బందిపోట్లు అని వాళ్ళను అసహ్యించుకునే ప్రజలు, విదేశీ తుపాకుల్ని రహస్యంగా తెప్పించి బందిపాటలకు పెద్ద లాభాలకు అమ్ముకునే పెద్దమనుషుల్ని గౌరవిస్తుంటారు. ప్రభుత్వం కూడా పదిమందిని బెదిరించి డబ్బు లాగేవాళ్ళను బందిపోట్లంటుంది కాని, పెద్దమనుష్యుల ముసుగేసుకున్న అసలు బందిపోట్లకి రక్షణ కల్పిస్తుంది.
తుపాకుల శబ్దం ఆగింది. సీట్ల మధ్యగా ఇరుక్కున్న వాళ్ళు లేవడానికి సాహసించలేకపోతున్నారు. ధడాలున బస్సు తలుపు తెరుచుకుంది. నలుగురు వ్యక్తులు స్టెన్ గన్స్ తో లోపలకు ప్రవేశించారు.
"అందరూ లేచి సీట్లలో కూర్చోండి" ఆజ్ఞాపించిందో కంఠం.
అందరూ లేచి కూర్చున్నారు. ఓ పిల్లవాడు సీటుకింద కాలు చిక్కుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. అతడి తల్లి భయంతో నోట మాటరాక చూస్తోంది గుడ్లప్పగించి అందరి దృష్టి తనమీదే పడటంతో బిక్కుమని చూస్తోంది.
బుర్రమీసాలతో తలపాగా పెట్టుకున్న యాభై ఏళ్ల వ్యక్తి అటువైపు నడిచాడు.
"వద్దు, వద్దు" పెద్దగా ఏడ్వటం మొదలు పెట్టిందావిడ. అయినా అతగాడాగలేదు. బస్సులో వాళ్ళెవరూ కదలలేదు. ఎదిరిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అతడు వంగి సీటుకిందనుంచి పిల్లవాడిని ఒడుపుగా లాగి వాళ్ళమ్మ ఒడిలో పడేశాడు.
"మీ దగ్గరున్న విలువయిన వస్తువుల్నీ, డబ్బుల్నీ బయటకు తీయండి. దాచడానికి ప్రయత్నిస్తే నాలుగు తన్ని తీసుకోవాల్సి వస్తుంది" హిందీలో అన్నాడు.
ఎవరిదగ్గరా విలువైన వస్తువులంటూ ఏమీ లేవు. ఉన్న కాస్త డబ్బునీ తీసి యిచ్చేశారు. స్త్రీల మెడల్లో మంగళసూత్రాలనీ, పిల్లల ఒంటిమీదున్న వస్తువుల్నీ తీసుకోలేదు వాళ్ళు హరీష్ దగ్గరకు వచ్చాడో వ్యక్తి.
కష్టపడి కూడబెట్టిన డబ్బు చేతులారా ఇవ్వాలంటే బాధగా వుందతనికి. అయినా ఏమీలేదని బుకాయించలేకపోయాడు. సంచి తీసి అందించేశాడు.
"హు, బాగానే వుందే డబ్బు, మంచి ఖరీదయిన చీరెలు" ఆ వ్యక్తి సంతోషంగా సంచి భుజానికి తగిలించుకున్నాడు.
నాయకుడు తలుపు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.
"సాబ్!" పిలిచాడు హరీష్ అతడు తలతిప్పి చూశాడు.
"ఆ ఒక్క చీర మా అమ్మకోసం కొన్నది. యిప్పించెయ్యండి" దీనంగా అన్నాడు హరీష్.
నాయకుడి భ్రుకుటి ముడిపడింది.
"జానీ! ఇతడి దగ్గిర నుంచి చీరలు తీసుకున్నావా?" అడిగాడు. జానీ పరుగున వచ్చి సంచి అందించాడు. అతడందులోంచి అన్నీ తీసి చూశాడు.
"ఎవరికివి?" హరీష్ ని అడిగాడు.
"ఆ తెల్లది మా అమ్మకు, నాలుగు రోజుల్లో నా పెళ్ళి".
నాయకుడు డబ్బుతో సహా అన్నీ హరీష్ చేతులలో పెట్టాడు.
"ఇక పదండి. అసలు పని మర్చిపోకండి" ఆజ్ఞాపించాడు. అన్యాయంలో కూడా నైతిక విలువలుంటాయి. మనసు పరిధంతా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సయినా కేంద్ర బిందువులో మానవత్వం వుంది.
"సాబ్" పిలిచాడు హరీష్ ఏమిటన్నట్లు వెనక్కు తిరిగాడు.
హరీష్ వంగి అతడి కాళ్ళకు నమస్కరించాడు.
"మీరు భభీరామ్ గదూ! ఇప్పుడు గుర్తుపట్టాను, బాల్పురాలో నా పెళ్ళి వస్తే సంతోషిస్తాను".
నాయకుడు భభీరామ్ అతడిని లేపి భుజం తట్టాడు ఆప్యాయంగా తర్వాత పాసింజర్లవైపు తిరిగి "బిర్జూ అగర్వాల్, లేచి మాతోరా" అన్నాడు.
మూడోసీటులో కిటికీ పక్కన కూర్చున్న బిర్జూ ఉలిక్కిపడ్డాడు. "తన పేరు బందిపోట్లకెలా తెలిసింది?"
"నిన్నే బిర్జూ! నువ్వు మాతో వస్తున్నావు" అతడి కళ్ళలోకి చూస్తూ కఠిన్మగా అన్నాడు భభీరామ్.
అప్పుడర్ధమయింది అందరికీ - ఆ దాడిలో అంతరార్ధం.
వాళ్ళు బిర్జూని కిడ్నాప్ చేయబోతున్నారు.
అధికార వార్తల ప్రకారం 1980లో 52, 1981లో 23 కిడ్నాపింగ్స్ జరిగాయా ప్రాంతంలో కాని రికార్డు కెక్కనివి మరెన్నో తమ బిడ్డల్ని వదిలించుకోవడానికో, తమని తాము రక్షించుకోవడానికో అనేకమంది లక్షలకొద్దీ రూపాయలు బందిపోట్లకు సమర్పించుకున్నారు.
బిర్జూ గొడవ చెయ్యకుండా దిగి వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఎద్దుబళ్ళు అడ్డు తొలిగాయి. బస్సు ముందుకి కదిలింది.
చీకట్లోంచి మరో నలుగురు వ్యక్తులు బయటకొచ్చారు.
బిర్జూకి ఇరవై రెండేళ్ళుంటాయి. బి.ఏ. పాసయ్యాడీ మధ్యనే. అతడి తండ్రికి వైతాగంజ్ లో బట్టల దుకాణాలున్నాయి. డబ్బు బాగానే సంపాదించాడు. తనలాగా బందిపోట్లకు చిక్కిన వాళ్ళ గురించి విన్నాడు బిర్జూ తమని పర్యాధగానే చూస్తారు. తండ్రిని డబ్బు అడుగుతారు. ఇస్తే గొడవ లేదు, మర్యాదగా సాగనంపుతారు. ఇవ్వకపోతేనే ప్రమాదం.
బిర్జూకి తండ్రి మీరు నమ్మకం వుంది. అందుకే ధైర్యంగా వున్నాడు.
అతడి ముందు కాన్వాస్ బూట్లు వుంచారెవరో.
"మార్చుకో".
కాళ్ళకున్న షూస్ విప్పి అవి తొడుక్కున్నాడు. కళ్ళకు గంతలు కట్టారు.
ఆ రాత్రి వాళ్ళు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. తెల్లవారబోయే సమయానికి ఒక పల్లెటూరు చేరుకున్నారు. ఒక ఇంటిలో వాళ్ళకు ఆశ్రయం దొరికింది.
తనలాంటి మరో ఇద్దర్ని కలుసుకున్నాడు బిర్జూ.
అందులో ఒకడు రాజు పటాలే రాత్రివేళ పొలంనుంచి నలుగురు స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతూంటే దాడిచేసి పట్టుకొచ్చారతడిని. అయిదులక్షల రూపాయలు పంపమని అతడి తండ్రికి ఉత్తర్వు వెళ్ళింది. 'అంత ఇచ్చుకోలేననీ లక్షరూపాయలు ఇస్తాననీ' వార్త పంపించాడు ఆయన. వీళ్ళు 'కనీసం రెండు లక్షలు ఇవ్వాలని' మరో ఉత్తరం పంపారు. దానికింకా జవాబు రాలేదు.
రెండోవాడు వినయ్ కుమార్ అతడిదీ బట్టలవ్యాపారమే భార్యతో కలిసి సినిమాకు వెళ్ళివస్తుంటే పట్టుకున్నారు. భార్యని మర్యాదగా ఇంటి దగ్గర విడిచిపెట్టి అతడిని తీసుకొచ్చారు. అతడి మామగారు బాగా డబ్బున్నవాడు రెండు లక్షలకు కబురు వెళ్ళింది, సమాధానం రాలేదు యింకా.
అంతా కలిసి మరో మూడురోజులు అలాగే ప్రయాణం సాగించారు. పగలంతా నిద్రపోవడం, రాత్రిళ్ళు ప్రయాణం కాలినడకనే.
నాలుగోరోజున బిర్జూచేత తండ్రికి ఉత్తరం రాయించాడు భభీరామ్.
ఆ ఉత్తరం బిర్జూ తండ్రి కృష్ణ అగర్వాల్ ఇంటిముందు పోస్టుబాక్సులో వేయబడింది. మరో రెండు రోజుల్లో డబ్బు ఎక్కడ అందజేయాల్సింది తెలుపుతామని వుందందులో.
* * *
మైనపురి డిస్ట్రిక్టు హెడ్ క్వార్టర్స్ పోలీసు కార్యాలయం హడావుడిగా వుంది. డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్లూ, నలుగురు ఇన్ స్పెక్టర్లు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారు.
యు.పి ఇన్ స్పెక్టర్ జనరల్ రజీందర్ సింగ్ ఆయనకు సెల్యూట్ చేసి నిలబడ్డాడు.
"ఎంతవరకు వచ్చింది?" అడిగాడు రజీందర్ సింగ్.
"అంతా సిద్దమయినట్లే సర్! రెండు వందలమంది కానిస్టేబుల్స్ రెడీగా వున్నారు. అమ్యూనిషన్ రెడీ, మరో రెండు ట్రక్కులు రావాల్సి వుంది. అందుకు ఎదురుచూస్తున్నాం".
"గుడ్! రాత్రి తొమ్మిదయ్యేసరికి మీరు బాల్పురా చేరుకోవాలి".
"అయిపోయింది సర్!"
"మనకందిన సమాచారం కరెక్టేనా?"
"పూర్తిగా కరెక్టే సర్! అక్కడ ఒక పెళ్ళికి అటెండవుతాడని తెలిసింది సర్!"
"సరే జాగ్రత్త! ముగ్గురు వ్యక్తులు అతడి చేతిలో వున్నారు. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంటుంది. ఎంత రక్తపాతం జరిగినా సరే వదలకండి ఈ సారితో భభీరామ్ అంతమయిపోవాలి".
"అలాగే సర్! తప్పకుండా నా జీవితంలో నేను ఎదురుచూస్తూ వున్నది. ఇలాంటి అవకాశం కోసమే సర్! నా ప్రాణాలు పోయినా సరే, భభీరామ్ ప్రాణాలతో తప్పించుకోలేడు సర్!"
సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన అతడి తమ్ముడు ఓ పోరాటంలో భభీరామ్ గుంపుకి ఆహుతయిపోయాడు రెండేళ్ళక్రితం ఆనాటినుంచీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కరమ్ వీర్ సింగ్.