భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్

 

 

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు. ఈ ఏడాది జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి. 

దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్  సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
 

హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డికి ఊరట

  తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు డీజీపీగా శివధర్‌రెడ్డి కొనసాగడంపై తాత్కాలిక అడ్డంకులు తొలగినట్ల య్యాయి.ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యంగా యూపీఎస్సీ  ద్వారా జరగాల్సిన నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. నియామకంలో విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా పాటించాలన్న అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. డీజీపీ నియామక వ్యవహారంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి, డీజీపీ శివధర్‌రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ, తుది నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ కేసుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

నేను నెంబర్ వన్ యాక్టర్‌ని కాదు..కానీ : పవన్ కళ్యాణ్

  తాను నెంబర్ వన్  యాక్టర్‌ను కాకపోయిన తన సినిమా ప్లాప్ అయిన డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ తనకు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.  ప్రజల మద్దతు, ప్రేక్షకులకు మద్దతునే ఇది తనకు సాధ్యమైందని పవన్ తెలిపారు. అయిన సరే తాను రాజకీయాల్లోకి ఎందుకువచ్చానంటే...ప్రజాసేవను తాను బాధ్యతగా భావించానని చెప్పారు.   పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా బిగ్ న్యూస్ అయిపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. తాను  పిఠాపురం శాసన సభ్యుడిగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఫంక్షన్లకు హాజరు కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ తెలిపారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు.   

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు బాంబు బెదరింపు!

పశ్చిమ బెంగాల్  గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టింది. గవర్నర్ ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ వార్నింగ్ తో  గురువారం (జనవరి 8) అర్ధరాత్రి అప్పటికప్పుడు లోక్ భవన్  వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో  తాజా బెదరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.

హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు.. కొట్టేసిన హైకోర్టు

టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  నవదీప్‌పై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు   కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. గుడిమల్కాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు..  నవదీప్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలూ లేవని పేర్కొంటూ కేసు కొట్టివేసింది.   నవదీప్ వద్ద డ్రగ్స్ లభించకపోవ డంతో పాటు, అతడిపై నమోదైన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.  ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసును కొనసాగించడం చట్టబద్ధం కాదనీ, అందుకే నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేస్తున్నట్లు వెల్లడించింది. నవదీప్ తరఫున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ తన వాదనలు వినిపించారు. నవదీప్‌పై ఉద్దేశపూర్వకంగా కేసు బనాయించారని, ఎలాంటి  ఆధారాలు లేకుండానే అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదన లను పరిగణనలోకి తీసు కున్న హైకోర్టు కేసును కొట్టివేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హీరో నవదీప్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసును కొర్టు కొట్టివేయడంతో ఆయన నిర్దోషిగా నిరూపితుడయ్యారని నవదీప్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

  టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన  నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. ఆయనపై గతంలో నమోదైన డ్రగ్స్‌ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని న్యాయవాది సిద్ధార్థ్‌ వాదించారు.  నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో కేసు ఉంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. గుడిమల్కాపూర్‌లో   నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హై కోర్టు పేర్కొన్నాది.  

బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా జిల్లా ఎస్పీ పేరుతోనే మోసాలు

ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది. ఫర్నిచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని  పలువురికి  జిల్లా ఎస్పీ పేరుతో గురువారం జనవరి 8) మెస్సేజ్ లు అందాయి. ఈ విషయం  పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే అప్రమత్తమై ఆ ఫేక్ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేశారు. సైబర్ మోసాలు వివిధ రూపాల్లో  పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంద ర్భంగా  ఎస్పీ సంకీర్త్ ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.  

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.కోటి.. కుమారుడికి ప్రమోషన్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అత్యంత అమానవీయంగా వేధింపులకు గురై  ఆ మానసిక క్షోభతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.   ప్రభుత్వ డాక్టర్ అయిన  సుధాకర్ కు జగన్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుమారుడిని పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.   జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది.  ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా..  విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనపై  పిచ్చివాడు అన్న ముద్రవేసి,  ఆసుపత్రికి పంపడం వంటి  అత్యంత అమానవీయ చర్యలకు అప్పటి జగన్ ప్రభుత్వం పాల్పడింది. ఆ  మానసిక వేదన, ఆ అవమానంతోనే  ఆయన కన్నుమూశారు.   నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రభుత్వ పరంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సహకారం అందించాలని నిర్ణయించారు.   ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని  గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు.  అలాగే ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.   

పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో  ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో..  గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో..  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్‌ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

సంక్రాంతికి నో టోల్ ఫ్రీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి నగరాలు, పట్టణాలలో ఉండే ప్రజలు స్వంత ఊళ్లకు వెళ్లడం ఆనవాయితీ. ఇలా  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లే ప్రజలకు టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ను ఇబ్బందులకు గురి చేస్తుండటం, గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుని అగచాట్లు పడటం సాధారణంగా మారిపోయింది. ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకూ టోల్ ఫ్రీకా ప్రకటించాలని తెలంగాణ పర్యాటక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే తెలంగాణ విజ్ణప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ తిరస్కరించారు. జాతీయ రహదారులపై ఉచిత టోల్ కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.  ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.  

టూరిజం డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని క్రియోటివ్ అకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు.   విజయవాడ పున్నమీ ఘాట్ లో   అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన  ఆయన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఈ   కార్యక్రమానికి హాజరైన  యూరోపియన్ యూనియన్ రాయబారి (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి  ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు.  తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమన్న చంద్రబాబు ఆవకాయ్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం  సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు.  ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు. ఇక ఈ ఆవకాయ ఫెస్టివల్ ను తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుంటున్నామన్న చంద్రబాబు తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు.  కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి.  మైసూర్, కలకత్తాలకు దీటుగా  విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా ఆ ఉత్సవాలను జరుపుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.