మరికొంతకాలం గడిచింది. ప్రదీప్ కి స్మీతతో కలిసి బతకడం చాలా బాగుంది. ముందు అనుకున్నట్టు జీవితం చాలా అందంగా ఉంది. కానీ, ఎక్కడో, ఏదో మూల తప్పు చేస్తున్నానా? అనే గిల్టీ కాన్షస్.... పెళ్ళి చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్మీతకి అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలి? అందరిలా ఒక భర్తగా భార్య పిల్లలతో నిండైన సంసారం వుండాలి కదా! తను ఇంటికి వచ్చేసరికి స్మిత అందంగా ఎదురు రావడం, పిల్లలు డాడీ అంటూ చుట్టేయడం ఎంత అందంగా వుంటుంది! ఎంత తీయగా వుంటుంది . ఆ కోరిక క్రమంగా పెద్దదై స్థిరపడసాగింది.
అయితే స్మిత మాత్రం పెళ్ళి ప్రస్తావన తీసుకు రాగానే "ఎందుకంత ఇన్ సెక్యూరిటీ నీకు?" అంటోంది.
"ఇన్ సెక్యూరిటీ కాదు. సంప్రదాయం బ్రేక్ చేయడం ఇష్టం లేదు. పోనీ ఎంగేజ్ మెంట్ చేసుకుందాం" అన్నాడు.
నవ్వింది. "శోభనం అయ్యాక ఎంగేజ్ మెంట్ ఏంటి అసహ్యంగా!"
"అదీ నిజమే! అనిపించింది. కానీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనిపిస్తోంది."
"సెటిల్ మెంట్ అంటే పెళ్ళి చేసుకోవడం కాదు. ఇంకా మంచి ఉద్యోగం రావాలి మంచి ప్లాట్ కొనుక్కోవాలి. బ్యాంక్ బాలన్స్ వుండాలి. ఇన్నోవా కారుండాలి.... పిక్సిడ్ డిపాజిట్లుండాలి . అప్పుడే సెటిల్ అయినట్టు"అంది.
"అవన్నీ లేకపోయినా కలిసి బతుకుతున్నాంగా! దీనికి లేని అభ్యంతరం పెళ్ళికి దేనికి?"
"నో ప్రదీప్! పెళ్ళికి చాలా కావాలి. కలిసి బతకడానికి అవన్నీ అక్కర్లేదు. మనకి ఒకళ్లంటే ఒకళ్ళ కి ఇష్టముంటే చాలు..."
"అంతేనా!?" అసంతృప్తిగా చూశాడు.
"అంతేగా మరి!" ప్రేమగా అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది.
ఓ శుభ సాయంత్రం చెప్పాడు "స్మితా!నీకో శుభవార్త . మనం కొడైకెనాల్ వెళుతున్నాం."
"అవునా....ఎప్పుడు?"
"నెక్ట్స్ వీక్ మాకక్కడ వర్క్ షాప్ వుంది"
"ఓ నైస్ ! చూడాల్సిన ప్లేస్. తప్పకుండా వెళదాం."
అతని మనసు ఆనందంతో తుళ్ళి పడింది. మర్చిపోకుండా బట్టలతో పాటు ఉంగరం కూడా తీసి పెట్లో పెట్టబోయి ఏదో ఆశతో ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు కొడైకెనాల్. అక్కడ ఆ అందమైన ప్రకృతి పందిరి లో ఈ ఉంగరం ఆమె వెలికి తొడిగి తన సొంతం చేసుకోవాలి అనే ఓ మధురమైన ఊహ అతని ఆణువణువూ పులకింపచేసింది.
అనుకున్నట్టే కోడై కెనాల్ వెళ్ళారు. స్టార్ హోటల్ లో అకామడేషన్. సదా మబ్బులతో కప్పేసిన కొండలు, రంగురంగుల పూలు, రోడ్ల పక్కన వరుసగా స్వెట్టర్ లు, టోపీలు అమ్మే చిన్న చిన్న షాపులు, మంచు కురుస్తున్నట్టుగా పడే జల్లులు, ఎముకలు కోరికే చలి, వెచ్చని ప్రియురాలి కౌగిలి. తనకెంతో ప్రియమైన ఫోటో గ్రఫీ వర్క్ షాప్ , కనువిందైన కమనీయ దృశ్యాలు. ఎంతో అందంగా మరెంతో అద్భుతంగా వున్నా ఎక్కడో, ఏదో లోటు, అసంతృప్తి అందీ అందని భావన ... ప్రదీప్ మనసంతా కొత్తగా , వింతగా సందడిగా వుంది.
స్టార్ హోటల్ సూట్ లో తెల్లటి , మెత్తటి బెడ్ మీద రజాయి కప్పుకుని ల్యాప్ టాప్ ఒళ్ళో పెట్టుకుని అతను వర్క్ షాప్ లో వున్నంతసేపు లాగిన్ అయి ఆఫీస్ పని చేసుకుంటూ మధ్య మధ్య వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది స్మిత.
సాయంత్రాలు ఆ చల్లని జల్లుల్లో తడుస్తూ కొండవాలుగా నడుస్తూ ఉడికించిన పల్లీలు, దోరమామిడి ముక్కలు తింటూ షికారుగా నడిచి వెళ్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతూ గడిపేశారు.
అతని గుండెల్లో అసంతృప్తి ముల్లులా ఆ ఉంగరం గుచ్చుకుంటూనే వుంది. తన జేబులోంచి ఆమె వెలికి ఉంగరం చేరుకునే శుభ క్షణాల కోసం అతని నీరీక్షణ సాగుతూనే వుంది. మధ్య మధ్య చేత్తో తడిమి చూసుకుంటూ అప్రమత్తంగా వున్నాడు.
ఆరోజే అతని వర్క్ షాప్ ఆఖరి రోజు. హోటల్ రూమ్ నుంచి బైటకి వెళ్ళి ఏకాంతంగా కొండ చాటున వున్న నావదేవుడు చిరుజల్లుల అక్షతలు చల్లుతుంటే ఆ ఉంగరం ఆమె వేలికి తోదగాలని తహతహలాడుతూ వచ్చాడు.
"బైటకి వెడదాం" ప్రేమగా ఆమె కురులు సవరిస్తూ అన్నాడు.
"బద్దకంగా వుంది. వెచ్చగా పడుకుందాం" అంది.
ఉంగరం తొడుగుతాను అనబోయాడు. ఆమె రజాయి లో ముడుచుకోవడం చూసి ఆగిపోయాడు. చెదిరిన జుట్టు, రాత్రి నుంచీ మార్చుకోనీ నైట్ డ్రెస్ , బొట్టు లేని నుదురు బోసి మెడ, పచ్చని మొహం, నలిగిపోయిన మొగలి పూవులా వుంది.
"మన ఈ అనుభవం ఎన్నటికీ మర్చిపోనీ మధురానుభూతిగా మిగలాలని నా కోరిక" అన్నాడు.
నవ్వింది. "ఇలాంటి మధురానుభూతులు ఇంకా చాలా పొందచ్చు" అంది.
"అందుకే పెళ్ళి చేసుకుందాం" ఆశగా అన్నాడు.
"అబ్బా ఇక్కడ కూడాడే సోదా?" ఆమె మొహం రజాయి లో దాచుకుంది.
ఆ మాట గుండెల్లో గునపం లా దిగింది. నిట్టూర్చాడు.
"నాకు ఆకలిగా ఉంది. వేడి వేడిగా ఏమన్నా తెస్తావా?"గోముగా అడిగింది.
'అలాగే" మౌనంగా లేచి బయలుదేరాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు.
తెల్లవారు జామునే లేచి కెమెరా తీసుకుని ఆమె వైపు చూసాడు. గాడంగా నిద్రపోతోంది. సవ్వడి చేయకుండా తలుపు తెరచుకుని తిరిగి లాక్ చేసి బైటికి నడిచాడు.
"సాధారణంగా ఆడపిల్లలే పెళ్ళి, పెళ్ళి అంటూ తహ తహలాడతారు. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్దంగా ఉంది. ఎందుకిలా? పెళ్ళంటే ఈమెకి ఎందుకీ విముఖత? ఆలోచిస్తుంటే మనసు బాధగా మూలిగింది. అడుగులు బరువుగా పడ్డాయి.
ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఈ బంధం? తను కొనసాగించినా తన చుట్టూ ఒక కుటుంబం వుంది. కుటుంబానికి వ్యతిరేకంగా , సంప్రదాయానికి విరుద్దంగా బతికే సాహసం ఆమెలా తను ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆమెమీద అంతులేని ప్రేమ వుంది. ఆమె కోసం బతకాలనే కోరిక వుంది. ఆమెతో సహజీవనం అన్నిటి కన్నా బాగుంది. కానీ మనసులో ఏమూలో అనుక్షణం గుచ్చుకుంటున్న అపరాధభావన ఆమెని సమర్ధించనీయడం లేదు.
మనసులో వేదన కొండల మీద, లోయల్లోనూ పరచుకుంటున్న మంచులా పరచుకుంటోంది.
భుజాన వున్న కెమెరా కి పని చెప్పాడు. అప్పటికే చాలామంది లేచి వారి వారి పనుల్లో మునిగి పోతున్నారు. టూరిస్టు లు కొందరు అప్పుడే దిగినట్టు న్నారు. ప్రకృతి అందాలే కాదు అక్కడి ప్రజల జీవన విధానం , వారి వృత్తి , వ్యాపారాలు అన్నీ వింతగా, ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. అన్నిటినీ కెమెరా లో బందిస్తున్నాడు.... ఎర్రటి టోపీ, ఎర్రటి స్వెటర్ ఎర్రని మేజోళ్ళు చెర్రీ పండు లాంటి పాప రివ్వు రివ్వున పరుగెత్తు కొచ్చి ప్రదీప్ కాళ్ళ మీదకి బంతి విసిరేసింది.
ఉలిక్కిపడిన ప్రదీప్ బెదురూకళ్ళతో చూస్తున్న పాపని చూసి చిరునవ్వు నవ్వాడు. చిరుచీకట్లో పాప కళ్ళు మెరిసిపోతున్నాయి.
ఒంగి బంతి అందుకున్నాడు. చేత్తో బంతి పట్టుకుని చిరునవ్వుతో చూశాడు తీసుకో మన్నట్టు. పాప అలాగే నిలబడిపోయింది. దగ్గరకు రాలేదు. "కమాన్" అన్నాడు . పాప చూస్తూ ఉండిపోయింది.
"అషీ" పాతికేళ్ళ యువతి పాపలాగే ఎర్రటి స్వెటర్, మప్లర్ తో వచ్చింది.
అతన్ని అతని చేతిలో బంతిని చూసి చిరునవ్వు నవ్వింది. "హాయ్' అని పలకరించింది.
అతనూ చిరునవ్వుతో "హాయ్" అంటూ "మీ బేబీనా?" అడిగాడు.
ఆమె పాప వైపు ప్రేమగా చూస్తూ అవునన్నట్టు తలూపింది.
"అయాం ప్రదీప్" చేయి చాచాడు.
"ఆయామ్ సోనమ్" చేయి కలిపింది.
బంతి ఆమె చేతికిచ్చాడు. ఆమె పాపని ఎత్తుకుంది. అతను ఎత్తుగా వున్న రోడ్డు మీద నుంచి పల్లం వైపు అడుగులు వేస్తూ అడిగాడు. "మీరు కొడైకెనాల్ వాసులా?"
ఆమె అనుసరిస్తూ చెప్పింది... "కాదు, డిల్లీ నుంచి వచ్చాను . జస్ట్ ఫర్ సైట్ సీయింగ్....' వాళ్ళ మధ్య సంభాషణ ఇంగ్లీషు లో సాగుతోంది.
"కొడైకెనాల్ ప్రకృతి అందానికి నిలయం కదా...."
'అవును... ఐ లవ్ దిస్ ప్లేస్... డార్జిలింగ్ , సిమ్లా, కూడా వెళ్ళాం. ఎన్ని రోజులున్నా తనివి తీరలేదు."
"ఓ పెద్ద టూర్ వేశారు. మీవారికి ట్రావెలింగ్ ఇంట్రస్టా?"
ఆమె నవ్వింది. "ఏం నాకుండకూడదా అలాంటి ఇంట్రస్ట్."
"సారీ! జస్ట్ క్యాజువల్ గా అడిగాను. మీ ఇంట్రస్ట్ ని ఆయన గౌరవించి మిమ్మల్ని ఇవన్నీ తిప్పడం గ్రేట్ కదా!"
'ఆయనెందుకు తిప్పాలి? నేనే నాకూతుర్ని తిప్పుతున్నాను."
ఆమె వైపు చిత్రంగాచూశాడు . ఆ చూపులో అర్ధం గ్రహించినట్టు నవ్వింది.
'ఆయామ్ సింగిల్. పాప డాడీ , నేనూ సెపరేట్ అయ్యాం."
"ఎందుకు?" అడక్కుండా ఉండలేక పోయాడు. ఆమె నవ్వింది. ముందుకు తోలుతూన్నట్టు పడుతున్నాయి అడుగులు. ఎదురుగా పెద్ద అగాధం. దీన్ని సోసైద్ పాయింట్ అంటారు. అని గైడ్ కాబోలు ఏదో చెప్తున్నాడు. టూరిస్టులు ఆ సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు.
"నేను స్వేచ్చాజీవిని. నన్ను ఎవరన్నా బంధిస్తే నేను బతకలేను. ప్రేయసీ భార్యగా మారాక మగవాడికి తన అధికారం గుర్తొస్తుంది. అహంకారం నిద్రలేస్తుంది. ఆధిపత్యం చేయాలనిపిస్తుంది. తనమాట నెగ్గాలన్న పంతంతో భార్య అస్తుత్వాన్ని అణిచేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆధునిక మహిళ సహించలేదు. నేనూ ఆధునిక మహిళనే. అందుకే నాలాంటి అమ్మాయి లందరికీ పెళ్ళి చేసుకుని బానిసలూగా మారకండి , బతకాలనిపించినంత కాలం కలిసి బతకండి అని సందేశం ఇచ్చే కధలు రాస్తూ గడిపెస్తున్నాను."
అతను నిర్ఘాంత పోయాడు.
ఆమె నవ్వుతూ అంది "ఇప్పుడు పాప, నేను ఇద్దరం ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులం. మమ్మల్ని అందించే సాహసం ఎవరూ చేయలేరు. మా మీద మేము ఎవరికీ ఎలాంటి హక్కులు, అధికారాలు ఇవ్వం" మృదువుగా వున్నా కచ్చితంగా వుంది ఆమె స్వరం. "బై...సీయూ" అంటూ వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన వైపే నిరుత్తరుడై చూస్తున్న అతని మనసులో అలజడి మొదలైంది.
ఇదేనా ఆధునిక మహిళ మనస్తత్వం. ఇంతేనా ఆధునిక జీవితానికి ఈఅమ్మాయి లిచ్చే నిర్వచనం . దీనికి కారణం ఎవరు? మగవాడా? ఆడవాళ్ళ మితిమీరిన స్వేచ్చా కాంక్ష? తనూ అలాగే మారతాడా, మగవాడిలా.... ఒక మామూలు మగవాడిలా ... భర్తగా, హక్కులు కోరుతూ, ఆధిపత్యం చెలాయిస్తూ ....అవకాశం కోసం ఎదురు చూస్తూ....
జల్లు పెద్దదైంది. వర్షం ఉదృతంగా మారుతోంది. పరిసరాలన్నీ మసకబారాయి. అంతా చీకటి అలుముకుంది. ఏమీ కనిపించడం లేదు. చలికి కొంకర్లు పోతున్న కుడిచేయి ప్యాంట్ జేబులోకి వెళ్ళింది. గట్టిగా తగిలింది ఉంగరం పెట్టె.అత్యంత భద్రంగా తీశాడు . ఎర్రటి వెల్వెట్ బట్టతో కవర్ చేసిన చిన్న అట్ట పెట్టె తెరిచాడు. చీకట్లో నక్షత్రాల్లా మినుకు మినుకుమని మెరిశాయి కెంపులు. రెక్కలు చాచుకున్న పక్షి ఆకారం... అ ఆకారానికి జీవం వస్తున్నట్టు అనిపించింది. అతని కళ్ళు ఆ ఉంగరం వైపు తదేకంగాచూస్తూ వుండి పోయాయి. కొన్ని క్షణాలు గడిచాయి. జనం బాగా పల్చబడ్డారు. తనలాంటి ఒకళ్ళో ఇద్దరో అతి జాగ్రత్తగా నడుస్తున్నారు.
అతని కుడి చేయి కొద్దిగా పైకి లేచింది. అట్టపెట్టె తో సహా ఉంగరం అగాధం లోకి జారిపోయింది. అతను నిశ్శబ్దంగా వెనక్కి హోటల్ వైపు బరువుగా అడుగులు వేశాడు. అతని కంటి నుంచి జారిన కన్నీటి బొట్లు వర్షం నీటిలో కలిసిపోయాయి.
-------