Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 3

                                
                             కల్పనా కాదు, కాకరకాయా కాదు
                         కడిగి వడపోసిన సత్యం

   ఒక్కొక్క కవిచేసుకున్న అదృష్టం అలా వుంటుంది. అల్లసాని పెద్దన్నగారు "అచట పుట్టిన చిగురుకొమ్మెన చేప" అని వ్రాశారట. అహాహా! ఎంత గంభీరమైన అలంకారం! ఏమీ అమోఘమైన ఊహ! అని ఆకాశానికి ఎత్తివేశారు. ఎవరో ఒక మహానుభావుడు లేచి, అయ్యా అది చిగురుకొమ్మ కాదు- చిగిరి చెట్టు కొమ్మ, చిగిరికి చేవుంటుందా అని అక్కడ జనసామాన్యం వాడుతుంటారు. మన బొప్పాయి, మునగ మొదలయిన చెట్లవంటిదే ఇదొక చెట్టు అని ప్రకటించారు. ఆహా! అలాగా అని నోళ్ళు తెరిచాము.
    ఇలాంటిదే మరొకచోట కనిపించింది పెద్దన్నలో. వరూధిని ప్రవరాఖ్యుడిని తిప్పడానికి చూస్తూ,
    స్వారాజ్యమేలంగ నీరైర నురహ
     ల్యాజురడయిన జంభాసురారి
    ..............................................................
    వారికంటెను నీ మహత్వంబు ఘనమే?
    పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప
    కచ్చడాల్ గట్టుకొను మునిమ్రుచ్చులెల్ల
    తామరసనేత్ర లిండ్ల బందాలుగారె!
   అని అన్నాడు. ఆహా! ఏమిటి ఈ ఊహాచాతురి! ఇనుపకచ్చడాల్! ఏమి ఇనుపకచ్చడాల్! ఏమి ఇంద్రియ నిరోధన సాధనం! ఎట్లా వూహించగలిగాడో ఈ పెద్దన! అని ఆశ్చర్యంలో మునిగిపోయాము.
    మునులు ఎవరైనా ఈ ఇనుపకచ్చడాల్ కట్టుకొనేవారా? ఎవరు సప్లయి చేస్తుండేవారు? అవి ఎలా వుండేవి?
    ముని అయితేనే ఈ ఇనుపకచ్చ కట్టాలా? ఇతరులెవరయినా కట్టవచ్చునా? ఏదయినా 'మొనాపొలీ' వుండేదా? ఇతరులు కడితే ఎందుకు కట్టేవారు?
    ఈ గోల అంతా పురుషులకేనా? స్త్రీలకు కూడా ఇటువంటి నిరోధన సాధనాలు ఏమయినా వున్నాయా? వాళ్ళకు అక్కరలేదంటారా?
    ఆలోచించేవాడికి అన్నీ ప్రశ్నలే అంటారు. ఇలాంటి ప్రశ్నలకు అడ్డు ఏమిటి?
       ... .... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
    నిజం చెప్పాలంటే, ఇనుపకచ్చడం అన్నది కల్పనా కాదూ. కాకరకాయా కాదు. కడిగివడపోయిన సత్యం. ఇనుపకచ్చడాలుండేవి. ఇప్పుడుగూడా అవి వుంటే వుండవచ్చును. మానవ స్వభావం మారకుండా వుంటే, ఈ కచ్చడాలకు కావలసినంత అవకాశం ఎప్పుడయినా వుండవలసిందే. ఈ ఇనుపకచ్చడాలు ఒక్క పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వుండేవి.
    ఎవరికి ఎలాంటి కచ్చడాలుండేవో, ఎందుకుండేవో, ఎలా వుండేవో, ఇప్పుడు వాటి గుర్తులు ఏవయినా వున్నవో తెలుసుకోవాలీ అంటే, మానవ చరిత్రను మళ్ళీ ఒకసారి పరకాయించి చూడాలి. మొదటి పుటలు తిరగవెయ్యాలి.
    పాఠక మహాశయులు "ఊ; కానీ" అంటే చాలు. నేను తిప్పి చెప్పుతాను.
                                  *        *        *
    మనిషీ ఒక జంతువే. ఇలాంటివి ఎన్నో జంతువులు వున్నాయి సృష్టిలో. ఏ జంతువు ప్రత్యేకత ఆ జంతువుకుంటుంది. సింహం మొదలు చీడపురుగుదాకా ఏదో ఒక ప్రత్యేక గుణం లేని జంతువే లేదు.
    కాని అన్ని జంతువులకూ కొన్ని సమాన గుణాలున్నాయి. అవి జాతికీ జీవనానికీ ముఖ్యమైనవి. అవి లేకపోతే జంతువూ చస్తుంది: జాతీ నశిస్తుంది. ఆ గుణాలున్నాయి కాబట్టే సృష్టి స్థితిలయాలకు అవకాశం వుంది. లేకపోతే సృష్టి అంతా ఈసరికి ఎప్పుడో అంతమయి వుండవలసిందే.
    ఆహారమూ నిద్రా ఈ సమానగుణాలలోనివే. ఈ గుణాలు, వీటి ఆవశ్యకత లేని జంతువులు లేవు. అలాంటి గుణమే సంగమం. మిధునం అంటే జంట; దీనికార్యం కాబట్టి మైధునం అంటారు. ఈ సర్వ జంతుసమాన గుణాన్ని, ఆహారవాంఛ ఎంత స్వాభావికమో, నిద్రించాలన్న కోరిక ఎంత ప్రకృతి సిద్ధమో, సంగమవాంఛ అంత ఆవశ్యకమయినది.
    ఈ వాంఛ పుట్టటానికి వేరే కారణం అక్కరలేదు. ఏలాంటి శిక్షణ వద్దు. చదువు సాముల పనిలేదు. జీవితమే ఆ కోరికను కలిగిస్తుంది. ప్రకృతే దానిని ప్రేరేపిస్తుంది.
    ఆహారవాంఛ ఎంత బలమో వేరే చెప్పనక్కరలేదు. నాగరికత కలవారయినా చచ్చిపడి వున్న గుర్రాల మాంసం పచ్చిదే తిన్నారు. మగని కళేబరం మీద ఎక్కి నిక్కి చెట్టున ఉన్న కాయకోసం తిని ఆకలి తీర్చుకున్న పతివ్రతలున్నారు. తోడివారి శవాలనే తిండిగా చేసుకొని ఎప్పుడు బయటపడతామా అని దినాలు గడిపిన శూరులున్నారు, ఆకలి చేసిన పని ఎంతో విశేషించి చెప్పనక్కరలేదు.
    మైధునవాంఛ గూడ అట్లాంటిదే. దాని విసురును ఆపుకోవడం కష్టం. అందుచేతనే దాని బలాన్ని మహాకవులు వర్ణించారు. మన పురాణాలన్నీ దాని ప్రాబల్యాన్నే ప్రకటిస్తున్నాయి. మన ఋషుల చరిత్రలు దానినే ఉద్ఘాటిస్తున్నాయి.
    "తేషాం ఇంద్రియ నిగ్రహం యదిభవేత్
        వింధ్యః ప్లవేత్ సాగరే"
    అన్నాడు ఒక మహా అనుభవశాలి. ఆకూ అలమూ తింటూ కాలం గడుపుతుండేవారు విశ్వామిత్ర పరాశర ప్రభృతులు మహాఋషులు. వారి పనేమయింది? ఈ సంగమ వాంఛకు జోహారు చేయక తప్పింది కాదు. అవును కదా, అన్నమూ, పాలూ, నెయ్యీ తింటూ పెరిగిన సాధారణ మానవుల సంగతేమిటి? వీళ్ళలో ఇంద్రియనిగ్రహం వుంటే వింధ్యపర్వతం సముద్రంలో జీలుగు బెండులాగా తేలక పోతుందా? అని అన్నాడు భర్తృహరి! అంత బలం ఈ మైధునవాంఛకుంది.

 Previous Page Next Page