Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 2

  

     "నాకో అయిడియా వస్తోందర్రా ఇప్పుడు ఆవేశంలో వున్నాం కాబట్టి కొన్నాళ్ళు ఉత్తరాలు రాసుకుంటాం. కాని ఆ తర్వాత అనుకోకుండానే దూరమయిపోతాం. కాని కొన్నేళ్ళ తర్వాత అందరం అనుకోకుండా కలుసుకుంటే ఎలా మాట్లాడుకుంటాం? ఏం మాట్లాడుకుంటాం? ఊహించండి" అనూరాధ అప్పుడే ఆ దృశ్యాన్ని ఊహించేసుకుంటోంది.
   
    "ఏముంది, పిల్లల గురించి- మొగుళ్ళ గురించి మాట్లాడుకుంటాం" అంది విశాల వెంటనే.
   
    "అవునులే నీ కంతకంటే వేరే ఆలోచన ఎందుకొస్తుంది. ఎప్పుడెప్పుడు పెళ్లవుతుందా, పిల్లల్ని కంటానా అని ఎదురు చూస్తుంటావు. నేను మాట్లాడేది అలాంటి విషయాల గురించి కాదు. ఈ రోజున భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కంటున్నాం. ఈ వయస్సులో పిచ్చి పిచ్చి కోరికలు, ఊహలు, చిన్న విషయాలేక్ ఆవేశపడిపోయి పోట్లాడుకోవడాలు చేస్తుంటాం. మన నలుగురిలో ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసుననే భావనలో వున్నాం. కాని పదేళ్ళ తర్వాత మనలో నిజస్వరూపాలు బయటకు వస్తాయి గదూ?"
   
    "నీ అయిడియా చాలా బాగుంది రాధా! మరో పదేళ్ళ తర్వాత మనలో మెచ్యూరిటీ వస్తుంది. జీవితం బాగా ఎనలైజ్ చేసి మాట్లాడుకుంటాం అలాగే చేద్దాం రాధా!" అంది భార్గవి సంతోషంగా.
   
    "అలా కుదురుతుందా? ఎవరెవరం ఎక్కడుంటామో?" విశాల సందేహం వెలిబుచ్చింది.
   
    " 'వేర్, దేరీజ్ విల్ దేరీజ్ వే' - అన్నారు. మనసుంటే మార్గముంటుంది. ఆలోచిస్తూంటేనే ఎంత ఎగ్జయిటింగ్ గా వుంది. అందరూ ఒకే ఊళ్ళో వుండి అప్పుడప్పుడు కలుసుకుంటుంటే అది వేరే విషయం. కాని వైజయంతి వెళ్ళిపోతుంది. నేనూ వెళ్ళిపోవచ్చు- ఒకవేళ ఈ ఊళ్ళోనే వున్నా మన ముగ్గురికీ ఒకే కాలేజీలో సీటు రాకపోవచ్చు. అది కాకపోయినా డిగ్రీ అయిపోయాక మనం విడిపోవచ్చు. కాని - పదేళ్ళ తరువాతంటే బహుశా జీవితాల్లో సెటిలయిపోతాం. అప్పుడు మనలో తప్పకుండా మార్పు వస్తుంది. అప్పుడు కలుసుకుంటేనే బావుంటుంది" అంది భార్గవి.
   
    "నిజమే భార్గవీ! నువ్వలా అంటూంటే నాకు ఈ అయిడియా బాగున్నట్లే తోస్తోంది. తప్పకుండా కలుద్దాం" అంది వైజయంతి.
   
    "ఎలా? అప్పుడెవరెక్కడుందీ ఎలా, ఎక్కడ కలవాల్సిందీ తెలిసేదెలా?" విశాల అనుమానం.
   
    "అవును! నిజమే. ఒకసారి రెగ్యులర్ గా ఉత్తరాలు రాసుకుంటే తప్ప అది సాద్యంకాదు. అలా జరిగితే మనం కొత్తగా చెప్పుకునేదేముంటుందిక!" రాధ అడిగింది.
   
    "ఆ ఉత్తరాలు రాసుకోలేకేగా ఈ ప్రోగ్రాం వేసుకుంటున్నది. ఇక ఎలా కలుస్తాము అన్న ప్రశ్నకు జవాబు ఒకటుంది" అంది వైజయంతి. నిశ్చయం చేసింది.
   
    "ఏమిటది, చెప్పు?" అడిగారంతా.
   
    "ఎప్పుడు ఎక్కడ కలవాలో యిప్పుడే నిర్ణయించేసుకుంటే సరి".
   
    "ఇప్పుడా, అప్పటిదాకా గుర్తుంటుందా ఒకవేళ కుదరని పరిస్థితుల్లో వుంటే?"
   
    "కుదరకపోతే అది వేరే విషయం. అది మన చేతుల్లో వుంటుదప్పుడు, ఈ రోజు ఏప్రిల్ ఇరవై అయిదు. సరిగ్గా పదహేనేళ్ళ తర్వాత, పదేళ్ళంటే త్వరగా గడిచిపోతాయి. అందుకే పదిహేనన్నాను. 1988 ఏప్రిల్ ఇరవై అయిదున మనం ఈ కాలేజీలో, ఈ చెట్టుకిందే కలుద్దాం" అంది వైజయంతి.
   
    "నేను ఓ.కే. నా జీవితంలో మర్చిపోలేని విషయాలన్నీ ఎప్పటికప్పుడు రాసిపెడుతూంటాను మీకు వినిపించడానికి" అంది భార్గవి ఉత్సాహంగా.
   
    "ఆ పని నేనూ చేస్తాను" అంది అనూరాధ.
   
    "అయితే మనం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది, ఏప్రిల్ ఇరవై అయిదుని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలన్నమాట" అంది విశాల.
   
    "మరే, ఎక్కడయినా రాసిపెట్టుకో - లేదా మీ బావకు ఇప్పుడే చెప్పేసెయ్ గుర్తుంచుకోమని పిల్లల ధ్యాసతో మర్చిపోయినా మర్చిపోతావు" వైజయంతి హెచ్చరించింది.
   
    "అవసరం లేదులే ఆ మాత్రం గుర్తుండదేమిటి? ఇంతవరకూ ఎవరూ ఫేర్ వెల్ పార్టీలో అనుకోని కొత్త తీర్మానం చేసుకున్నాం."
   
    "అయితే అందరూ గుర్తుంచుకోండి. ఆ రోజున మనం ఇక్కడే కలవాలి. రావడానికి వీలులేకపోతే ఎవరితోనయినా కబురయినా చెయ్యాలి. సమయం ఉదయం పదిగంటలు, తేదీ ఏప్రిల్ ఇరవై అయిదు, ఎనభైఎనిమిదో సంవత్సరం మన అనుభవాలన్నీ ఇలాగే మాల గుచ్చి తీసుకురావాలి. కనీసం ఒక్కరోజన్నా కలసి గడపాలి" పొగడ మాలల్ని అందరికీ పంచుతూ అంది భార్గవి.
   
    "ఓ.కే. డన్" అందరి చేతులూ కలుసుకున్నాయి.
   
                                వైజయంతి
   
                          1982వ సంవత్సరం ఫిబ్రవరి నెల-
                            స్థలం -ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లా.
   
    సాయంత్రం ఆరవుతోంది. చలికాలం కావడంతో చీకటిపడిందప్పుడే.
   
    ఒరాయి నించి వైతాగంజ్ వైపు వెళుతోంది ఆర్టీసీ బస్సు. హరీష్ గుప్త బస్సుని ఉత్సాహంగా నడుపుతున్నాడు. మరో రెండు గంటల్లో వైతాగంజ్ చేరతారు. డిపోలో బస్సు అప్పచెప్పేస్తే బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత నెలరోజులు సెలవు.
   
    మరో వారంరోజుల్లో వుంది పెళ్ళి ముహూర్తం. హరీష్ పక్కనే పెట్టుకున్న బ్యాగ్ ని చూసుకున్నాడు గర్వంగా పెళ్ళికూతురి కోసం కాశీలో కొన్న ఎర్రపట్టుచీర, వెండి గొలుసూ, తల్లికోసం కొన్న జరీఅంచు తెల్లచీరా వున్నాయందులో రెండేళ్ళ నించీ కూడబెట్టిన రెండువేల రూపాయల క్యాషుకూడా వుంది. అమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా అతడి హృదయం కృతజ్ఞతతో పొంగుతుంది. తనకు ఏడాది వయసప్పుడు తండ్రి చనిపోయాడు. అప్పటినుంచీ పడరాని కష్టాలూ పడిందావిడ. ఈ నాటికి తను జీవితంలో స్థిరపడగలిగాడు. జబ్బుతో వున్న ఆమె చివరి కోరిక తన పెళ్ళి చూడాలని ఆమెకు నచ్చిన అమ్మాయినే ఎన్నుకున్నాడు. పెళ్ళి ఏర్పాట్లు అన్నీ చూస్తూ తన కోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తూంటుంది. ఆమెకోసం కూడా తను ఖరీదయిన చీర కొన్నాడని తెలిస్తే బహుశా ఏడ్చేస్తుందేమో!
   
    దూరంగా కుకర్ గావ్ బ్రిడ్జి కనుపిస్తోంది. అక్కడిదాకా రోడ్డు గతుకులతో నిండివుంది. బ్రిడ్జి దాటాక మెయిన్ రోడ్డు బావుంటుంది. స్పీడుగా వెళ్ళిపోవచ్చు. హరీష్ స్పీడు బాగా తగ్గించి నడుపుతున్నాడు. అయినా బస్సు కుదుపులతో నడుస్తోంది.
   
    హెడ్ లైట్స్ వెలుతురులో దూరంగా రోడ్డు కడ్డంగా ఏదో నిలబడి వుండడం కనిపించిందతనికి. కాని అదేమిటో స్పష్టంగా తెలియడం లేదు. బస్సు మరికాస్త దూరం పోనిచ్చాడు హరన్ కొడుతూ కదలలేదది.
   
    పాతిక గజాల దూరానికి వచ్చాక స్పష్టంగా కనిపించింది ఒకటి కాదు రెండు ఎడ్లబండ్లు రోడ్డు కడ్డంగా నిలబెట్టి వున్నాయి. లోపల మనుష్యులెవరూ లేరు.
   
    హారన్ కొడుతూ మరింత దగ్గిరగా బస్సుని పోనిచ్చి బ్రేక్ వేశాడు హరీష్. హాండిల్ మీద వేసిన చెయ్యి అలాగే ఆగిపోయింది. పక్కనుంచి దూసుకుపోయిందో తుపాకీ గుండు. వెంటనే నాలుగు పక్కలనుంచీ తుపాకీల మోత వినిపించడం మొదలయింది.
   
    పాసెంజర్లందరూ తలలు వంచి సీట్ల మధ్యలో దూరిపోయారు.
   
    ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకిది కొత్తకాదు. ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ నోటా ఈ నోటా ఎన్నో కథలు వింటూంటారు. ఎప్పుడో ఒకప్పుడు తుపాకీ అనుభవం కలుగుతుందని వాళ్ళకు తెలుసు.
   
    ఉత్తరప్రదేశ్ లోని ఆ దరిదాపుల పన్నెండు జిల్లాలనూ బందిపోట్ల దేశంగా పరిగణిస్తారు. అటు మధ్యప్రదేశ్ చంబల్ లోయనించీ యిటు రాజస్థాన్ బార్డర్ ప్రాంతం అంతా పాలించేది బందిపోట్ల ముఠాలే. ఆ ప్రాంతంలో దాదాపు రెండు వందల బందిపోట్ల గుంపులున్నాయని అంచనా. వాళ్ళల్లో ఫూలన్ దేవి, కుసుమ, గీతలాంటి స్త్రీ నాయకురాళ్ళున్నవి కాకుండా మాన్ సింగ్, రాజుభట్నాగర్, మధోమల్లా, ఘన శ్యామ్, సికార్వార్, మల్కాన్ సింగ్ లాంటి పేరుమోసిన నాయకులు కూడా వున్నారు. వీళ్ళగురించి రకరకాల కథలు ప్రచారంలో వున్నాయి. అందులో కొందరు బాహాటంగానే తిరుగుతూంటారు. గ్రామస్థులు వాళ్ళకు అతిధిసత్కారాలు ఘనంగా చేసి పంపుతారు. పోలీసులు వస్తున్నారంటే వెంటనే వార్త నందచేసే ఇన్ ఫార్మర్ల కొరతలేదు. కొండలు, నదీ లోయలు, పొలాలు వీళ్ళకు విశ్రాంతి స్థలాలు. పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రిళ్ళు ప్రయాణాలు చేస్తారు. ఒక్కోసారి ఒక్కరాత్రిలో దాదాపు యాభైమైళ్ళు కూడా నడిచెయ్యగలరు. కాబట్టి వీళ్ళు ఏ సమయంలో ఎక్కడుంటారో ఎవరూ చెప్పలేరు. వాళ్ళకి వార్తలు అందజేసే ఇన్ ఫార్మర్లు ఒకోసారి డబ్బు కోసం పోలీసులకు వాళ్ళ ఉనికిని చెప్పేస్తారు. అలా జరిగినప్పుడు పోలీసులతో దాడి జరపడం, పోరాటంలో కొందరు చనిపోవటం జరుగుతుంది. బ్రతికి బయటపడ్డవాళ్ళు పారిపోయి మరో గుంపులో చేరడమో, స్వంతంగా ఒక నాయకుణ్ణి ఎన్నుకొని కొత్త గ్యాంగ్ ని స్థాపించుకోవడమో జరుగుతుంది. కొల్లగొట్టిన డబ్బు వాళ్ళ నిత్యావసరాలకు, కొంత దానధర్మాలకు, ఎక్కువగా ఆయుధాలు కొనుక్కోవడానికి వినియోగిస్తారు. అత్యంత అధునాతనమైన అమెరికన్, ఫ్రెంచి స్టెన్ గన్స్ వుంటాయి వాళ్ళ దగ్గర. సాధారణంగా పోలీసు యూనిఫారాల్లో తిరుగుతుంటారు.

 Previous Page Next Page