"సాక్షాత్తూ ఆ దేవుడే దిగివస్తాడేమో కదూ!"
* * * *
"రాస్కెల్" ఫెడేల్ మన్న చప్పుడు అసురసంధ్య వణికేలా నేలపడ్డ పన్నెండేళ్ళ సూరి నోటినుండి రక్తం ధార కడుతుంటే మరోసారి జుట్టుపట్టుకున్న రాజేందర్ బలంగా పైకిలేపి దూరంగా విసిరి కసిగా కాలితో డొక్కలో తన్నాడు.
"అమ్మా!" మెలితిరిగిపోతూ కాళ్ళను చుట్టేసుకున్నాడు.
విదిలించుకున్న రాజేందర్ స్వైర విహారాన్ని చుట్టూ మూగిన జనం వింతగా చూస్తున్నారు తప్ప అతడికోసం తెలిసిన ఏ ఒక్కరూ ఆపే సాహసం చేయలేకపోతున్నారు.
"దొంగనాకొడకా....మా పొలంలో ములక్కాడ ఎత్తుకు పోతావా అసలు నీకెన్ని గుండెల్రా...."
ఇక్కడ రాజేందర్ అంతమంది మధ్య సాగిస్తున్న మారణకాండ నిజంగా సూరనే పసికందుకి బుద్ది చెప్పాలనికాదు. చుట్టూ మూగిన వాళ్ళలో క్వారీకి పనిచేసే కూలీలూ వున్నారు. పొలంలోని పాలేర్లూ వున్నారు. తిరగబడాలని కాంక్ష వుంది. తిరుగుబాటు చేయలేని ఎందరో నిస్సహాయులూ వున్నారు. ఇక్కడిలాంటి దారుణం చేయడం అలగా వాళ్ళందర్నీ హడలుగొట్టే ఓ టెర్రరిజమ్....
ఒక భావిపౌరుడు ప్రాణాలచేత బట్టుకుని చూస్తుండగా రాజేందర్ మరోసారి సూరిని చేరాడు. "ర్రేయ్....ఊరుకుంటే మునగకాదా కాదురా, రేపు మునగచెట్టునే కొట్టుకుపోతావు....బానిసనాకొడకా! మా సామ్రాజ్యంలో గడ్డిపూచపై సైతం మా అనుమతిలేకుండా చేయివేస్తే ఆ చేతుల్ని కాళ్ళనీ విరిచేస్తాను.
"అందుకే నిన్ను...."
"రాజేందర్" ఎక్కడినుంచి వచ్చాడో మధ్యవయస్కుడైన జావాహర్ దూకుడుగా లోనికి దూసుకొచ్చి రాజేందర్ కి అడ్డంగా నిలిచాడు. "ప్లీజ్! పసిపిల్లాడు....చస్తాడు....."
"నన్నాపకండి మాస్టారూ....వాడి అంతు చూస్తా.....వీడు....పోయినా....ఈ ప్రపంచానికి పెద్ద అనర్ధం లేదు....మీ స్థాయిలో వున్న వాళ్ళు యిలా నోరులేని పిచ్చుకమీద ఇంత పెద్ద బ్రహ్మాస్త్రం సంధించటం భావ్యంకాదు."
రాజేందర్ అహాన్ని తెలివిగా చల్లార్చగానే పొగరుగా చుట్టూ చూస్తూ వెంటనే జీపుకేసి నడిచాడు.
అక్కడ సూరికి ఆసరా యిచ్చిన జవహర్ సమీపంలోని పట్టణంలో కాలేజి లెక్చరర్ అయితే రాజేందర్ పట్టణ యువజన నాయకుడూ....ఇప్పటికే మూడు హత్యల్ని సునాయాసంగా చేయించి విచ్చల విడిగా బయట తిరుగుతున్న చాలా పెద్దింటి వాడూను.
"ఎవరతను?" పొలంనుంచి తిరిగొస్తున్న లక్ష్మమ్మ పక్కనే మంగని అడిగింది.
"పరమ కిరాతకుడు బామ్మా? ఈమధ్యనే వూళ్ళో అడుగు పెట్టాడు ఉబుసుపోనప్పుడల్లా యిలా వూరిమీద పడుతుంటాడు.
"అతను...." లక్ష్మమ్మ వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. మంగ చెప్పింది "వీర్రాజుగారికి స్వయానా బావమర్ది! సావేరమ్మకి కాబోయే భర్త...."
అది వినిపించిందేమో జీపు యింజన్ స్టార్టు చేస్తూ మంగవేపు చూశాడు రాజేందర్. అతడి కళ్ళలో ఏ భావం కదలాడిందో వేగంగా తల తిప్పుకుంది మంగ....
బామ్మ వారగా నక్కిన శంకూ భయంగా చూస్తున్నాడింకా.....
* * * * *
ఊరంతా నిద్రలోకి జారిన అపరాత్రివేళ....
ఆరుబయట బామ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకున్న శంకూ రెప్పలార్చకుండా గదిలోకి చూస్తున్నాడు. అక్కడ హరికేన్ లాంతరు వెలుగులో అమ్మ ఫోటో కనిపిస్తూంది.
ఇందాక దెబ్బలు తింటున్నప్పుడు సూరి 'అమ్మా' అని తల్లి కోసం చేసిన ఆర్తనాదాలే గుర్తుకొచ్చాయో లేక సూరిని గుండెలకు హత్తుకుని తల్లి ఏడ్చిన జ్ఞప్తికొచ్చిందో ఇప్పుడు అదే పనిగా అమ్మ ఫోటోవేపే చూడాలనిపిస్తూంది.
"బామ్మా....మరేమో...."
"చెప్పు నాన్నా!"
"సూరి వాళ్ళమ్మ ఇందాక అంతలాగ ఏడుస్తుందెందుకు?"
"కడుపు తీపిగా నాన్నా!"
"మరి అమ్మకి లేదా....." ఓ మిస్సైల్లా దూసుకొచ్చింది వెంటనే ప్రశ్న! "బామ్మా...." ఏ అపురూపమయిన అదృష్టం చేజారిందనిపించిందో "మరి అమ్మకి నేనంటే ఇష్టముండేది కాదా" అడుగుతున్నాడు. అది కూడా కాదు అమ్మ గురించి విన్న చాలా అపవాదులకి జవాబులు కోరుకుంటున్నాడు. "ఎందుకు చచ్చిపోయిందే....ఏం తప్పు చేసిందే."
లక్ష్మమ్మ దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతోంది. "నీకు చాలాసార్లు చెప్పాను. ఇలాంటి ప్రశ్నలు వేయొద్దని లక్షసార్లు....."
"నేను పెద్దోడ్నయిపోయానుగా బామ్మా! అందుకే అన్నమాట! అయినా మామూలుగా చచ్చిపోలేదటగా....ఏదో తప్పు చేసిందటగా_"
"అవున్రా!" ఉద్విగ్నంగా అంది. "నిన్నుకని చాలా తప్పు చేసింది."
"అప్పుడు నన్నే చంపేయాల్సింది" తప్పుచేస్తే తను పుట్టాడా? మానసికమయిన పరిణతి లేదు శంకూకి! "బామ్మా....అసలు అమ్మ బావిలో పడి...."
"రేయ్ శంకూ....ఏమిట్రా....ఏమిటా పిచ్చిప్రశ్నలు?" ఆమె వెక్కిపడుతూంది.
"అందరూ అనుకుంటున్నారు బామ్మా.....నన్నడగటం లేదు...అదోలా యేదేదో అంటున్నారు. చిన్నప్పుడు అర్ధమయ్యేది కాదు....ఇప్పుడు పెద్దోడ్నయిపోయానుగా! తెలిసిపోతూందన్నమాట....అసలు నాన్న బ్రతికే వున్నాడా?"
తలూపింది కలలోలా!
"మరి నన్నెందుకు వదిలేశాడు?"
"నువ్వంటే ప్రాణంరా... కానీ...."
"మరి ఒకసారీ కనిపించడేం?"
"కనిపించకూడదు గనుక....." అసంకల్పితంగా నోరు జారింది.
"అన్నీ అబద్దాలు...." సంతృప్తి నివ్వని జవాబుల మూలంగా అతడిలో ఉక్రోషం పెరిగిపోతూంది. "అమ్మకీ నాన్నకీ అందరికీ నేనంటే అసహ్యం? అందుకీ అమ్మ నన్నుకని ఆత్మహత్య చేసుకుంది. నాన్న కనిపించాకుండా వెళ్ళిపోయాడు" శంకూ పెదవులు అదిరిపడుతున్నాయి. "బామ్మా__అమ్మమ్మని అయినా నీకు నేనంటే యింత ప్రేముందే, మరి అమ్మకి లేదేం?"
"లేదని ఎలా అనుకుంటున్నావురా.....? ఇదేమిటి పెదవి విప్పి మాట్లాడలేని వాడు యిన్ని ఆరాలు తీసి వేధిస్తున్నాడేమిటి?"
"ఉంటే ఎంత కష్టమొచ్చినా నా కోసం బ్రతికేది కదా?"
"శంకూ... శంకూ..." లక్ష్మమ్మ కళ్ళ నీళ్ళను చిమ్ముతున్నాయి.
"నిజం బామ్మా....అమ్మని నేను చూడలేకపోయినా" వెక్కిళ్ళతో గొంతు పూడుకుపోయింది.
"అమ్మ కళ్ళు, ముక్కూ, పెదవులు అన్నీ నాలాగే వుంటాయనిపిస్తూంది. అందుకేనే అమ్మని తిట్టాలనిపించినా ఏడుపొచ్చేస్తూ వుంటుంది" అమ్మ విషయంలో చాల చాలా విన్నాడు. అన్నింటికి సమాధానాలు కోరుకుంటూ బామ్మని నిలదీశాడు. కాని ఆమె నిస్సహాయంగా ఏడ్చేస్తూంది. అదే సరిగ్గా శంకూని కలవరపరిచింది కూడా.....
"ఏడవకు బామ్మా! నువ్వేడిస్తే నేను చూడలేనే" ఇప్పుడు శంకూ ఓదార్చుతున్నాడు. "మంచి బామ్మవి కదే.... ఇప్పుడు నువ్వు నవ్వేస్తా వన్నమాట! నన్ను జోకొట్టి నిద్రపుచ్చుతావన్నమాట...."
బామ్మ జోకొట్టింది. ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో జోలపాటతో అతడ్ని బుజ్జగించింది.
"జో అచ్యుతానంద జోజో ముకుందా" ఆమె గొంతు వణికిపోతూంది. నిద్రపోతున్న శంకూని చూస్తూ ఓ క్షణం వుండిపోయిన లక్ష్మమ్మ నిశిరాత్రివేళ బయటికి నడిచింది.