Read more!
 Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 3

 

    "ఈ ఇడియా బావున్నట్టుంది"
    
    "మెల్లగా అంటావేమిటి! చాలా రోజుల మధనం తరువాత పుట్టిన గొప్ప ఐడియా నేనే మొదట ఫాలో అయ్యి సంఘానికి ఈ కొత్త ప్రయోగం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మరి నా భార్య దీనికి ఒప్పుకుంటుందో లేదోననే భయం వుంది. విడిపోదామంటే తను ఏడుస్తుంది, రోధిస్తుంది. కానీ సంఘానికి ఓ కొత్త నడక నేర్పించాకంటే ఇలాంటి కష్టాలకి జంకకూడదు. అందుకే ఆమెను కన్విన్స్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తాను."    

 

    "ఓకే విష్ యు ఆల్ ది బెస్ట్ కానీ మరోసారి ఆలోచించు"    

 

    "చాలా ఆలోచించాకే ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందనిపించింది. నేను ప్రవేశపెట్టబోయే కొత్త పద్దతి అందరూ సెహబాష్ అని మెచ్చుకుని తామూ ఆచరిస్తారు చూడు. జీవితాంతం ఇద్దరు కలిసుండాలి అన్న కాన్సెప్టే తప్పు. బలవంతపు మాఘస్నానాలు ఎందుకు చెప్పు? విడిపోయే స్వేచ్చ వున్నపుడే కలిసున్న ఆ రెండేళ్ళ అమృతం తాగెయ్యాలన్న తొందరా, యావా వుంటాయి ఎప్పుడూ వుండే మేళం అనుకోగానే ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. కాబట్టి నా ప్రయోగం గొప్ప సక్సెస్ అవుతుంది చూడు"
    
    "కరెక్ట్"
    
    "నిద్రలేస్తూనే ఒకరినొకరు ఆత్మీయంగా గుడ్ మార్నింగ్ చెప్పుకునే జంటను చూపించు- నేను ఇంతవరకు చెప్పింది ట్రాష్ అని ఒప్పుకుంటాను. మన కొంపలు ఎలా తయారయ్యాయంటే నిద్రలేస్తూనే ఆమె విసుక్కుంటూ ఇంటి చాకిరీకి  సిద్దపడిపోతుంది. అతనేమో లుంగీ అయినా సరిగా కట్టుకోకుండా పేపర్లో షేర్ కాలమ్ లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇక రోజంతా ఎలా గడుపుతారు చెప్పక్కర్కేదు ఒకరంటే ఒకరికి విసుగు, అనవసరమైన కోపాలు, దెప్పి పొడుపులు ఎదుటి వ్యక్తి వల్లే తన జీవితం ఇలా తగలడిందని సణుక్కోవడాలు, అందుకే ఈ ఘోరాలన్నీ జరక్కుండా వుండాలంటే పెళ్ళి రెండేళ్ళకి రద్దయిపోవాలి"
    
    "నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ నాదో చిన్న డౌట్. అడగమంటావా"
    
    "సందేహించకు నీ అనుమానం ఏమిటో చెప్పు?"
    
    "పెళ్ళి రద్దయిపోవడానికి రెండేళ్ళు ఎందుకు గడువు పెట్టావ్? మూడేళ్ళకో నాలుగేళ్ళకో రద్దయిపోవాలని ఎందుకనలేదు?"
    
    సతీష్ సీరియస్ గా ఓ గుటక వేసి ఆ తరువాత నెమ్మదిగా చెప్పాడు. "కారణం వెరీ సింపుల్ రేపు నా మ్యారేజ్ సెకండ్ యానివర్సిరీ గనుక"
    
    సతీష్ కి మెలకువ వచ్చేటప్పటికి లిఖిత పక్కన లేదు. గడియారం వైపు చూశాడు. అది కూడా అప్పుడే నిద్ర లేచి కాళ్ళూ, చేతులూ విదుల్చుకుంటున్నట్లు పెద్దముల్లు పన్నెండు దగ్గరా, చిన్నముళ్ళు ఆరు దగ్గరా వున్నాయి. గాలి కిటికీ తెరలను సుతారంగా కదుల్చుతోంది.
    
    "ఈరోజు తమ పెళ్ళి రోజని లిఖితకు గుర్తుందో లేదో, గుర్తు రాకపోతే ఇంకొక్క క్షణం తామిద్దరూ కలిసి వుండడం మహాపాపం" అనుకుంటూ బెడ్ రూమ్ నుంచి బయటపడి వంటింట్లోకి చూశాడు.
    
    లిఖిత అటు తిరిగి కాఫీ కాస్తున్నట్టుంది.
    
    "లిఖీ" అంటూ వంటింట్లోకి దూరాడు.
    
    ఆ పిలుపుకి ఆమె ఇటు తిరిగి "అప్పుడే లేచారా! మీ టైమ్ ఏడు కదా" అంది.
    
    "కానీ ఈరోజు..." చెప్పాలా వద్దా అంటూ సందేహించాడు. ఆమెకి గుర్తు రాకుండా వుంటే తాను గుర్తుచేయడం దండుగ అనవసరంగా ఇరుక్కుపోతాడు. గుడి, సినిమా, హోటలు భోజనం లాంటి వాటికి తను బలైపోతాడు.
    
    అతనికి అప్రయత్నంగా మొదటి పెళ్ళిరోజు గుర్తొచ్చింది. అంతకు ముందు రాత్రి నుంచే హడావుడి ప్రారంభమైంది. ఇద్దరూ నిద్రపోకుండా మేల్కొని ఖచ్చితంగా పన్నెండు గంటలకు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మరో అరగంట వరకు మంచం చేత తమకు శుభాకాంక్షలు చెప్పించుకున్నారు. ఆ తరువాత నిద్రపోయి ఉదయాన్నే లేచారు.
    
    ఇద్దరూ తలారా స్నానం చేసి గుడికి బయల్దేరారు. దారినిండా జోక్ లు. కబుర్లు మనసుకి ఊపిరి ఆడకపోవడమంటే ఏమిటో ఆరోజు తెలిసింది.
    
    ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో వుండిపోయాడు. లిఖిత అనేకరకాల పిండివంటలు చేసింది. ఇద్దరూ తింటూ తమ పెళ్ళిరోజు విశేషాలను చెప్పుకుంటూ నవ్వుకున్నారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక మ్యాట్నీ కెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు సతీష్ పదిమూరల మల్లెపూలు కొన్నాడు.
    
    రాత్రి తొందరగా భోజనం ముగించి బెడ్ రూమ్ లో దూరారు. లిఖిత అయితే సిగ్గును పూయించే పూలమొక్క అయిపోయింది. ఫస్ట్ నైట్ కంటే ఆ రోజే ఆమె బావున్నట్టు అనిపించింది అతనికి.
    
    తమకంతో పైకి లాక్కున్నాడు. ఆమె ఎద అతనికి ఛాతీకి తగిలి ఒత్తుకు పోయింది. ఆ ఒత్తిడికి మనసంతా విచ్చుకున్నట్టు ఫీలయ్యాడు.
    
    "మన ఫస్ట్ నైట్ రోజు గుర్తొస్తోందా! నేను లోపలికి రాగానే గడిపెట్టేశారు" గుర్తు చేసుకుంటూ చెప్పింది ఆమె.
    
    "ఆరోజు వున్నదంతా తొందరే. ఈరోజు లేనిదంతా అదే" అని ఆమెను తనపై పడుకోబెట్టుకుని కబుర్లు ప్రారంభించాడు.
    
    మరో గంటకు గాని వాళ్ళ శరీరాలకు అలసట రాలేదు.
    
    అలా గడిచింది ఫస్ట్ యానివర్సరీ.
    
    సెకండ్ యానివర్సరీకే ఇంత మార్పుంటే ఏదో యానివర్సరీకి తమ పెళ్ళిరోజుని గుర్తు చేసుకోవడమే ఇబ్బందిగా వుంటుందేమో అనుకున్నాడు అతను.
    
    "ఈరోజు అని ఏదో చెప్పబోయి ఆగిపోయారేం?" అంటూ లిఖిత అతనికి కాఫీ అందించింది.
    
    "ఈ రోజు....."
    
    "ఊ" ఆమె చెప్పమన్నట్టు తొందర చేసింది.
    
    "మన పెళ్ళిరోజు"
    
    "ఇప్పటికి గుర్తొచ్చిందన్న మాట. మీకు గుర్తుందో లేదోనని నేను చెప్పకుండా వున్నాను. పోనీలెండి కనీసం గుర్తుందన్న మాట"
    
    ఇలా ఎదుటి వ్యక్తిని టెస్ట్ చేయడం ప్ర్రారంభమైందంటే దాంపత్యం ఎలా అఘోరిస్తోందో సులభంగా చెప్పేయవచ్చు. ఆమెకు గుర్తుందో లేదో తను టెస్ట్ చేయడం, తనకు గుర్తుందో లేదోనని అనుమానపడడం ఎబ్బెట్టుగా వుంది.
    
    "ఏమిటి ఈరోజు ప్రోగ్రామ్?" అనడిగింది ఆమె కాఫీ తాగుతూ.
    
    "ఈరోజు సెలవు పెట్టటం కుదరదు లిఖితా- ఆడిటింగ్ వుంది"
    
    "పోనీలెండి నాకూ పిండివంటలు చేసే ఓపిక లేదు. ఒళ్లంతా అదోలా వుంది"
    
    ఒళ్ళంతా అదోలా వుందా అంటే రాత్రి కూడా ఇక పక్కలోకి చేరనివ్వదన్న మాట. పెళ్ళిరోజు కూడా ఆ మూడ్ రాలేదంటే ఎందుకు కలిసి వుండడం సో- పెళ్ళి రెండేళ్ళకి రద్దయి పోవాలన్న తన సిద్దాంతం కరెక్టు అన్నమాట.
    
    కాని ఈ ప్రయోగం చేయడానికి లిఖిత ఒప్పుకుంటుందా? తమ పెళ్ళి రద్దయి పోయిందని అంత సులభంగా తనని వదిలి వెళ్ళిపోతుందా? కష్టమైనా సరే కన్విన్స్ చేసి విడిపోవాలి. లేదంటే ఒకరిమీద ఒకరికి బొత్తిగా ఇష్టం లేకుండా ఎందుకు కలిసి వుండడం?

 Previous Page Next Page