కొంచెం సేపు అలాగే నిలబడి లోపలికి వచ్చి తలుపు వేసేశాను. అన్ని గదుల్లో లైట్లార్పేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఒంటరి వాళ్ళు. నేను చాలా దురదృష్టవంతురాలిని. కానీ నేనిలాఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఎవరు? నా మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది.
"అప్పుడే పిల్లలోద్దు , పిల్లలోద్దు...." అంటూ పిల్లలు పుడితే నా కెరీర్ పాడైపోతుందని పిల్లల్ని కనడం వాయిదా వేస్తూ వచ్చినందుకు భగవంతుడు నాకసలు పిల్లలే లేకుండా చేశాడు. పిల్లల కోసం పలవరించిన మాధవ్ విసిగిపోయినట్లున్నాడు. నన్నూ, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఏం సాధించాను ? నిట్టుర్పు గుండేల్లి చీల్చుకుంటూ వచ్చింది.
జీవితంలో యాభై ఏళ్ళు గడిచిపోయాయి. బోలెడంత డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను. ఇంకా సంపదిస్తూనే వున్నాను. కానీ , ఎవరి కోసం? నా తరువాత ఎవరు అనుభవించాలి? నా దగ్గర ఐదు లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ వుంది. యాభై వేలు విలువ చేసే ఈ ఇల్లు వుంది. సుమారు పది లక్షల దాకా విలువ చేసే బంగారు నగలున్నాయి. సేవింగ్స్ అకౌంట్ లో రెండు మూడు లక్ష లున్నాయి. ఇంకో రెండేళ్ళ లో రిటైర్ అవుతాను. ఇరవై వేలు పెన్షన్! మరో కొన్ని లక్షలు బ్యాంకులో జమ అవుతాయి. ఏం చేయనివన్నీ ఎంత ఖర్చు పెట్టుకుంటే కరుగుతాయి? ఏం ఖర్చు పెట్టుకోను. ఇంకా సంపాదిస్తాను బతికున్నంత కాలం సంపాదిస్తాను. కానీ, ఎవరి కోసం ? ఎవరున్నారు? గుండెల్లో ఆవేదన సుళ్ళు తిరుగుతుంటే , మంచం మీద వాలిపోయాను.
గుండెల నిండా దుఃఖమే . కానీ కన్నీళ్ళే కరువైనాయి. ఎప్పటికో నిద్రపట్టింది.
రోజులు గడుస్తున్నా నా నవల మాత్రం పూర్తీ కావడం లేదు. నా మనసు బాధపడకుండా, పాత్రకీ అన్యాయం చేయకుండా నేనా పాత్రకి ఒక ముగింపు ఇవ్వాలి. అది ఎలాంటి ముగింపు ? ఎలాచేయాలి? నాకేం అర్ధం కావడం లేదు? ఆలోచన సంపూర్ణంగా వచ్చిందాకా కంప్యూటర్ ముట్టుకోకూడదని నన్ను నేను నిర్బంధించుకుని కూర్చున్నాను. ఆఫీసు కి వెళ్ళడం, నాకిష్టమైన పార్కులో కొంతసేపు గడిపి ఇంటికి రావడం, టీవీ చూసి పడుకోవడం....ఇదే నా దినచర్య.
వారం గడిచింది. ఆరోజుఅదివారం. ఉదయం పది దాటి వుంటుంది. ఆరుంబావు కల్లా లేచి మార్నింగ్ వాక్ , యోగా పూర్తీ చేసుకుని, స్నానం , పూజ కానిచ్చి ఇడ్లీ తిని కూర్చున్నాను. తలుపు చప్పుడైంది. చూస్తె జ్ఞాపిక! వారం క్రితం మంచినీళ్ళ కోసం వచ్చింది. మళ్ళీ ఇవాళ!
"రా...రా! వాటర్ కావాలా?' అడిగాను చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ .
"ప్చ్" పెదవి విరిచింది. "నాకు బోర్ గా వుంది. నా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్ కి ఊరేళ్ళారు"అంది చనువుగా సోఫాలో కూర్చుంటూ.
"అలాగా....మరి నువ్వెళ్ళలేదేం?"
"మమ్మీకి వెకేషన్ లేదు"
"ఓ... ' జాలేసింది తన మొహం చూస్తె.
అప్పటిదాకా జాలిగా పెట్టినమోహంలో హుషారు తెచ్చుకుంటూ అడిగింది. 'అంటీ! మీ ఇంట్లో టాయ్స్ ఉన్నాయా?"
"లేవమ్మా... మా ఇంట్లో పిల్లలు లేరు కదా?"
"మీకు చిల్డ్రన్స్ లేరా?" ఆశ్చర్యంగా చూసింది.
లేరన్నట్లు నవ్వాను.
"మీరు ఒక్కరే వుంటారా? అంకుల్ కూడా వుండరా?"
"లేదు....సరేగానీ నీ సంగతి చెప్పు . మీరెక్కడ వుంటారు?"
గుమ్మం దాకా వెళ్ళి చేత్తో చూపించింది. అదిగో ఆ అపార్ట్ మెంట్."
సరిగ్గా మా ఇంటికి కొంచెం ఎదురుగా పెద్ద అపార్ట్ మెంట్.
"ఎవరేవరుంటారు? నీకేంతమంది అక్కలు, అన్నలు?"
"నాకు ఒక్కడే తమ్ముడు"
"అలాగా! మరి తమ్ముడిని తీసుకురాలేదెం?"
"వాడిక్కడ లేడు . అమెరికా ..."
"అమెరికా లోనా? అక్కడేవరున్నారు ?"
"ఎవరూ లేరు."
"మరి తమ్ముడు ఎక్కడున్నాడు?"
"హాస్పిటల్...."
"ఏ హాస్పిటల్ ?"ఆశ్చర్యంగా అడిగా.
భుజాలెగరేసి "ఐ డోంట్ నో" అంది.
"ఇక్కడ ఎవరెవరుంటారు ?"
"మమ్మీ , నేను డాడీ."
నాకేం అర్ధం కాలేదు. తమ్ముడు అమెరికాలో హాస్పిటల్లో , ఇక్కడ తల్లి , తండ్రితో ఈ పాప. ఇంక చిన్నపిల్లతో అంతకన్నా ఆ విషయాలు డిస్కస్ చేయడం సభ్యత కాదు. పద్దతి అంతకన్నా కాదు. ఫ్రిజ్ తెరిచి క్యాడ్ బరి చాక్లెట్ తీసిచ్చాను. "థాంక్యూ" అంటూ తీసుకుంది.
ఆ పాపని ఎలా ఎంటర్ టైన్ చేయాలో నాకర్ధం కాలేదు. నా దగ్గర కాలక్షేపం అవుతుందని తనకి ఎందుకని పించిందో కూడా నాకు తెలియలేదు. అయినా నాకు తోచిన విధంగా అవీ ఇవీ మాట్లాడుతూ "టీవీ చూస్తావా?' అని అడిగాను.
"యా... ' అంది హుషారుగా.
"టీవీ అన్ చేసి "ఏం చానెల్ చూస్తావు?" అడిగాను.
"డిస్కవరీ "అంది.
తను కోరిన ఛానెల్ పెట్టి నేను కిచెన్ లోకి వెళ్ళిపోయాను. వంట చేసుకోవడానికి. కానీ నా మనసంతా జ్ఞాపిక తమ్ముడి తో నిండిపోయింది. అమెరికాలో హాస్పిటల్ లో పసివాడు ఒక్కడినీ వదిలేసి వీళ్ళంతా ఆ తల్లి, తండ్రి ఇక్కడ హైదరాబాద్ లో వుండటం నాకు ఎలాగో అనిపించింది. ఏం జబ్బు అయి వుంటుంది? నాకెందుకో నేను రాస్తున్న నవలలో పాపాయి పాత్రకీ, జ్ఞాపిక తమ్ముడికి ఏదన్నా పోలిక వుందేమో అన్న సందేహం కలిగింది. రాసే నవల మీద ధ్యాస వున్న ప్రతి రచయిత్రి కీ ఇలాంటి ఆలోచనలు వస్తూనే వుంటాయన్నది వాస్తవం. కాబట్టి అంతగా నా ఆలోచనకి ప్రాధాన్యం ఇవ్వకపోయినా, ఎక్కడో మనసులో ఓ మూల జ్ఞాపిక తమ్ముడిని గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని పించింది.
"అంటీ!అయామ్ గోయింగ్" అంటూ కిచెన్ లోకి వచ్చింది జ్ఞాపిక.
"ఏం? బోర్ గా వుందా?'అడిగాను . నాకెందుకో తను వెళ్ళడం ఇష్టం లేదు.
అనుకోని అతిధిలా ఇంట్లోకి వచ్చి చనువుగా, ఆ పాప తిరుగుతుంటే ఇంటికి కొత్త అందం వచ్చినట్లుగా అనిపిస్తోంది. అందుకే అన్నాను. "నాతొ కలిసి లంచ్ చేస్తావా "
"నో ... మమ్మీ తిడుతుంది" అంటూ పారిపోయింది.
అప్పటి నుంచీ జ్ఞాపిక కోసం ఎదురు చూడడం నా దినచర్య లో భాగమైంది.
ఆ అమ్మాయి కూడా నా దగ్గరకి తరచూ నేను ఇంట్లో ఉన్న సమయంలో రావడం కాస్సేపు యేవో కబుర్లు చెప్పి, టీవీ చూసి వెళ్ళడం అలవాటైంది. అప్పుడప్పుడు డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి నెయిల్ పాలిష్ లు తీసుకుని వేసేసుకోవడం, ఎంతో స్వతంత్రంగా ఫ్రిజ్ లో వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు తాగేయడం , ఫ్రీజర్ లో చాక్లెట్స్ , కోసం వెతుక్కోవడం రిమోట్ తీసుకుని నచ్చిన చానెల్ పెట్టుకుని టీవి చూడడం.... ఇలా ఎంత అలవాటై పోయిందంటే తనకోసం నేను ఆఫీసు నుంచి పార్కుకి వెళ్ళే అలవాటు మానుకుని ఇంటికి త్వరగా రావడం ప్రారంభించాను. తన సమక్షంలో నేను కోల్పోయిందేదో పొందుతున్న అనుభూతి కలగసాగింది. నాకు తెలియకుండానే జ్ఞాపిక పట్ల నాలో అభిమానం, వాత్సల్యం కలిగి తన రాకకోసం ఎదురు చూడడం ఒక అలవాటుగా మారింది.