ఏదో మాటవాసికి చెప్పానుగాని, ఈ వాంఛకున్న అమోఘబలం ఎరగనివారెవరు? దీనిని నిగ్రహించగలనని గట్టిగా చెప్పగల ధీరుడెవరు?
ఇంతకూ నిగ్రహించవలసిన ఆవశ్యకత ఏమి వచ్చింది? సవ్యమూ, సహజమూ కదా ఈ వాంఛ. ఆహారవాంఛను నిగ్రహించడానికి ప్రయత్నం ఏ జంతువయినా చేసిందా? ఇంద్రియ నిగ్రహం కోసం తాపత్రయ పడిన జంతువు సృష్టిలో వుందా? మనుష్యులలో అలాంటి ప్రయత్నం ఉందంటే-ఎక్కడో ఏదో పెద్దలోపం జరిగిందన్న మాట. మనుష్యులు ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నారన్న మాట. వీరి జీవనం స్వభావానికి వ్యతిరేకంగా వుందని తేలిపోతుంది.
అదే జరిగింది మానవులలో. ఇదంతా మా తెలివితేటలవల్ల వచ్చిందని సంతోషిస్తే సంతోషించవచ్చు. దుష్టచింత వల్లనే ఈ దోషం సంక్రమించిందంటే అనవచ్చు. రెండింటికీ ఉన్నాయి ప్రమాణాలూ, దృష్టాంతరాలూను. దీనివల్ల మనుష్యుడు ప్రకృతిని అతిక్రమించాడని అనండి; లేదా, పతితుడైపోయాడని అయినా అనుకోండి.
ప్రకృతికి విరుద్ధంగా ఉండడమే ఒక గొప్పతనం అన్న అభిప్రాయం ఈ మనుష్యులకు కలిగింది. జంతువులలాగా ఉండటం నీచంగా తోచింది. మన గొప్పతనం ఏమిటి అన్న ఊహ పొడగట్టింది. ప్రవాహానికి ఎదురుగా ఈదడమే ఒక ప్రజ్ఞ అని అనుకున్నారు. జంతువలకు భిన్నంగా ఉండడానికే ప్రయత్నం చేశారు. దానితోనే అన్ని విధాల అగచాట్లకు పాలయినారు. స్వభావసిద్ధమయిన బ్రతుకు చచ్చింది. కపటమూ, మాయా ప్రకోపించింది. అసహజమైన జీవనం సంప్రాప్తించింది. ఇదే ఒక సౌభాగ్యం అని ఆనందిస్తున్నాము. నిగ్రహానికి స్వశక్తితో ప్రయత్నించారు. చాలింది కాదు.
దెబ్బ మీద దెబ్బ తినకతప్పింది కాదు. ప్రకృతీ నీకు ఇదిగో ఒక్క నమస్కారము అని, చేతులు జోడించక తీరింది కాదు.
గత్యంతరం లేదు. బాహ్య పరికరాలు కూర్చుకోవలసి వచ్చింది. ఇతర సాధనాలు వెదకవలసి వచ్చింది. ఈ పాట్లు పడలేక నపుంసకత్వాన్ని సంపాదించుకొనేవారు. కోరికోరి నపుంసకులయి గౌరవస్థానాలు అలంకరించేవారు. కదలడానికి వీలు లేకుండా ముండ్ల సెజ్జల మీద నివాసం ఏర్పరచుకొనేవారు. అన్ని విధాల బీభత్స రూపాలు ధరించేవారు. ఇంకా చాలింది కాదు. ఈ ఇనుప కచ్చడాలకు తయారయారు.
* * * *
మతం కోసమని కొందరు; మహత్వం కోసం అని కొందరు ఇంద్రియ నిగ్రహానికి దిగారు. ఇదంతా తమంతటతామే తెచ్చి పెట్టుకొన్న గోల; స్వయంకృతాపరాధం--కాదు కాదు, నిగ్రహం, నిరోధం.
ఇంకొక రకం గూడా వుంది. అది ఇతరులు కలిగించిన నిగ్రహం: పైవారు కట్టించిన ఇనుపకచ్చడాల్ ఒక మనిషికి ఇంకొకరు ఇలా ఇనుపకచ్చడం కట్టించటం ఏమిటి? అసంభవం! అన్నట్టు కనబడుతుంది. ఒక వ్యక్తి ఇంద్రియనిగ్రహంతో ఇంకొక వ్యక్తికి ఏమిపని అన్నట్టు తోస్తుంది. కాని, కొంచెం ఆలోచిస్తే ఇందులో అసందర్భం ఏమీ లేదు.
లేగదూడకు నోరు కడుతున్నాం కామూ? నూర్పులలో ఎడ్ల ముట్టెలకు తిక్కాలు తగిల్చినామా లేదా? పనిచేయవలసిన గొడ్లకూ గుర్రాలకూ ఇంద్రియనిగ్రహం ఎంత చమత్కారంగా కలిగించాం చూడండి.
ఇందులో తప్పున్నదా? అనుభవం అనమేమి? అనము. ఎందుచేతనంటే, ఆ లేగదూడ మన సొత్తు; అంటే మనం పాలు తాగమన్నప్పుడే పాలు తాగాలి. ఆ ఎడ్లు మనవి; వాటిని మన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటాం. మన ఆస్థి కాబట్టే ఇతరుల ఉపయోగానికి విడిచిపెట్టం. అంతేకాదు, వాటి స్వసౌఖ్యం గూడా ఆలోచించం. ఈ ఇంద్రియనిగ్రహం వాటికి కావాలా వద్దా అన్న చింతే మనకుండదు. అస్థిమీద మనకున్న హక్కు చెలాయిస్తాము.
ఆస్తీ, హక్కూ అన్నవి ఎప్పుడూ అలాంటివే. ఎక్కడా అలా ఉండవలసినవే. పశువుల విషయమైనా అంతే, మనుష్యుల విషయమైనా అంతే. ధర్మం ధర్మమే, మారదు.
ఒక ఆడమనిషి ఆస్తిలో ఒక మగవాడున్నాడనుకోండి. ఆ ఆడమనిషి ఏమి చేస్తుంది? ఆ మగవాడిని తాను తన ఇష్టం వచ్చిన విధంగా తనకిష్టం కలిగినప్పుడల్లా ఉపయోగించుకుంటుంది. తన సంతోషానికీ, సంతప్తికీ వాడిని ఉపయోగించుకుంటుంది. వాడి కష్టసుఖాలు తనకు ప్రధానం కావు.
అంతేకాదు; ఈ మగవాడిని ఇంకొకరి ఉపయోగానికి విడిచి పెట్టదు. ఇలాంటి సంతోషంగాని, ఇలాంటి సంతృప్తిగాని, వీడి ద్వారా ఇతరులు పొందడానికి వీలులేకుండా చేస్తుంది. ఏమయినా పెంకెతనం చేస్తే కాలు చెయ్యి విరిచి కట్టిపడవేస్తుంది.
రాబిన్సన్ క్రూసో ఏమిచేశాడు? కావలసినప్పుడు దొరుకుతుందో దొరకదో అని తన మేక కాళ్ళు విరగగొట్టాడు. ఆస్థిలో ఉన్న అధికారం అది: హక్కులో ఉన్న హజం అది.
అలాగనే, ఒక మగవాడికి ఒక స్త్రీ ఆస్తిగా దొరికిందనుకోండి. వీడుమాత్రం ముద్దిస్తాడా? తన హక్కు సర్వవిధాలా చెలాయించక ఊరుకుంటాడా? ఆ స్త్రీని తన ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. తానే ఉపయోగించుకుంటాడు. పైవాడికి ఉపయోగ పడకుండా చూస్తాడు. ఇంకా ఏదయినా అట్టే ఇట్టే అంటే-ఏముంది? గట్టిగా నాలుగు తంతాడు; కొట్లో పెట్టి తాళం వేస్తాడు.