కుటుంబరావు గారు నవ్వారు.
పాలు తాగుతనే 'ఎందుకు నవ్వు?' అన్నట్లు చూసింది లావణ్య.
"రోజు పడుకోబోయేటప్పుడు మీ అమ్మ వేధిస్తే గానీ ఒక కప్పు పాలు తాగవు. ఇవాళ రెండో గ్లాసు కూడా తాగేస్తుంటేను."
మాట్లాడలేదు లావణ్య.
తొమ్మిదయింది టైము.
నడక వల్ల నిద్ర ముందుకు వచ్చేస్తుంది. అయినా కొత్త పరిసరాలు నిద్రను తరిమేస్తున్నాయ్. పరుపులు లేవు. దుప్పట్లు లేవు. ఎవరికి ఎక్కడ సుఖంగా ఉంటె అక్కడ పడుకున్నారు.
చిరు చలిగా ఉంది.
నిద్రపట్టని లావణ్య కూర్చుని కిటికీలోంచి బయటికి చూసింది.
చిన్న హవుజ్ లాంటి కొలను, దాన్నిండా తామర పూలు, గట్టుమీద శ్రీహర్ష.
ఇంకో మనిషి మేలుకునే ఉన్నాడని తెలియగానే దైర్యం వచ్చింది కుటుంబరావుగారూ డ్రైవరూ ఓ మోస్తరు నిద్రలో పడిపోయారు.
తటపటాయిస్తూనే బయటికి నడిచింది. తెల్లటి వెన్నెలా, పూలవాసనా, వింత శబ్దాలూ , ఎదురుగుండా సరదాగా మాట్లాడే యువకుడూ- చాలా రొమాంటిక్ గా వుంది.
అతను పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నాడు. పలకరించాలనిపించింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?" అంది దగ్గరగా వెళ్ళి. "జీపు గురించి?"
ఆలోచనల్లోంచి బయటపడి నవ్వాడు శ్రీహర్ష.
"జీపు రిపేర్ చేయించుకోవడం ఒక్కరోజు పని మిస్ లావణ్యా! జీవితాల్ని రిపేర్ చేసుకోవడం అంత సులభం కాదు."
"ఎవరి జీవితానికి రిపేరు?" అంది లావణ్య.
"ఇంకెవరి జీవితమో అయితే నాకెందుకు విచారం? నా బతుకే!"
"అదేమిటి అలా అంటారు? ఏమయింది మీ బతుక్కి?"
ఒక్క క్షణం తల చేత్తో పట్టుకుని మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయాడు.
"మిమ్మల్నే! అడిగినదానికి జవాబు చెప్పడంలేదు.
"థాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఎన్ క్వైరి!"
"ఊరికే మాట వరసకి అడగటం లేదు నేను. చెప్పండి."
శ్రీహర్ష రెండు చేతులూ వెనక గట్టుమీద ఆనించి, కాళ్ళు బార్ల జాపి కూర్చుని సిగరెట్ అంటించాడు.
"ఇవాళ ఎవరేం పని చెప్పినా చేసే ఈ శ్రీహర్ష ఒకప్పుడు లక్షలకి వారసుడంటే నమ్ముతారా?"
కాసేపు పరిశీలనగా అతన్ని చూసి "ఎందుకు నమ్మను" అంది లావణ్య.
"లావణ్యా! ఒకప్పుడు మేమూ ఉళ్ళో కల్లా డబ్బున్నవాళ్ళలా చలామణి అయినవాళ్ళుమే. మా తాతగారో పది లక్షలు, మా నాన్నగారో పదిహేను లక్షలు వెలిగించేశారు. అందుకు బాధపడను. కానీ లావణ్య ఖర్చు పెట్టింది దానధర్మాలకి, కాదు, సత్రాలు కట్టించడానికి కాదు. తినడానికి, తాగడానికి, విలాసాలకి పాతిక లక్షలు- ఆరోజుల్లో- ఖర్చు పెట్టారు. "కొడుకేలేలా బతుకుతారు? కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి?' అన్న ధ్యాస లేకుండా అనుభవించేశారు. మేం పెద్దవాళ్ళ మయ్యేసరికి గంగయ్య దగ్గర ఇరవైవేల అప్పూ, సోహన్ లాల్ దగ్గర వస్తువులన్నీ తాకట్టు , కిరాణా షాపులో రెండేళ్ళ తిండి దినుసుల పద్దూ, పెళ్ళి కావాల్సిన చెల్లెలూ , నాన్నపోయిన దిగులుతో కుమిలిపోయే అమ్మా- ఇది సంక్రమించిన ఆస్థి. అయినా అధైర్యపడలేదు నేను."
"అధైర్యపడే రకంలా కనపడరు" అంది లావణ్య.
కాసేపాగి మళ్ళీ మొదలెట్టాడు శ్రీహర్ష. "నెమ్మదిగా ఏదో వ్యాపారం పెట్టాను. ఒక శ్రేయోభిలాషి వెయ్యి రూపాయలు పెట్టుబడిగా- పోనీ దానంగా అనుకోండి- ఇచ్చాడు అయన ఇచ్చిన ముహూర్తబలమో- నా అదృష్టమో గానీ, బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. వచ్చింది వచ్చినట్లు మళ్ళీ వ్యాపారంలోనే పెడుతున్నాను. మరి చివరికి మునుగుతానో, తెలతానో నాకే తెలియదు. పగలంతా నవ్వేస్తూ, నవ్విస్తూ గడిపేస్తాను. కాసేపు ఒంటరిగా కూర్చుంటే చాలు, ఆలోచనలూ, భయాలూ చుట్టేస్తాయి. అందుకే రాత్రిళ్ళు తొందరగా నిద్రపట్టదు నాకు. సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేస్తాను."
"అంతేగాద! బాటిల్ మీద బాటిల్ - ఖాళీ చెయ్యడం కూడా ఉందా?" అంది నవ్వుతూ.
"ఆ అలవాటు లేదులెండి. మీలాగా ఎవరన్నా ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేస్తె మనసులో బాధంతా బయట పెట్టేసుకావాలనిపిస్తుంది. అయినా ఎవరితోనూ చెప్పుకొననుకొండి. ఇవాళే మొదటిసారి, మీ ముందు బయటపడిపోయాను. సారీ!"
ఏం మాట్లాడకుండా మునిపంటితో పెదిమలు కొరుకుతూ కూర్చుండిపోయింది లావణ్య.
"మీకు బోర్ కొట్టించేస్తున్నానా?"
"అబ్బే! అలాంటిదేమీలేదు."
హాఠాత్తుగా మారిపోయాడు శ్రీహర్ష.
"ఎంతసేపు నా గొడవ చెబుతున్నాను. ఇంతకీ మీరు ఫలాని కుటుంబరావు గారి కూతురని తెలిసింది గానీ, ఇంక వివరాలేం చెప్పలేదు. మిమ్మల్ని గురించి ఎంతో తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉంది. ఇంకో విషయం నాకు కొత్తా పాతా లేదు. అతిగా మాట్లాడేస్తుంటాను. మీరేం నొచ్చుకోకూడదు. అన్ సివిలైజ్ డ్ బ్రూట్ లేక అనాగరిక మృగం అనుకోని నన్నొదిలేయ్యండి. కోపం మాత్రం తెచ్చుకోకండి."
"అంత అన్ సివిలైజ్ డ్ కాదు లెండి."