శంకూ అడిగింది ఎవరికీ అర్ధంకాని ఓ ఉద్గ్రంధపు పుటల్లోని సారాంశాన్ని, చలిలో వణుకుతూనే మామిడితోపులోకి వెళ్ళిన ఆమె అక్కడ చీకటిలో ఆకారాన్ని కలిసింది. "నన్ను నీ కొడుకు నిలదీస్తున్నాడయ్యా! అర్ధం చేసుకోగలడో లేదో నిశ్శబ్దంగా నేనుండిపోతే నాన్నెందుకు నన్ను వదిలిపెట్టాడూ అంటూ నన్ను సాధిస్తున్నాడు. ఒక్కసారి....కనీసం ఒక్కసారి నువ్వు వాడికి కనిపించి నేను చెప్పలేని నిజాన్ని చెబితే...."
"వెలుగులో బ్రతికే పసికందు వాడు! ఈ చీకటి పొరల క్రీనీడలు వాడిపై పడకూడదు అత్తయ్యా! నన్ను ద్వేషించనీ, ఆ ద్వేషంలోనయినా వాడ్ని ఎదగనీ" చీకటిలోని ఆకారం గొంతు గంభీరంగా పలికింది. ఆ స్వరం చీలిన గగనం గుండెనుంచి జారిపడ్డ ఉరుములా ప్రతిధ్వనించింది.
* * * * *
ఉదయం ఎనిమిది గంటలవేళ....
రెండు గంటల క్రితమే నిద్రలేచిన పల్లె వెలుగు స్నానంతో తలార బోసుకున్న ముగ్ధలా వుంది.
సూర్యకిరణాల తాకిడితో చలిని విదిలించుకున్న యేరు తీరుబాటుగా తూర్పుకి సాగిపోయింది.
ఏడో కొండని తాకిన గాలి అలలు పూలమాలల సౌరభాల్ని ఒంటికి అద్దుకొని వూరిలోని జనాన్ని పరామర్శిస్తూ వెనక్కు వస్తున్నాయి.
"బామ్మ! కళ్ళు మండిపోతున్నాయి" కమ్మలదడి చాటున తలంటు స్నానం చేస్తున్న శంకూ గట్టిగా కేకపెట్టాడు.
"గట్టిగా అరవమాక" అమంగ తలని రుద్దుతూంది "ఆడపిల్లలా అలా హైరానా పడతావేంటీ...." కుంకుడుకాయ పుల్ల శంకూ నెత్తిన ఒంపింది.
తలను రుద్దుతానన్న బామ్మ ఆ పని మంగకి అప్పజెప్పి తను వంట గదిలోకి దూరటం శంకూకి నచ్చలేదు. అసలు మంగే బామ్మకి నచ్చజెప్పి అవకాశం తీసుకోవటం అతడు గమనించాడుగానీ యిప్పుడు మంగ చేతుల్తో కుదిపేస్తుంది. అది కూడా కాదు ఎదురు నిలబడ్డ మంగ తల రుద్దుతున్నట్టుగా అతడి మొహాన్ని గుండెలకి హత్తుకుంటూంది.
అప్పటికే బామ్మకి రాత్రి చెప్పాడు తను పెద్దాడ్నయిపోయానని.
"మంగా! ఊపిరందటం లేదు" మంగతోనే ఓ అండర్ స్టేండింగ్ కి వచ్చేద్దామనుకున్నాడు. "ఎందుకలాగ దగ్గరికి లాక్కుంటావు?"
"చెప్పాలవి...." కిసుక్కున నవ్వింది.
"ఏమిటి....?"
"ఎత్తులు...." మర్మంగా అంది. "అదే_తలంటు స్నానం చేయనన్న నీ ఎత్తులు సాగవని చెప్పాలని...."
"ఇదిగో చెప్తున్నాను. నా కళ్ళు మండిపోతున్నాయి.
"ఎవరు తెరవమన్నారు" హాస్యంగా అంది. "ఎవరు చూడమన్నారు."
"నేనేం చూడలేదు."
"సిగ్గుపడక....అలా చూడాలనిపించిందీ అంటే నేనేం కోపగించుకోనులే" విదిలించుకున్నాడు మంగ చేతుల్ని. "చూడూ" కళ్ళు చిట్లించి ఇప్పుడు సరాసరి మంగ కళ్ళల్లోకి చూస్తున్నాడు. "నాకు తెలుసు నువ్వంటున్నదేంటో."
"ఇంకేం తెలివైన పిల్లాడివే...." చెంబులో నీళ్ళను అందుకోబోతుంటే పీటమీది నుంచి దూరంగా జరిగిపోయాడు. జారిపోతున్న తువ్వాల్ని నడుంకి చుట్టుకుంటూ "నేను పోసుకుంటాను. నువ్వెళ్ళు" అప్పటికే కుంకుడు కాయ రసం కళ్ళలోకి వెళ్ళడంతో మండిపోతున్నాయి. వరుసగా మూడు చెంబులనీళ్ళు నెత్తిమీద గుమ్మంరించుకున్నాడు.
మంగ చూస్తూంది రెప్పవాల్చకుండా.
లేత ఎండలో శంకూ శరీరం నేలని తాకే జలపాతంలా మెరిసి పోతూంది. నీళ్ళతో తడిసిన శంకూ భుజాలూ ఒళ్ళూ కరిగిన బంగారంలో ముంచి తీసిన విగ్రహాన్ని గుర్తుచేస్తున్నాయి.
శంకూ ప్రవర్తనకి కోసం రావడంలేదు. పిరికిగొడ్డు ధైర్యం తెచ్చుకుంటే ఎంత బాగుడ్ను అనుకుంటూంది. రాలుగాయి పిల్లడు రగులుకుంటే చూడాలని ఒళ్ళంతా కళ్ళుచేసుకొని చూస్తూంది.
బామ్మ చీర చెరగు అందుకుని తల రుద్దేసుకున్నాడు. రోషం ఉక్రోషం ఎక్కువై పోతూంటే కాళ్ళను నేలకి తాటిస్తూ కోపంగా గదిలోకి వెళ్ళాడు.
"ఏమైందిరా?" శంకూని చేరనున్న లక్ష్మమ్మ అప్పుడు చూసింది. శంకూ కళ్ళు కుంకుడుపుల్ల మూలంగా చింతనిప్పుల్లా ఎరుపెక్కాయి. "అయ్యోరామా....కళ్ళెందుకు మూసుకోలేదురా?"
"ఒళ్ళుమండి..." దుఃఖం ముంచుకొస్తున్నట్టు మొహంపెట్టి" అదిగో మంగ నడుగు" అన్నాడు.
అప్పటికే బయటికి వెళ్ళిన మంగ అయిదు నిమిషాలలో వెనక్కు వచ్చింది. చేతిలో చిన్న ఉగ్గిగిన్నెతో.
"అదేంటి" ఉగ్గిగిన్నెలో తెల్లగా కనిపించేదేమిటో తెలీక కోపంగా అనగానే "ముందు వెల్లకిలా పడుకో" అంది.
అదేమిటో అర్ధమైన లక్ష్మమ్మ మంగ దబాయింపుకి నవ్వుకుంది. మంగ అల్లరికే నవ్వుకుందో, లేక పెదవి విప్పని శంకూ కోపం చూడ ముచ్చటగా అనిపించిందో కాలేజీకి కేరియర్ కట్టాలని వంటగదిలోకి నడిచింది.
"బామ్మా!" గట్టిగా కేకేశాడు.
బలవంతంగా మంచంపైకి తోసింది మంగ. "బామ్మాలేదూ, అమ్మా లేదు నోర్మూసుకుని పడుకో."
"ఎందుకూ" నివ్వెరపోతూ చూశాడు.
"కళ్ళు ఎర్రగా వుంటే అక్కడ కాలేజీలో అంతా తాగొచ్చావనుకుంటారు. పాలేస్తే ఎరుపు పోతుంది" విదిలించుకోబోయిన శంకూ చేతుల్ని పట్టుకుని ఉగ్గుగిన్నెలో పాలను రెండు కళ్ళలో వేసింది.
నిజమే...చల్లగా అనిపించింది.
కళ్ళు మూసుకునే అడిగాడు! "పాలుపోస్తే మంట తగ్గుతుందా?"
"ఆవుపాలు కావులే."
"మరి...."
"చనుబాలు"
"అంటే...."
"ముద్దపప్పు" కిసుక్కున నవ్వింది. "ఆడదాని పాలు అన్నమాట...."
రెండు క్షణాలు మాట్లాడలేకపోయాడు. వెంటనే చాలా ప్రశ్నలు అడగాలనిపించింది. అసలు అవెలా సంపాదించగలిగిందీ అన్న పెద్ద సంశయమూ కలిగింది. కాని అడిగితే ఇంకేం అల్లరి చేస్తుందో అని ఆగిపోయాడు.
ఓ నిమిషం తర్వాత కళ్ళు తెరిచాడు.
పైకిలేచి కళ్ళు తుడుచుకుంటూ అటూ ఇటూ చూశాడు.
మంగ లేదక్కడ....ఉగ్గుగిన్నె ఇంకా తడిగానే వుంది అంచున పేరుకున్న తెల్లని పాలతో.
సన్నని ప్రకంపన....అటూ ఇటూ చూశాడు.
అది ఉద్వేగమో లేక మరేదో తెలుసుకోవాలన్న ఉత్సాహమో మరోమారు అటూ ఇటూ చూసి వణుకుతున్న చేతుల్తో ఉగ్గుగిన్నెని అందుకున్నాడు.
నెమ్మదిగా చాలా నెమ్మదిగా చూపుడు వేలుతో గిన్నెలోని పాలు తుడిచి అసంకల్పితంగా నాలుకపై వుంచుకున్నాడు.
"అమ్మదొంగా"
ఉలికిపడ్డాడు వేలిని తీసి మంగ అక్కడ నిలబడి నవ్వుతూంది.
"గడుగ్గాయివే...."
"అదీకాదు...."
"చూడూ...." గిన్నెని అందుకుంటూ రహస్యంగా అంది.
"నీకు రుచి చూడాలని అంత ఇష్టంగా వుంటే నన్నడగొచ్చుగా పాలెందుకు....నోటిలో అసలు...." ఆ తర్వాత మంగ అన్నదేమిటో అతడికి అర్ధం కాలేదు.
"చూడూ...బుద్దిమంతుడిలా ఫోజు పెట్టకు...ఈ రాత్రికి మీ బామ్మనిద్రపోయేక వస్తాను...."
"ఎందుకూ...."
"అందుకే" నిన్నటి కలలోలా నవ్వుతూంది మంగ.