అకుపచ్చాం ఎరుపు రంగుల్తో ట్రాఫిక్ లైట్లలా మెరుస్తున్న ఒక పురుగు వచ్చి లావణ్య భుజం మీద వాలింది. ఆ అమ్మాయి దాన్ని చూసుకోలేదు.
"మిస్ లావణ్యా! ఆకుపచ్చా, ఎరుపూ రంగుల్తో ఉండి, పదికాళ్ళతో పెద్ద పెద్ద రెక్కల్తో ఉండే పురుగుని ఏమంటారు?"
"ఏమో! నాకు తెలియదు. నేను జువాలజీ స్టుడెంటుని కాను. అయినా ఎందుకా విషయం ఇప్పుడు?"
"అబ్బే! ఏమి లేదు. అలాంటి పురుగోకటి మీ భుజం మీద హెలికాప్టర్ లా వాలింది"
"బాబోయ్!" అని పెద్దగా గావుకేక పెట్టేసింది లావణ్య. "తీసెయ్యండి! తీసెయ్యండి!"
శ్రీహర్ష నవ్వుతూ వేళ్ళతో ఆ పురుగుని కిందికి తోసేశాడు. సగం దాకా చచ్చిపోయిన దాన్లాగా కొందపడి అంతలో గుర్తొచ్చినట్లు రెక్కలు విదిల్చి ఎగిరెళ్ళి పోయింది ఆ పురుగు.
కోపంతో మింగేసేలా చూసింది లావణ్య శ్రీహర్షని.
"ఒక్క క్షణంలో దుకించేస్తాను మనుషులుంటే......" అని ఏదో చెప్పబోయాడు శ్రీహర్ష.
".......ఊ! మనుషులుంటే బరువుకి ముణుగుతుందా?" అంది లావణ్య జానెడు లోతున్న నీళ్ళను చూస్తూ.
జీపు రివర్సు చేసుకుని వెనక్కి వెళ్ళి మళ్ళీ స్పీడుగా వచ్చేసి వాగు దాటాలని చూశాడు శ్రీహర్ష. హాఠాత్తుగా కాలు బెణికినట్లు వాగు మధ్యలో ఆగింది జీపు.
"తోయ్యాలేమో" అంది లావణ్య నిరసనగా. తనకింకా శ్రీహర్ష మీద కాస్త కోపంగానే ఉంది.
"ప్లీజ్!" అన్నాడు శ్రీహర్ష.
అందరూ తొయ్యక తప్పలేదు.
లావణ్య ఆపసోపాలు పడుతూ తోస్తోంది.
"లావణ్యగారూ మరీ గట్టిగా తోసేస్తున్నారు. అలా చేస్తే ఆగకుండా పరిగెత్తి వెళ్ళిపోతుంది. మనం ఎక్కే సావకాశం కూడా ఉండదు."
"వెక్కిరించనక్కర్లేదు" అంది లావణ్య.
రెండు ఫర్లాంగులు తోసినా జీపు స్టార్టవలేదు.
"నాన్నా! ఈయన జీపులో లిప్టు ఇవ్వకపోతే హాయిగా దేముడా అని నెత్తిన చేతులు పెట్టుకుని నడిచి వెళ్ళి పోయిండేవాళ్ళం. ఈ తోసే శ్రమ ఉండేది కాదు" అంది లావణ్య తలపట్టుకుని కూర్చుండిపోతూ.
శ్రీహర్ష కూడా జీపు దిగి బోనేట్ ఎత్తి చూశాడు చాలాసేపు. తర్వాత పెట్రోలు టాంకు చూశాడు. అప్పుడు చెప్పాడు అసలు కారణం పెట్రోలు అయిపొయిందిట- పెట్రోలు టాంకు లికవుతుంది.
"మరి ఆ సంగతి ముందరే కనిపెట్టలేక పోయారూ! రెండు ఫర్లాంగులు పాటు తోయించారే మహా!" అని ఉడుకుమోత్తనంగా , "నన్నా ఈ జీపు మీద నా తల బద్దలు కొట్టేసుకుందామనిపిస్తోంది" అంది.
"ష్! ఏమిటా మాటలు? అతనేమన్నా అనుకుంటాడు." అన్నారు కుటుంబరావుగారు.
"ఐయాం సో సారీ!" అన్నాడు శ్రీహర్ష.
అరయిపోయింది. అడవిలో త్వరగా చీకటి పడుతుంది. కీచురాళ్ళ రోద ఎక్కువవుతోంది.
"ఇంకో మైలు నడిస్తే డాక్ బంగాళా ఉంది. రాత్రికి అక్కడ పడుకోవాల్సిందే. మరి చీకటి పడకముందే నడిచివెళ్ళి పోవాలి సార్" అన్నాడు డ్రైవరు.
"నా వాళ్ళ కాదు బాబోయ్! నేనడవలేను. ఇక్కడే పడుకుంటా" అంది లావణ్య. నాన్నగారి దగ్గర గారం పోతూ.
"ఏ నక్కలో, కుందేల్లో వచ్చి మీద పడ్డాయంటే భయపడిపోతావు" అన్నారు కుటుంబరావుగారు.
"ఆ భయమేం లేదు సార్! నక్కలు కుందేళ్ళు ఇక్కడ చాలా తక్కువ కట్లపాములు, ఎర్రతేళ్ళు మాత్రం ధారాళంగా ఉంటాయ్" అన్నాడు శ్రీహర్ష.
ఇందాక పురుగు వాలడంతోనే హడలిపోయి ఉన్న లావణ్య కెవ్వున అరవబోయినంత పనిచేసి, కాళ్ళ వైపు చూసుకుని, భయం తీరక ఒక్కొక్కో కాలూ ఎత్తి పాదాల కింద కూడా చూసుకుంది.
భయం తగ్గాక "మిమ్మల్ని......"అని పళ్ళు కోరుకుతున్నట్లు శ్రీహర్ష వైపు చూసింది.
ఒక మైలు నడిచి డాక్ బంగాళా చేరుకున్నారు. లావణ్య చకచక నడిచేది. శ్రీహర్ష సమానంగా నడిచాడు. అంత అందమైన అమ్మాయి పక్కన అడుగులో అడుగు నడవడమే మహాభాగ్యంలా ఉంది అతనికి. కుటుంబరావుగారు వెనకబడిపోయేవారు. అంతలోనే మళ్ళీ అయన కోసం ఆగిపోయేవాడు శ్రీహర్ష. ఇంకో యాబై గజాలు ముందుకి వెళ్ళిపోయిన లావణ్య శ్రీహర్ష పక్కన రాకపోవడం చూసి తనూ ఆగిపోయేది. డ్రైవర్ మరి వెనగ్గా ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. తనకోసం మాటిమాటికి శ్రీహర్ష ఆగిపోవడం కుటుంబరావుగారు గమనించారు. మనిషి మంచితనం చిన్నచిన్న విషయాల్లో బయట పడుతుంటుంది. జీవితపు పరుగు పందెంలో పక్కవాడి కోసం ఆగే అవకాశం ఎక్కడా?
అది చిన్న బంగాళా. చుట్టూ తోట. మూడు గదులూ , వాచ్ మాన్ ఆ ఇంట్లోనే అవుట్ హౌస్ లాంటి రూమ్ లో ఉంటుంటాడు. అతనికి పరిస్థితి వివరించాడు శ్రీహర్ష. నవ్వుతూ, ఓపిగ్గా వివరిస్తూ చెప్పే అతని ధోరణికి లొంగని వాళ్ళుండరు.
వాచ్ మెన్ ని బతిమాలితే అతనే పక్కనే ఉన్న చిన్న పల్లె నుంచి పళ్ళు, పాలు తెచ్చిచ్చాడు.
నడిచి నడిచి ఆకలిమీద ఉన్న లావణ్య ఆరు అరటిపళ్ళు, తిని రెండు గ్లాసుల పాలు తాగేసింది.