మంచుపర్వతం
--యండమూరి వీరేంద్రనాథ్
ఉమెన్స్ కాలేజీ ఆవరణలో పొగడచెట్టు క్రింద జరిగింది ఆ నలుగురి సమావేశం.
అ రోజు కాలేజీ అంతా చాలా హడావుడిగా వుంది. పరీక్షలకు చివరి రోజది. అందరూ గుంపులు గుంపులుగా కూర్చొని వెళ్ళాల్సిన సినిమా గురించో, చేసుకోబోయే పార్టీ గురించో మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళు నలుగురూ మాత్రం పొగడచెట్టు క్రింద కూర్చున్నారు ఎప్పటిలాగానే. వాళ్ళ మొహాల్లో ఎక్కడా సంతోషపు ఛాయలు కనిపించడం లేదు.
పరీక్షలు బాగా రాయలేదనే బాధ కాదది. ఫెయిలవుతానన్న భయం ఎవరికీ లేదందులో రెండేళ్ళు ఒక ప్రాణంలా మెలిగిన వాళ్ళలో ఒకరు దూరంగా వెళ్ళి పోతున్నారనే దిగులు అదంతా.
ఆ నలుగురూ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. యవ్వనపు పొంగులు వికసిస్తూన్న వయసు, మానసికంగా ఎదిగీ ఎదగని స్థాయివాళ్ళది. అందుకే ఒకరు దూరమయిపోతున్నారని తెలియగానే ప్రపంచం తల్లక్రిందులైనట్లుగా బాధపడి పోతున్నారు. ఎవరికీ నోట మాట రావడం లేదు- కంట నీరు తప్ప ప్రపంచంలో సెంటిమెంటు తప్ప మరేమీ లేదనుకునేటంత చిన్న వయసు వాళ్ళది.
అందులో...
వైజయంతి క్లాసులో ఫస్టు ఎప్పుడూ, సెకండ్ వచ్చిందంటే నిద్రాహారాలు మాని ఫస్టురాంక్ కోసం ప్రయత్నిస్తుంది. ఆమె తల్లీ, తండ్రీ, యిద్దరూ డాక్టర్లే, ఒక్కతే కూతురు. అయినా గారాబం తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఏ లోటూ లేదు. తమలాగే ఆమె డాక్టరవుతుందన్న వాళ్ళ ఆశ మాత్రం ఫలించలేదు. ఓసారి హాస్పిటల్ లో యాక్సిడెంటుకి గురయిన వ్యక్తిని తండ్రి ట్రీట్ చేయడం చూసింది. అంతే రక్తాన్ని చూస్తే తగని భయం ఆమె కప్పటి నుంచి. స్వతహాగా బిడియస్తురాలు కూడా.
విశాల తల్లిదండ్రుల ఆరుగురి సంతానంలో మొదటిది. మధ్య తరగతి కుటుంబం. 'సాధారణమైన చదువూ, తెలివితేటలు. అయితే వాళ్ళ కుటుంబ సన్నిహితుల్లో ఆ మాత్రం చదువూ, తెలివితేటలు గల అమ్మాయిలు అప్పట్లో లేకపోవటంతో ఆమెను పొగిడేవాళ్ళే ఎక్కువ. అంచేత తను చాలా ఇంటిలిజంట్ అనుకుంటుంది. ఇంటర్ పూర్తవగానే వాళ్ళ బావకిచ్చి పెళ్ళి చేయాలన్నది వాళ్ళ పెద్దల కోరిక. కాని తను డిగ్రీ పూర్తిచేస్తానని అంతవరకు పెళ్ళే చేసుకోననీ అంటుంది. ఇంట్లో పెద్ద పిల్ల కావడంతో తల్లికి చేదోడుగా వుంటూ కాస్త ఛాదస్తాలనీ, ఆచారాలనీ వంటపట్టించుకుంది తనకు తెలియకుండానే. ఆ మాట ఎవరయినా అంటే మాత్రం ఒప్పుకోదు. మాట తొందర మనిషి.
అనురాధ పుస్తకాల పురుగు. అంటే కేవలం క్లాసు పుస్తకాలే కాదు. చేతికందిన ప్రతి పుస్తకాన్నీ, చివరకు చిత్తు కాగితాల్ని కూడా చదవకుండా వదలిపెట్టదు. సంగీతంలో అబిరుచి వుంది. కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. పుస్తకాలు, లేదా టేప్ రికార్డర్ ఆమెకు సదా పక్కనుండే స్నేహితులు. ఒక్కతే సంతానం తల్లిదండ్రులకి. అందుకని బాగా గారాబం. ఈ ముగ్గురు స్నేహితులు తప్ప ఆమెకు వేరే స్నేహితులు ఎవరూ లేరు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.
ఇక మిగిలింది భార్గవి. బాగా చదువుతుంది. లిటరేచర్ అంటే ఇష్టం. తెలుగు లిటరేచరులో పి.హెచ్ డి. చేయాలన్నది ఆమె ఆశయం. అందరికన్నా ధైర్యస్థురాలు. స్నేహపూరితమైన నవ్వు, చక్కటి స్వరం ఆమెకు పెట్టని ఆభరణాలు. ప్రతి విషయాన్ని తరచి తరచి ఆలోచిస్తుంది. విశ్లేషించి వాదిస్తుంటుంది. భావుకత పాళ్ళు ఎక్కువ. 'నువ్వు పుస్తకాలు చదివి పాడయిపోతున్నావే' అంటుంది వాళ్ళమ్మ. ఆమె పుస్తకాలు చదివి పాడయిందో బాగుపడిందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం హాస్టల్లో వుంటోంది...తండ్రికి ట్రాన్స్ ఫరవడంతో.
కాలేజీలో చేరిన మొదటిరోజున అనుకోకుండా నలుగురూ ఆ పొగడచెట్టు క్రిందే కలుసుకున్నారు. నలుగురిదీ ఒకటే గ్రూపనీ, ఒకటే సెక్షననీ తెలిసింది. నలుగురికీ ఒకటే భయం, సీనియర్స్ చేసే రాగింగ్ గురించి.
అనుకుంటుండగానే వచ్చిందో గ్రూపు.
"ఎవరు మీరు? దుష్ట చతుష్టయమా?" అడిగిందో అమ్మాయి.
ఎవరూ నోరు తెరవలేదు.
"మౌనం అర్ధాంగీకారం మీలో దుశ్శాసని ఎవరు? ఇటు రమ్ము" పిలిచిందో గడుగ్గాయి.
అప్పటికీ ఎవరూ కదలలేదు, మాట్లాడలేదు. భయంగా చూస్తూ నిలబడ్డారు.
"ద్రౌపదీ కనిపించటం లేదని కాబోలు రావడం లేదు. ద్రౌపదిని పిలవండి" అన్నారు ఒకరు.
"అదిగో వస్తోంది" లంగా ఓణీ వేసుకుని బెరుగ్గా నడిచి వస్తున్న అమ్మాయిని చూస్తూ అంది.
"ఏయ్ ద్రౌపదీ! యిలారా" పిలిచారు గట్టిగా.
భయం భయంగా వచ్చిందా అమ్మాయి.
"నీ పేరు?"
"మాలిని" అంది మెల్లిగా.
"మాలిని అంటే మాలికి స్త్రీ లింగమూ తోటపని చేస్తావా?"
"లేదండీ" ఆమె కళ్ళలో నీళ్ళు తిరగటం మొదలు పెట్టాయి.
"ఈ కాలేజీలో నీళ్ళు పుష్కలంగా వున్నాయి. కన్నీళ్ళతో చెట్లకు నీళ్ళెట్టక్కర్లేదు".
"మాలిని అంటే మాలి కాదు. ద్రౌపదే. అజ్ఞాతవాసంలో పెట్టుకున్న పేరు" గబుక్కున అందుకుంది విశాల. వారిస్తున్నా భార్గవిని పట్టించుకోలేదామె.
"చూశావా దుశ్శాసనీ వచ్చి వస్త్రాపహరణం కానియ్యి" ఆజ్ఞాపించింది గ్యాంగు లీడరు.
"నా పేరు దుశ్శాసని కాదు, విశాల".
"ఈ రోజుకి నీ పేరు మార్చేశాం, చెప్పిన పని చెయ్యి లేదా నిన్నే ద్రౌపదిని చేయాల్సొస్తుంది" బెదిరించారు.
విశాల లంగా జాకెట్ లో వుందారోజు అవతలమ్మాయి కనీసం ఓణీ అయినా వేసుకుంది.
ఆ అమ్మాయి ఓణీ పట్టుకుని లాగక తప్పలేదు.
అంతటితో వదలి వెళ్ళిపోయారా గుంపు. వాళ్ళ స్నేహం మరింత బలపడింది. ముగ్గురూ ఒకే కాలేజిలో డిగ్రీ చేరాలనుకున్నారు.
కాని అనుకోకుండా వైజయంతి తల్లిదండ్రులకు ట్రాన్స్ ఫర్ కాబోతుందనీ, నాలుగురోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోతారనీ తెలిసింది అంతక్రితం రోజే....
"నాకు చాలా బాధగా వుంది వైజూ! రెండేళ్ళు ఎంత త్వరగా గడిచిపోయాయి. మరో మూడేళ్ళు కలిసి చదువుకుంటాం అనుకుంటే ఇలా అయిపోయింది" అంది రాధ.
"హాస్టల్లో వుండి చదువుకోరాదూ, భార్గవి కూడా వుందిగా అమ్మావాళ్ళు ఒప్పుకోరా" అంది రాధ.
"అమ్మో, అమ్మా వాళ్ళను విడిచి వుండాలంటే నాకు చచ్చే భయం. అసలు అమ్మకూడా ఒప్పుకోదు" అంది వైజయంతి.
ఆమె పిరికితనం తెలిసిన స్నేహితులు ఇక ఆ విషయం మాట్లాడలేదు".
"అక్కడ బి.ఏ. లో చేరతావా?" అడిగింది విశాల.
"ఆ, లేడీ శ్రీరామ్ కాలేజీలో సీటు వస్తుందన్నారు నాన్నగారు".
"చాలా బాగుంటుంది కదూ ఆ కాలేజీ. ఏదో మ్యాగజైనులో చదివా దాని గురించి" అంది అనూరాధ.
"ఆ! అందుకే అక్కడ చదివించాలని నాన్న పట్టుదల కాని నాకే భయం వేస్తోంది. అక్కడ అమ్మాయిలంతా గడుగ్గాయిలట."
"నాలుగు రోజుల్లో అంతా అలవాటయిపోతుంది లెద్దూ ఇక్కడ చేరిన రోజున ఎంత భయపడ్డాం?" భార్గవి గుర్తుచేసింది.
"నిజమేననుకో కాని మిమ్మల్ని మిస్సవుతాను".
"మళ్ళీ ఎప్పుడు కలుస్తామో గదా! అసలు కలుసుకుంటామో లేదో?" భార్గవి స్వరంలో వేదన.
"మీరంతా ప్రోగ్రాం వేసుకుని ఢిల్లీ రాకూడదే?"
"ఈ ఊళ్ళో వున్న స్కూలు ఫ్రెండ్సుని కలవడానికి వెళ్ళనివ్వదు మా అమ్మ ఇక ఢిల్లీ పంపుతుందా?" మూతి సున్నాలా చుట్టింది విశాల.
"నువ్వు ఎప్పుడయినా రావడానికి వీలుంటుందా వైజూ?" అడిగింది రాధ.
"ఏమో! ఇప్పుడు మాకు బంధువులంటూ ఈ ఊళ్ళో ఎవరూ లేరు. వస్తే మాత్రం మిమ్మల్ని కలవకుండా వెళ్ళనులే".
"ఉత్తరాలు రాస్తుండు వైజూ ఆ రకంగానయినా మన స్నేహాన్ని కొనసాగిద్దాం" భార్గవి కోరిక.
"ఉత్తరాలు రాయడమంటే నాకు తగని బద్ధకం అని మీకు తెలుసుగా నువ్వు మాత్రం మర్చిపోకుండా రాస్తూండు భార్గవీ! నేనూ ప్రయత్నిస్తాలే" భార్గవి కలం స్నేహం గురించి వాళ్ళందరికి తెలుసు.