Previous Page Next Page 
కేదారం పేజి 4


    
    'సరే మేమింతే బ్రష్ పట్టుకొని రంగులు కలపడమే జీవితమా? హమీదా అక్క వేటకరిస్తుంది. అవునండి. వీళ్ళు మహిళా సమాజాలు ఏర్పరుచున్నారు. అక్కడేమిటమ్మా నేర్పేది అంటే తిరగబడ్డానికి చిట్కాలు. సంగీతం నేర్చుకుంటారు. మగాళ్ళ మధ్య కూర్చుని చర్చలు సాగిస్తారు. తొట్లో ఒకటి రెండు మొక్కలు నాటేస్తారు. ఇహ ఇదేనమ్మా జీవితం ' ఇదీ వరస.
    'జీవితం అంటే బిందువులో దూకడం'
    'బావుంది - అది జీవితం ఎలా అవుతుంది? చావు బావిలోకి ఉరికే మోటార్ సైకిల్ అవుతుంది' హమీదా అక్క అరుస్తుంది.
    'నాకేదో భయంగా ఉంది' హమీదా అక్క ఆలోచనలో పడిపోతుంది. 'నువ్వూ కళవలె లక్ష్యం లేని మార్గాన పడవు కదా అని'
    ఆమె ఆ మాట విన్నది. మంచులా చల్లబడిపోయింది. ఊపిరి సైతం ఆడకుండా అలా చాలాసేపు నుంచుంది. ఆమె చేతిలోని గులాబి చిరునవ్వు నవ్వి, తలవంచుకొని నిద్రపోయింది.
    ఆమె బెదురుతూ, బెదురుతూ కళ్ళు తెరిచింది. చుక్కల దివ్వెల వెలుగు తగ్గింది. చంద్రుని ముఖంలో అలసట కనిపిస్తుంది. తాను కళ వలె నవ్వీ, నవ్వీ నవ్వీ నవ్వీ చల్లబడి పోతుంది. మెడ వాలిపోతుంది. జనం తనను ఈడ్చి పారేస్తారు.
    ఆమె విసికినది. వేసారింది. ఏదో మార్గం వెదుక్కుందాం అనుకుంది. కాని ఏదీ మార్గం? దోవ ఎక్కడో మళ్ళిపోయింది. చక్కని నీలపు ఆకాశం నిరాశోపహతుని హృదయంలా వ్యాపించింది. భయంతో ఆమె కళ్ళు మూసుకుంది. పక్కకు తిరిగింది.
    హమీదా అక్క ఆమె మాటలకు భయపడుతుంది. ఒక్క హమీదా ఏమి? కుటుంబం సాంతం అమెను కొరకరాని కొయ్య అనుకుంటున్నారు. వచ్చిపోయే వాళ్ళు వింతగా చూస్తున్నారు.
    అలాంటి వారిలో అతనూ ఒకడు -
    లాలా తన ఆలోచనల మందను ఒకవైపు తోలాలనుకుంది. ఆమె స్మృతులు దేన్నో వెదుకుదామనుకున్నాయి కాని సోమరితనం వాటిని లేవనీయలేదు. ఎదుగుతున్న చంద్రుణ్ణి చూస్తూ ఉండిపోయింది. ఏదో ఒక నీడ మెరుపులా వచ్చి మాయం అయింది. అదే నీడ ఆమె గుండెలో వెన్నెల ఆరబోస్తుంది - ఇప్పుడు. అదే ఛాయ ఎదుగుతూ పోతుంది.
    'తన గొప్పతనం చూపడానికే మగాళ్ళను అసహ్యించుకుంటుంది. తనను గురించి ఎక్కళ్ళీని టెక్కు ఎవడికేం' అతడు చాలా ముందు కూర్చొని , మూడు నాలుగు గంటలు ఆమె తప్పులు ఎన్నందే అతనికి అన్నం అరగదు.
    అతనికి లోకంలో ప్రతిదాన్ని పరిహసించడం అలవాటయి పోయింది - ముఖ్యంగా ఆడవాళ్ళ రచలనన్నా వారి పెయింటింగ్స్ అన్నా బొత్తిగా గిట్టదు.
    "కవిత్వమా ! అది మీకెలా తెలుస్తుంది? అర్ధం కావద్దూ అది - అదేం వంటా వార్పా?" అని వెక్కిరింపుగా నవ్వితే లాలాకు మంటల్లో దూకినట్లుంటుంది.
    ఎవరూ దొరకలేదనుకొండి లాలా తల్లి దగ్గర ప్రారంభిస్తాడు. "ఆర్ట్ గీర్ట్ అంటారు చూచారా అవి ఆడపిల్లల్ను నాశనం చేసి వదుల్తాయి. ప్రపంచంలో ఎంతమంది గొప్ప ఆర్టిస్టులున్నారో వాళ్ళంతా తమ ఆర్ట్ ను పిచ్చాసుపత్రిలోనే పూర్తీ చేశారు" అని విమర్శిస్తాడు.
    "అల్లా! లాలాను కాపాడు" తల్లి వాస్తవంగానే వణికిపోతుంది" ఏమోనమ్మా లోకం లేని ఆడపిల్లలంతా ఇంటిపనులు చేసుకుంటారు. దీని వ్యవహారం అంతా తలకిందులు" అని వాపోతుంది.
    "విన్నారా! ఇహ ఇప్పుడు కళ దగ్గర సంగీతం నేరుస్తుంది" చిన్నపిల్లవాడిలా చాడీలు చెపుతాడు.
    లాలాకు అక్తర్ మామంటే అభిమానం అని తెలిసిం తరవాత మరీ పరాచికాలు పట్టించే వాడు. అక్తర్ మామ తిరిగి తిరిగీ ఎప్పుడో గాని ఇల్లు చేరుకునేవాడు కాడు. అతడు వచ్చాడంటే లాలాకు చేతినిండా పని. మాటామాటకి గజాలా అక్కను పిలుస్తుంది. రోజంతా చాయ్ చేస్తుంటుంది. స్వెట్టర్లు అల్లుతుంది. అక్తర్ మామ సిగరెట్లు అయిపోతే, పేకాటలో సర్వస్వం పోయినవానిలా తలపట్టుకొని కూర్చుంటుంది. అప్పుడు ఆమె ఆరాటం చెప్పలేం. ఎక్కడ్నుంచో సిగరెట్లస్టాకు తెప్పించి పెట్టాలి. అక్తర్ మామ విషయంలో లాలాకున్న సానుభూతి చూచి ఉడుక్కునేవాడు.
    "అమ్మాయ్! నీ పరిచర్యలు నన్ను అవిటివాణ్ణి చేసేట్టున్నాయి. దారి నడిచే బాటసారిని కూర్చోమనడం శిక్షమ్మా" అనేవాడు.
    ఆ మాటలు విని లాలా గుండె పగిలేది. అక్తర్ మామను ఓదార్చే జవాబు ఇవ్వాలనుకుంటుంది. కాని నాలుక అరుకుపోతుంది. ఇక్కడ ఆమె తన జాతినే అసహ్యించుకుంటుంది. ప్రపంచంలోని ప్రతి ఆడదీ గజాలా అక్కలా కరినురాలుగా కనిపించేది. గజాలా అక్క వికారమైన తన పిల్లలను అక్తర్ మామ వడిలో వేసి 'బేబీ ఇదిగో మీ అంకుల్' అంటుంది.
    "ఈ అక్తర్ చచాదంతా నాటకం. ఒక ఆడది జీవిత సర్వస్వాన్ని లాక్కోగలదంటే నేను నమ్మను."
    "మీకెలా తెలుస్తుంది" లాలా వ్యంగ్యంగా 'అది మానవులకు తెలుస్తుంది' అన్నది.

 Previous Page Next Page