హుంకరించాడు జగన్నాథం.
గడగడలాడుతూ వెళ్ళిపోయారు ఆ జనం...జగన్నాథం పొలాల్లో కూలి చేసుకుంటేకాని గడవని జనం... ఆ కూలిలేని రోజుల్లో జగన్నాథం దగ్గిర అప్పులు తెచ్చుకుంటే కాని గడవని జనం...
అప్పటి కప్పుడే కులం పెద్దలు హరిబబును పిలిపించారు...
"అవును నేను సరళను పెళ్ళిచేసుకుంటాను." అని నిర్భయంగా చెబుతున్న హరిబాబుని చూసి కులం పెద్దలతోపాటు ఎల్లయ్యకూడా గుండె బాదుకున్నాడు.
"ఏటేటి? జగన్నాథం గోరి బిడ్డనే ఆరిని కాదని ఈ ఊళ్ళో బతుకుదామనే? ఏంటే ఎల్లయ్యా? సదివినోడు, సదివినోడు...అంటివి...ఇట్లా తయ్యారయ్యేడేంటీ? నీ కొడుకూ?..."
ఎల్లయ్య గుటకలు మింగాడు. ఏం సమాధానం చెపుతాడు? కడుపు కట్టుకుని కొడుకుని చదివించగలడు కాని, పెద్దలను ఎదిరించగలడా? జగన్నాథంగారిని కాదనగలడా?
"ఏంటిరా, యిదంతా?..." అమాయకంగా అడిగాడు కొడుకుని...
తండ్రి ముఖం చూస్తోంటే జాలితో కడుపు తరుక్కుపోయింది హరిబాబుకి...తండ్రి తనమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అతనికి బాగా తెలుసు..."వురేయ్! మనకి ఒక చక్కని ఇల్లు...రెండుపూటలా తిండి....నీకో చక్కని బిడ్డ...భలే ఎల్తదిరా బతుకు..." అనేవాడు కలల్లో తేలిపోతూ... వెర్రి తండ్రి! కనీసం కలల్లో అయినా కూడూ, గూడూ, మించి ఊహించలేడు అవి రెండూ లభిస్తే స్వర్గంలో ఉన్నట్లే అనుకుంటాడు. జీవితంగురించి ఇంకేమీ తెలియదు.
"తప్పేం లేదయ్యా! ఆ అమ్మాయి కిష్టమయింది. నా కిష్టమయింది ఉద్యోగాలు చేసుకుని హాయిగా బ్రతుకుతాం!" ధైర్యంగా అన్నాడు హరిబాబు.
వాళ్ళ మధ్య పిడుగుపడినట్లే అయ్యింది అందరికీ.
"ఈల్లేదు. యెంతమాత్రం యీల్లేదు. ఎల్లయ్యా! పంతులయ్యనడిగి లగ్గం పెట్టించు మన నాగికి ముడెట్టించేద్దాం...."
ఏకగ్రీవంగా తీర్మానించారు అందరూ.... ఎల్లయ్య మాట్లాడకుండా ఊరుకున్నాడు. తననేం చెయ్యగలరనే ధీమాతో హరిబాబు కూడా పట్టించుకోలేదు. హరిబాబు టౌన్ కి పారిపోయి ఉంటె నిజంగానే ఎవరూ ఏమీ చెయ్యలేకపోయే వారు-కానీ జనుల మూర్ఖత్వం దేన్నైనా బలితీసుకోగలదని ఊహించలేని హరిబాబు సరళణు ఒక్కదాన్ని ఊళ్ళో వదిలి వెళ్ళలేక ఊళ్ళోనే ఉండిపోయాడు.
ఎల్లయ్యతో కాని, హరిబాబు తోకాని ఏమీ మాట్లాడకుండానే కులం పెద్దలు హరిబాబు పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. పెళ్ళికూతురు బంధువులపిల్ల నాగలక్ష్మి సిద్దంగానే ఉంది. ఆ పిల్లతోనూ ఎవరూ మాట్లాడలేదు. దాని యిష్టానిష్టాలూ కనుక్కోలేదు.
కులం! కట్టుబాటు! ఎవరు కాదనగలరు? ఇదంతా చూసి హతాశుడయ్యాడు హరిబాబు. తనవాళ్ళంతా ఒక కట్టుగా నిలబడి తనకు అండగా ఉంటే జగన్నాథంగారి అహాన్ని ఎదుర్కోవటం ఏమంత కష్టంకాదు. కానీ మూర్ఖత్వంలో మగ్గిపోయే తనవాళ్ళే తనకు శత్రువులయిపోయారు.
"ఈ పెళ్ళి నేను చేసుకోను. చేసుకోనంటే చేసుకోను." అని అరిచాడు. వెంటనే వెంటనే పది పదిహేను బాణాకర్రలు గాలిలోకి లేచాయి. హరిబాబు వంటిమీద దెబ్బల వర్షం కురిసింది. ఒక్కడు...ఆ జనాన్ని...కల్లుమైకంలో అజ్ఞానపు మైకాన్ని రంగరించి పీకలదాకా తాగి మత్తెక్కి తమ మేలేదో తామే తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆ జనాన్ని ఏం చెయ్యగలడు? తెలివితప్పి కూలిపోయాడు. అతణ్ణి అలాగే మోసుకొచ్చి పీటలమీద కూలేసారు. వెనక మరొకడు పడిపోకుండా పట్టుకున్నాడు. బాజాలు మ్రోగాయి. పురోహితుడే పెళ్ళి కూతురి మేడలో మంగళసూత్రం కట్టేసాడు. పెళ్ళిపాటలు పాడారు. ఆడంగులు నవ్వుకున్నారు. ఛలోక్తులు విసురుకున్నారు. పెళ్ళితంతులన్నీ ముగిసాక గోలు గొలున యేడుస్తూ ఎల్లయ్య పెళ్ళికొడుకుని బండిలో వేసుకుని టౌను హాస్పిటల్ లో చేర్పించాడు.
3
చిన్న సూట్ కేస్ చేత్తోపట్టుకుని జబ్బుపడిలేచిన మనిషిలా పాలిపోయిన ముఖంతో తన ఇంటికి వచ్చిన సరళనుచూసి పావని గుండెలు దడదడలాడాయి. సరళను గురించిన సంగతులేవీ పావని తన అత్తగారింట్లో చెప్పలేదు. ఇప్పుడు నిజం తెలిసి ఎవరేమంటారోనని కొద్దిగా భయపడింది.
సరళను పద్మావతి మామూలుగా ఆదరించింది.
"అలా ఉన్నావేమమ్మా జబ్బు చేసిందా?" అని అడిగింది.
సరళ ఏం సమాధానం చెపుతుందో నన్నట్లు పావని కంగారుగా "సరళా! స్నానంచెయ్యి. బాత్ రూంలో నీళ్ళు పెట్టించాను." అని లేవగొట్టింది.
సరళ ఏదీ పట్టించుకోలేదు. యాంత్రికంగా లేచి వెళ్ళి స్నానంచేసి వచ్చింది...
అనుపమ సరళ కంటే రెండేళ్ళు జూనియర్.
"ఏవిటిది చిన్న వదినా! ఎవరైనా డాక్టర్ కి చూపించుకున్నావా?" అని అడిగింది.
"ఎందరో డాక్టర్లు చూసారు. భయంగా ఉంది. అసలు బ్రతుకుతాడో బ్రతకడో?" అంది సరళ ఎటో చూస్తూ.
అనుపమ తెల్లబోయి "ఏమిటది వదినా నే నే మడిగాను? నువ్వేం చెబుతున్నావ్?" అంది.
సరళ అయోమయంగా చూసి తల దించుకుంది. భోజనం దగ్గిర తనకేం కావాలో తనేం తింటుందో తెలియకుండా భోజనం చేస్తోన్న సరళను వింతగా చూసారు.
"ఇప్పుడే వస్తాను." అని సాయంత్రం యింట్లోంచి బయలుదేరింది సరళ.
"ఉండు నేనూ వస్తాను." అని లేవబోయింది పావని.
పద్మావతి అడ్డుతగిలింది.
"వెళ్ళనీ కొత్త ఊరా? ఇప్పుడు అభ్బాయి వచ్చేవేళయింది."
పావని ఏమీ అనలేకపోయింది. విఠల్ వచ్చే సమయానికి పావని ఇంట్లో లేకపోతే, విఠల్ పైకి ఏమీ అనలేకపోయినా లోలోపల చాలా కష్టపెట్టుకుంటాడు.
రాత్రి తొమ్మిదయినా సరళ తిరిగిరాలేదు. అశాంతితో దొర్లుతున్న పావనిని చూసి విఠల్ "అలా ఉన్నావేం?" అని అడిగాడు.
"సరళ ఇంకా రాలేదు." అంది పావని.
"నేను వెళ్ళి స్నేహితులెవరింట్లోనైనా ఉందేమో చూసిరానా?" అన్నాడు విఠల్.
"వద్దు-వద్దు-మీరు వెళ్ళద్దు-" కంగారుగా అంది పావని.
"ఎందుకంత కంగారు?" నవ్వాడు విఠల్.
పావని మాట్లాడలేదు.
"కొంచెంసేపైనా నన్ను వదిలి ఉండలేవా?" అని అల్లరిగా నవ్వుతూ మీద చెయ్యివేసి దగ్గిరగా తీసుకోబోయాడు.
భర్త ప్రేమకంటే పావని కోరుకొనేది లేదు. అయినా ఆ సమయంలో అతడు తనను వదిలి పడుకుంటే బాగుండుననుకుంది.
సరళ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అనుమానించగలిగింది పావని అందుకే అంతగా తల్లడిల్లిపోతోంది.
సరళ ఎప్పటికి వస్తుందో? ఏ స్థితిలో వస్తుందో? అయినా తెలిసి తెలిసి తల్లిదండ్రులు సరళను తన దగ్గిరకు ఎందుకు పంపాలి? తల్లి ఉత్తరం రాసింది.
"...సరళ మరీ పిచ్చిదానిలాగ తయారయింది. నేను భరించలేకపోతున్నాను. నీ దగ్గిరకు వెళ్తానంది పెద్దదానివి నవ్వుకున్నావు కదా, అని పంపిస్తున్నాను. అయినా హరిబాబుకి పెళ్ళయిపోయింది గనుక ఫరవాలేదు...."
ఇదీ ఆ ఉత్తరంలో సారాంశం....హరిబాబుకి పెళ్ళయిపోయింది గనుక ఫరవాలేదుట! పెళ్ళంటే ఏమిటనుకున్నారు వీళ్ళు? తను పెద్దదట! తల్లీ తండ్రీ పెద్దరికాలను లక్ష్యపెట్టని సరళ తన పెద్దరికాన్ని లక్ష్యపెడుతుందా? ఇంత బాధ్యత తను భరించగలదా?
సరళ బాగా పొద్దుబోయి వచ్చింది. స్నేహితురాలు లలితతో సినిమాకు వెళ్ళి వాళ్ళింట్లోనే అన్నం తిని వచ్చానని చెప్పింది పద్మావతికిది బాగుండక పోయినా పరాయిపిల్లను ఏమీ అనలేక ఊరుకుంది.
ఆ మరునాటికే పావని భయంగా ఎదురుచూస్తున్న పిడుగు పడింది...