జ్ఞాపిక
హటాత్తుగా బయట కోలాహలం వినిపించడంతో నా రచనా వ్యాసంగానికి ఆటంకం కలిగింది. ఒక్కసారిగా నేను రాస్తున్న నవల లోంచి బయటపడి విసుగ్గా కిటికీ లోంచి తొంగి చూశాను. వేసవి సెలవులేమో , ఐదు నుంచి పన్నెండేళ్ళ పిల్లలంతా వాకిట్లో ఆడుకుంటున్నారు.
వాతావరణం హాయిగా వుందేమో గుంపుగా గూళ్ళ నుంచి బయటపడిన పక్షుల్లా స్వేచ్చగా ఎగురుతున్నారు. అమ్మాయలు కొందరు స్కిప్పింగ్, కొందరు టెన్నీకాయిట్, అబ్బాయిలు క్రికెట్, చిన్నపిల్లలు సైక్లింగ్ ఇలా ఎవరికీ తోచిన ఆటలు.... కోలాహలంగా వుంది.
ముందు నా ఏకాగ్రత కి భంగం కలిగించి నందుకు కోపం వచ్చినా , వాళ్ళందరినీ అలా చూస్తుంటే ముచ్చటేసింది. కొద్ది క్షణాలు కిటికీ లోంచి వాళ్ళనలాగే చూస్తూ కూర్చున్నానే గానీ, నా మనసంతా నేను రాస్తున్న నవల మీదే వుంది. నవల మధ్యలో ఆగిపోయింది.
"ఏం చేయాలి? ఆ పాపనేం చేయాలి? నా నవలలో కధానాయిక చేసిన చిన్న తప్పుకి.... కాదు.... కాదు పెద్ద తప్పుకి బలైపోయి మందమతి గా పుట్టిన పాపాయి నేం చేయాలి? ఆలోచనతో బుర్ర వేడెక్కి పోయింది. కాస్సేపలాగే కూర్చుని , కిటికీ మూయడానికి లేవబోతుంటే గబగబా తలుపు బాదుతున్న శబ్దం వచ్చింది.
"ఎవరది?" అంటూ హాల్లోకి నడిచి డోర్ తీశాను.
పదేళ్ళ పాప ఆయాసపడుతూ 'అంటీ.... ఐ వాంట్ వాటర్" అంది చేత్తో మంచినీళ్ళన్నట్టుగా సైగ చేస్తూ.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పాప ఎవరో నాకు తెలియదు. నేనీ ఏరియాలో ఇల్లు కొనుక్కుని నాలుగేళ్ళు గా వుంటున్నా చుట్టుపక్కల ఎవరున్నారో కూడా నాకు తెలియదు.నేనెవరో తెలియకుండానా తలుపు తట్టి మరీ మంచినీళ్ళు అడుగుతోంది. నవ్వొచ్చింది. "కమ్" అంటూ డైనింగ్ టేబుల్ మీద గ్లాసెస్ స్టాండ్ లోంచి గ్లాస్ తీసి, ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసి, గ్లాసులో పోసి ఇచ్చాను. గటగటా తాగేసి, "థాంక్యూ" అంటూ వెళ్ళబోతుంటే అడిగాను.. "నీ పేరేంటి?"
నావైపు తిరిగింది. "ఆయామ్ జ్ఞాపిక" అంది మొహం మీద పట్టిన చెమట కర్చీప్ తో తుడుచుకుంటూ.
"జ్ఞాపిక.... జ్ఞాపిక" అని రెండుసార్లు మనసులో అనుకుంటే కానీ ఆ పేరు పలకడానికి మనసొప్ప లేదు.
"డూ యూ లైకిట్?' అడిగింది.
ఆ అమ్మాయి చొరవకి ముచ్చటేసింది. నవ్వుతూ తలూపాను.
"థాంక్యూ " అంటూ పారిపోయింది.
ఆ అమ్మాయినలాగే కొన్ని క్షణాలు చూసి డోర్ వేసుకుని కిచెన్ లోకి నడిచాను. గిన్నెతో నీళ్ళు స్టవ్ మీద పెట్టి కప్పులో రెండు స్పూన్ల తేనే వేసుకుని ఫ్రిజ్ లోంచి సగం కట్ చేసిన నిమ్మ బద్ద తీసుకుని కొద్దిగా రసం పిండుకున్నాను. ఈ మధ్య లెమన్ టీ నాకు రుచిగా అనిపిస్తోంది. అ టీ తాగాక కలిగే ఉత్సాహం నాకా లేమెన్ టీ మీద ఇష్టాన్ని కలుగజేసిందేమో. నీళ్ళలో కొన్ని టీ ఆకులూ వేసి, కొన్ని క్షణాల్లోనే డికాషన్ కప్పులో వంపుకుని కప్పు తీసుకుని తిరిగి హాల్లోకి వచ్చాను.
కొద్దికొద్దిగా టీ సిప్ చేస్తూ టీవీ అన్ చేసి, సోఫాలో వాలాను.
న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. రాజకీయ నాయకుల నేర చరిత్రలు, అవినీతి సామ్రాట్ ల అరెస్టులు, సీబీఐ దర్యాప్తులు, కోట్ల రూపాయల కుంభకోణాలు,డబ్బు కోసం హత్యలు, దొంగల వీరవిహారం , విచ్చలవిడిగా బతుకుతున్న యువత, యాక్సిడెంట్లు ఇతర దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు....ఏవగింపునీ, రోతనీ అసహ్యాన్ని కలగజేసే వార్తలు. భారతదేశంలో పుట్టినందుకు గర్వపదాలో, సిగ్గుపదాలో అర్ధం కానీ స్థితి. ఈ దేశంలో , రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి... అవినీతిని అలవాటుగా చేసుకుని బతుకుతున్న బడాబాబులు.... ఆడవాళ్ళ బలహీనతని, అవకాశంగా తీసుకుని వాళ్లతో స్వర్గాన్ని పొంది, వాళ్ళను నరకానికి తోసే బలిసిన నాయకులు.... అందరినీ ఏ టు జెడ్ అందరినీ ఒకే షాట్ తో తుదముట్టించే పవర్ పుల్ బులెట్ ఏదన్నా ఉందా? ఉందే వుంటుంది. అదేదో నాకు దొరికితే ఎంత బాగుంటుంది !
ఛానెల్ మార్చాను. ఏదో సీరియల్ వస్తోంది. ఇద్దరు ఆడవాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు నిప్పులు కురిసే కళ్ళతో చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మేకప్ వాళ్ళ ఆసలు మొహాన్ని పూర్తిగా మార్చేసినట్లు అనిపిస్తోంది. అద్దాల చీరలు, వన్ గ్రామ్ గోల్డ్ నగలు, అందంగా వున్నారు. వాళ్ళు ఆగి, ఆగి చెబుతున్న డైలాగ్ లు అసహ్యంగా వున్నాయి. వాళ్ళెందుకు ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకుంటున్నారో నాకర్ధం కాలేదు. వాళ్ళ హావభావాలు ,సంభాషణలు పలికే తీరు, అర్ధం లేని విలనీ భరించలేక పోయాను. మరో చానెల్ తిప్పాను. ఇద్దరు భార్యల మధ్య నలిగే హీరో, వాళ్ళల్లో ఎవరు మొదటి భార్యో తెలియలేదు. కానీ ఒక భార్య పాత్ర మాత్రం వీలైనంత నీచంగా, దరిద్రంగా, అసహ్యంగా మలిచాడు రచయిత. ఆ అరిస్టు నటన మరింత నీచంగా వుంది. టోటల్ గా స్త్రీ పాత్రల చిత్రీకరణ చాలా నీచంగా, దిగజారుడుగా వుంది. వీళ్ళకి "ఆర్టిస్టులు' అని తెలుగులో అందమైన పదం 'కళాకారులు' అనీ ఆ పదం వాడడం అంటే నిజమైన కళాకారులను అవమానించడం అనిపించింది. ఇంక చూడలేక పోయాను.
మరో ఛానెల్ రెండు పార్టీల నేతలతో ఒక జర్నలిస్టు చర్చ.అది చర్చలా లేదు. వీధిన బడి చేస్తున్న రచ్చలా వుంది. టీవి ఆఫ్ చేసి, విసురుగా రిమోట్ విసిరేసి, తిరిగి న గదిలో కి వెళ్ళాను.
లెమన్ టీ ఇచ్చిన శక్తి బాగానే పనిచేస్తున్నట్లుంది. మళ్ళీ నవల రాయడానికి ఉపక్రమించాను. కానీ ఎండుచేతో ముందుకు సాగలేదు. వేళ్ళు విరుచుకుంటూ ఫైల్ సేవ్ చేసి లాగ్ అవుట్ అయ్యాను. కంప్యూటర్ షట్ డౌన్ చేసి, గదుల్లో లైట్లువేస్తూ హాల్లోకి వచ్చాను. ఏం చేయాలో తోచలేదు. టీవీ చూడ లేకపోతున్నాను.
నవల పూర్తీ చేయాలంటే ఎలా? ఆ పాప పట్ల కసాయిదానిలా ప్రవర్తించి, ఆ పాత్రను చంపేయాలని లేదు. బతికేలా చేస్తుంది? కానీ ఎలా? మానసికంగా, శారీరకంగా కూడా ఎదగని ఆ పాప బతికేం చేస్తుంది? ఎవరా పాపని కంటికి రెప్పలా కాపాడు కుంటారు? అసలు నేనీ ఇతివృత్తం ఎందుకు తీసుకున్నాను? బోలెడన్ని సమస్యలుండగా ఈ వస్తువేనాకు ఎందుకు రాయాలనిపించింది? ఏమో?
వాకిలి తలుపు తీసి బయటికి వచ్చాను. వెన్నెల పాలు ఒలికినట్టు పల్చగా పరచుకుంది. మొక్కల మీద గాలిలో చల్లదనం పెరిగింది. వాతావరణం హాయిగా వుంది. ఎదురుగా వున్న అపార్ట్ మెంట్ లో కొన్ని ప్లాట్స్ లోనే లైట్లు వెలుగుతున్నాయి. అందుకేనేమో కళావిహీనంగా వుంది. జ్ఞాపిక గుర్తొచ్చింది. ఎక్కడుంటుందో! ,ముద్దుగా ,బొద్దుగా , ఆడి ఆడి అలసిన కళ్ళు , కందిన చెంపలు, చెదరిన జుట్టు... ఎంత ముద్దుగా వుంది! రోజూ వస్తుందా ఆడుకోడానికి? చక్కదనం తో పాటు చలాకీతనం కూడా ఇచ్చాడు భగవంతుడు. భోళాగా , కలివిడిగా మాట్లాడింది. తీయాని స్వరంతోహయిగా , స్వచ్చంగా ,మాట్లాడింది. ఎందుకో జ్ఞాపిక వచ్చి కాసేపు కబుర్ట్లు చెబితే బాగుండు అనిపించింది.