Read more!
Next Page 
యమదూత పేజి 1

                                 

 

                                         యమదూత
    
                                                                     -----మైనంపాటి భాస్కర్
    
    
                                  

 

    రివ్వుమని దూసుకొస్తోంది ఆ హీరోహోండా మోటార్ బైక్. వెనక కూర్చుని ఉన్న నిశాంత పమిట ఆ వేగానికి తెరచాపలా రెపరెపలాడుతూ వుంటే నేలమీదే దూసుకొస్తున్న పడవలా కనబడుతోంది ఆ మోటారు సైకిలు.
    
    వేగం ఏమాత్రం తగ్గించకుండానే టర్న్ చేసి, 'యంగ్ వన్స్' క్లబ్ గేట్లోకి పోనిచ్చి, సడన్ బ్రేక్ తో ఆపాడు దినకర్. ఆ జర్కుకి అప్రయత్నంగానే అతన్ని హత్తుకు పోయింది నిశాంత.
    
    దిగి "ఏమిటా దూకుడు?" అంది తెచ్చి పెట్టుకున్న కోపంతో.
    
    నవ్వి, మోబైక్ ని లాక్ చేశాడు దినకర్. "కమ్" అని చెప్పి, కీ చైన్ ని విలాసంగా తిప్పుతూ లోపలికి నడిచాడు.
    
    అప్పటికే అక్కడ అరవై డెబ్బయ్ మోటార్ సైకిళ్ళు పార్క్ చేసి ఉన్నాయి. ఇరవై ముఫ్ఫయ్ కార్లు కూడా ఆగి వున్నాయి.
    
    క్లబ్ లో అడుగెట్టబోతూ, అక్కడ వున్న క్లాత్ బేనర్ వైపు చూసింది నిశాంత.
    
    "వెల్ కం టూ ద క్లబ్! గాలా జామ్ సెషన్! సర్ ప్రయిజ్ ప్రోగ్రామ్ టుడే!" అని రాసి వుంది.
    
    సంశయంగా చూస్తూ దినకర్ తోబాటు లోపలికి నడిచింది నిశాంత.
    
    లోపల పెద్ద హాలు వుంది. అందులో పరువం పరవళ్ళు తొక్కుతున్నట్లు ఫాస్ట్ బీట్ మ్యూజిక్ కి అనుగుణంగా ఊగిపోతున్నారు అమ్మాయిలూ, అబ్బాయిలూ.
    
    "డర్టీ డాన్సింగ్ అంటారు దీన్ని కమ్! లెటజ్ జాయిన్" అన్నాడు దినకర్.
    
    "ఇంకా నయం! నాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు."
    
    "ఎలా అలవాటు అవుతాయి? మెడిసన్ చదువుకునే రోజుల్లో రోజుకి పదహారు గంటలు చదువు. చదువు పూర్తయి ప్రాక్టీసు పెట్టాక రోజుకి ఇరవై అయిదుగంటలూ, వారానికి ఎనిమిది రోజులూ ఊపిరి తిరగని ప్రాక్టీసూ, ఇంక తీరికెక్కడుంటుందీ? అవునా? కమాన్! స్పోర్ట్! సరదాలు లేకపోతే జీవితం ఏముంది! లెటజ్ డాన్స్!"
    
    "నాకు డాన్సు రాదు."
    
    "నేను చేయిస్తాను."
    
    నవ్వింది నిశాంత. "అంతటి మొగాడివే!"
    
    "నిశా! నన్ను గట్టిగా కౌగలించుకుని ఊరికే కాళ్ళు కదుపు. అదే డాన్స్."    

 

    ఆమె వదిలించుకోబోతున్నా వినకుండా, ఆమె నడుం చుట్టూ చేయి వేసి డాన్సు ఫ్లోరు మీదకి లాక్కెళ్ళాడు దినకర్.
    
    మొహమాటంగా పాదాలు అటూ ఇటూ నాలుగుసార్లు కదిపింది నిశాంత. హాల్లోని అందరూ తననే చూస్తున్నట్లు భ్రాంతి కలిగిందామెకి. ముఖ్యంగా ఆ మూల కోతుల్లా కూర్చుని చూస్తున్న నలుగురూ...
    
    తనని అంచనా వేస్తున్నట్లు అరంగుళం అరంగుళమూ పట్టిపట్టి చూస్తున్నారు వాళ్ళు.    

 

    ఒక్కసారి చురుగ్గా చూసి, విసురుగా తల తిప్పేసుకుంది నిశాంత. ఫ్లాష్ బల్బులు వెలుగుతున్నాయి. కెమెరాలు క్లిక్ మంటున్నాయి.
    
    ఆ పాట ఆగిపోగానే, అతని పట్టు వదిలించుకుని వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది నిశాంత. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకి.
    
    మళ్ళీ మరోపాట మొదలయింది. అక్కడున్న అందగత్తెలంతా దినకర్ తో కలిసి డాన్సు చేయడానికి ఎగబడిపోతున్నట్లు అనిపించింది నిశాంతకి. అందుకు ఆనందించాలో, అసూయపడాలో అర్ధంకాలేదు.
    
    ఇంకో నాలుగు డాన్సులయ్యాక -
    
    ఆ మూల కూర్చున్న కోతులు నాలుగు లేచాయి. వాళ్ళు చెప్పబోయేది వినమన్నట్లు ఒక్క నోట్ ఇచ్చి ఆగిపోయింది మ్యూజిక్.
    
    వాళ్ళలో పెద్ద బెలూన్ లా వదులుగా వున్న ప్యాంట్ వేసుకున్న ఒకతను అందరినీ ఆకర్షించడానికి చెయ్యి ఎత్తి "నౌ! ద రిజల్ట్ ఆఫ్ టు డేస్ సర్ ప్రయిజ్ ప్రోగ్రాం! దటీజ్, ద సెలెక్షన్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ద ఇయర్!"
    
    "దిస్ ఇయర్స్ బ్యూటీ క్వీన్ ఈజ్..." అని సస్పెన్స్ కోసం అన్నట్లుగా ఆగి "దిస్ ఇయర్స్ బ్యూటీ క్వీన్ ఈజ్.... మిస్ నిశాంత. ద గ్రేట్ బ్యూటీ క్వీన్.... మిస్ నిశాంతా!" అన్నాడు.
    
    ఉత్సాహంగా మ్యూజిక్ అందుకుంది బ్యాండు.
    
    అబ్బాయిలంతా పెద్దగా చప్పట్లు కొడుతుంటే అమ్మాయిలు మాత్రం మెటికలు విరుస్తున్నట్లు వినబడీ వినబడకుండా చప్పట్లు కొట్టారు.
    
    ఒకబ్బాయి వచ్చి, నిశాంత తలమీద పూలతో చేసిన కిరీటం లాంటిది పెట్టబోతుంటే తల పక్కకు తిప్పుకుని చటుక్కున లేచి నిలబడింది నిశాంత. చరచరా బయటికి నడిచింది.
    
    ఆమె వెనకే వచ్చాడు దినకర్.
    
    మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చి కోపంగా నిలబడింది నిశాంత. దీర్ఘ ఉచ్చ్వాస నిశ్వాసాల వల్ల ఆమె ఎత్తయిన గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.
    
    "కోపం వచ్చిందా?" అన్నాడు దినకర్.
    
    "రాదూ మరి? నువ్వు చేసిన ఘనకార్యానికి?"
    
    "టేకిట్ ఈజీ యార్! ఇందులో పుట్టి మునిగిపోయింది ఏముంది?"
    
    "నేను ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్ ని. నాకు ఇలాంటి పిల్ల చేష్టలు, ఇలాంటి డాన్సులూ గీన్సులూ నచ్చవు."
    
    "నువ్వు పెద్ద డాక్టర్ వి కావచ్చు. కానీ చిన్నపిల్లవేగా?"
    
    "నాకు ఇరవైనాలుగేళ్ళు" అని మూతి బిగించింది నిశాంత. ఆమె పెదవులు సరళరేఖలా బిగుసుకున్నాయి. కళ్ళు తీవ్రంగా చూస్తున్నాయి.
    
    ఆమెని తదేకంగా కాసేపు చూసి అన్నాడు దినకర్.
    
    "నిన్ను చూస్తుంటే గాలిబ్ గుర్తుకువస్తున్నాడు."
    
    "ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళు గుర్తుకు రావడమేమిటి?"
    
    "గాలిబ్ అంటే గాలిబ్ కాదు. అతని కవిత్వం గుర్తువస్తోంది. నీలాగ కోపంగా ఉన్న అమ్మాయిని చూసి గాలిబ్ ఏమన్నాడో తెలుసా?"
    
    "కత్తి చేతలేకనే కదనమ్ము జరిపెడి ఇంతికెవ్వడు అసువు లీయకుండు?"
    
    "అర్ధం అవుతోందా? చెప్పనా? కత్తి లేకుండానే కళ్ళతో యుద్ధం చేసే అందాల భామ ముందు ప్రాణాలు వదలని వాడెవడు ఉంటాడు?
    
    పమిట కొంగు నడుం చుట్టూ బిగించి "ఇక చాలు! మోటార్ సైకిల్ స్టార్ట్ చెయ్!" అంది.
    
    "నడుము బిగియించు చుంటివి నన్ను దునుమ,        
    నాకు తెలియునులే నీకెంత నడుముకలదో!
    
    అని కూడా అన్నాడు గాలిబ్" అన్నాడు దినకర్. "అంటే నాతో కయ్యానికి కాలు దువ్వి నడుము బిగిస్తున్నావు కానీ, నీకు అసలు నడుమే లేదుకదా అని అర్ధం! తెలిసిందా!"
    
    "నాన్సెన్స్ నడుమే లేకుండా ఎలా ఉంటుందీ? అది ఫిజియాలజీ ఒప్పుకోదు."
    
    "ఫిజియాలజీకీ పొయిట్రీకీ చాలా దూరంలే గానీ...."
    
    "అర్ధం పర్ధం లేని ఈ పొయిట్రీని పొయ్యిలో పెట్టి, నన్ను ఇంట్లో దించుతావా లేదా? అసలు మేనర్సు లేదు నీకు!"
    
    "ఎంత తీయని పెదిమలే నీవి,
    తిట్టునప్పుడు కూడా తీపి కురియు!"
    
    "నాకు కాళ్ళు నెప్పెడుతున్నాయి బైక్ స్టార్ట్ చెయ్యి ముందు"
    
    "ఏల కాళ్ళు నొచ్చెనో బాలామణికి
    రాత్రి ఎవ్వరి స్వప్న సీమ కేగివచ్చె!"
    
    బుసకొట్టిన తాచులా చటుక్కున తలెత్తి చూసింది నిశాంత.
    
    "నే నెవ్వడి స్వప్న సీమలోకి వెళ్ళలేదు. రాత్రంతా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చెయ్యలేక చచ్చిపోయానుగానీ, మిస్టర్ దినకర్! ఫర్ గాడ్స్ సేక్! ఇంకెప్పుడూ ఇలాంటి ఇబ్బందికరమయిన పరిస్థితి నాకు రానివ్వకు! నెవర్ నెవర్!" అని విసవిస నడిచి, గేటు ముందు ఆగివున్న ఒక ఆటోలో కూర్చుంది.

Next Page