Previous Page Next Page 
హిమసుందరి పేజి 3

    రామకృష్ణకీ అంతే - సరీగా ఆ రెండే ఇష్టం!
 
    రామకృష్ణ పది గంటలకి భోంచేసి స్కూటర్ మీద రయ్యిన తిరిగి వస్తాడు. వస్తూ ఆఫేసువి వార, మాసపత్రికలు, నవలలు తెస్తాడు.

    సీతకి మంచి పనిమనిషి దొరికింది. అంట్లగిన్నెలు కడగటం, ఇల్లు తుడవటం, పంపునీళ్ళు అన్నింట్లో పట్టి నింపటం కాక, ఇంట్లోనే బట్టలు కూడా ఉతుకుతోంది. ఉదయం వచ్చినప్పుడు ఉతికి ఆరేసి- మద్యాహ్నం వచ్చినప్పుడు తీసి మడతలు కూడా పెట్టి అందిస్తుంది.

    సీతకి వంట తప్పించి వేరే పనంటూ లేదు. రామకృష్ణకీ ఆఫీసు తప్పించి వేరే పనిలేదు. దాంతో ఎన్ని సినిమాలు చూసినా - వార, మాస పత్రికలు కరకర నమిలేస్తూ, నవలలు తెగ దిగమింగేస్తూ- ఎన్ని చేసినా సమయం మిగిలిపోతూనే ఉంది.

    ఇద్దరూ హాస్యప్రియులు, సరదావాళ్ళు కావటం - పైగా కొత్త కాపురం. దాంతో కోపతాపాలకు, సూటిపోటి మాటలకి వాళ్ళ మధ్య తావులేకుండాపోయింది.

    ఓరోజు "నాకేం తోచటం లేదు" అంది సీత.

    "నాకూ అలాగే ఉంది" అన్నాడు రామకృష్ణ.

    వీళ్ళిలా బోర్ ఫీలవుతున్న సమయంలో ఓ నవల చదివారు. దాంతో భార్యాభర్తలు కోపంతోనూ, అపార్దాలతోను విడిపోయి - ఆ తర్వాత నిజం గ్రహించి దగ్గర అయితే ఆ భార్యాభర్తల కలయిక మహా అద్భుతంగా ఉంటుందని, అది ఎలా ఉంటుంది అన్నది వర్ణింప శక్యంకాదని, అనుభవంలోనే ఆ మధురానుభవం చవిచుడాల్సిందే గాని...... అంటూ ఓ రచయిత్రి తన కలాన్ని నొక్కి రాసి వక్కాణించింది తన నవలలో.

    అది చదివి -

    "మనమధ్య కోపం చోటుచేసుకుంటే బాగుండును" అంది సీత సీరియస్ గా.

    "కోపం కన్నా అపార్ధం అయితే బాగుంటుందేమో!" సాలోచనగా అన్నాడు రామకృష్ణ.

    "ముందు కోపం చూద్దాము. అది బాగుంటే అపార్ధం దాకా పోదాం!" అంది సీత.

    "నీ ఇష్టం!" అన్నాడు రామకృష్ణ.

    అదే మొదలు వాళ్ళు కోపం గురించి చాలా ట్రై చేస్తున్నారు గాని, అదేం పాపమో - వాళ్లకి కోపగించుకునే విషయాలలో కూడా నవ్వు రావటం మొదలుపెట్టింది. దానికి కారణం వాళ్ళు తొందరలోనే గ్రహించారు. ఫలానా విషయంలో కోపగించుకోవాలని ముందే అనుకోవటం వల్ల - అదేదో నాటకం ఆడినట్లు ఉండి, దాంతో వాళ్ళు నవ్వాపుకోలేకపోయేవారు. దాంతో ఆ సీను రసాభాస అయేది.

    ఓరోజు తెలిసిన దూరపు బందువు వాళ్ళింటికి వచ్చాడు.

    "కాఫీ తీసుకురా!" అన్నాడు రామకృష్ణ.

    సీత బూస్ట్ కలుపుకు వస్తూ గుమ్మం తగిలి, కప్పుని జారవిడిచింది. ఆ సమయంలో ఎవరూ లెక్కపెట్టలేదు గాని, కప్పు వేయి ముక్కలయి ఉంటుంది. మ్యాప్ బొమ్మ అత్యంత ఆకర్షణీయంగా నేలమీద గీసినట్లు - నేలపాలయిన బూస్ట్ నేలమీద పరచిన ఇండియా మ్యాప్ లా తయారయింది.

    "అయ్యయ్యో!" అంది సీత.

    "ఎందుకు అయ్యయ్యో! నిమ్మదిగా నడిస్తే ఏంపోయింది? అన్నింటికీ కంగారే! గాజు కప్పేగాక, చిక్కటి కప్పు కాఫీ కూడా నాశనం" అన్నాడు రామకృష్ణ.

    "అది కాఫీ కాదు - బూస్ట్!" నెమ్మదిగా చెప్పింది సీత.

    "నేను కాఫీ తెమ్మంటే నీవు బూస్ట్ ఎందుకు తెచ్చావు?"

    "కాఫీ పొడి లేదు."

    "అయిపోతే చెప్పాలని తెలియదా?"

    "మర్చిపోయాను."

    "మర్చిపోతావు, మర్చిపోతావు! నేనో వెధవని వున్నాగా - నీవేం చెప్పినా తేవటానికి. అసలు మీ ఆడజాతికి భర్త అంటే భయభక్తులు, పిసరంత గౌరవం కూడా లేదు. కాఫీ తెమ్మంటే బూస్ట్ తెస్తారు. బూస్ట్ తెమ్మంటే బోర్నవీటా కలిపి తెస్తారు. అవునంటే కాదనటంలో ఆడజాతిదే  అగ్రతాంబూలం!"

    "అదికాదు...." గాజు పెంకులు ఏరుతూ అంది సీత.

    "అదికాదు, ఇదికాదు- నువ్వు ఏది చెప్పవద్దు. పగలంతా నీవు చేసేపని ఏముంది - మంచమెక్కి దొర్లటం తప్ప! ఇంట్లో ఏం సరుకు నిండుకుందో చూసుకోనక్కరలేదా? అడ్డమయిన వెధవ నవలలన్నీ చదువుతూ, పగటికలలు కంటూ - ఛీ..... ఛీ..... మీలాంటి వాళ్ళని రోజుకోసారి అయినా వీపు సాఫీ చేస్తే గాని మాట వినరు!" కోపంతో ధూం ధాం అంటూ మగాణ్ణి అనే అహం ముఖంనిండా పరుచుకోగా రామకృష్ణ అన్నాడు.

 Previous Page Next Page