"అబద్దాలని నువ్వూ నేనూ అరిస్తే నిజాన్ని అబద్దంగా మార్చగలిగిన వాళ్లు భయపడతారా? ఆపదలో రక్షకదళాన్ని పిలిచినందుకు వాళ్ళీవిధంగా నన్ను భాక్షించారు."
కన్నీళ్లతో విడిపోయిన జానకి సుశీల మళ్ళీ అయిదేళ్ళకి కలుసుకున్నారు.
జానకి పూర్తిగా మారిపోయింది.
వెనుకటి ఉత్సాహం చిలిపితనం ఎగిరిపోయి పూర్తిగా ఉదాసీనంగా తాయారయింది.
ఊళ్ళో వెనుకటి ఉధృతం తగ్గినా జానకిని చూడగానే చెవులు కోరుక్కోవటం మానలేదు
రాజారావుకు జానకి పట్ల అర్థ్రభావం లేకపోలేదు.
చిన్నతనంనుంచీ అతను జానకిని సొంత చెల్లెలిలా అభిమానించాడు.
జానకిని దోషిగా అతని అంతరంగం ఊహించలేకపోతోంది.
కానీ. జానకి అల్లరిపడింది కోర్టులకెక్కి పత్రికలపాలయి నలుగురినోళ్ళలో నానింది.
అతనికి అన్నింటికంటే తన కుటుంబ క్షేమమూ సమాజంలో ప్రతిష్ఠా ముఖ్యం.
ఆ కారణంచేత జానకితో మాట్లాడటానికి వీల్లేదని సుశీలను కఠినంగా శాపించాడు.
పాపం! జానకి రమణరావును గురించి చెప్పిన మాటలు సుశీల రాజారావుకు ఎలా చెప్పగలదు ?
3
నల్లని చీర కట్టుకుని తాటికాయంతబొట్టు పెట్టుకుని విసుగు నణచుకునే ప్రయత్నంలో చికాకు ఎక్కువ కాగా హాల్లోకి వచ్చింది సుశీల.
"హలో! సుశీలా దేవీ!"
ఎంతో సభ్యతతో పలకరించాడు రమణరావు.
అదేం పాపమో రమణరావు ఏది చేసినా, ఏం మాట్లాడినా కృతకంగానే అనిపిస్తుంది సుశీలకి!
"హలో!" అంది పొడిగా.
"నే నిప్పుడే వస్తాను."
కావాలని సుశీలా రమణరావులను వదిలి వెళ్ళిపోయాడు రాజారావు.
సుశీల మనసులో గుర్రుమంది.
రాజారావు ఉద్దేశం అర్థంచేసుకున్న రమణరావు సుశీల వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు.
సుశీల తిరిగి నవ్వలేదు.
ముఖం తిప్పుకుంది.
అన్న దగ్గిరలేడు గనుక తన తిరస్కారాన్ని సాధ్యమయినన్ని విధాల ప్రకటించడానికే సిద్దపడింది సుశీల.
సుశీలలో ఈ సంచలనం రమణరావు అర్థంచేసుకొకపోలేదు.
కానీ సుశీల సౌందర్యం అతడికి పిచ్చెక్కిస్తోంది.
అదీగాక రాజారావు ఆస్తిని గురించే తప్ప అప్పుల గురించి తెలియదు, రాజారావు లాంటి ఐశ్వర్యవంతుడి చెల్లెన్ని - అందాల రాశిని సుశీలని - ఈ తిరస్కారాలకి భయపడి వదులుకోదలచలేదు రమణరావు.
"మీరీ నల్ల చీరలో చాలా అందంగా ఉన్నారు. నాకు నలుపంటే ఇష్టం" అన్నాడు.
ఒళ్ళు మండింది సుశీలకు__
"నాకు నలునంటే అసహ్యం. నాకు ఇష్టంలేని వ్యక్తుల దగ్గిరకు విధిగా వెళ్ళాల్సి వస్తే, ఈ నల్ల చీర కట్టుకుంటాను"
తల తిరిగింది రమణరావుకు. ఎంతయినా సుశీల తన అయిష్టాన్ని ఇంత స్పష్టంగా ప్రకటిస్తుందని అనుకోలేదు.
పాలిపోయిన రమణరావు అంతకూ ఇంతకూ నిరుత్సాహపడే రకం కాదు.
సుశీల కోపాన్నంతమా సరసం క్రింద మారుస్తూ "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే!" అన్నాడు చిలిపి నవ్వుతో ..
నిర్ఘాంతపోయింది సుశీల.
అతనిమీద చీదరింపు మరింత ఎక్కువయింది.
అతని ముఖం చూడటం ఇష్టం లేక చేతి కందిన విశ్వనాథ వారి 'చెలియలికట్ట ' చదువుతూ కూర్చుంది.
"ఏమిటి చదువుతున్నారు?"
"చెలియలికట్ట!"
"ఏం వస్తుంది, ఆ పుస్తకాలు చదివితే? కూడు పెడతాయా గుడ్డ పెడతాయా?