Read more!
 Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 3

 

    "మరి చిన్నవాడు కదా వదినగారు! ఆ ప్రేమ వుంటుంది. మా పెళ్ళయిన కొత్తలో 'వదినా వదినా' అంటూ నా పైట కొంగు పట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టారంటే నమ్మబుద్దికావటం లేదు...కాలం ఎంత త్వరగా పరుగు తీస్తుందో..." అంది కస్తూరి గరిట పెట్టి కూర తిప్పుతూ.

    "అంతేనమ్మా! ఏదో భగవంతుడి దయవల్ల మనకున్నదాంట్లో ఇప్పటి వరకూ ఏ కష్టం లేకుండా మా తమ్ముళ్ళు మిమ్మల్ని పోషిస్తున్నారు. ఇలాగే మనందరం కలకాలం కలిసుండాలనేదే నా కోరిక...." అంది భ్రమరాంబ.

    "తప్పకుండా వదినా! మన ఉమ్మడికుటుంబం ఈ ఉరంతటికి ఆదర్శమేగా. అందరిచుపు మనమీదే వుంటుంది" అంది కస్తూరి.

    "అందుకే తల్లీ! సాయంత్రం అందరికి దిష్టి తీయాలి. వీడు ఊరక రాకుండా ఆ నక్కజిత్తుల కరణాన్ని కూడా భోజనానికి పిలుచుకువచ్చాడు. వాడిచూపు మంచిది కాదు. ముదనష్టపు చూపు....."అంది భ్రమరాంబ.

    ఆమె మాటలకు కస్తూరి నిశ్శబ్దంగా నవ్వింది.

                                        *    *    *    *

    ఈ ఏడాది మీ జయంతికి పెళ్ళి చేస్తారా బావా?" అన్నాడు రామనాధం పులుసు పోసుకుంటూ.

    జయంతి రామనాధాన్ని కొరకొరా చూసింది.

    "చదువుకుంటుందిగా బావా....ఈ ఏడాదిలో పదవతరగతి పూర్తీ అవుతోంది. పై చదువులు చదవాలంటే పట్నం పోయి రావాలి. చూద్దాం! అప్పటిమాట ఇప్పుడే ఏం చెప్పగలం..." అన్నాడు సర్వోత్తమరావు నవ్వుతూ.

    "ఏం కాదు. నేను పట్నం పోయి కాలేజిలో చేరతాను......" అంది జయంతి.

    "అబ్బో! అంత పెద్ద చదువులు చదివి ఎవర్ని ఉద్దరిద్దామని తల్లీ" అన్నాడు రామనాధం.

    "మిమ్మల్ని మాత్రం కాదులే" అంది జయంతి.

    "చూశావా బావా! నీ కూతురికి కూడా నేను అలుసయిపోయాను" అన్నాడు రామనాధం నిష్టూరంగా.

    "జయంతి తప్పమ్మా! మామయ్యను అలా అనచ్చా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "మరి నా సంగతి ఆయనగారికెందుకు?" అంది జయంతి బెరుకు భయం లేకుండా.

    "ఏదో పెద్దాయన. నీ మంచి కోరేగా అంది" అన్నాడు సర్వోత్తమరావు.

    "తమ్ముడూ! ఇక లాభం లేదురా. దీని ముక్కుకు తాడు బిగించాల్సిందే" అన్నాడు రామశేషు తమ్ముడు సర్వోత్తమరావుతో.

    "ఇదిగో పెద్దనాన్న! మీరు కూడా నన్ను అట పట్టిస్తున్నారా?" అంది జయంతి.

    అ మాటలకు అందరూ నవ్వారు.

    "అమ్మా! నాకు పప్పుచారు కావాలి." అడిగాడు వెంకట్.

    "వేసుకో నాన్నా ఇదిగో" అంటూ దాక్షాయణి వాడికి గరిటతో పప్పుచారు పోసింది.

    "మీరు కూడా కూర్చుంటే బావుండేది కదమ్మా...ఇప్పటికే చాలా అలస్యమయిపోలా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "ముందు మీరు తినండి బావగారూ! ఆడవాళ్ళంతా తర్వాత భోంచేస్తాంలే" అంది దాక్షాయణి.

    "ఏమోయ్ మాధవరావ్! ఎలా సాగుతుంది నీ వ్యాపారం?" అడిగాడు కరణం.

    "బానే వుందండి! పండగ సరుకు దాదాపు అమ్ముడయిపోయింది." అన్నాడు మాధవరావు.

    "మరింకేం....బానే ఆర్జించుంటావ్" అన్నాడు రామనాధం.

    భ్రమరాంబ కస్తూరి వేపు చూసింది.

    కస్తూరి ఆమెని చూసి నెమ్మదిగా నవ్వింది.

    "ఆ ఏం ఆర్జనలెండి....పోటీ ఎక్కువయిపోలా? మా షాపుపక్కనే రెండు షాపులు కొత్తగా వచ్చాయి." అన్నాడు మాధవరావు కరణంతో.

    "అప్పుడే వ్యాపారం మరింత జోరుగా సాగుతుందోయ్, అది వ్యాపారంలోని రహస్యం" అన్నాడు కరణం.

    "వంకాయ ఇగురు వేసుకోండి...." అంది రామనాధంతో దాక్షాయణి.

    "వద్దమ్మా మీ ఆయనకు వేయి. నాకు ఇకచాలు. కడుపు నిండిపోయింది. ఏమిటో బావగారి ప్రేమ బలవంతంగా లాక్కోచ్చారు భోజనానికి రా బావా అని" అన్నాడు రామనాధం.

    "పండుగరోజు కూడా ఒక్కడివే, ఇంట్లో చేతులు కాల్చుకోవటం ఎందుకులే అని పిలిచా, బావా ఏం తప్పా?" అన్నాడు సర్వోత్తమరావు.

    "అయ్యో ఎంతమాట! నీ ప్రేమ నాకు తెలియదా బావా?" అన్నాడు రామనాధం.

    "కరణంగారు మొహమాట పడుతున్నట్లున్నారు, అమ్మా కస్తూరి ఆయనకు అన్నం వడ్డించు" అన్నాడు రామశేషు.

    "అయ్యో! ఎంతమాట. నాకు మీ ఇంట్లో మొహమాటం ఏముందండి! ఇదేమైనా నాకు కొత్తా. ప్రతి పండుగరోజు మీ ఇంట్లోనేగా నా భోజనం రామశేషుగారూ" అన్నాడు కరణం.

    "మరికాస్త వడ్డించుకొండి అన్నయ్య పెరుగులోకి!" అంటూ విస్తర్లో కాస్త అన్నం వడ్డించింది కస్తూరి.

    "అయ్యో...వద్దమ్మా...అంటూ "గడ్డపెరుగేనా చెల్లెమ్మా, ఏది కాస్త ఈ చేతిలో వేయి" అన్నాడు.

    అయన మాటలకు నవ్వుకుంటూ కస్తూరి గరిటనిండా పెరుగు తీసి అయన చేతిలో వేసి...రెండు గరిటెల పెరుగు అన్నంలో వడ్డించింది.

    "అబ్బ! పెరుగు ప్రశస్తంగా వుందండి! వెధవది మా ఇంట్లో పెరుగు ఇలా వుండదు. ఎంతైనా రామశేషుగారి పాడిగేదెల నెయ్యి.... పెరుగు, పాలు తరువాతే...అన్నాడు కరణం.

 Previous Page Next Page