Read more!
 Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 2

 

   సావిత్రికి ముప్పయి రెండేళ్ళు. రామచంద్రంకి ముప్పయి ఎనిమిది. ఈ కాలంలో ఈ యిడు అడమగవాళ్ళకి ఎందరికి పెళ్ళిళ్ళుకాలేదు. అది వేరే విషయం. సావిత్రికి పదహారో ఏటే పెళ్ళయింది. వెంటనే కాపురానికి రావటం, వెంట వెంటనే అయిదుగురు పిల్లలికి తల్లి కావటం జరిగింది. చులింత బాలింతగానే కొంత జీవితం గడిచిపోయింది. సావిత్రిలో అందం తరగలేదు. రామచంద్రంలో వేడి కరగలేదు సమయం చిక్కితే వాళ్ళ అనురాగం ప్రదర్శించుకుంటుంటారు.

 

    రామచంద్రంవి సామాన్య రూపురేఖలు, సీతకి తండ్రి పోలిక వచ్చింది. అయితే రూపురేఖలు సామాన్యంగా వున్నా, శరీర సౌష్టవం చక్కని వంపులతో వుండి సీత చూడటానికి బాగానే ఉంటుందనిపిస్తుంది. తండ్రి పోలిక అదృష్టవంతురాలని సీతని చుసిన అందరూ అంటారు.

 

    సావిత్రి అందం అద్భుతం. సావిత్రి సామాన్య కుటుంబంలో పుట్టబట్టి మధ్య రకం గుమస్తా రామచంద్రం భార్య అయింది.

 

    అయినా తన రూపానికి తగినవాడు తన భర్త కాడని సావిత్రి ఎప్పుడు అనుకోలేదు. "అపురూప లావణ్యవతి నా అర్ధాంగి కావటం నా అదృష్టం" అని ఎప్పుడూ అనుకునేవాడు రామచంద్రం. వాళ్ళ అన్యోన్యం మూడు పువ్వులు ఆరుకాయలు లాంటిది.

 

    "సమయం సందర్భం చూసుకోరు. వంటిల్లయేది, వసారా అయేది ఎక్కడపడితే అక్కడేనా. ఇంక అయన పేచి పెట్టినా సరే ముద్దిచ్చేది లేదు. ఈ విషయంలో గట్టిగా ఆయన్ని శిక్షించాల్సిందే." అనుకుంది సావిత్రి.

 

    అప్పుడే స్నానం చేసోచ్చిన సీత "ఇహపై అమ్మా నాన్నా ఓ చోట వుంటే నే జాగ్రత్తగా వుండాలి" అనుకుంది.

 

    కూతురికి ముఖం చూపించడానికి సిగ్గుపడి వంటింట్లోనే వుండిపోయింది సావిత్రి.

    
                                                                           2

 

    రోజు స్నానం చేసి వస్తూనే ఆకలికి తాళలేక "అన్నం అన్నం" అంటూ కంచం పెట్టుకుంది సీత.

 

    "అదేం తొందరే సరిగ వళ్ళు తుడుచుకుని పూర్తిగా బట్టకట్టుకురా. కాస్త ఆలస్యమయితే ఆకలికి అగలేవు. నలుగురున్న యింట్లో పడి సంసార బాధ్యతలు మోయాలంటే ఏం చేస్తావు? ఎలా వేగుతావు?" అంటూ ప్రతి రోజు సాధిస్తూనే వుంటుంది.

 

    "ఎడం చేత్తో లాగి పారేస్తాను. ఎంత సంసారమైనా సరే. ముందు మాత్రం అన్నం వడ్డించేయ్యి. కడుపు కాలిపోతున్నది . కాళ్ళు పిక్కుపోతున్నాయి" అనటం సీతకు అలవాటు.

 

    ఇవాళ ఎప్పటిలా వంటింట్లోకి వచ్చి కంచం పెట్టుకోలేదు సీత. తల్లి ఎదుటకి రావటానికి సిగ్గు పడింది. "ఆ సమయంలో కావాలని తానోచ్చానని అమ్మ అనుకోడు కదా?" అని ముందు గదిలో కూర్చుని ఊరికే మధన పడుతున్నది.

 

    "సీత వచ్చి కంచం పెట్టుకుంటే సరిపోతుంది." అనుకుంది సావిత్రి.

 

    ఎంతకీ సీత వచ్చే సూచనలు కనపడలేదు.

 

    "అదింకా చిన్నది . సిగ్గుపడి ముఖం చాటేసింది. తను పిలిస్తేగాని ఈ పూటకి భోజనానికి కొచ్చేలా లేదు. తనే పిలిచి మాట్లాడితే సిగ్గు సిగ్గు....ఆయనంటే మగాడు. తన బుద్దేమయింది? వద్దని గట్టిగా చెప్పక్కరలా? పిలవంగానే గువ్వలా వదిగిపోయింది. అయన కౌగిటిలో చీ....చీ...ఇలాంటి పని మరోసారి చూడరాదు. వట్టు పెట్టుకోవాల్సిందే తన చేతులు అయన మెడ చుట్టూ పెన వేసుకుని వున్నాయి. ఆయనేమో ముద్దుపెట్టుకోవడానికి మొహం వంచారు. సరిగ్గా అప్పుడే సీత వచ్చింది? చీ...చీ....సీతేమన్నా పసిదా? వంటింట్లో మమ్మల్ని అలా చూసి ఏమనుకుందో ఏమిటో పాడు "వంటింట్లో సావిత్రి ఆలోచనలు ఇలా సాగుతున్నాయి.

 

    అరగంట గడిచింది.

 

    సీత వంటింటి చాయల కొచ్చే సుచనలేమి కనపడలేదు.

 

    సీతకి ఎంతాకచి అవుతున్నదో ఏమో?" అనుకున్నది సావిత్రి. తల్లి ప్రాణం ఆగలేక, అయినా స్రీ కి పెట్టని ఆభరణం లాంటి సిగ్గుని విడనడలేక చివరికి తెగించి ముందుగది గుమ్మం దగ్గరి కొచ్చింది.

 

    సీత గోళ్ళుకొరుకుతూ కుర్చీలో అటు తిరిగికూచుని వుంది.

 

    "అన్నం పెట్టుకుని తినవే సీతా: నాకు తలనొప్పిగా వుంది." అంటూ పక్క గదిలోకి తప్పుకుంది సావిత్రి. "అమ్మయ్య అనుకుంది పెద్దభారం దిగిన దానిలా సీత.

 

    "నువ్వే పెట్టమ్మా అన్నం." అనిగాని "తలనొప్పి ఎక్కువగా వుందా అమ్మా!" అనిగాని సీత అడగలేదు. తల్లికొచ్చిన తలనొప్పి నిజమైనది కాదని తెలిసి నెమ్మదిగా లేచి వంటిట్లోకి నడిచింది. ఆపూటకి తనే అన్నం వడ్డించుకొని తింది.

 

    సీత భోంచేసి వచ్చిందాకా సావిత్రి గదిలోంచి బైటికి రాలేదు. "దగ్గరుండి వడ్డించినా సరీగా భోంచేయదు. అర్ధాకలితో అన్నం ముందు నుంచి లేచి పోయిందో ఏమిటో" అని సావిత్రి తెగ ఆరాట పడిపోయింది గదిలో వున్నంత సేపూ.  

 Previous Page Next Page