మనుచరిత్రలో ఉన్న పద్యపాదాన్ని అందులోని ఇనుపకచ్చడాల ప్రసక్తినీ తీసుకున్నారు. ఇక్కడ తాతాజీ దృష్టి శబ్దపరంగా ఉత్పత్తి చూట్టంగానీ, సాహిత్యపరంగా ఏఏ గ్రంధాల్లో ఇనపకచ్చడాల ప్రస్తావన ఉందో వెతకటం కానీ కాదు. దీని వెనకవున్న సామాజిక ఆచారాన్నీ, దాని వెనక దాగిన ప్రాచీనకాలం నాటి నీతినీ బట్టబయలు చేయటమే ఆయన ప్రధానోద్దేశం. దీన్ని ఆధారంగా చేసుకొనే తాతాజీ దీని చరిత్రను ఇతర దేశాల చరిత్రలనుండీ, సామాజిక ఆచార వ్యవహారాలను విడమర్చే గ్రంధాలనుండీ కొత్తదృష్టిలో వ్యాఖ్యానించారు.
సంస్కృతగ్రంధాల్లో; క్షేమేంద్రుని రచనలు నాటి ప్రజా జీవితాన్ని, ఆచార వ్యవహారాలనూ నమోదు చేసినంతగా మరేవీ చేయలేదు. అంతకన్నా ప్రాకృతగ్రంధాల్లో జనజీవితం మరింత హెచ్చుగా వర్ణితమై వుంటుంది. బహుశా ఆ గ్రంధాల్లో జనజీవితం మరింత హెచ్చుగా వర్ణితమై వుంటుంది. బహుశా ఆ గ్రంధాల్లో ఇనుప కచ్చడాలూ, ఇతర సాధనాల ప్రసక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వుండివుండచ్చు, ముఖ్యంగా జానపదకథలూ- గాధలూ ఇలాటి తండాల జనజీవిత ఆచార వ్యవహారాలకు గనుల్లాంటివి. ఆదిమసమాజం వీటిల్లో ప్రతిబింబించినంత నిసర్గంగా మరెందులోనూ వుండదు. నేటి మన నాగరికసమాజంలో అనేక సందర్భాల్లో అలంకారాల్లో, పలుకుబళ్ళూ-సామెతల్లో, పండగలూ-పబ్బాల్లో ఇవన్నీ రూపం మారీ, కర్మకాండ మారీ కన్పిస్తూంటాయి. "ముద్దర్లుముద్దర్లుగా వుండగానే ముగ్గురు బిడ్డల తల్లయింద"న్నదో సామెతయి అలాటిదే ఈనాడు చిన్నపిల్లలకు అలంకారంగా కట్తూండే "సిగ్గుబిళ్ళ"గా నిలిచిన ఆనాటి ఇనుపకచ్చడం.
దీని పుట్టుకను తెలుసుకోవాలంటే సమాజంలో స్త్రీ పురుష సంబంధ పరిణామాలను స్థూలంగానైనా మననం చేసుకోవాలి.
మాతృత్వం వాస్తవం. పితృత్వం విశ్వాసం. అంటే ఒకటి ప్రత్యక్ష ప్రమాణం. రెండోది శబ్దప్రమాణం. ఆస్థి సమాజపరంగా వుండి కుటుంబపరంగా కానంతవరకూ ఆస్థికి వారసత్వసమస్య తలెత్తలేదు. అప్పుడు పిల్లల పితృత్వాన్ని పట్టించుకోలేదు. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కాద్రవేయులు: దైత్యులు లాంటి పురాణోదాహరణలు-
సమాజం మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యానికి వచ్చిం తర్వాత కూడా రాజుకు బహుపత్నీత్వం ఉన్నప్పుడు ఆయన వారసులు రాజు కొడుకులంటే చాలదు. ఆ రాజుకున్న ఏ రాణి కొడుకన్నది చెప్పుకోటం అవసరం. ఈ సందర్భాల్లో ప్రాచీనకాలంలోని మాతృస్వామ్య అవశేషాలయిన తల్లి పేరుంచుకోటం కొందరిలో మిగిలింది. ప్రాచీన తండా ఆచారాలన్నీ అలాగే మిగిలుంటాయని కానీ, అన్నీ నశిస్తాయని కానీ అనుకోలేం. ఆ విధంగా మిగిలిన ఆచారంగా వీటిని అర్ధం చేసుకోవచ్చు. అందుకని కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లి పేరుతోనే చెలామణి అయ్యేవారు.
సమాజం పరిణామం పొందిన తర్వాత కుటుంబాలు ఏర్పడి, ఆస్థి కుటుంబపరమైనప్పుడు సంప్రదాయం తల్లకిందులయింది. కుటుంబాలేర్పడినప్పుడు స్త్రీ ప్రాధాన్యం తగ్గి, పురుష ప్రాధాన్యం పెరిగింది. అప్పుడు ఆస్థి తండ్రి నుండి కొడుక్కు సంక్రమించటం ఆరంభమయింది. దాంతో సంతానానికి తల్లికన్నా తండ్రిని లెక్కపెట్టే సంప్రదాయమొచ్చింది.
అంతవరకు శబ్దప్రమాణంగా వున్న పితృత్వానికి ప్రత్యక్ష ప్రమాణ ప్రతిపత్తి కల్పించడానికి మార్గాన్వేషణ ఆరంభమయింది.
వివాహాల్లో వున్న సగోత్రవివాహాలూ-సాముదాయక వివాహాలూ, దంపతీ వివాహాలదశ పోయి ఏకపత్నీ వివాహమన్నదశ అవతరించింది. పత్నుల సంఖ్య ఎంతున్నా వారసత్వ హక్కుండే పుత్రుణ్ణి కనే హక్కు ఒక్కదానికే. ఆమే "ఏకపత్ని". మిగిలినవాళ్ళందరూ ఉపపత్నులు. వారి సంతానానికి ఆస్థిహక్కు లేదు. అందువల్ల వారికి "దాయాద" అధికారం తప్ప "దాయమూలాల" మీద హక్కుండేది కాదు.
దీనికి ఉదాహరణగా రామాయణగాధనే తీసుకోవచ్చు. దశరధునకు నలుగురు ప్రధాన మహిళలు. అప్రధానులు చాలామంది వున్నట్టు రామాయణమే చెపుతుంది. వీరిలో మన నిర్వచనం ప్రకారం కౌసల్య ఏకపత్ని. ఆమె కొడుకే రాముడికే దాయమూలంపై అధికారం. అంటే రాజ్యాధికారం. ఇది తెల్సుకున్న కైక ఎదురుతిరిగింది. దశరధుడు అంగీకరించక తప్పలేదు. కైక ఏకపత్ని అయి భరతుడికి దాయమూలాధికారం కట్టబెట్టాలనుకుంది. భరతుడు అంగీకరించక - రామ (రాజ) ప్రతినిధిగానే ఉండాలని నిర్ణయించుకోవడంతో కైక పధకం తల్లకిందులయింది. ఇలాగే సత్యవతీ శంతనుల కథనూ, శకుంతలా దుష్యంతుల కథనూ అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి వారసుణ్ణి కనాలి కనకనే ఆ పత్నికి పరపురుష సంపర్కం కాకుండా సాధ్యమయినంతవరకూ బందోబస్తు చేసేవారు. మన దేశంలో లేమందక, కౌటిల్య, బృహస్పతి, శుక్రాది రాజనీతిగ్రంధాల్లో అంతఃపుర రక్షణకిచ్చిన ప్రాధాన్యం దీన్నే బలపరుస్తుంది. ఈ అంతఃపుర రక్షణలో కంచుకిలాంటి పాలకులు, బోనులూ, రక్షణద్వారాలూ వంటి అనేకానేక పద్ధతులను ఈ శాస్త్రవేత్తలు సూచించారు.
ఈ సంప్రదాయం అంతఃపుర రక్షణ అవసరమనుకున్న ప్రతి ప్రాచీన నాగరికతలోనూ- బాబిలోనియా, సుమేరియా, గ్రీకు, రోము - ఆధునికంగా ఉండే మధ్యయుగాల జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండులలో బహుళ ప్రచారంలో వుండేది. ఇలాంటి సంప్రదాయ రక్షణకే "ఇనుపకచ్చడ"మని ప్రపంచచరిత్ర తెల్పుతుంది.
మనుచరిత్రోని ఈ పద్యపాదం ఆనాటి ఋషులు తమ అస్థలిత బ్రహ్మచర్య ప్రతిపత్తి నిరూపణకోసం ఉపయోగించేవారేకానీ ఆడవాళ్ళకోసం ఉపయోగించిన దాని వెనకవున్న ఆశయంతో మాత్రంకాదు. (దీనికి విప్రతిప్రత్తిగా తాతాజీ కొంత ఊహించారు) అదీకాక వ్యంగ్యంగా ఎత్తిపొడవటం కూడా దీని ఉద్దేశం.
తాతాజీ పరిశీలనా శక్తికీ - హేతువాద అన్వయానికీ - ఒక కొత్త సృష్టితో పాత ఆచారాలు ఎలా మనకు తెలియకుండానే మనవెంట వస్తుంటాయో వివరించటానికీ ఈ ఇనుపకచ్చడాలు పాఠకుల ముంజేతికంకణాలు. పదునైన ఆలోచనాంశాలు.
__ ఏటుకూరి ప్రసాద్