పద్మావతి కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూస్తూ
"అయితే ఇది నిజమేనుటే!" అంది పావనితో.
పావని బెదురుగా "ఏమిటత్తయయా!" అంది.
"పక్కవీధి తులశమ్మ చెప్పింది. మన సరళ హరిజనుడ్ని పెళ్ళిచేసుకుంటానందిటగా..."
పావని మాట్లాలేదు.
"నేను నమ్మలేకపోయాను. మన ఇళ్ళల్లో ఇలాంటి బుద్దులెవరి కున్నాయి? కానీ, ఆవిడ అన్నీ వివరంగా చెప్పింది. మీ నాన్న వాడికి వాళ్ళ కులందానితో పెళ్ళి జరిపించాట్టగా! మంచిపని చేశాడు. లేకపోతే, హవ్వ! ఇంటా వంటా ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా?"
అప్పటికీ పావని మాట్లాడలేదు. మాట్లాడి ప్రయోజనంలేదు.
"అవన్నీ అలా ఉంచు. ఇది విను. ఆ వెధవ ఇక్కడే ఆస్పత్రిలో ఉన్నాట్ట. వాణ్ని చూట్టానికే ఇది ఇక్కడికి వచ్చిందిట! రాత్రి అక్కడికి పోయిందట. అక్కడకు పోవడానికి వీల్లేదని గట్టిగా చెప్పు. నీ చెల్లెలికి నువ్వు చెప్పకపోతే, ఎవరు చెపుతారు?"
ఆజ్ఞాపిస్తున్నట్లు అంది పద్మావతి.
సరళ ముఖం చూస్తోంటే హృదయం ద్రవించిపోతోంది పావనికి. ఈ విషయాలన్నీ సరళతో ముఖాముఖి మాట్లాడటానికి మనసు రావటంలేదు. అయినా తప్పదు.
"సరళా! నిన్న హరిబాబుణు చూట్టానికి వెళ్ళావా?"
"అవునక్కా! ఎంతెంత దెబ్బలు తగిలాయో, నువ్వు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. అసలు బ్రతుకుతాడంటావా అక్కయ్యా?"
అమాయకంగా ఓదార్పు కోసం తనను ఆశ్రయిస్తోన్న చెల్లెలితో ఏం మాట్లాడాలో తోచలేదు పావనికి...
"సరళా! నువ్వు అక్కడకి వెళ్ళద్దమ్మా"
"అదేమిటక్కయయా మామూలుగా తెలిసినవాళ్ళు అపాయదశలో ఉంటేనే చూసి సహించలేం కదా నా ప్రాణానికి ప్రాణమైన హరిబాబును ఈ స్థితిలో చూడకుండా నేను ఉండగలనా"
పావనికి ఏడుపొస్తూంది. కోప మొస్తూంది.
"సరళా! ఇలా అయితే నిన్ను నా దగ్గిరుంచుకోను. మన ఇంటికి పంపేస్తాను..."
వణికిపోయింది సరళ.
"వద్దక్కయ్యా ఆ ఊళ్ళో అంటూ ఆ రాక్షసకృత్యం మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ నేను బ్రతకలేను. నన్ను కొన్నాళ్ళు నీ దగ్గిరే ఉండనియ్యి."
వెక్కి వెక్కి ఏడ్చింది సరళ...రెండుచేతులూ జాపి సరళణు గుండెల్లోకి తీసుకుంది పావని. తడబడుతోన్న తన కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ, "మరి రేపటినుండీ వెళ్ళవుగా" అంది.
సరళ మాట్లాడలేదు.
ఆ మరునాడు సాయంత్రంకూడా సరళ వెళ్ళిపోయింది. ఈసారి ఎక్కడికి వెళ్లిందో అందరికీ తెలిసిపోయింది. శాంతమూర్తి అయిన పద్మావతి పావనిమీద కాళికలాగే విరుచుకుపడింది...
"ఇదేమైనా సంసారుల కొంపా? సానుల కొంపా? ఇలాంటి మూక చేరితే పెళ్ళికావలసిన నా కూతురు కూడా పాడైపోతుంది. చేతనైతే నీ చెల్లెలికి బుద్ది చెప్పి కుదురుగా ఉండమను. లేకపోతే పంపించెయ్యి. కచ్చితంగా చెపుతున్నాను. ఈ ఇంట్లో ఇలాంటివి సాగవు."
అత్తగారి కోపానికి చాలా భయపడింది పావని
సరళ వచ్చేవరకూ మేలుకుని కూచుంది. రాత్రి పన్నెండయింది.
ఇంట్లో గొడవలతో చికాగ్గా ఉన్న పావని అంత రాత్రివేళ సరళ బయటినుండి రావటం సహించలేకపోయింది.
చాచి లెంపకాయ కొట్టింది. బిత్తరపోయి చూసింది సరళ.
"ఛీ! ఛీ! సిగ్గులేదూ?" అంది చీదరించుకుంటూ.
"సిగ్గెందు కక్కయ్యా? ఏం తప్పు చేసానని?" నిర్భయంగా అడిగింది సరళ.
"తప్పు చెయ్యలేదూ అతనికి పెళ్ళయిపోయింది. తెలియదూ?"
"పెళ్ళి! ఆ అబద్దాల పెళ్ళికంటే ముందుగానే మా ఇద్దరికి నిజంపెళ్ళి జరిగిపోయింది. నీకు తెలుసా అక్కయ్యా!"
మ్రాన్పడిపోయింది పావని.
"ఏవిటే నువ్వంటున్నది?"
"అవునక్కయ్యా ఇప్పుడు నాకు అయిదో నెల"
మతిపోయిన పావని సరళ చెంపలు టపటప వాయించేసింది...
"ఛీ! ఛీ! పాపిష్టిదానా!" అంది కోపంగా.
పావని దెబ్బలు లక్ష్యపెట్టకుండా "ఇందులో నేను చేసిన పాపమేముంది అక్కయ్యా! నా త్రికరణాలతో నావాడనుకున్న వ్యక్తికి నన్ను నేను అర్పించుకున్నాను. ప్రకృతిసహజంగా మాతృత్వం వచ్చింది ఈ గొడవలన్నీ మధ్యలో రాకపోతే నేనూ, హరీ, ఈ విషయానికి ఎంత ఆనందించేవాళ్ళం!" అంది సరళ.
పావనికి ఆలోచించగలిగే శక్తి పోతోంది.
"వద్దక్కయ్యా! కొంచెం రోజులుండనీ! నేనుంటే హరి తప్పకుండా బ్రతుకుతాడు. హరి కోలుకోగానే నేనూ, హరీ, ఎక్కడికైనా వెళ్ళిపోతాం"
హడలిపోయింది పావని. ఒకవైపు అత్తమామలు. మరోవైపు తల్లిదండ్రులు - ఎదురుగా సంఘం - వికృతంగా భయపెడుతూ కనిపించారు.
"వీల్లేదు ఎంతమాత్రం వీల్లేదు. రేపే ఎవరినైనా మనిషిని తోడిచ్చి నిన్ను అమ్మ దగ్గిరకి పంపేస్తాను."
పిచ్చిదానిలా అరిచింది పావని.
పక్క గదిలోనుండి సరళ ఏడుపు హృదయవిదారకంగా వినిపిస్తోంటే గుండె తరుక్కుపోసాగింది పావనికి. కొంతసేపటికి ఏడుపు ఆగిపోయింది. వెళ్ళి చూడాలనిపించింది. అంతలో గుండె రాయిచేసుకుంది. ముందు తల్లిదగ్గిరకు వెళ్ళిపోనీ ఆ మంచిచెడ్డలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారు. లేకపోతే, "నువ్వే సరళ జీవితం నాశనంచేసావ"ని అందరూ తనను దుమ్మెత్తి పొయ్యరూ?
రాత్రంతా సరళ దిగులుతో సరిగా నిద్రపట్టక ఆ మరునాడు పావని కొంచెం పొద్దుబోయి లేచింది.
సరళ ఇంట్లో లేదు. గుండె గుభిల్లుమంది. ఎక్కడికి పోతుంది? తల్లి దగ్గిరకే వెళ్ళి ఉంటుందనీ రామాపురానికి మనిషిని పంపారు. వెంటనే సుందరమ్మా, జగన్నాథం కంగారుపడుతూ వచ్చేసారు, 'సరళ మా దగ్గిరకు రాలే'దంటూ...
హరిబాబు దగ్గిరకు వెళ్ళిందేమోనని అందరూ హాస్పిటల్ కు వెళ్ళారు. హరి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. వంటిమీద తెలివిలేకుండా ఏదో అతి ప్రయాసతో అంటున్నాడు. దగ్గిరగా వెళ్ళింది పావని తనకున్న జీవశక్తినంతా వినియోగించి హరి ఉచ్చరించిన చివరిమాట "సరళ!"
హరి ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోయాయి. ఎల్లయ్య గోడు గోడున ఏడుస్తూ తనకు తెలిసిన మనుష్యులను ఏమీ అనలేక తనకు తెలియని దేవతలకు శాపనార్ధాలు పెడుతూ పిచ్చివాడిలా వెళ్ళిపోయాడు?
ఆ తరువాత పావని ఏనాడూ స్థిమితంగా నిద్రపోలేకపోయింది. ఏ మూలనుండో సరళ దీనంగా "నన్ను కొంచెంరోజులు నీ దగ్గిర ఉండనియ్యవూ అక్కయ్యా! నే నుంటే హరి చావడు." అని అడుగుతున్నట్లే తోచి ఉలికిపడి
లేచికూచునేది.
జగన్నాథం ఎంత ప్రయత్నించినా సరళ జాడ తెలియలేదు. పోలీస్ రిపోర్ట్ ఇయ్యటానికి ఆయన "నలుగురిలో తలెత్తుకోలేకపోవటం" అడ్డువచ్చింది. లోలోపల కుమిలిపోవటంతప్ప సుందరమ్మ ఏం చెయ్యలేకపోయింది.
ఆనాటి కీనాడు సరళ దగ్గిరనుండి ఈ టెలిగ్రాం!
ఏ పరిస్థితుల్లో ఉండి తనకీ టెలిగ్రాం ఇచ్చిందో సరళ!
4
హోటల్లో దిగి అడ్రస్ వెతుక్కుంటూ సరళను కలుసుకోవటం కష్టమే అయింది పావనికీ, విఠల్ కీ.
మంచానికి బల్లిలా అతుక్కుపోయిన సరళణు చూడగానే గొల్లుమంది పావని.
పావని ఏడుపుని కూడా పట్టించుకోకుండా "అక్కయ్యా! హరి కులాసాగా ఉన్నాడా?" అని అడిగింది ఆరాటంగా సరళ.