Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 4


    
    ఎలాగైనా సరే లిఖితను ఒప్పించాలి. ఈ బంధం నుంచి బయటపడాలి.
    
    "పదిగంటలకల్లా తయారయి బయటపడ్డాడు.
    
    ఆఫీసులో వున్నా లిఖితను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచన తప్ప మరొకటి మనసుకి అందడం లేదు.
    
    రెండేళ్ళలో పెళ్ళి రద్దయిపోవాలి అన్న తన కొత్త ప్రయోగాన్ని ఎలా సమర్ధించాలి అన్నా విషయం మీద రకరకాలుగా రిహార్సల్స్ చేసుకున్నాడు.
    
    ఆఫీసు అయిపోగానే బజార్లో అటూ ఇటూ తిరిగి ఏడుగంటలకల్లా ఇల్లు చేరుకున్నాడు.
    
    లిఖిత అతను వెళ్ళేటప్పటికి ఏదో పుస్తకం చదువుకుంటోంది. భర్తను చూడగానే పుస్తకాన్ని మూసి రూమ్ లోకి వెళ్ళింది.
    
    "పూలైనా తెచ్చి వుండాల్సింది"
    
    "అంటే ఒళ్ళు బాగై పోయిందా?"
    
    "మనకి కాదండి- దేవుడికి"
    
    అతను నిరాశపడిపోయాడు. మేరేజ్ డే రోజు కూడా పూల అవసరం దేవుడికే పరిమితం కావడం దురదృష్టకరం.
    
    ఈ సంఘటనలన్నీ అతన్ని కొత్త ప్రయోగాన్ని అమలు చేయమని వత్తిడి చేస్తున్నాయి.
    
    స్నానం, భోజనం ముగించేటప్పటికి తొమ్మిధైంది.
    
    ఇద్దరూ ఒకే కాట్ మీద పడుకున్నారు గానీ ఇద్దరిలోను ఎలాంటి ఎగ్జయిట్ మెంట్ లేదు.
    
    ఆమె చదువుతున్న పుస్తకాన్ని మూసి "బెస్ట్ బిఫోర్ టెన్ ఓ క్లాక్" అంది అతనివేపు తిరిగి కన్నుగీటుతూ.
    
    "మందుల సీసా మీద 'బెస్ట్ బి ఫోర్ యూజ్' వున్నట్టు అలా అంటున్నావేమిటి?" అడిగాడు అతను.
    
    "ఆపైన నిద్రొస్తుంది నాకు. అందుకే మీకేమైనా కావాలంటే టెన్ ఓ క్లాక్ లోపలే"
    
    అతను విసుక్కున్నాడు. ఇదేదో తనకు ఒక్కడికే కావలసిన విషయం అన్నట్టు, తనకు బొత్తిగా ఇష్టం లేనట్టు మాట్లాడుతోంది. పెళ్ళిరోజు కూడా దానిమీద ఆసక్తి లేకుంటే ఎందుకు ఈ దాంపత్యం?
    
    అతను చివాలున లేచి కూర్చుని మొత్తం తను అనుకుంటున్న కొత్త ప్రయోగాన్ని వివరించాడు.
    
    "అందువల్ల మనమే ఈ కొత్త ప్రయోగానికి నాంది పలుకుదాం. రెండేళ్ళు ఈ రోజుతో అయిపోయాయి కాబట్టి రేపట్నుంచే మనకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. నీ దారి నీది. నా దారి నాది. ఇలా మనం ఒక సంవత్సరం గడుపుదాం. ఇలా విడివిడిగా వుండడమే బావుందనుకుంటే శాశ్వతంగా విడిపోదాం. లేదూ కలిసి వుండడమే మంచిదనిపిస్తే ఆరోజు నుంచీ తిరిగి కలిసి వుందాం. కాబట్టి థర్డ్ యానివర్సరీకి మనం తప్పకుండా కలవాలి. నువ్వు ఎక్కడున్నా ఆరోజు నేను వచ్చేస్తాను" అని ముగించాడు.
    
    ఈ కొత్త ప్రయోగానికి లిఖిత ఒప్పుకోదని, విడిపోయే ఆలోచన మానెయ్యమని కన్నీళ్ళతో ప్రార్ధిస్తుందని అతనికి తెలుసు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తిరిగి ఎలా కన్విన్స్ చేయాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు కనుక భయం లేకుండా ఆమె వేపు చూశాడు.
    
    అతను ఊహించిన దానికంటే విరుద్దంగా వుంది పరిస్థితి.
    
    ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ముఖంలో వింత వెలుగు.
    
    "మీ కొత్త ప్రయోగాన్ని నేనూ ఆనందంతో ఆమోదిస్తున్నాను. ఇలాంటిదేదో జరిగితే బావుండునని నాకూ కొంతకాలంగా అనిపిస్తోంది. అయితే అదేమిటో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు చెబుతుంటే ఎగ్జాక్ట్ గా నాకూ  కావల్సింది అదేననిపిస్తోంది. సో- రేపటి నుంచి మనం విడిపోతున్నాం. ఎలానూ విడిపోతున్నాం కనుక కొసరుగా ఒక్కసారి అని కౌగలించుకోకండి. ఎక్స్ పైరీ టైమ్ మొదలైంది. టైమ్ పదీ పది. నాకెందుకనో గాఢ నిద్ర వస్తోంది. ఉదయం కాగానే మనం విడిపోతున్నామన్న భావనే నూతన ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుతోంది" అని అటు తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె.
    
    అంత షాక్ కి గురవడం అతనికి జీవితంలో అదే మొదటిసారి.
    
    లిఖిత పుట్టింటికి చేరి అప్పటికి నెలయింది.
    
    భర్తనుండి విడిపోయి వచ్చేశానని లిఖిత చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రులు పెద్ద యాగీనే చేశారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు. కోర్టు కెక్కుతామన్నారు అల్లుడ్ని వీధిలోకి ఈడుస్తామని శపధం చేశారు. కానీ వీటిలో ఏ ఒక్కదానిని లిఖిత ఒప్పుకోలేదు. 'నీతో జీవితం బోరుగా తయారయింది' అని ముఖం మీదే అన్న భర్తతో పోలీసులు, కోర్టు, జడ్జీలు కాపురం చేయిస్తారా? భార్యను స్నేహితురాల్లా చూడడం తెలియని భర్తతో కలిసి వుండడం సాధ్యమా? నిజానికి ఆ రాత్రి సతీష్ అలా అంటాడని ఆమె ఊహించలేదు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మాత్రం ఉండేది. అంతకుముందు రెండు మూడు నెలల నుంచి సతీష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంటికొస్తే మూడీగా వుండేవాడు.
    
    మనసు విప్పి మాట్లాడేవాడు కాదు.
    
    "పెళ్ళివల్ల చాలా నష్టాలున్నాయి. అందులో ముఖ్యమైంది స్వేచ్చను కోల్పోవడమే"
    
    "నాకెందుకో ఈ మధ్య ఇంకో అమ్మాయిని ప్రేమించాలనుంది. ప్రేమ పెళ్ళితో ఆఖరు. కానీ ప్రేమ పోయాక జీవితం మీద ఇంట్రస్ట్ చచ్చిపోతుంది. అందుకే ప్రేమ ఎప్పటికీ పోకూడదు. అది అలా కొనసాగుతూనే ఉండాలి"
    
    "నేనేమిటి, ఫ్రాయిడ్ లాంటివాడే ఏమన్నాడో తెలుసా? పెళ్ళాం లేకుంటే నరకం కూడా నివాసయోగ్యమే అన్నాడు"
    
    "ఇంట్లో ఏమీ తోచడం లేదు లిఖితా! నీతో అయినా సరే మాట్లాడాలని పించలేదు"
    
    ఎప్పుడయినా మాట్లాడితే అలాంటి అయిష్టత ప్రకటించేవాడు.
    
    అలాంటి వ్యక్తితో కలిసి బతకాల్సిరావడం దురదృష్టం. భర్తలో వచ్చిన మార్పుకు ఆమె ఎంతగానో ఫీలయ్యేది. అందుకే ఆయనకు ఎలాంటివి ఇష్టమో కనిపెట్టి అలాగే నడుచుకునేది! కానీ లాభం లేకపోయింది. తామిద్దరి మధ్య ఉన్న లింకు తెగిపోయినట్లనిపించింది ఆమెకి.
    
    చివరకు సెకండ్ యానివర్సరీ నాడు తన భర్త సతీష్ విడిపోదామన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఖంగుతింది. అంతలోనే సర్దుకుంది! ఇంకా వేడుకోవడాలు, అర్దింపులూ అనవసరం. తన ఉనికినే భరించలేని వ్యక్తితో కలిసి జీవించాలనుకోవడం శుద్ద దండుగ. అందుకే అతను అలాంటి ప్రపోజల్ పెట్టగానే తనూ అలాగే ఫీల్ అవుతున్నానని నటించింది. మగాడి దృష్టిలో స్త్రీ చీప్ అవడం ఆమెకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా చిరునవ్వుతో అతని ప్రపోజల్ కు ఒప్పుకుంది.
    
    మరుసటి రోజు ఉదయం నిద్రలేచి అతనితో కనీసం చెప్పా పెట్టకుండా బయలుదేరి వచ్చేసింది.

 Previous Page Next Page