Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 5

            ఉంగరం
    ఫోన్ మోగడంతో బద్దకంగా ఒత్తిగిలి కళ్ళు తెరవకుండానే తలగడ పక్కనే ఉన్న మొబైల్ అందుకుని మత్తుగా "హలో" అంది స్మిత.
    "హాయ్ స్మితా గుడ్ మార్నింగ్ !" ఈష స్వరం హుషారుగా  వినిపించింది.
    "అప్పుడే లేచావా?" అదే మత్తు స్వరంతో అడిగింది స్మిత.
    'అప్పుడే ఎంటే.... టైమెంతో తెలుసా.... ఎనిమిదిన్నర మనం ఇంకో గంటలో గోల్కొండ హోటల్ లో జర్మన్ టీం తో కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి.... గుర్తుందా ?"
    కెవ్వుమంటూ లేచి కూర్చుని బ్లాంకెట్ తో పాటు మొబైల్ కూడా విసిరేసి పరిగెత్తుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
    సరిగ్గా పావు గంటలో బ్రషింగ్, బాతింగ్ పూర్తీ చేసుకుని మరో పది నిముషాల్లో డ్రసప్ అయి , డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి స్విచ్ అన్ చేసి, డ్రయ్యర్ తో జుట్టు అరబెట్టుకుంది. చకచకా పౌండేషన్ , కాంపాక్ట్ , ఐలైనర్, మస్కారా , లిప్ స్టిక్, అన్నీ అయ్యాక హెయిర్ బ్రస్ తో హెయిర్ సెట్ చేసుకుని , ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి పాల పాకెట్ తీసుకుని మగ్ లో సగం వరకూ పోసి టైం చూసింది. తోమ్మిదిం బావు , బాప్ రే మగ్ ఫ్రిజ్ లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ప్లాట్ లోంచి బైటికి వచ్చి లాక్ చేసి పరుగులాంటి నడకతో లిప్ట్ దగ్గరకు వచ్చింది స్మిత. లిప్ట్ ఆరో అంతస్తు లో వుంది. రెండో అంతస్తు కి నిముషం లో రావచ్చు కానీ, రాలేదు. అసహనంగా లిప్ట్ వైపు చూస్తూ మొబైల్ కోసం బ్యాగు లో చూసి వెంటనే తను బ్లాంకెట్ తో పాటు మొబైల్ విసిరేయడం గుర్తొచ్చి మళ్ళీ ప్లాట్ కి పరుగెత్తింది.
    ఈలోగా లిప్ట్ రెండో అంతస్తు లో ఆగి కిందికి వెళ్ళిపోయింది. స్మిత లిప్ట్ దగ్గరకు వచ్చేసరికి కింద నుంచి రెండో అంతస్తు లో ఆగకుండా నాలుగో అంతస్తు కి వెళ్ళింది. "షిట్" అని తిట్టుకుంటూ మొబైల్ అన్ చేసి ఈష కి కాల్ చేసింది. "హాయ్ ఈషా అందరూ వచ్చేశారా? రాత్రి సెకండ్ షో కి వెళ్ళాను. అదే మర్చిపోయాను.... ఏంటో బోర్ అనిపించి వెళ్ళాను. మెలకువ రాలేదు. వచ్చేస్తున్నా.... ఓ ... బాస్ ఇంకా రాలేదా? థాంక్ గాడ్ ... ఒకే, ఒకే లిప్ట్ వచ్చింది బై మళ్ళీ మాట్లాడతా.."
    అప్పటికే లిప్ట్ లో వున్న యువకుడు "ఏ ఫ్లోర్ "అడిగాడు బటన్ నొక్కుతూ.
    "గ్రౌండ్ ...గ్రౌండ్ ప్లోర్" కంగారుగా అంది.
    అతను ఆమె కంగారు పడుతుండటం చూసి , కనిపించి కనిపించకుండా నవ్వి బటన్ నొక్కాడు.
    'అయామ్ ప్రదీప్" లిప్ట్ అగేలోగా సమయం వృధా  చేయకుండా అన్నాడు.
    అయితే సమాధానం చెప్పేలోగా లిప్ట్ గౌండ్ ప్లోర్ లో ఆగడంతో సమాధానం చెప్పకుండా దిగబోయిన స్మిత ఒక్క క్షణం ఆగి అతని వైపు ఓ చూపు విసిరి... "అయామ్ స్మిత.... సి యూ"... పరుగులాంటి నడకతో వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేసింది.
    ఆమె వెళ్ళిన వైపు రెండు క్షణాలు చూసి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు ప్రదీప్ . స్మీత ఆఫీసుకు వెళ్ళేసరికి ఈష ఎదురు చూస్తోంది. స్మీత స్కూటర్ పార్కు చేయగానే 'పద పద కారెక్కు"అంటూ లాక్కెళ్ళింది.
    "కాఫీ కూడా తాగలేదే.... "నీరసంగా మొహం పెట్టింది స్మిత.
    "నో ప్లాబ్లెమ్ మనం వెళ్ళేది గోల్కొండ హోటల్ కి. వెళ్ళగానే కాఫీలు, బ్రేక్ ఫాస్ట్ రెడీగా వుంటాయి. ప్రదీప్ టీమ్ అల్ రెడీ వెళ్ళిపోయారు."
    'ప్రదీప్' ఆ పేరు వినగానే"ఈ పేరు ఇంతకుముందు విన్నానే" అంది స్మిత.
    "వినడం ఏంటే షీలా టీమ్ మేనేజర్ ప్రదీప్."
    "ఓ....అతను కాదులే మా ప్లాట్స్ లో కొత్త మొహం లిప్ట్ లో కనిపించింది .ప్రదీప్ అని చెప్పాడు పేరు."
    "సరే....లక్షా తొంబై మంది వుంటారు. అయినా నువ్వు హడావుడి లో సరిగ్గా విని వుండవు. ప్రతాప్ అయి వుండచ్చు అతని పేరు... మనదేశంలో వందమందిలో కనీసం ఎనబై మంది శ్రీనివాసులుండే అవకాశం వుంది గానీ, ఇరవై మంది ప్రదీప్ లు వుండే చాన్స్ తక్కువ. ఎందుకైనా మంచిది రేపోసారి వెరిఫై చేసుకో."
    మర్నాడు స్మిత మామూలు టైం కే ఆఫీసు కి వెళ్ళింది కానీ, నిన్న కనిపించిన ప్రదీప్ కనిపించలేదు లిప్ట్ లో. మరో నాలుగు రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయింది. ఐడో రోజు సాయంత్రం ఆరున్నర కి ఆఫీసు నుంచి వచ్చి స్కూటర్ పార్క్ చేసి లిప్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి "హాయ్" అంటూ పలకరించాడు ప్రదీప్.
    "హాయ్ మీరు ...ప్ర...."
    "ప్రదీప్"
    "ఓ.... ఆయామ్ స్మీత వర్కింగ్ ఇన్...."
    'ఆయామ్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఫోటో గ్రాఫర్ "
    "నైస్ టు సీయూ"
    "థాంక్యూ"
    సెకండ్ ఫ్లోర్ లో దిగబోతూ "బై" అందిస్మిత.
    మరో రెండు రోజుల తరువాత అంటే ఆదివారం పదిన్నరకు అపార్ట్ మెంటు కి దగ్గర్లో వున్న బిగ్ బజార్ లో షాపింగ్ చేస్తూ మళ్ళీ కనిపించాడు ప్రదీప్. పలకరింపులు, పరామర్శలు అయ్యాక చెప్పాడు. "నేను ఫోర్ నాట్ ఫోర్ లో దిగి నెల అయింది."
    "నేను టూ నాట్ టూ...."
    "రండి పైన కాఫీ తాగుదాం....' ఆహ్వానించాడు.
    "షాపింగ్ ఒక్కరే వచ్చారా ?" అడిగింది టేబుల్ దగ్గర కూర్చున్నాక అతని  కవర్స్ లో వున్న సరుకులు , కూరగాయలు చూస్తూ....
    "ఒక్కడినే ఉంటున్నా కాబట్టి ' నవ్వాడు.
    "సేమ్ టు సేమ్ ... నేనూ ఒక్కదాన్నే. పేరెంట్స్ గుంటూరు లో వుంటారు. తమ్ముడు బెంగుళూరు లో బిటెక్ చేసున్నాడు."
    "మా పేరెంట్స్ బాంబే లో వుంటారు. అక్క మ్యారేజ్ అయి స్టేట్స్ వెళ్ళిపోయింది."
    "ఏమన్నా తింటారా?" అడిగాడు ప్రదీప్.
    "శాండ్ విచ్"
    రెండు శాండ్ విచ్ తీసుకుని వచ్చాడు.
    తింటూ కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు దొర్లాయి.
    మరో నెలరోజులు గడిచింది. వాళ్ళ స్నేహం గుభాళించింది. లిప్ట్ పరిచయం రెస్టారెంట్స్ దాకా సాగింది.
    'అసలు మనం రెస్టారెంట్ లో ఎందుకు కలుసుకోవాలి? మా ప్లాట్ కి రండి ఈ సండే" అంది ఓరోజు.
    "థాంక్స్" అన్నాడు.
    ఆదివారం ఉదయం పదకొండు గంటలకి చేతిలో స్టీలు టిఫిన్ బాక్స్ తో కాలింగ్ బెల్ కొట్టాడు.
    "హాయ్! ఏంటిది? " అడిగింది బాక్స్ వేడిగా తగిలింది.
    "పొంగల్ .ఇది చేయడం లో నేను ఎక్స్ పర్ట్ ని."
    "ఓ థాంక్స్ ! అయితే బ్రేక్ ఫాస్ట్ దీంతో అయిపోతుంది. లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను. 
    "నేను హెల్ప్ చేస్తాను"
    బ్రేక్ ఫాస్ట్ తో మొదలైన కబుర్లు సాయంత్రం టీ టైం దాకా సాగుతూనే వున్నాయి. అందులో పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు , రాజకీయాలు , ఇంటర్ నెట్ లు , సినిమాలు, కార్పోరేట్ ఆఫీసుల పనిగంటలు, జర్నలిస్టు ల కష్టాలు చాలా కొనసాగాయి. సాయంత్రం వాతావరణం చల్లగామరిన వేళ, విరజాజులు విచ్చుకుని కమ్మని సుగంధాలు విరజిమ్ముతున్నాయని గాలి తెలియజేస్తున్న సమయంలో బాల్కనీ లో కూర్చుని అల్లం టీ తాగుతూ అందిస్మిత "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" 
    'ఆఫ్ కోర్స్ ఇప్పుడే తెలుస్తోంది నీతో పరిచయం అయ్యాక, ఇంత అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా వుంటుందేమో!"
    ఆమె అందమైన కళ్ళల్లో అంగీకారం ....ప్రదీప్ మనసు తుళ్ళి పడింది.
    మర్నాడే వెళ్ళి అందమైన ఉంగరం కొన్నాడు అమే కోసం. లాంచనంగా గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకుంటే ఇద్దరూ కలిసి ఒకే ప్లాట్ లో కలిసి బతకచ్చు అనుకున్నారు." రాత్రి ఉంగరం వైపు మురిపెంగా చూస్తూ....
    రెక్కలు విచ్చుకున్న పక్షిలా వుంది ఉంగరం , రెండు రెక్కలు, వాటి మీద మెరుస్తున్న చిన్న చిన్న కెంపులు, పచ్చలతో , చాలామంది అబ్బాయిల్లా "ప్రేమ' అంటూ తీయని కబుర్లు చెప్పి మోసం చేసేవాడు అనుకుంటుందేమో! తను అలాంటి వాడు కాదని తెలుస్తుంది. ఈ ఉంగరం చూసే ఎలా రెస్పాండ్ అవుతుందో అనుకున్నాడు.
    మర్నాడు లుంబినీ పార్కులో "నీకో సర్ ఫ్రైజ్" అన్నాడు.
    "ఏంటో అది?' నవ్వింది.
    "కళ్ళు మూసుకుని చెయ్యి ఇవ్వు.."
    ఆమె కళ్ళు మూసుకుని కుడి చేయి చాచింది.
    "ఊహు.... ఎడం చేయి ఇవ్వు"
    ఆమెకి సస్పెన్స్ ఇష్టం లేకపోయింది. "ఏంటబ్బా " అంటూ కళ్ళు తెరిచి అరచేయిలో మిల మిల మెరుస్తున్న ఉంగరం చూసింది.
    "ఏంటిది?" ఆశ్చర్యంగా చూసింది.
    "ఎంగేజ్ మెంట్ రింగ్ ఇక్కడే... ఈ ఆకాశమనే పందిరి కింద, నక్షత్రాల వెలుగులో ఈ చెట్లన్నీ వింజామరలు వీస్తుంటే నీ వేలికి ఈ ఉంగరం తొడిగి, నన్ను నీ భర్తగా గుండెల్లో రిజిష్టర్ చేసుకుంటావని" భావోద్వేగంతో అన్నాడు.
    "నీకీ నమ్మకాలున్నాయా?' అంది.
    అతనిలో అయోమయం.
    ఆమె రెండు చేతులూ వెనక్కి గడ్డి మీద ఆన్చి కళ్ళెత్తి పైకి చూస్తూ అంది ",మనసులు కలవడం ప్రధానం . ఉంగరాలు మార్చుకోవడం, తాళి కట్టడం, మంత్రాలు, ఇవన్నీ అబద్దాలు అనిపిస్తుంది నాకు. మన మనసులు కలిశాయి. మనం కలిసి వుండటానికి ఇవన్నీ దేనికి?"
    అతని కళ్ళల్లో ఓ పక్క ప్రశ్నలు, మరో పక్క ప్రశంసలు....
    మరో పది రోజులకి నెలాఖరు వచ్చింది. ఫోర్ నాట్ ఫోర్ ఖాళీ అయింది. టూ నాట్ టూ కళకళలాడింది. స్కూటర్ లాక్ చేసి వుండిపోయింది. మరో బైక్ మీద ప్రేమ జంట పరుగులు మొదలయ్యాయి.
    "లైఫ్ ఈజ్ వండర్ పుల్" అన్నాడు ప్రదీప్.
    "ఎక్స్ లెంట్" అంది స్మీత.
    ఆఫీసు , సాయంకాలం పికప్ లు, షికార్లు, ఐస్ క్రీం పార్లర్ లు, కబుర్లు నవ్వులు, శనాదివారాలు సినిమాలు, శిల్పారామం, మాల్ లో ఫోర్ డీ మూవీలు..
    "జీవితం ఇంత బాగుంటుందా?' తనలో అనుకుంటున్నట్టు పైకి అనేసింది స్మిత.
    "మనం పెళ్ళి చేసుకుందాం. ఇంకా బాగుంటుంది" అన్నాడు.
    "పెళ్ళా!" అదోరకంగా చూసింది. "అయినా పెళ్ళి అంటే బ్యాండు మేళాలు, తలంబ్రాలేనా? కలిసి బతుకుతున్నప్పుడు అవన్నీ దేనికి?" అంది.
    "పెళ్ళి సంప్రదాయం , పెళ్ళి ఆచారం, పెళ్ళి లీగల్ బాండేజ్! ఇప్పటికే బాగా లేట్ అయింది. మనం ఫామిలీ వేలో ఎంటర్ అయ్యేముందు పెళ్ళి చేసుకుంటే సేఫ్."
    "ఎవరికి?"
    "మనకే!"
    "ఎవరి నుంచి?"
    "సమాజం నుంచి..."
    "నేను సమాజం కోసం బతకడం లేదు ప్రదీప్. నా కోసం బతుకుతున్నాను. నాకెలా కావాలంటే అలా బతుకుతాను. ప్లీజ్ నన్ను పెళ్ళి పిల్లలు అంటూ బంధించాలని చూడకు. నేనెప్పుడూ స్వేచ్చగా ఎగురుతూనే వుండాలి. సంసారం అనే పంజరం లో బతకలేను...."
    అమెమాటలు అర్ధం అయ్యీ అవకుండా అర్ధం అయినా జీర్ణం కానట్టు అనిపించింది . అయినా ఆమెని వదులుకోవాలనిపించలేదు. "పిచ్చి స్మిత ఇప్పుడలాగే అంటుంది. కొన్నాళ్ళు అయాక తనకి మాత్రం సంసారం , పిల్లలు కావాలనిపించదా? తన చుట్టూ వున్న వాళ్ళంతా అతనెవరు అంటే ఏమని చెప్పుకోవాలన్న ప్రశ్న ఉదయించదా? అప్పుడైనా పెళ్ళికి ఒప్పుకోవల్సిందేగా? అందాకా ఈ ఉంగరం పదిలంగా నా దగ్గరే దాచుకుంటాను" అనుకున్నాడు.  

 Previous Page Next Page