Read more!
 Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 3

 

    సీత భోంచేసి వచ్చాక వంటగదిలోకి వెళ్ళిన సావిత్రి ఆత్రంగా అన్నంకూర గిన్నేలమిద మూతలు తీసి చూసింది. కొద్దిగానే అన్నం తరిగి వుంది.

 

    "ఇది నాలుగు మెతుకులు కెలికిపోయింది. ఇంకా పసిపిల్లకి పెట్టినట్టు దగ్గరుండి తినిపించాలి. ముందు, ముందు ఇలా అయితే ఎట్లా? సీత కిష్టం, మధ్యాహ్నం నాలుగు పకోడిలయినా వేసి పెట్టాలి," అనుకుంది సావిత్రి.

 

    సీత సరీగా భోంచేయనందువల్ల సావిత్రికి అన్నం సహించలేదు. పేరుకి నాలుగు మెతుకులు కెలికి ఏదో తిన్నాననిపించి ఆ పూటకి కంచం ముందు నుంచి లేచింది.

 

    అలవాటు ప్రకారం దగ్గరనుండి కబుర్లు చెపుతూ అన్నం పెట్టకపోవటంతో అర్ధాకలితో కంచం నుంచి లేచింది సీత.... "వంటింట్లో పక్కనే కూచుని తినాలంటే ఏమిటోగా వుంది." అమ్మ పెట్టకపోతేనే తినలేనా? అనుకుంది. ఆ తర్వాత "తినలేను" అని గట్టిగా అనుకుంది.

 

    మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకుంది సావిత్రి.

 

    సీత కాసేపు పుస్తకాలు తిరగేసి తోచక నిద్రపోయింది.

 

    సావిత్రి రెండు కాగానే లేచి పకోడీలు చేసే ప్రయత్నంలో పడింది.

 

    సీత నిద్ర లేచేసరికి కమ్మగా పకోడిలవాసన వచ్చింది. "ఈ వాసన వంటింట్లోంచా? పక్కింట్లో" అని ముక్కు ఎగబిల్చి వంటింట్లోంచే అని నిర్ధారణ చేసుకుని "హోయ్ ....హోయి.....అమ్మ పకోడిలో చేస్తున్నది. "అని సంతోషపడింది." తల్లిని తనే అడిగి పకోడీలు పెట్టించుకోవాలి." అనుకుంది నెమ్మదిగా చాపమించి లేచింది.

 

    వంటింట్లో సావిత్రి ఓ వాయ పకోడీలు తీసింది. మరోవాయ పిండి నూనెలో వేసింది. వాయ వేగేలోగా వంటిల్లు శుభ్రం చేసేందుకు పూనుకుంది. పొయ్యి వేపు వీపు పెట్టి ఉల్లిపాయ పొట్టు ఎత్తుతుంటే జరగాల్సింది జరిగిపోయింది.

 

    అగ్నిదేవుడు సావిత్రి అందానికి వెర్రెత్తిపోయి వెనకా ముందూ ఆలోచించకుండా సావిత్రి చీర కొంగు అంటుకున్నాడు. సావిత్రి అది  గమనించలేదు. ఉల్లిపాయ పోట్టేట్టుతూ రాత్రికి భర్తనేలా మందలించాలో ఆలోచిస్తుంది.

 

    సావిత్రి వీపు తట్టాడు అగ్నిదేవుడు.

 

    వీపు చుర్రుమంది సావిత్రికి.

 

    జరిగింది గ్రహించుకుని పెద్దగా కేక పెట్టిపైకి లేచించి సావిత్రి.

 

    రోజు నేత చీరలు కట్టే సావిత్రి ఆ రోజు పాత నైలాన్ చీర కట్టుకుంది. స్టీలు సామానులవాడి కివ్వడానికి తప్ప మరెందుకు పనికిరానిది. ఆ చీర రంగు డిజైను చాలా యిష్టం. మోజుపడి కొనుక్కుంది. అక్కడికి అయిదేళ్ళువాడింది. ఇంకా దానిపై మోజు తీరక "ఈ ఒక్కసారి కట్టుకుందాం ఇదే ఆఖరు." అనుకుంటూనే చీర కట్టుకుంది, నైలాను చీర గాబట్టే కొంగుతో బాటు చీర అంటుకుంది.

 

    సావిత్రి గావుకేకలేస్తూ నుంచున్న చోటే గిర గిరా తిరగడం మొదలుపెట్టింది. చీర లాగినా రాలేదు. నైలానుకి అతుక్కుపోయే గుణముంది. చీర ఓ పక్క మండుతూ సావిత్రిని అంటిపెట్టుకునే వుంది.

 

    తల్లి కేకలు విని సీత పరిగెత్తుకుంటూ వంటింటి గడప దగ్గిరకొచ్చింది.

 

    నిలువునా మండిపోతున్న సావిత్రి కూతుర్ని చూడనే లేదు.

 

    సీత "అమ్మో...అమ్మో...." అంటూ వీధిలోకి పరుగుతిసింది.

 

    "ఇదే ఆఖరుసారి ఈ చీర కట్టుకోవటం" అనుకున్న సావిత్రి "నేను లేకపోతె అదెలా బతుకుతుందో, కూతుర్ని గురించే అనుకున్న సావిత్రి "మిమ్మల్ని విడిచి పోతాను,' నవ్వుతూ భర్తను బెదిరించిన సావిత్రి ఆ నిమిషాన నిలువెల్లా అగ్ని దేముడు ఆక్రమించగా స్థాణువయింది.

 

    సీత వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చేటప్పటికి నూనెలో వేగిన పకోడీలు బొగ్గుల్లా మారాయి. ఆ పక్కనే కింద పడున్న సావిత్రి పొగచూరు కట్టేలా వుంది.

 

    "అమ్మా!" అంటూ వంట గదేమిటి, పంచభూతాలు వినేంత గట్టిగా కేక వేసి పడిపోయింది సీత.

 

    సావిత్రిని పరీక్షగా చుసిన ఒకావిడ "ఇంకెక్కడ సావిత్రి అందరిని అన్యాయం చేసి తన దోవ తను చూసుకుంది" అంది.

 

    "నైలాను చీరలు కట్టుకుని వంటలు చేయకుడదమ్మా! తెలిసి తెలిసి ఎందుకు కట్టుకుంటారో ఏమో? ఇంకో ఆవిడ వ్యాఖ్యానం చేసింది.

 

    "ముంది ఈ పిల్లని చుడండి" అన్నాడు వచ్చిన వాళ్ళలో ఒకాయన. రామచంద్రం కోసం ఆఫీసుకి కబురంపారు.

 

    తెలివొచ్చిన సీత, ఆఫీసునుంచి వచ్చిన రామచంద్రం, బడినుంచి వచ్చిన పిల్లలు ఫ్రెండింటినుంచి వచ్చిన బాబా, ఒకరినొకరు కౌగలించుకొని పెద్ద పెట్టున రోదిస్తుంటే చూసే వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు.

 

    సావిత్రి వెలిగించిన పొయ్యి ఎప్పుడో ఆరిపోయింది. తిరిగి రాజేస్తే ఆ పొయ్యిలో మంట లేస్తుందేమో గాని, సావిత్రి మాత్రం లేచిరాదు.

 


    ఈ నిజం సావిత్రి శవాన్ని చూడవచ్చిన వాళ్ళకే కాదు, రామచంద్రంకి తెలుసు పిల్లలకి తెలుసు.

 

    అందుకే వాళ్ళందరికీ కళ్ళు వర్షిస్తూనే వున్నాయి.      

 Previous Page Next Page