కాంగ్రెస్ కి తెరాసకి మధ్య కార్పోరేట్ అడ్డుగోడలున్నాయా
posted on Nov 7, 2013 @ 8:41PM
తెలంగాణా సాధనలో తెరాస పాత్ర గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన పనిలేదు. అయితే ఒక ప్రముఖ వెబ్ సైట్ తాజా సంచికలో తెరాస మరియు కేసీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు పేర్కొంది.
తెలంగాణా ఏర్పడిన మూడు నాలుగు సం.లలోనే మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధించే విధంగా అనేక ప్రణాళికలు తమ వద్ద సిద్దంగా ఉన్నాయని ఇంతవరకు చెపుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా కేజీ బేసిన్ నుండి తమకు వాటా కేటాయించాలని డిమాండ్ చేయడం, కేవలం అక్కడి పార్టీలలో కలకలం సృష్టించి విభజన ప్రక్రియను ఆలస్యం చేయడానికేనని పేర్కొంది.
తెరాసను విలీనం చేయడానికి ఇష్టపడితే కె.తారక రామారావుకి ఉపముఖ్యమంత్రి పదవి, కవితకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, కానీ కేసీఆర్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని మంకు పట్టుపట్టడంతో జాప్యం జరుగుతోందని సదరు వెబ్ సైట్ పేర్కొంది.
అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయవద్దని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తరపున గుజరాత్ లోని కొన్నిపెద్ద కార్పోరేట్ సంస్థల నుండి కేసీఆర్ కు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ తో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తే, తెరాస ఎన్నికల ఖర్చులు భరించగలమని సదరు సంస్థల ప్రతినిధులు హామీ ఇస్తున్నట్లుగా తెరాస నేతలు కొందరు చెప్పినట్లు పేర్కొంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ‘షరతులు లేని తెలంగాణా’ అనే కొత్త పల్లవి అందుకొన్నారని పేర్కొంది.
బీజేపీతో తెదేపా కూడా స్నేహం చేయాలనీ ఆశిస్తున్నపటికీ, తెలంగాణాలో బలంగా ఉన్నబీజేపీ ఒత్తిడి మేరకు మోడీ ఆ ఆలోచనను ప్రస్తుతం పక్కనబెట్టి తెరాసకు గాలం వేస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే బేషరతుగా మద్దతు ఇస్తామనిఇంతవరకు బీజేపీ అధిష్టానం హామీ ఇస్తున్నపటికీ, ఆఖరి క్షణంలో ఆపార్టీ తన నిర్ణయం మార్చుకోవచ్చని పేర్కొంది. రాజకీయ పార్టీలన్నీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తాయని సదరు వెబ్ సైట్ పేర్కొంది. అయితే ఇదంతా నిజమని నమ్మకపోయినప్పటికీ, నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఇందులో ఎంతో కొంత యదార్ధం ఉంది ఉండవచ్చును.