Read more!
 Previous Page Next Page 
యమదూత పేజి 2

 

    ఆశ్చర్యంగా ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడతను.
    
                                                                  * * *
    
    ఫోను రింగయింది నిశాంత ఇంట్లో.
    
    హలో! అంది నిశాంత.
    
    నిశా!
    
    దినకర్ గొంతు వినబడుతూనే ఫోను పెట్టేసింది నిశాంత.
    
    మళ్ళీ మోగింది ఫోను.
    
    దినకర్ గొంతు వినీ వినబడగానే ఫోను పెట్టేసింది.
    
    అలా నాలుగుసార్లు జరిగింది.
    
                                                                    * * *
    
    హైదరాబాద్-
    
    పాత నగరంలో
    
    దివాన్ దేవిడీ-
    
    అది ఒకప్పటి నిజాం రాష్ట్ర ప్రధాన మంత్రి సాలార్ జంగ్ భవంతి. అందులోనే చాలాకాలం పాటు సాలార్ జంగ్ మ్యూజియం వుండేది. ఇప్పుడు మ్యూజియం కొత్తగా కట్టిన బిల్డింగులోకి మారిపోయింది.
    
    దివాన్ దేవిడీలో కోర్టుల సముదాయం వుంది.
    
    అందులో-
    
    మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో -
    
    బయట బెంచీమీద కూర్చొని వుంది నిశాంత.
    
    దినకర్ ని చూడగానే ఆమె మొహంలో ఆశ్చర్యం కనబడింది. లేచి వచ్చింది. ఆమె మొహంలో నిన్నటి అలుక లేదు. ఒకపక్కకి నడిచారు ఇద్దరూ.
    
    "దినకర్! ఇక్కడికెందుకొచ్చావ్?"
    
    "నీకు కోపం వచ్చిందేమో, సారీ చెప్పాలని వచ్చాను."
    
    "మంచివాడివే! అదంతా ఉత్తుత్తి కోపం అని నీకు తెలీదా ఏమిటి?"
    
    "ఉత్తుత్తి కోపం అయినా సరే, నా మనసుని పిండేస్తుందని నీకు తెలియదా?"
    
    తదేకంగా అతని కళ్ళలోకి చూసింది నిశాంత. క్రమంగా ఆమె పెదవులు గులాబీ రేకుల్లా విచ్చుకున్నాయి. అరవిరిసిన నంది వర్ధనం లాంటి చిరునవ్వు కనబడింది.
    
    "ఎందుకు తెలియదు? బాగా తెలుసు!"
    
    "థాంక్స్ నిశా! నేను నిన్నింక డిస్టర్బ్ చెయ్యను. వస్తానేం!"
    
    ఆదుర్దాగా చూసింది నిశాంత.
    
    "ఉండు! ఆ కుర్రాడిని విచారించడం కాగానే నేనే సాక్ష్యం చెప్పాలనుకుంటాను. తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం."
    
    విజిటర్స్ గాలరీలో కూర్చుని బోను వైపు చూశాడు దినకర్.
    
    బోన్లో నిలబడి వున్నాడు ఒక చిన్న కుర్రాడు. అతనికి పట్టుమని పదేళ్ళు కూడా ఉండవు. అతన్ని ప్రశ్నిస్తున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    
    "నీ పేరేమిటి బాబూ?"
    
    "విక్కీ"
    
    "పూర్తి పేరు చెప్పు"
    
    "వెంకటకృష్ణ"
    
    నీ కెన్నేళ్ళు?"
    
    "ఎనిమిది"
    
    "ఎన్నో క్లాసు చదువుతున్నావ్?"
    
    "నాలుగు"
    
    "ఏ స్కూలు"
    
    "గ్రామర్ స్కూలు"
    
    "చూసినది చూసినట్లు చెప్పగలవా నువ్వు"
    
    "చెప్పగలను"
    
    "అబద్దాలు చెబితే ఏమవుతుందో తెలుసా!"
    
    "అబద్దాలు చెప్పిన వాళ్ళకి కళ్ళు పోతాయి"
    
    జడ్జివైపు సాభిప్రాయంగా చూశాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    
    "ఫర్వాలేదు. పిల్లాడు తెలివైనవాడే! ఇతని సాక్ష్యం మనం లెక్కలోకి తీసుకోవచ్చు." అని తలాడించాడు జడ్జి.
    
    చిన్న పిల్లలచేత కోర్టులో ప్రమాణం చేయించరు. కానీ వాళ్ళు ఎంతవరకూ విషయాలు సరిగ్గా చెప్పగలరూ అన్నది తేల్చుకోవడానికిగానూ, ముందుగా కొన్ని ప్రశ్నలు వేసి పరీక్ష చేస్తారు.
    
    మళ్ళీ ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు ప్రాసిక్యూటర్.
    
    "విక్కీ! చనిపోయిన వైదేహిగారు నీకేమవుతారు?"
    
    "ఆమె మా అమ్మ" అన్నాడు విక్కీ అతని గొంతులో దుఃఖం ధ్వనించింది.
    
    "మీ అమ్మను చంపిన హంతకుడిని నువ్వు చూశావా?"
    
    "చూశాను."
    
    "మళ్ళీ చూస్తే గుర్తుపడతావా?"
    
    "గుర్తుపడతాను."
    
    "ఎక్కడ చూసినా గుర్తుపడతావా?"
    
    ఉన్నట్లుండి ఏడవడం మొదలెట్టాడు విక్కీ.
    
    "విక్కీ! ఎందుకు ఏడుస్తున్నావ్?" అన్నాడు ప్రాసిక్యూటర్ ఆదుర్దాగా.
    
    సమాధానం చెప్పలేదు విక్కీ మరింత బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. కోర్టులో కలకలం మొదలయింది.
    
    చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ, మళ్ళీ జరిగినదంతా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు పెద్దగా ఏడ్చాడు విక్కీ.
    
    బుజ్జగిస్తున్నట్లు అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    
    "విక్కీ! ఏడవకు చెప్పు! ఏమయింది? ఎందుకు ఏడుస్తున్నావ్? భయపడ్డావా?"
    
    ఎక్కిళ్ళు తగ్గాక తడుముకుంటున్నట్లు అన్నాడు విక్కీ.
    
    "మా అమ్మని చంపిన మనిషి ఇక్కడే వున్నాడు సార్!"    

    కోర్టులో వున్న అందరూ ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకున్న శబ్దం.
    
    విస్తుబోతూ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    
    "మీ అమ్మను చంపిన మనిషి ఇక్కడే ఉన్నాడా? ఎవరతను?"
    
    "అడుగో అతనే అమ్మను చంపేసింది" అని చెయ్యి చూపించాడు విక్కీ, సూటిగా దినకర్ ని చూపిస్తూ.
    
    అందహ్రి తలలూ అప్రయత్నంగానే దినకర్ వైపు తిరిగాయి. అందరి చూపుల్లో ఆరోపణ!
    
    "నేనా! నేను మీ అమ్మను చంపానా?" ఆనందు దినకర్ దిగ్భ్రాంతి చెందుతూ.
    
    సరదాగా సర్కస్ చూస్తున్న ప్రేక్షకుల మధ్యకి హఠాత్తుగా పెద్ద పులి దూకేస్తే ఎంత కల్లోలం చెలరేగుతుందో, అంత కల్లోలం చెలరేగింది కోర్టులోని ప్రేక్షకుల గ్యాలరీలో - హంతకుడు తమ మధ్యలోనే వున్నాడని తెలియగానే!
    
    పొట్టిగా, అర్భకంగా కనబడుతున్న ఒక మనిషి తన గొంతునెవరో నులిమేస్తున్నట్లు గుడ్లు తేలేసి భయంగా దినకర్ వైపు చూశాడు.
    
    పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆశ్చర్యంగా చూశాడు దినకర్ వైపు.
    
    అప్పటిదాకా షాక్ లో వున్న దినకర్, అప్పుడే స్పృహ వచ్చినవాడిలా అన్నాడు. "దిసీజ్ నాన్సెన్స్! నాకీ కుర్రాడెవరో తెలియదు! నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నాడు. నేనెవరినీ చంపలేదు! నన్ను నమ్మండి!"
    
    అతనికి తెలియకుండానే, కేకలు పెడుతున్నంత పెద్దగా వస్తోంది అతని గొంతు.
    
    "ఆర్డర్! ఆర్డర్!" అన్నాడు జడ్జి.
    
    అతి ప్రయత్నంమీద తనని తాను కంట్రోలు చేసుకోగలిగాడు దినకర్. కానీ, ఎవరో ఒక బకెట్ తో నీళ్ళు అతనిమీద గుమ్మరించేసినట్లు ఒకక్సరిగా వళ్ళంతా చెమటలు పట్టేశాయి అతనికి. తల వెంట్రుకల మధ్యనుంచి స్వేదం సన్నటి సెలయేళ్ళలా నుదుటిమీదకు జారింది. క్షణాల్లో షర్టు తడితడిగా అయిపోయి ఒంటి కతుక్కుపోయింది.
    
    బోనులో ఉన్న కుర్రాడు విక్కీవైపు తిరిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
    
    "విక్కీ! ఇతనేనా మీ అమ్మను చంపింది?" అన్నాడు దినకర్ వైపు చూపిస్తూ.
    
    "ఆ ఎర్ర కోటేసుకున్నాయనే మా అమ్మని చంపాడు!" అన్నాడు విక్కీ ధారాపతంగా కారిపోతున్న కన్నీళ్ళని ఎడం చేత్తో తుడుచుకుంటూ. "ముందుగా అమ్మ గొంతు పిసికాడు. అమ్మ తప్పించుకుని పక్కకు దొర్లింది. అయినా వదలకుండా దిండుని అమ్మ మొహంమీద నొక్కి పట్టేసుకున్నాడు. చాలాసేపు గిలగిలా కొట్టుకుంది అమ్మ! తర్వాత చచ్చిపోయింది!" అని మళ్ళీ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలెట్టాడు విక్కీ.
    
    అప్పటిదాకా ఒక పక్కన నిలబడి కేసు ప్రొసీడింగ్స్ ని శ్రద్దగా గమనిస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టరు జలీల్ అలర్టుగా అయిపోయి, దినకర్ వెనకవచ్చి నిలబడ్డాడు. ఆ మర్డర్ కేసు డీల్ చేస్తోంది అతనే.
    
    విక్కీని ఓదార్చడం మొదలెట్టాడు పబ్లిక్ ప్రాసిక్యూటరు. "ఏడవకు విక్కీ! మీ అమ్మని చంపేసిన వాడికి పెద్ద శిక్ష పడేటట్లు చూస్తాం మేము! జైల్లో పెట్టించేస్తాం? నీకేం భయం లేదు! కానీ నువ్వు జరిగింది జరిగినట్లు, చూసింది చూసినట్లు చెప్పాలి! సరేనా? ఇప్పుడు చెప్పు! ఇతనే మీ అమ్మని చంపాడని ఎలా అనుకుంటున్నావు?"
    
    "ఆ ఎర్రకోటు బాగా గుర్తు!" అన్నాడు విక్కీ.
    
    "ఎర్రకోటు వేసుకున్నాడు కాబట్టే ఇతను మీ అమ్మను చంపిన వాడనుకుంటున్నావా?"
    
    "కాదు అంకుల్! నాకు బాగా గుర్తు! ఈయనే ఆ రోజున మా అమ్మని..." ఏడుపు ముంచుకొచ్చేసింది విక్కీకి.
    
    అరుస్తున్నట్లు పెద్దగా అన్నాడు దినకర్. "నేను నిజం చెబుతున్నాను. నన్ను నమ్మండి. ఈ కుర్రాడు నన్ను చూసి ఇంకెవరో అనుకుని పొరబాటుపడుతున్నాడు. ఎవరినీ చంపవలసిన అవసరం నాకు లేదు."
    
    ఇన్ స్పెక్టర్ చెయ్యి గదమాయిస్తున్నట్లు దినకర్ భుజం మీద పడింది. కొద్ది క్షణాల తర్వాత ఆ చెయ్యి కొంచెం కిందకి జారి, దినకర్ మోచేతిపైన గట్టిగా బిగిసింది. తాను అప్పటికే అనధికారికంగా అరెస్టు అయిపోయినట్లు అనిపించింది దినకర్ కి.

 Previous Page Next Page