ఒక్కసారిగా నా గుండె చెరువైంది. అప్రయత్నంగానే నా కళ్ళ నుంచి రెండు నీటి బొట్లు జారిపడ్డాయి.
"అన్నీ సక్రమంగా వుంటేనే బతకడం ఒక సాహసంగా మారిన ఈ రోజుల్లో అలాంటి బాబు బతికి ఏం చేస్తాడు చెప్పండి. తల్లిగా నేను గుండెల్లో పెట్టుకోగలను. కానీ, వాడు ఎదిగిన కొద్ది వాడికి బతుకు బరువైపోతుంది.నా చిన్నారి తండ్రి ఆ బరువు మోయడం నేను తట్టుకోలేను. అందుకే....అందుకే...."
నా పక్కన నిశ్శబ్దంగా ఒక విస్పోటం జరిగింది. ఆ పొగల్లో ఏదో స్పష్టంగా కనిపిస్తుంటే అశక్తతతో నోట మాట రాక మూగగా ఆమెనే చూస్తూ భయంగా, అనుమానంగా అడిగాను అందుకే..."
"మె...మెర్సీ కిల్లింగ్.... వాడిని చంపేయమని.... కారుణ్య హత్యకు పాల్పడమని చెప్పాను."
"కృత్తికా! మీకు మతిపోయిందా?' గట్టిగా అరిచాను.
కృత్తిక వెక్కుతూ అంది "మరి ఏం చేయను? డబ్బు మంచినీళ్ళ లా ఖర్చవుతోంది. కానీ వాడిలో మార్పు లేదు. వాడు బాగుపడితే చాలనుకున్నాం. కానీ, ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఎలా? ఎలా బతుకుతాడు? ఎవరు వాడిని కళ్ళల్లో పెట్టుకుని కలకాలం కాపాడగలుగుతారు? అంటీ మీరే చెప్పండి. జ్ఞాపిక భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా.... అందుకే.... అందుకే ఆ కసాయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గర నుంచి వచ్చే నిర్ణయం కోసం నేను నా మనసుని పాషనంగా మార్చుకుని ఎదురు చూస్తున్నాను."
కృత్తిక రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.
నాకూ దుఃఖం ఆగలేదు. చాలాసేపు మౌనంగా నేనూ, ఆమె ఏడుస్తూ వుండిపోయాం.
'ఆలా జరగడానికి వీల్లేదు కృత్తికా! నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు మనం వెళదాం" నెమ్మదిగా ఆమె భుజాల మీద చేయెసి అన్నాను.
"ఎందుకు?" కన్నీళ్ళతో ఆశ్చర్యంగా అడిగింది కృత్తిక.
"వెళదాం . డాక్టర్ తో నేను మాట్లాడతాను. తప్పకుండా ఈ జబ్బుకి చికిత్స వుంటుంది."
కన్నీళ్ళతో పేలవంగా నవ్వింది. "లిటిల్ ఏంజెల్స్ దాని పేరు. దానికి అటాచ్ అయి చిల్డ్రన్ హోమ్ కూడా ఉంది. అన్నీ వాళ్ళే చూసుకుంటారు."
"లిటిల్ ఏంజెల్స్"అని ఉచ్చరిస్తూ అడిగాను. "ఎప్పుడు వెళ్దాం?"
"చెప్పాగా.... వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు."
"అలా కాదు . రేపు వెళదాం" దృడంగా అన్నాను.
అప్పటికప్పుడే నా మనసులో ఓ స్థిర నిర్ణయానికి నాందీ పడింది.
"నాకు ధైర్యంసరిపోవడం లేదాంటీ" వణికే స్వరంతో అంది కృత్తిక.
"లేదు కృత్తికా! నువ్వనుకున్నట్టు జరగదు. బాబుని బతికించుకుందాం . నేనున్నాగా. మీ అమ్మలాంటి దాన్ని ...నమ్ము."
కృత్తిక చప్పున నా గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెని ఓదార్చడానికి నాకు మాటలు రాలేదు. మౌనంగా ఆమె వీపు మీద చేత్తో రాస్తూ, నా స్పర్శ ద్వారా ఆమెకి ధైర్యం కలిగించడానికి ప్రయత్నించాను. కాస్సేపటికి తేరుకుంది.
నేను మరి కొంచెం సేపు ఆమెకి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి డిన్నర్ కూడా చేయాలనిపించలేదు. కృత్తిక మాటలు, ఏడుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా వినిపిస్తోంది.
మెర్సీ కిల్లింగ్.... మెర్సీ కిల్లింగ్! లేదు, అలా జరక్కూడదు. తప్పకుండా తగ్గుతుంది బాబు బాగవుతాడు . బాగుపడాలి.
గబగబా కంప్యూటర్ దగ్గర కెళ్ళి అన్ చేసాను. నా ఫైల్ ఓపెన్ అయిందాకా సమయం వృధా చేయకుండా నా బ్యాంక్ పాస్ బుక్, చెక్ బుక్ బ్యాగులో పెట్టుకున్నాను.
ఫైల్ ఓపెన్ అయింది.
కదం తోక్కుతున్నట్టుగా నా కలం పరుగులు పెడుతోంటే ఆ రాత్రి నన్నేదో ఉన్మాదం అవరించినట్టుగా నా నవల పూర్తిచేశాను.
మర్నాడు నేనూ, కృత్తికా నా కారులో బాబుని ఉంచిన చోటుకి వెళ్ళాం. నగరానికి దూరంగా ప్రశాంతమైన పరిసరాల్లో చూడగానే మనసుని దోచుకునేలాగా వుంది ఆశ్రమం. అక్కడే హాస్పిటల్, అక్కడే హాస్టల్, అక్కడే పిల్లలకి స్వీచ్ ధేరఫీ, ఆటలు, పాటలు, నేర్పే రకరకాల పరికరాలు.
గేటు తోసుకుని లోపలికి వెళ్ళగానే నా కళ్ళ బడిన దృశ్యం నన్ను ముగ్దురాల్ని చేసింది. పిల్లలు కొందరు అరుగుల మీద, కొందరు చెట్ల కింద కూర్చున్నారు. మమ్మల్ని దూరంగా నలభై ఏళ్ళ స్త్రీ ఎదురుగా వచ్చి "రండి, రండి! నేనే మీకు కాల్ చేయాలనుకుంటున్నాను. అంటూ ఆహ్వానించి తన గదిలోకి తీసుకుని వెళ్ళింది.
నేను ఆవిడని అనుసరించినా నా కళ్ళు మాత్రం ఆవిడ గది కిటికీ బైట ఎదగని మనస్తత్వాలతో , వయసు పెరిగినా వీడని అమాయకత్వంతో కనిపిస్తున్న పిల్లలని చూస్తున్నాయి.
ఆవిడ గదిలోకి వెళ్ళగానే "బాబెలా వున్నాడు?" అడిగింది కృత్తిక.
ఆవిడ మారు మాట్లాడకుండా "రండి వెడదాం" అంది ముందుకు నడుస్తూ.
కృత్తిక నావైపు ఆందోళనగా ,ఆవిడ వైపు అనుమానంగా చూస్తూ, ఆమెని అనుసరించింది. నేనూ వాళ్ళ వెనుక నడిచాను. ముగ్గురం ఆ హాస్టల్ కి అనుకుని వున్న హాస్పిటల్ కి వెళ్ళాం.
చందమామ లాంటి మొహం, చెంపకి చేరడేసి కళ్ళు, కానీ చూపుల్లో శూన్యం, పలకలేని మౌనం...తన ఎదురుగా ఎవరున్నారో కూడా అర్ధం కాని అయోమయం.... మంచం దగ్గరకి ఆత్రుతగా వెళ్ళిన కృత్తిక బాబునలా చూసి తట్టుకోలేని దానిలా నోటికి చెంగు అడ్డు పెట్టుకుని కుళ్ళికుళ్ళి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోయింది.
నేను బలవంతంగా దుఃఖం ఆపుకుంటూ అడిగాను అక్కడికి వచ్చిన డాక్టర్ ని "ఇతను మాములుగా మారే అవకాశం లేదా?"
డాక్టర్ గంబీరంగా వుంది. "నిజానికి ఈ జబ్బు వున్నవాళ్ళు కచ్చితంగా అంతో ఇంతో ఇంప్రూవ్ అవుతారు. చూశారుగా.... ఆ పిల్లల్ని."
బయట ఆవరణ లో ఆడుకుంటున్న కొందరు పిల్లల్ని చూపించింది.
"వాళ్ళు మొదట్లో చాలా దారుణంగా వుండేవాళ్ళు. ఇప్పుడు చూడండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏదన్నా చెబితే అర్ధం చేసుకుంటారు. మనం పలకమన్న మాటలు, చిన్న చిన్న పద్యాలు అస్పష్టంగా అయినా పలుకుతారు. కానీ, ఈ బాబు.... ప్చ్.... వెరీ బ్యాడ్ లక్..."
నేను చటుక్కున డాక్టర్ చేయి పట్టుకున్నాను. 'అలా అనకండి.. బాబు మాములుగా అవాలి.... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు...ప్లీజ్."
డాక్టర్ నావైపు ఆశ్చర్యంగా చూసింది. "మీరెవరు?"
"నేను...నేను.... " తడబడ్డాను.
డాక్టర్ అంది.... "వాళ్ళకి మీరేం అవుతారో నాకు తెలియదు కానీ వాళ్ళ ఆవేదన, తాపత్రయం కళ్ళారా చూస్తున్న దానిగా బాబు తల్లి కోరికను చట్టబద్దంగానే మన్నించాలనుకున్నాను. కానీ, బాబు పరిస్థితి చూస్తుంటే ఆ అవసరం లేదనిపించింది..."
"అంటే.... అంటే బాబు ఆరోగ్యం బాగుపడుతుందా?" ఆశగా , ఆత్రంగా అడిగా.
తల అడ్డంగా ఆడించింది.డాక్టర్. "నో హోప్! అల్ మోస్ట్ హీ ఈజ్ ఇన్ డెత్ బెడ్."
నేను నిలువెల్లా వణికిపోతూ బాబు వైపు చూశాను. తల పక్కకి వాలిపోయి వుంది. నోట్లో నుంచి చొంగ కారుతోంది.
"అటు చూడండి..." కంపిస్తూ అరిచాను డాక్టర్ తో.
డాక్టర్ విసురుగా మంచం దగ్గరకు వెళ్ళి బాబు చేయందుకుని పల్స్ చూసింది. ఆమె ప్చ్" అంటూ బాబు చేతిని వదిలేసింది. ఆ చేయి అచేతనంగా పక్కకు వాలింది.
కృత్తిక పరుగెత్తుకుని వచ్చింది. కాసేపట్లో కృత్తిక హృదయ విదారకమైన రోదనతో మిగతావాళ్ళ వెక్కిళ్ళ తో విషాదం ఆవరించింది ఆ ప్రాంగణమంతా.
"అయ్యో! ఇందుకా నేను వచ్చింది ఇక్కడికి? నా కళ్ళారా ఆ పసివాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం చూడ్డానికా?" నాకు దుఃఖం ఆగలేదు.
కాసేపట్లో కృత్తిక భర్త, అతని వెంట నలుగురు స్నేహితులు వచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తీ చేసి , బాబు మృత దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏడుస్తున్న కృత్తికను దగ్గరకు తీసుకుని బలవంతంగా నడిపిస్తూ కారు వద్దకు అడుగు లేస్తున్న ఆమె భర్త గంబీర్యం చూస్తె భయమేసింది నాకు.
"అయామ్ సారీ" డాక్టర్ హీనస్వరంతో అంది.
నేను కళ్ళు తుడుచుకుని నా బ్యాగు లోంచి చెక్కు బుక్కు తీశాను. తీసుకున్న నిర్ణయం అమలుపరచాల్సిన సమయం ఇదే. ఇంతకాలం నేను సంపాదించి కూడబెట్టిన డబ్బు సద్వినియోగం కావాలి. బావిభారత పౌరులైన ఈ చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడాలి. అందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర వుంది. చకచకా అమౌంట్ రాసి సంతకం చేసి ఆ చెక్కు డాక్టర్ చేతికిస్తూ అన్నాను "ఎవరి పేరు మీద రాయాలో మీరు రాసుకోండి. ఇక ముందు ఈ సమాజంలో ఇలాంటి మరణాలు జరక్కుండా చూడండి... "అంటూ నిశ్చేష్టురాలైచూస్తున్న డాక్టర్ ని పట్టించుకోకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి కృత్తిక కూర్చున్న కారులో ఆమెకి మరో పక్కన కూర్చుని, ఆమె ఒడిలోంచి బాబు దేహాన్ని తీసుకుని నా ఒళ్ళో పెట్టుకున్నాను."
కారు కదిలింది.
---------