Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 4

 

     "సరే! అయితే నేను వెళ్లొస్తాను. విజయంతో తిరిగి వచ్చాక కలుస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్".
   
    "థాంక్యూ సర్! నా ప్రయత్నంలో లోపం వుండదు".
   
    రజీందర్ జీపులో కూర్చున్నాడు.
   
    "ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను కరమ్ వీర్. భింద్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వచ్చేముందే అక్కడ డెకాయిట్స్ కని కొత్త ఎస్.పి.ని వేశారుగా, వాళ్ళకు వార్త అందించటం ఓ వందమంది బయల్దేరి వస్తున్నామని ఫోన్ చేశారు. షంగర్ నదికి అటువైపున కాపలా కాస్తారట".
   
    "వాళ్ళెందుకు సర్! రావడం?" మొహం చిట్లించాడు కరమ్ వీర్.
   
    "భింద్ లో భభీ రామ్ మీద చాలా కేసులున్నాయి. మర్డర్ కేసులూ, రేప్ కేసులూ కూడా వున్నాయి. మనలాగే వాళ్ళూ చాలా పట్టుదలగా వున్నారు. అయినా వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వే పని పూర్తి చేసేస్తావు. భభీరామ్ మన చేతుల్లో చిక్కితేనే నాకు సంతోషం" నాకు రావాల్సిన విజయం మరో యస్.పి.కి దొరక్కూడదన్న హెచ్చరిక వుంది అతడి కంఠంలో.
   
    "తప్పకుండా ప్రయత్నిస్తాను సర్! అయినా ఆ వచ్చేది ఎవరో మీకు తెలుసుగా మనలాగా వాళ్ళలో ధైర్యం వుండదు సర్!"
   
    ఇద్దరూ ఎగతాళిగా నవ్వుకున్నారు - ఆ కొత్త యస్.పి.ని తల్చుకుని
   
    జీప్ కదిలింది.
   
                                             *    *    *
   
    రజీందర్, కరమ్ వీర్ లు భింద్ నగరపు సూపరింటెండెంట్ ని చాలా తక్కువగా అంచనా వేశారు.
   
    మధ్యప్రదేశ్ లో భింద్ నించి, ఉత్తరప్రదేశ్ బోర్డరు దాటి ఇటావా దగ్గరకు వచ్చేసింది ఆ బెటాలియన్.
   
    ఎలాంటి పరిస్థితుల్లోనయినా భభీరామ్ ను పట్టుకు తీరాలని దృఢ నిశ్చయంతో వస్తున్నారు వాళ్ళు కూడా.
   
    ఆ బెటాలియన్ లో ఆ ఉత్సాహాన్ని, పట్టుదలనీ రేకెత్తించిన వాళ్ళ ఎస్.పి. ఆ ప్రాంతానికి కొత్త వచ్చి నెలరోజులే అయింది.
   
    వచ్చిన రోజున ఎవరూ కేర్ చేయలేదు. కారణం ఆమె ఓ స్త్రీ కావడం ఆమె పేరు వైజయంతి.
   
                            *    *    *
   
    పోలీసు డిపార్టుమెంట్ లో అంత ఉన్నత స్థానంలో ఓ స్త్రీని చూడటం అదే మొదలు వాళ్ళకి.
   
    రెండోరోజున వైజయంతి అందరిలాంటి మామూలు స్త్రీ కాదని వాళ్ళ కర్ధం అయింది. డ్యూటీలో వుండి పొరబాటు చేసినందుకు మొదటి రోజే ముగ్గురు పోలీసులు సస్పెండ్ కాబడ్డారు.
   
    మూడో రోజున ఆమెలో దయార్ద్ర హృదయాన్ని, స్వభావాన్ని కూడా రుచి చూశారు.
   
    నాలుగో రోజున ఆమె అందర్నీ సమావేశపర్చింది.
   
    "ఫ్రెండ్స్! ఈ రోజునుంచీ నేను పూర్తిగా ఛార్జి తీసుకుంటున్నాను. నన్ను ఒక ప్రత్యేకమయిన పనిమీద నియమించింది ప్రభుత్వం. 'నా కర్తవ్యం సరిగా నిర్వహించగలగాలంటే మీ అందరి సహకారం కావాలి. అంటే మీ డ్యూటీ మీరు సవ్యంగా చేయాలి. మీ అందరి డ్యూటీ లేమిటో, నా డ్యూటీ ఏమిటో కూడా నాకు బాగా తెలుసు. డ్యూటీ సరిగ్గా చేసేవాళ్ళందరూ నాకు మిత్రులు. తప్పించుకునేవాళ్ళను నా శత్రువులుగా పరిగణిస్తాను. నా శత్రువులని ఎలా దెబ్బకొట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకొక్క విషయం నేను ఒక పోలీసు ఆఫీసర్ని మాత్రమే నాకు గుర్తుంటుంది. ఒక స్త్రీ నన్న విషయం నేను మర్చిపోతుంటాను. ఆ విషయాన్ని నాకు గుర్తు చేయాలని మాత్రం ఎప్పుడూ ప్రయత్నించకండి. అప్పుడు నిజమైన స్త్రీ శక్తేమిటో నేను మీకు చూపించవలసి వస్తుంది".
   
    ఆ స్త్రీ శక్తిని వారం రోజుల్లోనే వాళ్ళు స్వయంగా చూడగల్గారు.
   
    అప్పటికప్పుడు ఓ యాభైమంది సిబ్బందిని బయలుదేరదీసి చంబల్ లోయలోకి వెళ్ళిందామె. బందిపోటు షియారాం గుంపు ఆ ప్రాంతంలో విడిది చేసినట్లు ఆమె ఎవరితోనూ అనలేదు. కారణం పోలీసుల్లో కూడా కొందరు గూఢచారులుంటారు. వాళ్ళు బందిపోట్లకు పోలీసుల కదలికలను గూర్చి వార్తను అందిస్తూంటారు.
   
    పధ్నాలుగు గంటలపాటు ఏకధాటిగా ప్రయాణం చేసింది వైజయంతి. రెండుగంటలు అందర్నీ విశ్రాంతి తీసుకోమంది. ఇంకెంత దూరం ప్రయాణించాలో ఎవరికీ తెలియదు. అడగాలంటేనే భయం. అయితే వాళ్ళు ఎక్కువసేపు ప్రయాణం చేయాల్సిన అవసరం రాలేదు. ఏడుమైళ్ళ దూరంలోనే వుంది బందిపోట్ల ముఠా పోలీసుల్ని గుంపులుగా విడగొట్టి దార్లు చెప్పింది. ఒక గుంపుకి - మరో గుంపు ఎటు వెళ్తుందో తెలీదు. ఎంత వేగంతో ప్రయాణం చేయాలో మాత్రం చెప్పింది. చీకటి పడగానే ప్రయాణం సాగించారు. దిశవేగం - వాళ్ళని అనుకున్న చోటికి నాలుగు వైపుల్నుంచీ ఒకేసారి చేర్చింది. ఆమె తెలివితేటలకి పోలీసులే ఆశ్చర్యపోయారు. అది చాలా పెద్ద పొలం ఆర్డర్ ఇచ్చేవరకు కాల్పులు జరప వద్దంది వైజయంతి సియారాం గుంపే ముందు కాల్పులు జరిపింది. ఆరుగురు బందిపోట్లని ప్రాణాలతో పట్టుకోగలిగారు. నలుగురు కాల్పుల్లో మరణించారు. సియారాం, అతడి ప్రేయసి కుసుమ ముందుగానే తప్పించుకొన్న విషయం వైజయంతికి తెలియలేదు. తమలోనే వున్న శత్రువుని పట్టేసింది వైజయంతి. ఆమెకి ఆ అనుమానం కాస్త ఆలస్యంగా వచ్చింది. ఈ లోపులోనే శత్రువులకి వర్తమానం వెళ్ళిపోయింది. బందిపోట్లు పక్షికూత రూపంలో తాము ఎదురుచూస్తున్నట్లు ఇన్ఫార్మర్ కి తెలుపుతారు. ఇన్ ఫార్మర్ సరి అయిన సమయం చూసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే వైజయంతి తానే, ఇలాంటి కూతని తన క్యాంప్ కి దూరంగా ఏర్పాటు చేసింది. ఇన్ ఫార్మర్ రహస్యంగా వచ్చాడు. ఆమె పన్నిన వలలో చిక్కుకుపోయాడు.
   
    అతడు సబ్ ఇన్ స్పెక్టర్. అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో రహస్యంగా సియారాంకు వార్త పంపాడు. సియారాం తన గుంపుని వదిలి పారిపోయాడు. అదీ జరిగింది. ఆ ఇన్ స్పెక్టర్ని కూడా బందిపోట్లతో సహా కలిపి బంధించి భింద్ చేరుకుంది వైజయంతి. సియారాం, కుసుమల ఎస్కేప్ గురించి బాధపడలేదామె. పారిపోయిన సియారాం పెద్ద పొరపాటు చేశాడు. అతడికోసం అనుక్షణం వేటాడుతోంది ఫూలన్ దేవి. గుంపుని వదిలి ఆమెతో ఒంటరిగా పోరాడడం సియారాంకు సాధ్యంకాని పని.
   
    బందిపోటు ఫూలన్ దేవికి శత్రువు కుసుమ! ఫూలన్ లాగా తనూ పెద్ద బందిపోటు రాణి ననిపించుకోవాలని ఆమె ఆరాటం.
   
    1981 మే 7న ఉత్తరప్రదేశ్ లోని అస్తా అనే గ్రామంలో, ఆ ఊరి పెద్ద రాంసింగ్ భార్యను పదిమందిలో వస్త్రాపహరణచేసి నగ్నంగా నిలబెట్టడంతో పోలీసు రికార్డుల కెక్కింది కుసుమ. కుసుమ ప్రియుడు సియారాం.
   
    కుసుమ తండ్రి ఒక స్కూలులో చప్రాసీ చాలా చిన్నతనంలో కేదారనాధ్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అత్తింటిలో ఇమడ లేక కుసుమ పుట్టింటికి పారిపోయింది. ఆమె ఒక సెక్స్ మానియక్. అంత చిన్న వయసులోనే ఆమెకు చాలా మందితో సంబంధం వుండేది. పుట్టింటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు పదిహేడేళ్ళు. చాలా అందంగా నిండుయవ్వనంలో వుంది. మార్చి 8, 1978న మథోమల్లా అనే బందిపోటు ఆమెను చూచి మోహించి ఎత్తుకుపోయాడు. అతడి ఉంపుడుకత్తెగా కొంతకాలం వుండిపోయిందామె. మథోమల్లా సామ్రాజానికి శత్రుబృందం విక్రమ్ మల్లా అనే మరోగుంపు (ఫూలన్ దేవి ఆ గ్యాంగ్ లోనే వుందప్పుడు) ఆ రెండు గుంపులకి ఒకసారి పెద్ద పోరాటం జరిగింది. అందులో కుసుమకి గుండుదెబ్బ తగిలింది. ట్రీట్ మెంట్ కోసం ఆమెను ఢిల్లీకి పంపించారు. అక్కడ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
   
    అప్పటికే విక్రమ్ మల్లాకి కుసుమ మీద మనసు పుట్టింది. ఆమెను బెయిలుమీద విడిపించటానికి విక్రమ్ లక్షల డబ్బు వెదజల్లాడు. కుసుమ జైలునుంచి బయటపడింది. విక్రమ్ కి చేరువయింది. అదే గుంపులో వున్న ఫూలన్ దేవికీ కుసుమకీ ఒక్కక్షణం పడేదికాదు. అసూయతో రగిలిపోతూండేవారు. వాళ్ళ ముఠాలోనే వున్నాడు సియారాం. అతడు కుసుమ మాజీ ప్రియుడు. కొంతకాలానికి కుసుమకి తన ప్రస్తుత ప్రియుడైన విక్రమ్ అంటే మొహం మొత్తింది. మాజీ ప్రియుడే తన యవ్వనపు కోర్కెల్ని అణచగల మగధీరుడు అనుకుంది. అదీగాక విక్రమ్ ఫూలన్ దేవితో కూడా గడపటం అంతఇష్టం వుండేదికాదు. అందుకని సియారాంతో "విక్రమ్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని" అతడిని ఉసికొల్పింది కుసుమ. ఆ రాత్రే విక్రమ్ ని చంపేశాడు సియారాం. ఫూలన్ దేవి పారిపోయి స్వంతంగా ముఠాని ఏర్పరచుకుంది. తన ప్రియుడి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మంటముందు ప్రతిజ్ఞ చేసిందామె. ఈ విధంగా గొప్ప గొప్ప రాజ్యాలు స్త్రీ కారణంగా చీలిపోయినట్టే - చంబల్ లోయలో ముఠాలు రెండుగా చీలిపోయాయి.
   
    పారిపోయిన ముఠాకి సియారాం నాయకుడయ్యాడు. అతడి తమ్ముడు లాలారాం, భార్య కుసుమ అందులో ముఖ్యమయిన మెంబర్లు కుసుమ అందరికీ ప్రియురాలే. వాళ్ళ గ్యాంగు చెయ్యని ఘోరాలు లేవు. అన్నింటి వెనుకా కుసుమదే హస్తం.

 Previous Page Next Page