పొద్దున్నే కాఫీ అవీ ఏమీ తీసుకోదు వరలక్ష్మి. ఎనిమిదిన్నరా తొమ్మిది ప్రాంతాలలో తేలిగ్గా భోజనం చేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం టిఫినూ, రాత్రికి భిజనం కూడా తీసుకోదు. ప్రతిరోజూ ఒక్క పొద్దే ఆమెకి.
అది ఆమె తనమీద తనంతట తనే విధించుకున్న అంక్ష. కొడుకు హరీన్ కనబడకుండా పోయినప్పటినుంచీ అదే పద్దతి. ఆమెకి తను చెయ్యని నేరానికి తనని తనే శిక్షించుకుంటోంది వరలక్ష్మి.
బట్లరు భోజనం ట్రే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు.
మరికొద్ది నిమిషాలు అలా శున్యంలోకి చూస్తూ ఉండిపోయి తర్వాత అయిష్టంగానే ట్రే వైపు చూసింది వరలక్ష్మి.
ఆ కూరని చూస్తే చాలు, తన గుండెని నాలుగు పక్షాలుగా తరిగి కారం కూరి, సెగలు వస్తున్న నూనెలో వేయించినట్లు అయిపోతుంది వరలక్ష్మి మనసు.
గుత్తివంకాయ కూరని చూస్తే హరీన్ గుర్తువస్తాడు తనకి. హరీన్ కి గుత్తివంకాయ కూర అంటే ప్రాణం. తనకు హరీన్ అంటే ప్రాణం.
చాలా సంవత్సరాల క్రితం - ఎన్నాళ్ళయింది- ఈ గదిలో ఏకాంతవాసం చేస్తూ మృత్యువు కోసం మొహంవాచేలా ఎదురుచూస్తూ కాలగతినే మర్చిపోయింది తను.
ఎన్నేళ్ళయింది హారీన్ ఇల్లు వదిలి వెళ్ళిపోయి? ఎనిమిదేళ్ళ? పదేళ్ళా? పన్నెండేళ్ళా?
గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది వరలక్ష్మి. భారమైన క్షణాలు ఎన్ని కోట్లు గడచిపోయాయో?
వాటన్నిటిని నిమిషాలలోకి గంటలలోకి మార్చే గడియారం , రోజులలోకి మార్చే కాలెండర్ ఈ గదిలో లేవు.......వుండనివ్వలేదు తను.
చాలా సంవత్సరాల క్రితం ........ఒకరోజు పొద్దుటే మార్కెట్ నుంచి నవనవలాడే లేత వంకాయలు తెప్పించింది తను. హరీన్ మీద తనకి వున్న ప్రేమనంతా తాలింపుగా వేసి కూర వండింది.
హరీన్ అది ఇష్టంగా తినబోతుండగా వచ్చారు అయన. కోపంతో నిలువెల్లా వణికిపోతున్నారు. అయన చేతిలో ఆరోజు దినపత్రిక వుంది.
"నీకు సిగ్గూ యెగ్గూ వుందా?" అన్నారు తనమీద విరుచుకుపడుతూ "పొట్టకొస్తే అక్షరం ముక్కరాని వెధవ వాడు. వాడికి పొట్ట పగిలేలా అవన్నీ తినిపించకు. మూడోసారి కూడా మెట్రిక్ తప్పాడు. వీడికి మూడ్రోజులపాటు కడుపుమాడ్చు. అర్ధమయిందా?"
ఆ మాటలు వినగానే చివాలున లేచి నిలబడ్డాడు హరీన్. తెల్లటి కుందేలులా నమ్మకంగా వుండేవాడు. అప్పట్లో కోపంవస్తే చెంపలు, చెవులు ఎరుపెక్కిపోవడం కనబడేది.
"ఊరుకొండి......వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే వున్నాడు. రాత్రంతా మేలుకొని చదువుతూనే వున్నాడుగా. నేను ఏ రాత్రప్పుడు లేచి చూసినా వాడి రూములో లైటు వెలుగుతూనే వుంటుంది" అంది తను సర్దిచెప్పబోతు.
"అది చదువు కాదే! చదువుతున్నట్లు నాటకం. వీడి నాటకాలు నా కొంప మున్చుతున్నాయి. వీధి నాటకాలల్లో పడి చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు. రోజూ రాత్రిపూట తన గదిలో లైటు వేసి తలుపులు దగ్గరగా వేసి నాటకాల రిహార్సలుకి వెళుతూన్నాడు వాడు. ఎరా నిజమా కాదా చెప్పు? అబద్దాలు చెబితే డొక్క చీరేస్తా."
"పరిషత్ పోటీలు వున్నాయి" అన్నాడు హరీన్ వినీవినబడకుండా.
"ఆహా........పబ్లిక్ పరిక్షలకన్నా పరిషత్తు పోటీలు ముఖ్యమన్న మాట నీకు! ఈసారి నాటకాల పెరేత్తావంటే నాలుక పెరికేస్తా! ఈ దరిద్రపుగొట్టు నాటకాలు మన ఇంటా వంటా లేవు నీకెలా తగులుకున్నాయిరా?"
కోపం దాచుకోలేదు హరీన్. ఎర్రబడ్డకళ్ళతో అన్నాడు -
"నాటకాలు ఇంటా వంటా లేకేం! నీ దగ్గరనుంచే నాకు వంటబట్టాయి. నువ్వు ఆడటం లేదు ఆ ప్రియంవదతో చింతామణి నాటకం........."
వెంటనే కోపం కట్టుతప్పింది ఆయనకి. విసురుగా చెయ్యెత్తి హరీన్ చెంప చెళ్ళుమానేటట్లు కొట్టారు.
"ఏమండీ!" అని ఆదుర్దాగా అడ్డం పోబోయింది తను.
తనని బలంగా పక్కకి నెట్టేశారు అయన.
బుసబుస పొంగిన తన పసి చెంపను తడుముకున్నాడు హరీన్.
"ఫో వెధవా.......వెళ్ళిపో ఇంట్లోనుంచి . మళ్ళీ నీ మొహం నాకు చూపించకు " అన్నాడు అయన.
"వెళ్ళిపోతున్నా! ఇంక నీ ఇంట్లో ఒక్కక్షణం వుండను" అని రోషంగా అని తనవైపు తిరిగాడు హరీన్.
"అన్ని అవమానాలు భరిస్తూ ఎందుకమ్మా ఇక్కడ పడివుంటావ్! నాతోరా.........వెళ్ళిపోదాం!"
"బాబూ........హారీన్!" అంది తను వెక్కుతూ.
"నీకు ఇక్కడ ఇంక స్థానం లేదమ్మా! నీ స్థానంలోకి వచ్చేస్తోంది.......వచ్చేసింది. నువ్వు ఇంక కసాయివాడి దగ్గరికి తోలబడటానికి సిద్దంగా వున్న గంగిగోవులాంటి దానివి! నాతొ వచ్చేయ్యమ్మా! ఇవాళ నన్ను వెళ్ళిపొమ్మన్నాడు! రేపు నిన్న వెళ్ళగొట్టేస్తాడు. ఆ స్థితి రాకముందే రామ్మా! వెళ్ళిపోదాం!"
"హరీన్!" అంది తను వివశురాలయి రోదిస్తూ.
"బయటికెళ్ళిపొతే బతకగలమా అని భయపడుతూ వున్నావా అమ్మా? పొట్టకోసం పట్టెడు మెతుకులు సంపాదించి పెట్టలేని అసమర్ధుడిననుకుంటున్నావా? ఈ మధ్యే కదా ఈయన హటాత్తుగా 'పచ్చబడి' పంచభక్ష్య పరమాన్నాలూ చేయించి పెట్టగాలుగుతుంది! అయినా అవి మనకోద్దమ్మా! మెట్రిక్ పాస్ కాలేకపోవచ్చు నేను . కానీ జీవితంలో మెట్లెక్కి పైకి పోగలనన్న ధైర్యం నాకుంది. నాతొ వచ్చేయ్యమ్మా!"
హరీన్ వైపు దహించేటట్లు చూసి తన వైపు తిరిగాడు అయన.
"చూశావా- నాటకాల డైలాగులు ఎలా వంటబట్టాయో! ఇంక బాగుపడడు వీడు!"
"ఆనాటకాలే నాకు తిండిపెడతాయి" అన్నాడు హారీన్ నిశ్చయంగా.
"అయితే వెళ్ళు......అఘోరించు!"
"నువ్వు రావట్లేదా అమ్మా!" అన్నాడు హరీన్ చివరిసారిగా.
ఎటూ చెప్పలేక ఏమీ అనలేక గుడ్లెంబడి నీళ్ళు కుక్కుకుంటూ దుఖం బయటికి పొర్లిపోకుండా నోటికి కొంగు అడ్డు పెట్టుకుంది వరలక్ష్మి.
అటు భర్త!
ఇటు కొడుకు!
హరీన్ వయసుకి చిన్నవాడే గానీ, వయసుకు మించిన ఇంగిత జ్ఞానం వుంది. పదిసార్లు ఆలోచించకుండా ఒక నిశ్చయానికి రాడు. నిశ్చయానికి రాకుండా ఒకమాట అనడు. మాట అన్నాడంటే ఇంక ఎవరు అడ్డం వచ్చినా వెనుదిరగడు.
అచ్చం వాళ్ళ తాతగారి పోలికే హరీన్ది. తాత అంటే తన తండ్రి దశరధరామయ్యగారు. స్వాతంత్రోద్యమంలో తెల్లదొరల కేదురొడ్డి నిలబడి తుపాకీ గుండ్ల కెరైపోయిన మనిషి.
అదే ప్రభావం హరీన్ ది కూడా!
ఇంకో రెండుక్షణాలు తన సమాధానం కోసం ఎదురుచూసి, తర్వాత గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు హరీన్.
అదే కడసారి చూపు! మళ్ళీ చూడలేదు హరీన్ ని తను -
కలలో తప్ప!
ట్రేలోని ప్లేట్లో గుత్తివంకాయకూరని చూస్తుంటే మరో విషయం కూడా గుర్తుకు వచ్చింది వరలక్ష్మికి.
పుట్టుకతోనే నటన అలవడింది హరీన్ కి. చిన్నప్పటి నుంచి దారిద్ర్యంలోనే పెరిగాడు వాడు. తను వాడి చిన్న కడుపునిండా అన్నం కూడా పెట్టలేకపోయేది. ఆకలి తీరలేదని ఎప్పుడూ వప్పుకునేవాడు కాడు హరీన్. ఎవరితో చెప్పుకునేవాడు కూడా కాదు. తను పెట్టిన పిడికెడు మేతుకులతోనే సగం తిని, సగం వదిలేసి బ్రేవ్ మని ఉత్తుత్త తేన్పులు తెప్పించుకుని తెన్చేవాడు. తన తృప్తి కోసం. ఇంట్లో బియ్యం లేవని అన్నం వందలేదని గ్రహిస్తే తనే ముందుగా కడుపునొప్పి నటించి అన్నం వద్దనేవాడు. పొయ్యి రాజేయ్యకుండా తను దిగాలు పడి కూర్చుంటే ఎక్కడో ఒక్కసారి వినిపట్టేసుకున్న సినిమాపాటలూ, నాటకాలలో పద్యాలూ పాడి అభినయించి తనని నవ్విన్చేవాడూ. చాలా సంతోషంగా వున్నానని తనని నమ్మిచేవాడు.
ఆ జ్ఞాపకాలు మనసు గాయాలని రేపుతుండగా , ప్లేటుని తినకుండానే తీసుకెళ్ళి ఆ కూరనూ, అన్నాన్నీ బాత్ రూంలో పడేసింది వరలక్ష్మి.
తర్వాత వచ్చి మంచం కింద నుంచి ఒక పాత ట్రంకు పెట్టెను బయటికి లాగి, నిస్పృహగా దానిపక్కన కూలబడింది.
పెట్టి తెరవగానే అందులో హరీన్ వస్తువులు కనబడ్డాయి. ఎర్రబొమ్మ కళ్ళద్దాలు, పెచుతో చేసిన దొంగగేడ్డాలూ, మీసాలు, దారంకట్టి మొహానికి తగిలించుకునే ఒక పులిబుర్ర మాస్కు అలాంటివే ఎన్నో!
చిన్నప్పుడు హరీన్ ఆటవస్తువులన్నీ ఇలాంటివే. తక్కిన పిల్లల్లాగా బాలూ బంతీ కావాలని ఎప్పుడూ అడిగేవాడు కాదు. మంచి బట్టలు కుట్టించమని మారాం చేసేవాడుకాడు. ఎప్పుడన్నా అడిగితే ఇలాంటివి కొనియ్యమని అడిగేవాడు. ఆయనకేమో కొనే శక్తి వుండేది కాదు.
తర్వాత ఒకరోజున హటాత్తుగా తమ దశ తిరిగింది. నిన్నటిదాకా డబ్బుకోసం మొహం వాచిపోయిన తమ కుటుంబానికి ఒక్కసారిగా మొహం మొత్తేటంత డబ్బు వచ్చింది.
అంత డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదు! ఎందుకు వచ్చిందో తెలియదు! అడిగితే చెప్పేవాడుకాదు అయన.
చిరాకుపడేవారు!
మెల్లిగా పెట్టెలో మిగిలిన వస్తువులు బయటికి తీసింది వరలక్ష్మి.
ఉలెన్ ప్యాంట్, టెర్లిన్ షర్టులు ........అన్నీ హరీన్ వే.
డబ్బు వచ్చాక ఇవన్నీ కుప్పలుతెప్పలుగా కుట్టించారు అయన హరీన్ కోసం. కానీ అవన్నీ వేసుకోకముందే, హారీన్ వేసుకుంటే చూడాలనే తన ముచ్చట తీరకముందే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు హరీన్.
తనకు తెలియకుండానే కళ్ళెంబడి నీళ్ళు ధారగా కారిపోతున్నాయి వరలక్ష్మికి.
ఒక్కసారిగా ఆలోచనలలో నుంచి బయటపడి కళ్ళు వత్తుకుని, ఆ పెట్టెను తిరిగి మంచం కిందికి తోసేసి, బాల్కనీలోకి వచ్చి నిలబడింది. అప్పుడు కనబడింది ఆమెకి ఆ దృశ్యం.
లాన్ లో కూర్చుని వున్నారు ఆయనా, ప్రియంవదా. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. తర్వాత పేపరు తెరిచారు అయన. వెంటనే గుండెని చేత్తో పట్టుకుని కుప్పకూలిపోయారు.
ఏమయింది? ఏముంది ఆ పేపరులో అంతటి దుర్వార్త.
వరలక్ష్మి కాళ్ళు గజగజవణికాయి. వెనక్కి తిరిగి త్వరత్వరగా కిందికి రాబోయింది.
ఆలోగా విశ్వనాధం కళ్ళు తేలవేసి కుర్చీలో నుంచి కిందికి జారాడు.
8
కరుణ హెచ్చరిక వినగానే వెనక్కి తిరిగి చూసిన హరీన్ కి అక్కడ కనబడింది ఒక కొండచిలువ.
బద్దకంగా పాకుతూ దాదాపు తన పాదాల సమీపానికి వచ్చేసింది అప్పుడే.
పైకొమ్మ మీద నుంచి కిందికి దూకిన చిరుతపులికి కూడా కనబడింది ఆ కొండచిలువ.