జ్ఞాపికను చూస్తుంటే నా నవల మొత్తం తిరగరాయాలనిపిస్తోంది. నేను సృష్టించిన పాత్రల్లో ఎక్కడా ఏ లోపం లేకుండా విషాదం, వెలితి లేకుండా మార్చేయాలని పిస్తోంది. కధానాయిక చేసిన పొరపాటు ద్వారా కలిగిన బుద్ది మాంద్యం గల పాప పాత్ర స్థానంలో జ్ఞాపిక లాంటి చక్కటి , చలాకీ పాపాయిని సృష్టించి , ఆ పాత్రతో నాకు ఒక అనుబంధాన్ని పెంచుకోవాలని పిస్తోంది. కానీ నవల మొత్తం మార్చాలి. ఈ నవలని నేనలా మార్చలేను. ఏది ఏమైనా జ్ఞాపిక రాక నా జీవితంలో ఒక చిన్న ఆనందానికి తెరతీసింది.
అయితే, సరిగ్గా రెండు రోజుల్లో నా ఆనందానికి చిన్న అవరోధం ఏర్పడింది. అనుకోకుండా జ్ఞాపిక రావడం మానేసింది. మొదటి రెండు రోజులూ అసహనంగా ఎదురు చూశాను. ఏమైందో ఏంటో అని బెంగపెట్టుకున్నాను. వాళ్ళుండే అపార్ట్ మెంటు తెలిసినా ప్లాట్ నెంబరు తెలియకపోవడంతో ఎందుకు రావడం లేదో విచారించడానికి కూడా వీల్లేకుండా అయింది. నాకు తెలియకుండానే నాలో నిరుత్సాహం, ఏదో తెలియని వెలితి దుఃఖం కలగసాగాయి. నాలుగు రోజులు గడిచాయి. పాప రాలేదు. ఆరోజు నేనింక ఆగలేకపోయాను. తలుపు తాళం వేసి, వాళ్ళ అపార్ట్ మెంట్ వైపు వెళ్ళాను. వాచ్ మన్ కనిపించాడు. అతడినే అడిగాను "జ్ఞాపిక అనే పాప వాళ్ళు ఏ ప్లాట్ లో ఉంటారో తెలుసా?"
"తెలుసమ్మా . 202 లో వుంటారు."
లిప్ట్ లో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాను. వెంటనే కనిపించింది 202 . తలుపు వేసి వుంది. ప్లాట్ల లో మామూలేగా . కాలింగ్ బెల్ కొట్టాను. కొన్ని సెకన్ల తరువాత పంజాబీ డ్రెస్ లో వున్న ఒకమ్మాయి డోర్ తీసింది.
నావైపు ఆశ్చర్యంగాచూసింది .
"జ్ఞాపిక ఇల్లేనా?" అడిగాను.
"మీరు....?"
"జ్ఞాపిక ఫ్రెండ్" నవ్వుతూ , "ఉందా?" అని అడిగాను.
"రండి లోపలికి..." ఆ అమ్మాయి పక్కకి జరిగి చోటిచ్చింది.
హల్లో దివాన్ మీద వడలిన గులాబీ లా పడుకుని వుంది జ్ఞాపిక. నాకు కంగారుగా అనిపించింది. వేగంగా దివాన్ దగ్గరకు వెళ్ళి "జ్ఞాపికా!" అంటూ పిలిచాను.
కళ్ళు తెరిచింది. నన్ను చూసి "హాయ్ అంటీ" అని నవ్వింది. నీరసంగా వున్న ఆ నవ్వు చూస్తె నాకు దుఃఖం వచ్చింది.
"ఎమైందమ్మా?' అడిగాను.
"ఫీవర్ ' అంది.
నేను ఆ పాప తల్లి వైపు చూశాను.
"అవునండీ వన్ వీక్ నుంఛి ఫీవర్" అని జ్ఞాపిక దగ్గరగా వచ్చి ఆప్యాయంగా జుట్టు సవరిస్తూ.
"అరెరే! నీకు తెలుసా ? నువ్వు రాకపోతే నాకసలు తోచడం లేదు" అన్నాను జ్ఞాపికతో. నామాటలకి తల్లి వైపు చూసింది. ఆ చూపులో "చూశావా!" అన్న భావన కనిపించింది.
ఆమె నావైపు చూసి "మీరెక్కడ వుంటారు?" అడిగింది.
నేను చెప్పాను. అంతేకాదు, జ్ఞాపిక నాకు ఎలా పరిచయం అయిందో, తన పట్ల నా మనసులో అభిమానం రోజురోజుకీ ఎలా పెరుగుతుందో అన్నీ చెప్పాను.
"అలాగా! నాకసలు తెలియదు. తను ఆడుకోవడానికి వెళ్తుంది కదా, ఎవరింటికి వెళ్తుందో నాకు తెలియదు. సారీ! మిమ్మల్ని ఇబ్బందేం పెట్టలేదు కదా మా అమ్మాయి" అంది.
"ఇబ్బంది పెట్టిన వాళ్ళని వెతుక్కుంటూ వస్తారా ఎవరైనా? " అడిగాను.
ఆమె ఏం మాట్లాడలేదు.
జ్ఞాపికవైపు చూసి అడిగాను. "ఏమన్నా తింటున్నావా? ఫ్రూట్స్ తింటావా?"
"నో...." కచ్చితంగా అంది.
"ఏం తినడం లేదు. యాంటిబయోటిక్స్ వాడుతున్నాం కదా?" అంది వాళ్ళమ్మ.
కాస్సేపు అలాగే కూర్చుని కబుర్లు చెప్పి నేను ఇంటికి వచ్చానే గానీ , జ్ఞాపిక ను విడిచి రావడం అసలు నచ్చలేదు నాకు. ఆరోజు నుంచీ రోజూ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ అటువైపు ఓ అడుగు వేసి రావడం మొదలు పెట్టాను.
రెండు రోజుల్లో జ్ఞాపిక కొంచెం తేరుకుంది. ఇంట్లో తిరుగుతోంది. జ్ఞాపిక తల్లి పేరు కృత్తిక. ఆ అమ్మాయితో కూడా నాకు బాగానే సాన్నిహిత్యం పెరిగింది. ప్రతిరోజూ తన కోసం పళ్ళు, ప్రేస్టీలు తీసుకుని వెళ్ళడం , బతిమాలి గారం చేసి తినిపించడం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మా ఇద్దరి మధ్యా ఈ చిత్రమైన అనుబంధం ఎలా ఏర్పడిందో కూడా నాకర్ధం కాలేదు. ఈ హడావుడి లో నా నవల సంగతని తాత్కాలికంగా మర్చిపోయాను.
నాకు జ్ఞాపిక పట్ల వున్న అభిమానానికి, ప్రేమకీ కృత్తిక మనస్పూరిగా ఆనందించింది . " మా అమ్మాయి ఎక్కడికీ వెళ్ళదు. అలాంటిది మీ ఇంట్లో అంత చనువుగా కలిసిపోయిందంటే నమ్మలేకపోతున్నాను" అంది ఒకరోజు.
నవ్వి ఊరుకున్నాను. నా మనసులో వున్న సందేహం తీర్చుకోవడానికి ఆ రోజే నాకు అవకాశం కూడా కలిగింది. జ్ఞాపిక వాళ్ళ నాన్నతో కలిసి చాలా రోజుల తరవాత బయటికి వెళ్ళింది. ఇంట్లో నేనూ, కృత్తిక . కృత్తిక కూడా నన్ను 'అంటీ' అని పిలుస్తోంది. అందుకే జ్ఞాపికకి చెప్పాను నన్ను "అమ్మమ్మా" అని పిలవమని. కానీ, తనలా పిలవడం లేదు. సో....తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ నేను అంటీనే.
"కృత్తికా! జ్ఞాపిక తమ్ముడెక్కడ వుంటాడు?' అడిగాను.
ఉలిక్కిపదినట్టుగా చూసింది. అమెమోహంలో విషాద వీచిక కదలడం సెకనులో సగం సేపు నా దృష్టిలో పడింది.
కొన్ని క్షణాలాగి "ఇంకా ఏం చెప్పింది జ్ఞాపిక?"అడిగింది.
"అమెరికాలో ఏదో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పింది. ఎనీ ప్రాబ్లమ్ ?" అడిగాను.
హటాత్తుగా కృత్తిక రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుపు చూస్తె నా గుండె చెరువైంది. అంత బాధ కలిగించే విషయమా? నేను అనవసరంగా గుర్తు చేశానా? అని నన్ను నేను తిట్టుకుంటూ ఆమెని ఒదార్చడానికి ప్రయత్నించాను.
కొన్ని క్షణాల తరవాత చున్నీతో కన్నీళ్ళు తుడుచుకుని బొంగురుపోయిన గొంతుతో "సారీ " అంది.
"సారీ నువ్వు కాదు, నేను చెప్పాలి. నిన్ను బాధపెట్టాను. అంత బాధ కలిగించే విషయమయితే చెప్పద్దు లే కృత్తికా ...." అన్నాను.
"లేదు, లేదు, చెప్తాను. ఇంతకాలానికి నా మనసులో ఆవేదన పంచుకోవడానికి ఒక ఆత్మీయురాలు దొరికింది. చెప్తాను....' అంటూ చెప్పసాగింది.
"నాకు జ్ఞాపిక తరువాత ఒక బాబు పుట్టాడు. కానీ, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందని సెకండ్ ఇష్యూ కి గ్యాప్ వుండాలని, ప్రెగ్నెన్సీ పోవడానికి మందులు వాడాను. కానీ ఫలితం దక్కలేదు. ఆ తరువాత అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళాను. డాక్టర్స్ నా ప్రాణానికి ప్రమాదం అని అబార్షన్ సంగతి మర్చిపోయి డెలివరీ అవగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. చేసేది లేక ఊరుకున్నాను. కానీ, బ్యాడ్ లక్ ... బాబు సరిగా పుట్టలేదు..."
"అంటే?"
"ఇంటలేక్చువల్ డిజేబిలిటీ . మానసికంగా ఎదగని బాబు, శారీరకంగా కూడా సరిగా ఎదగలేదు. పీలగా ఉండేవాడు. ఐదేళ్ళు వచ్చినా మాటలు రాలేదు. చూపుల్లో వెర్రితనం, నోటి వెంట చొంగ కారుతూ.... జ్ఞాపిక వాడిని దగ్గరకు తీయనిచ్చేది కాదు. తను వాడిని ముట్టుకునేది కాదు. ఈ బాధ భరించలేక కొంతకాలం హాస్పిటల్ లోనే వుంచేశాం.ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణ లో రెండేళ్ళు వున్నాడు ట్రీట్ మెంట్ కోసం... వాడి కోసమే నేను ఉద్యోగంలోచేరాను. లక్షలు, లక్షలు ఖర్చు అయింది. కానీ కానీ.... " కృత్తిక దుఃఖం అణచుకుంటున్నదానిలాగా కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయింది. తరువాత తన్ను తాను సంభాళించుకుంటూ "ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు. కొంతకాలం మెంటల్లీ రిటార్దేడ్ స్కూల్ల్స్ లో చేర్చం. మా దౌర్భాగ్యం! చాలామంది పిల్లలు పూర్తిగా కాకపోయినా కొంతైనా మారారు. కానీ కానీ వీడు అసలు మారలేదు. వాడేమందులు ఎమైపోతున్నాయో అర్ధం కావడం లేదు.
"ఇప్పుడేక్కడున్నాడు...?" వణుకుతున్న స్వరంతో అడిగాను.
"సిటీకి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఒక స్కూలు వుంది. ఇలాంటి జబ్బుల పైన రీసెర్చి చేసింది ఒకావిడ. ఆ స్కూల్లో చేర్చాం. సంవత్సరానికి రెండు లక్షల దాకా ఖర్చవుతుంది.ఆ స్కూల్లో చేర్చి ఏడాది అవుతోంది . ఏమాత్రం ..... ఆశ క...ల...గ..డం... " మాట మధ్యలోనే దుఃఖం అడ్డుపడింది కృత్తికకి.
నా గుండెల్లో అగ్నిపర్వతాలు పగిలిపోతున్నట్టు శరీరం ఆపాదమస్తకం వణికిపోతోంది. ఏవిటీ చిత్రం? నేను రాస్తున్న నవలలోంచి రెండు పాత్రలు నా ముందుకొచ్చి నన్ను సవాల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ముగింపు , ముగింపు.... అంటూ కలవరించావు కదా ఇప్పుడు చెప్పు ఎలా ముగిస్తావో అని వాళ్ళు వేయి స్వరాలతో అరుస్తున్నట్టుగా .... ఒళ్ళు జలదరించినట్టయింది.
"తను బాబుని ముట్టుకోకపోయినా జ్ఞాపికకి వాడంటే ఏదో అభిమానం మమకారం. అపేక్ష వుండేవి. వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచీ "తమ్ముడేడి అని అడుగుతూ వుండేది. తమ్ముడికి జ్వరం వచ్చిందని , అమెరికా హాస్పిటల్లో వున్నాడని త్వరలో వస్తాడని, ఇద్దరూ అడుకోవచ్చని చెబుతూ వసున్నాను. కానీ, ఎంతకాలం మోసం చేయగలను తనని?"
కృత్తిక ఏడుస్తుంటే నా గుండె మెలితిప్పినట్టు అవుతోంది. ఆమె దుఃఖం చూడలేకపోతున్నాను.
అదే దుఃఖంతో చెప్పసాగింది. "తన మనసులో అదేమాట ఫిక్స్ అయిపొయింది. తను అదే భావనతో వుంది. దాన్ని మేం తుడిచేయడానికి ప్రయత్నించడం లేదు. కాలం గడిచాక తను పెద్దదవుతున్న కొద్దీ భయం వేస్తోంది. తను అడిగే ప్రశ్నలకి నా దగ్గర కానీ, అయన దగ్గర కానీ సమాధానం లేదు . ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?" వెక్కిళ్ళు పెట్టసాగింది.