లాలా నిద్రపోవాల్సిందే, కాని హమీదా అక్క నవ్వుల జలపాతాలు వినిపిస్తున్నాయి. చంద్రుని నిట్టూర్పుల్లా కవోష్ణవాయుతరంగాలు తాకుతున్నాయి. వరండాలో జనం ముచ్చట్లలో మురిసిపోతున్నారు. వారంతా కలిసి తన భవిష్యత్తుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అది ఇటుకా మట్టితో కట్టిన అనాకార భవిష్యత్తు. తాను ఆర్టిస్టు. అది తనకు తగిన భవిష్యత్తు మాత్రంకాదు. వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడరాదూ? ఇతరులను గురించి వీళ్ళకు ఎందుకింత చింత?
వరండాలోని వాగుడులో తనకు ఆసక్తీలేదు భయమూలేదు. తన మనసుకు తాను రాణి. తన మనసు గడుసుది. అది తాను చెప్పినట్లూ వినేట్లులేదు. ఆమె ఆలోచించసాగింది. అందులో దుఃఖమూ, ఆనందమూ కలిగలిశాయి.
ఆమె రంగురంగుల కలలు కంటూంది. కలలతో బెదిరిపోతూంది. భయం అలలు అలలుగా ఆమెను అల్లకల్లోలం చేస్తూంది. ఏడే తన మనసులోని చంద్రుడు? ఎక్కడికి పోయి క్రుంగాడు?
ఆమె కళ్ళు తుడుచుకుంది. ఎక్కడో దూరంగా కళ పాడుతూంది. తంబురా తలకానించిన కళ కనిపించింది. పాట వినిపించింది:-
'ప్రియుడులేడు, నిదురరాదు'
ఆమె స్వరాల సరాగాలను ప్రతిధ్వనిస్తూంది. కేకలు పెట్టిన పక్షిని చీకటి గదిలో కట్టివేసి నట్లున్నారు. చంద్రుడు పాపం, ఆ పక్షి దుఃఖం భరించలేక వెలవెల పోయాడు. వెన్నెల తన కాళ్ళ అందియలు విప్పి పారేసి మౌనంగా, విరాగినిలా నుంచుంది-ఏదో అన్వేషిస్తున్నట్లు.
కన్నీరు ముఖాన్ని కడిగేసింతరువాత, పరిస్థితులు ఎదుట నిలిచి వాటి ప్రాముఖ్యతను నచ్చచెప్పసాగేయి. మనసు వినడంలేదు. ఆమె మనసు ముకుదాడులేని ఆబోతులా తయారయింది. ఏ కారణం చెప్పినా, ఏ తత్త్వం చెప్పినా వినడంలేదు. దానికి గర్వం. తలబిరుసుదనం వచ్చేసింది. దానికి ముకుదాడు వేయడాన్నిగురించే వాళ్ళు ఆలోచిస్తున్నది.
ఆ వరండా ఎంతదూరం తనకు. అక్కడ కూర్చున్నజనం తన ఉనికినే గమనించడంలేదు. వాళ్ళకూ తనకూ మధ్య శతాబ్దాలదూరం. వాళ్ళంతా మొహెంజొదారో శిథిలాల్లోంచి లేచివచ్చి వరండాలో కూర్చున్నట్లున్నారు. మల్లెపందిరి సందుల్లోంచి వాళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చిలుంపట్టిన మెదళ్ళూ, లుకలుకలాడే ఎముకలూ, నరంలేని నాలుక గలవాళ్ళు. వాళ్ళు సమాధుల్లోంచి బయటపడి సజీవమైన ఒక అమ్మాయి భవిష్యత్తును నిర్ణయించడానికి వచ్చారు. వాళ్ళే అక్తర్ మామ అదృష్టమూ నిర్ణయించారు. అతడు మౌనంగా వాళ్ళతీర్పువిన్నాడు. పలకలేదు ఉలకలేదు, లేచినుంచున్నాడు. ఆనాటినుంచీ క్షణం విరామంలేకుండా తిరుగుతున్నాడు- ఏదో పోగొట్టుకున్నట్లు-ఎన్నడో దొరక్క పోదన్నట్లు అన్వేషణ అతనిపని. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు. గజాలా అక్క మొగుడూ పిల్లలతో యాభైసార్లు అతని ముందునుంచి తిరిగినా గుర్తించడు. ఆమెను మందిరంలోని దేవతను చూచినట్లూ, నీళ్ళలోని చంద్రబింబాన్ని చూచినట్లూ చూస్తాడు.
లాలాకు వరండాలో వింతవింత ముఖాలు కనిపిస్తున్నాయి. వారిలో ఇమ్తియాజ్ సోదరుడు, హమీదా అక్క తల్లితండ్రి ఉన్నారు. వారిమధ్య లక్కడి తాత ఉన్నాడు. రెండు భాగాలుగా విడివద్ద అతని గడ్డమూ కనిపిస్తుంది. బంగారు ఫ్రేమ్ ఉన్నవారి పటం పెద్ద గదిలో గోడకు ఉంది. తాత సంపాదించిందంతా కొడుకులు కర్పూరంలా కరిగించారు. వారు ఆర్జించిన కీర్తిప్రతిష్టలును లాలా అన్న దేశదేశాలు తిరిగి ఉద్యోగాలకోసం దేబరించడంలో పోగొట్టాడు. ఇంకా ఆ కీర్తిప్రతిష్టలు, తాతగారి పతంలా, ఫ్రేములో బిగింపబడి ఉన్నాయనే అపోహలో ఉన్నారంతా. వారు మణుగు బరువున్న కరవాలాన్ని పూవును అందుకున్నట్లు లాఘవంగా అందుకునేవారు. ఆ కరవాలంతోనే చివరి మొగల పాదుషాను వారు రక్షించారు. ఆ కరవాలంతోనే శత్రుమద్యంలో దూకి, శత్రుసంహారంచేసి, తన శిరస్సును ఖండించుకున్నారు.
ఆ కరవాలం ఇప్పటికీ అటకమీద ఉంది. ఒకసారి లాలా తనశక్తినంతా ఉపయోగించి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి, చమట కక్కింది. అక్కడే మరో కళ్ళు మూసుకొని కూరలో ఉప్పువేసినట్లే ఆమె సంబంధాలు కుదిర్చేది. ఆమె చుట్టుపట్ల ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలను అంటకట్టింది. అంతేకాదు వాళ్ళ పిల్లలకూ, పిల్లలపిల్లలకూ కూర్చింది. అందువల్ల లాలా అత్తలకూ, పిన్నమ్మలకూ తేలిగ్గా జరిగిపోయింది.
లాలా ఆ సాలీడు గూటిని తొలగించింది. అలా అనుకునేవరకు చంద్రుడు చిరునవ్వు నవ్వాడు. వెన్నెల వెలుగులు విరబోసి ప్రతి వస్తువునూ చెమ్మగిలచేస్తున్నాయి- ఆమె మనసుయుక్తంగా.
లాల మనోఫలకంమీద పాత స్మృతులు చెమర్చాయి. అతను పుస్తకాల పురుగును ఎండలో దులిపినట్లు బాధపడ్డాడు. చావుగొంతుతో ఏమేమో అన్నాడు. ఈ మధ్య అతడు ఇంగ్లండు వెళ్ళాట్ట పైచదువులకు. అది విని తాను అదో రకంగా తిరిగింది. తానేం మామూలు స్త్రీ యా? హుఁ!
మంచిదయింది. ఒక బరువు విరగడయింది. ఆమెకు స్వవిషయంలో ఎక్కడలేని గర్వం. తాను ఎవరిముందూ తలవంచదు. అదీ ఆమె నమ్మకం.
బతకడమూ, చావడమూ, తెలియని అమ్మాయిలంటే ఆమెకు జాలి. పుట్టగానే పెళ్ళిచింతలో పడిపోతారు. వయ్యారంగా స్కూలుకు, కాలేజీకి ఉరుకుతారు. ఒకరినిచూచి ఒకరు మండిచస్తారు. ఎవరైనా కొత్తచీర కట్టుకున్నా ఏడుపే. ఒక అబ్బాయిని తెచ్చుకున్నా మంటే. ఇహ అందరి గుండెలమీద పాములు పాకుతాయి. ఇహ పెళ్ళి, అబ్బో ఏం సిగ్గో! సిగ్గులు వలకపోస్తూ పత్రిక తెచ్చిస్తారు. అబ్బ! ఎంత గర్వమయాఅంటే వాళ్ళ తండ్రి శివధనుస్సును విరిచేషరతు పెట్టి ఒక రాముని తెచ్చికట్టినంత! అయిపోయింది. అక్కడితో జీవితంలో ఫుల్ స్టాప్. తరవాత ఏముంది? మామూలే, తగాదాలు. సంసారం చాలని ఆదాయం - ఛీ ఏమిటబ్బా - బతుకులు!!