Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 9

మరుక్షణంలో కొండచిలువ చిరుతని చుట్టేసింది. చిరుత భీకరంగా పెనుగులాడటం మొదలెట్టింది.

అవి రెండూ అలా పెనుగులాడుతుంటే కిందికి పైకీ ఉగీపోతోంది ఆ చెట్టుకొమ్మ. అసలే పై కొమ్మలు అవి. అంత దృడంగా లేవు. దానికితోడు అ కొమ్మ అప్పటికే నలుగురి బరువు మోస్తోంది - హరీన్, కరుణా, చిరుతపులి, కొండచిలువా .

భయానకంగా పోరాడుకుంటున్నాయి చిరుతా, కొండచిలువా. భీతీతో కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది కరుణ.

ఉదృతంగా ఉగిపోతోంది కొమ్మ. పటపటమని శబ్దం వినవచ్చింది. సందేహంగా అటువైపు చూశాడు హారీన్

అవును......కొమ్మ విరిగుతోంది! ఏ క్షణంలోనైనా తామందరూ కలిసి ఇంత ఎత్తు మీద నుంచి శరీరాలు చినాభిన్నం అయ్యేలా కిందికి పడిపోవచ్చు.

ఈ చివరిక్షణాలలో నీతోడు నాకవసరం అన్నట్లు అతని చేతిని గట్టిగా పట్టుకుంది కరుణ.

ఇంకాస్త విరిగింది కొమ్మ. ఇంకాస్త ఒరిగింది. అప్పుడు జరిగింది అది!

హోరాహోరీ [పోట్లాడుకుంటున్న చిరుతపులి , కొండచిలువా ఒకదాన్ని ఒకటి పెనవేసుకుని ధభేలున కిందికి జారాయి.

అంత ఎత్తుమీదనుంచీ!

కొద్ది క్షణాల తర్వాత "ధన" మని పెద్ద శబ్దం! వాటి శరీరాలు నేలకి తాకినప్పుడు ఉత్పన్నమయింది ఆ శబ్దం!


    వెనువెంటనే ఫేళఫెళ శబ్దం చేస్తూ చెట్టుకొమ్మ విరిగిపోయింది. పడిపోయారు హరీన్, కరుణా ఇద్దరూ.

కరుణ పెట్టిన కేక పూర్తిగా ఆమె నోటి నుండి వెలువడకముందే అతివేగంగా కిందికి చేరిపోయారు ఇద్దరూ. కానీ ఆశ్చర్యం! భూమి కఠినంగా తాకలేదు వాళ్ళని. ఫోమ్ రబ్బరుపరుపులాంటి దానిమీద పడ్డారు వాళ్ళు.

పడీపడటంలోనే లేచి నిల్చున్నాడు హరీన్. జరిగిందేమిటో అతనికి అర్ధం అయింది ఇప్పుడు.

ముందుగా కిందపడ్డాయి చిరుతపులి, కొండచిలువా కలిసి, వాటిమీద పడ్డారు తాము. అందుకనే దెబ్బలు తగలకుండా తప్పించుకొగలిగారు.

అద్భుతమే ఇది! కానీ అద్బుతాలు జరుగుతూనే వుంటాయి అప్పుడప్పుడూ!

చిరుతపులి, కొండచిలువా ఇంకా కొసప్రాణాలతో కొట్టుకుంటూనే వున్నాయి.

అప్పటికి వరద చాలావరకు తగ్గిపోయింది. భూమి మాత్రం బురద బురదగా వుంది.

"పద కరుణా! త్వరగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాం!" అన్నాడు హరీన్. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గబగబ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు.

చాలాదూరం వెళ్ళాక ఆగాడు హరీన్. ఆయాసం తీర్చుకుంటూ చుట్టుతా చూశాడు.

చాలా చిత్రమైన లోయ అది!

అమెరికాలోని గ్రాండ్ కాన్యాస్! లోయలాగా వుంది. సన్నగా ఇరుగ్గా వున్న సందులాగా ఉంది అది. దానికి రెండువైపులా నున్నటి రాతిగోడల్లాంటి కొండలు. ఆకాశమంత ఎత్తుగా కనబడుతున్నాయి.

ఎక్కడికి దారి తీస్తుంది ఈ లోయ? దీన్లో నుంచి ఎలా బయటపడతారు తాము? ఎలా?

కానీ తన ఆలోచనలు కరుణకి చెప్పలేదు హరీన్. చెబితే ఆమె మరింత భయపడుతుందని అతనికి తెలుసు.

అంతలోనే -

"అబ్బ" అని ఆగి పాదాన్ని పట్టుకుంది కరుణ."ఏమిటి కరుణా ఏమయింది?" అన్నాడు హరీన్ ఆదుర్దాగా.

"ఏదో తగిలి కొద్దిగా కోసుకుంది పాదం" అంది కరుణ నొప్పిని సహిస్తూ.

ఒరిగి చూశాడు హరీన్.

అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భూమిలోంచి కొద్దిగా పైకి పొడుచుకు వచ్చి కనబడుతోంది.

ఏమిటది?

పాదంతో అక్కడి మట్టిని జరిపి, కళ్ళు చిట్లించి పరీక్షగా చూశాడు.

ఫాన్ రెక్కలాగా వుంది! బ్రహ్మాండమైన ఫాన్ తాలుకు రెక్కలాగా!

కొద్దిక్షణాల తర్వాత అర్ధమయింది హరీన్ కి -

అది ఏదో విమానం తాలూకు ప్రొపెల్లర్ రెక్క!

అప్పుడు అతని దృష్టిని ఆకర్షించాయి ఆ చుట్టుపక్కల అంతా విసిరేయబడినట్లు పడివున్న విమానం తాలుకు శిధిలశకలాలు! కాదు కాదు విమానం కాదది - హెలికాప్టర్! ఒకచోట దాని తాలూకు ఇంజనూ, మిగతా రెక్కలూ స్పష్టంగా కనబడుతున్నాయి. విరిగిపోయిన తోకభాగం విసిరేసినట్లు మరికొంత దూరంలో కనబడుతోంది.

దానికి మరింత దగ్గరికి వెళ్ళాడు హరీన్.

హెలికాప్టర్ తాలూకు కాక్ పిట్ పడివుంది అక్కడ. అందులో కనబడుతోంది ఒక ఆస్తిపంజరం. అది ఆ కూలిపోయిన హెలికాప్టర్ తాలూకు పైలట్ ది అయి వుండాలి.

"ఎవరో పాపం! దురదృష్టవంతుడు!" అంది కరుణ జాలిగా. విచారంగా తల పంకించాడు హరీన్.

సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి వినబడింది ఒక ధ్వని. "ట్టట్టట్టట్ట"....." అతి దూరంగా వినబడుతోంది అది.

ఆ శబ్ధమేమిటో హరీన్ కి తెలుసు! గాలిని కోస్తున్నట్లుండే హెలికాప్టర్ రెక్కల చప్పుడు అది.

"కరుణా.......ఉయ్ ఆర్ లక్కీ! హెలికాప్టర్ వస్తోంది! మన వాళ్ళదే అయివుంటుంది! హెలికాప్టర్ ఫైటింగ్ సీన్సు కొన్ని వున్నాయి మా పిక్చర్లో. దానికోసం తెప్పించిన హెలికాప్టరే అయివుంటుంది ఇది. ఇక మనకు భయం లేదు కరుణా......... రక్షించబడుతున్నాం!" అన్నాడు ఉద్వేగంగా.

రిలీఫ్ గా చూసింది కరుణ.

హెలికాప్టర్ ఒకసారి గాలిలో రౌండ్ కొట్టి, తర్వాత డైవ్ చేసినట్లు లోయలోకి కొద్దిగా దిగింది. పైన కాస్త వెడల్పుగానే వుంది లోయ. కిందికి వచ్చినకొద్దీ ఇరుకై పోయింది.

వెంటనే వేసుకున్న షర్టుని విప్పేశాడు హరీన్. హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ దృష్టిని ఆకర్షించడానికి గాను, ఆ షర్టుని చేతిలో పట్టుకుని గాలిలో గిరగిర తిప్పసాగాడు.

కాని అతనికి తెలుసు!

ఈ ప్రయత్నం వల్ల ఎక్కువ లాభం లేదని!

అతను వేసుకున్నది బ్రౌన్ కలర్ షర్టు. ఆ షర్టు రంగు ఆకాశంలోనుంచి చూస్తే మట్టిరంగుతో కలిసిపోయి తేడా తెలియదు. అతని ప్యాంటు కూడా అదే రంగుది. కరుణ ఆకుపచ్చ చీర కట్టుకుని వుంది. అది చెట్ల రంగులో కలిసిపోతుంది.

ఇలాంటి స్థితిలో ఆ పైలెట్ తమని గమనించడం చాలా కష్టం. అయినా ప్రయత్నం మానకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. తక్షణం!

కొద్దిగా కిందికి వచ్చిన హెలికాప్టర్ వాళ్ళు వున్న ప్రదేశాన్ని సమీపించి, మళ్ళీ ముందుకి వెళ్ళిపోయింది.

నిరుత్సాహం ఆవరించింది కరుణని.

"వాళ్ళు మానని చూడలేదు" అంది దిగులుగా.

"ఉండు, ఉండు." అన్నాడు హరీన్ ఆమెని వారిస్తూ.

ఆకాశంలో దూరంగా వెళ్ళిపోయిన హెలికాప్టర్ మళ్ళీ వెనక్కి తిరగడం కనబడింది.

మళ్ళీ ఆశ అంకురించింది ఇద్దరి మనస్సులో.

ఈసారైనా చూస్తాడు ఆ ఫైలెట్ తమని! చూడాలి!

"ట్ట ట్ట ట్ట ట్ట" అని శబ్దం చేస్తూ మళ్ళీ వాళ్ళని సమీపించింది హెలికాప్టర్.

చేతిలోని షర్టుని తిప్పడం మొదలెట్టాడు హరీన్. ఈసారైనా ఫైలట్ తమని చూడాలి! లేకపోతే కష్టం!

మరింత దగ్గరికి వచ్చింది హెలికాప్టర్.

"హెల్ప్! హెల్ప్! హెల్ప్!" అని బిగ్గరగా అరవడం మొదలెట్టాడు. హెలికాప్టర్ చేస్తున్న రొదలో అతని గొంతు అతనికే వినబడటం లేదు.

హెలికాప్టర్ గాలిలో ఆగినట్లు కనబడింది. దానివేగం బాగా తగ్గిపోయింది.

":చూశారు మనల్ని!" అంది కరుణ ఉత్సాహంగా.

ఆమె మాటలు హరీన్ కి వినబడలేదు. అతను ఆ హెలికాప్టర్ వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు.

పైన హెలికాప్టర్ లో.

బైనాక్యులర్స్ పెట్టుకుని లోయలోకి తొంగిచూస్తున్నాడు స్టంట్ మాన్ రతన్. అతను పైలట్ పక్కన కూర్చుని వున్నాడు. ఆందోళనగా వుంది అతని మనసు. హరీన్ నదిలో కొట్టుకుపోవడం కళ్ళారా చూశాడు తను. అతనితో బాటు ఆ అమ్మాయీ, గుర్రమూ, కూడా కొట్టుకుపోవడం చూశాడు. వరద ఎంత ఉదృతంగా వుందో చూశాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళు మళ్ళీ బతికి బయటపడి బట్టకడతారంటే నమ్మడం కష్టమే!

కానీ ఆశ!

మనిషి చచ్చేదాకా ఆశ చావదు.

ఆ ఆశే తాము ఇంకా హరీన్ కోసం చివరి ప్రయత్నాలు చేసేటట్లు చేస్తోంది.

 Previous Page Next Page