Previous Page Next Page 
అసావేరి పేజి 4

    "ఎక్కడని ఎదుకుతామురా....ఏ మూలన నక్కేసిందో"
   
    "మన కళ్ళముందునుంచే ఇటు పరుగెత్తుకొచ్చింది గదరా" రాజయ్య గుర్తుచేసుకుంటూ ఓ కలబంధ మొక్కదగ్గిర ఆగాడు.
   
    "దూకేసి ఎటో యెల్లి పోయుంటాదిరా. పైగా పట్టుకోడానికి అదే టన్నా మనిసా?"
   
    "అయితే ఏటంటావు? వుట్టిసేతుల్తో యెనక్కెళ్దామంటావా?"
   
    "అయ్యగారు చెమ్డాలూడగొట్టేస్తారు. ఆషామాషీ కాదు. నా మాటిని తొందరగా యెదకు." శీనయ్య ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. తుండు గుడ్డతో నుదురు తుడుచుకొని ఏకాగ్రత మరో మూలకెళ్ళాడు. "కోతి ముండ ఎంత పనిబెట్టింది."
   
    "ఇప్పుడెలా గంతవు?" రాజయ్య అడిగాడు.
   
    "తన్నులు తినటానికి సిద్దపడి ఎనక్కి  యెళ్దామంటాను" యాదయ్య నిట్టూర్పుగా అని వెంటనే ఓ ఆలోచన మెరిసినట్లు టక్కున వెనక్కి తిరిగాడు "ఓ పని చేద్దాం."
   
    "ఏటది?"
   
    "ఈరిగాడి దగ్గిర కోతుందిగా....వూళ్ళోకెళ్ళి అందాకా వాడి కోతిని ఎరువడుగుదాం."
   
    "యెర్రోడిలాగున్నావు! ఆడిస్తాడేటి?"
   
    "ఇలాగ ఆలోసిత్తా కూసుంటే అయ్యగారి కమ్చీదెబ్బలు తప్పవు మరి అంచేత...."
   
    "అంతే...అందరూ ఏకగ్రీవంగా వూళ్ళోకి అడుగుపెట్టారు. 'ఈరి గాడి' కోసం చాలా వెదికారుగాని కొండమీద కోతిలాగే వూరిలో ఈరిగాడి జాడా తెలియలేదు.
   
    చాలా దిగులు పడిపోయారు. వట్టి చేతుల్తోనే వూరికి మధ్యగా వున్న లోగిలిలో అడుగుపెట్టారు.
   
    విశాలమయిన ప్రహరీతో సుమారు ఎకరం నేలపై ఎత్తయిన కోటలా వున్న ఆ భవంతి వీర్రాజుగారిది. పల్లె చుట్టూ వున్న గ్యాలరీలో దగ్గరలో వున్న పట్టణంలోని నాలుగు సినిమాథియేటర్లకీ మరెన్నో ఫేక్టరీలకి అధిపతి అయిన వీర్రాజుగారు కోటీశ్వరుడు మాత్రమేగాక రాజకీయాలలో సైతం ఎంతటి పలుకుబడిగల వ్యక్తి అంటే...
   
    ఆ జిల్లా రాజకీయపు ఎత్తులకీ జిల్లాలో జరగాల్సిన అతి ముఖ్యమైన హత్యలకీ రాష్ట్ర రాజధానిలో జరగాల్సిన మంత్రివర్గపు మార్పులకి సంబంధించిన కీలకమైన పధకాలకి....ఈ లోగిలి కేంద్రమౌతూ వుంటుంది. నిన్నటి జమీందారీ కుటుంబానికి చెందిన వీర్రాజుగారు ఇప్పటికీ తిరుగులేని శాసనకర్తే....
   
    బోగస్ విల్లా అల్లుకున్న ముఖద్వారంనుంచి పోర్టికోదాకా పరుచుకున్న పూలచెట్లమధ్య అసహనంగా పచార్లు చేస్తుందా పదహారేళ్ళ మెరుపు తీగ....మెరుపుకూడా కాదు....కోటికిరణాలు ముద్దగామారి సోయగాలి ముగ్ధలా ఆ భవంతిలో కదలాడే ఆ మలినదర్పణం అక్కడ పూచే నంది వర్ధనాలు సైతం అందంలో పోటీపడక తలలువంచే విమల చంద్రికా విలాసిని ఆమె.
   
    అది అందంకూడా కాదు.....నేలపై పుష్పించిన గులాబీలన్నీ అసూయాలో ఆత్మాహుతి చేసుకోగా సౌందర్యాన్ని ఆరాధించే సృష్టికర్త వాటికి పునర్జన్మగా రూపునిచ్చిన పేరుతోచని కుసుమం పదహారేళ్ళ ముగ్ధ సావేరి. ఆకాశాన బాదుషా భవనశిఖలా వెలిగే సూర్యుడు సైతం సాయంసంధ్యవేళ సావేరిని చేరుకుంటాడు....ఏం జరుగుతున్నదీ ఆమె తెలుసుకునేలోగా రావి చెట్ల ఆకులమధ్యనుంచి కిరణాల రాగాలతో ఆమె చెంపల్ని స్పృశించి అల్లరిగా పారిపోతుంటాడు.
   
    రాలిపోతున్న పూలమధ్య వసివాడని పువ్వులావుంది సావేరి. చిరుకోపంతో నిరీక్షించే ఆమె విశాలనేత్రాలు వెన్నెల్ని చిమ్మే జాబిల్లి తటాకాల్లా వున్నాయి. రోషమేమో సెలయేటి పాటవెలరిలా ఆమె నుదుట స్వేదం పేరుకుంది. మేక్సీ క్రిందటి ఆమె పరువం కుసుమపూల గోరింటాకు పూసిన సంధ్యరాగిణిని గుర్తుచేస్తూంది.
   
    తను కూడా ఉరుముతుంది అప్పుడప్పుడూ కానీ అది పిడుగులా కాక స్వరలయలై వినిపిస్తుంది.
   
    "ఏమిటి?" అప్పుడు చూసింది వట్టిచేతులతో నిలబడ్డ నలుగురు వ్యక్తుల్నీ "దొరకలేదన్నమాట"
   
    తల అడ్డంగా వూపారు నిశ్శబ్దంగా.
   
    "అవున్రా ఈడియట్స్ నిజంగా చంపుతా...." తండ్రిలానే హంటర్ చేతపట్టుకుని ఆవేశంగా అంది. కాని ఆమె అరచేతులు ఆ కొద్దిపాటి రాపిడికే కందిపోతున్నాయి. ఆ భావమే సావేరికి ఏడుపు తెప్పిస్తూంది కూడా. "ఎందుకు ఎందుకు తప్పించుకుందది?"
   
    "అప్పటికీ...." రాజయ్య తలవంచుకునే చెప్పబోయాడు.
   
    "చంపుతా...అబద్దం చెబితే అర్జంటుగా చంపుతా" హంటర్ ని జుళిపించింది కాని ఎందుకో చేతులు రావడంలేదు. "అసలు మిమ్మల్నిలా కాదు....నాన్నగారితో చెప్పీ...." ఈసారి నిజంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
   
    "ఏంటమ్మా!" రాధమ్మ వచ్చిందక్కడికి.....కోపాన్ని సైతం సరిగా ప్రకటించలేని కూతుర్ని చూస్తుంటే నవ్వొస్తుంది. కాని మొండిపిల్ల ఉడుక్కుంటుందని, ఉడుక్కుంటే ఓదార్చటం ఇంట్లో ఎవరికీ సాధ్యంకాదని తమాయించుకుంటూ అంది. "అసలేం జరిగిందే?"
   
    "ఇందాక నేను ఎస్టేటుకెళ్ళానా" కోపంతో సావేరి సంపెంగ నాసిక ఎరుపెక్కిపోతూంది. "దారిలో ఓ కోతి నన్ను వెక్కిరించింది."
   
    రాధమ్మ చీరచెరగుని నోటికి అడ్డంగా వుంచుకుంది.
   
    "అందుకని వీళ్ళని వెంటపడి పట్టుకోమన్నాను."
   
    "అది కొండెక్కిందమ్మా" శీనయ్య బెదురుగా అన్నాడు. "అప్పటికీ గాలించాం తల్లీ కాని దొరకలేదు."
   
    "అంటే....?" సావేరి వేలితో హెచ్చరిస్తూ అంది. "నన్ను వెక్కిరించిన కోతి కొండెక్కి తప్పించుకొంది కదూ అందుకే చంపుతా."
   
    "అది కాదమ్మా!" రాధమ్మ నచ్చచెప్పబోయింది. "కోతిని పట్టుకోవడం అంత తేలిక కాదే...."
   
    "మరి కొండమీది కోతినైనా నేను కోరితే రప్పిస్తానని డాడీ అంటారుగా మమ్మీ....."
   
    రాధమ్మ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఫకాలున నవ్వేసేదే కాని ఇప్పుడు సావేరి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి.
   
    "చూడు సావేరీ....నీకు కావాలంటే మరో మంచికోతిని....."
   
    "మమ్మీ....యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ....నాకు ఆ కోతే నేను కోరిన కోతే కావాలి....ఆ.... అంతే ....లేకపోతే వీళ్ళని చంపుతా...."
   
    "సరే....నువ్వెళ్ళు....నేను మాట్లాడతాగా" సావేరిని ఇంటిలోకి పంపడానికి ప్రాణంపోయినంత పనైంది. సావేరి హంటర్ విసిరి లోనికి వెళ్తుంటే అప్పుడు ఓ కారు లోపలికి అడుగుపెట్టింది.
   
    నిలబడ్డ వ్యక్తుల్నీ, భార్య రాధమ్మనీ చూస్తూ- "ఏం జరిగింది" అన్నాడు వీర్రాజుగారు.
   
    "మీరంతా వెళ్ళండి" అంటూ నలుగుర్నీ పంపేసిన రాధమ్మ జరిగింది చెప్పింది. "నౌఖర్లనీ కమ్చీతో కొట్టటం మీ కలవాటుగా. ఈరోజున మీ పని అది చేయబోయింది. కానీ మళ్ళీ చేతులురాక కమ్చీనిలా విసిరి వెళ్ళిపోయింది."
   
    భార్య చెప్పే విషయాలన్నీ పట్టించుకోని ఆజానుబాహుడైన వీర్రాజుగారి ఇది పట్టించుకోకుండా వుండలేకపోయారు. ఆయనకున్న సంతానం కొడుకు రవి తర్వాత సావేరి మాత్రమే అయినా అతని పెద్ద బలహీనత సావేరి.
   
    నిజమే....సావేరిని అలానే పెంచాడు. అడిగిందేదన్నా అలాగే సాధించాడు కూడా.
   
    "అర్ధమైందిగా...మీరు దాన్నెంత గారాం చేసిందీ."
   
    వీర్రాజుగారు నవ్వలేదు. నిజంగా ఆ తప్పించుకున్న కోతి కోసమే ఆలోచిస్తున్నట్టు సీరియస్ గా వుండిపోయారు.
   
    "ఏమిటోనండీ....దీని మొండితనం ఇదీనూ__ఇదిలాగే పెరిగితే దీన్ని ఎవరు కట్టుకుంటారో కట్టుకున్న వాడెలా తట్టుకుంటాడో మీకూ ఆ దేవుడికే తెలియాలి."
   
    గర్వంగా చూసారాయన. "పిచ్చిదానా....నా బిడ్డని కట్టుకునే వాడు మామూలు మనిషేకాడే..."

 Previous Page Next Page