Read more!
 Previous Page Next Page 
హిమసుందరి పేజి 2

    క్షణకాలం బరువుగా నడచిపోయింది.

    ఇరువురూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఫక్కున నవ్వుకున్నారు.

    "ఈ రోజు టిఫెన్ ఏమిటి?" రామకృష్ణ అడిగాడు - నిమ్మకాయని కోస్తున్న సీతను చూస్తూ.

    "చాలా తెలుగు నవలల్లో రచయిత్రులు రాసేది!" చెప్పింది సీత.

    "ఏమిటి ఉప్మానా!" రామకృష్ణ అరకిలో ఆముదం పుచ్చుకున్నవాడిలా డీలాపడిపోతూ అన్నాడు.

    "తగిన జీడిపప్పు తగిలించే చేశానులెండి డోంట్ వర్రీ.... ఈ ఇంట్లో ఉప్మా చేసి నెలా పదకొండు రోజులు అయింది. ఓరోజు దోశ, మరో రోజు ఇడ్లీ, ఆ తర్వాత ఊతప్పం, నిమ్మకాయ పులిహోర, మసాలా పకోడి, న్యూడిల్స్, రొట్టె, ఆటాబోండా, పెరుగు గారే, కట్ లెట్, పునుగులు - ఇన్ని రకాలు చేసి పెట్టాను. వీటన్నిటి మధ్య ఓరోజు ఉప్మా చేస్తే ఎందుకండీ - అలా దివాలా తీసినవాడిలా ముఖం పెడతారు?" అంటూ సీత ఉప్మాప్లేట్లు రెండు తీసుకు వచ్చి భర్తకి ఒకటి ఇచ్చి, తానొకటి తీసుకుంది.

    ముందుగా ఉప్మాలోని జీడిపప్పు ఏరుకుని తింటూ "నాకు తెలియక అడుగుతాను - చాలామంది రైటర్స్ తమ నవలల్లో టిఫెన్ గురించి రాయాల్సి వస్తే తగిన జీడిపప్పు వేసిన ఉప్మా అని రాస్తారు ఎందుకు? వాళ్ళకి అంతకు మించి టిఫెన్ చేయటం రాదా?" అడిగాడు రామకృష్ణ.

    "కొందరికి చేయటం రాక - మరికొందరికి జీడిపప్పు దండిగా వేసుకుని ఉప్మా చేసుకు తెనాలన్న ఆశ. జీడిపప్పు కొనలేక కొందరు. ఉప్మా అయితే చేయటం తేలిక. రాయటం తేలిక అని కూడా కావచ్చు. ఉప్మాకి, రచయిత్రికి అసలు సంబంధమే లేదు. మసాలా పకోడీ, బాసుంది, పెరుగు గారె, జాంగ్రీ, ఆలు బోండా, మైసూర్ పాక్ - అంటూ గొప్పగా స్వీటు, హాటు రాసే రచయిత్రి - ఇంట్లో రోజూ అలా చేసుకు తింటుందంటారా? అంతా హంబక్!" అంది సీత.

    "వాళ్ళెలా అఘోరిస్తే నాకెందుకు గాని - ఇది మాత్రం చాలా అన్యాయం సీతా!" అన్నాడు రామకృష్ణ.

    "ఏది- ఉప్మా చేయటమా?"

    "ఉహు! ఉప్మా తినటానికి పెట్టి, రకరకాల టిఫెన్ పేర్లు నోరూరేలా చెప్పటం!"

    "సారీ అండీ!" అంది సీత, మూతి సున్నాలా అందంగా చుట్టి.

    "ఎంత అందంగా వుందో!" అన్నాడు రామకృష్ణ.

    "ఏమిటి, ఉప్మానా!"

    "ఉహూ! నీ మూతి."

    సీత కిల కిల నవ్వింది.

    "ఇలా నీవు నా హృదయం కదలిపోయేలా కిలకిల నవ్వుతూ నా ఎదురుగా కూర్చుంటే ఉప్మా ఏం ఖర్మ - విషం కూడా అమృతంలా పుచ్చుకోగలను." స్పూనుకి, నోటికి చక చక పని కల్పిస్తూ అన్నాడు రామకృష్ణ.

    "నిమ్మకాయ తక్కువ అయిందేమో - పైత్యం ప్రకోపించింది" అంటూ మరోసారి కిలకిల నవ్వింది సీత.
   


       
                                                                               2


    సాధారణంగా ప్రతి ఆడపిల్లకి కాపురానికి రాంగానే అత్తవారిల్లు అనబడే ఆ కొత్తచోట ఇమడడానికి కాస్త టైము పడుతుంది. కొందరికి చిన్న సమస్యలు ఎదురయితే - మరికొందరికి పెద్ద సమస్యలు భయంకరంగా కనిపిస్తాయి.

    అత్తవారింట్లో వాతావరణందేముంది - అత్త, మామ, మరిది, ఆడబడుచు, బావగారు, తోడికోడలు- రకరకాల మనస్తత్వాలు - సూటిపోటీ మాటలు, వాళ్ళ పద్దతులు - ఇలా ఎన్నో సమస్యలు! అన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

    సీతకి అత్తగారి ఇల్లు ఉంది, దాని తాలూకా మనుషులూ ఉన్నారు. అయితే అత్తవారిల్లు పల్లెటూరిలోనూ, ఆడబదుచు పెళ్ళయి బొంబాయిలోను, ఓ బావగారు కలకత్తాలోనూ - అలా తలా ఒక చోట ఉన్నారు.

    సీత భర్తతో పాటు విజయవాడలో ఉంది.

    సీతామనోహరి, రామకృష్ణ ఇద్దరే ఇద్దరు. మూడో ప్రాణిగా కుక్క, పిల్లిలాంటివి కూడా లేవు.

    సీతకి నవలలు, సినిమాలు ఇష్టం.

 Previous Page Next Page