Read more!
Next Page 
అరుణ పేజి 1

                                 

 

                                                 అరుణ
                                                                                  ---డి. కామేశ్వరి
                                

    "కౌసల్యాసుప్రజ రామ పూర్వా సంధ్యాప్రవర్తతే.......
    ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట ........"
    పూజగదిలోంచి రామారావుగారికంఠం గంభీరంగా వినిపిస్తూంది. ఆయన భార్య కమలమ్మగారు పూలసజ్జ నిండా పూలుకోసి తెచ్చి ప్రక్కనపెట్టింది. ఆయననోరు యథాప్రకారం స్తోత్రంచదువుతున్నా ఆయన కళ్ళు ప్రశ్నార్ధకంగా భార్యవంక చూశాయి." అరుణ ఇంకా లేవలేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయి వచ్చింది. అదివచ్చి పడుకునేసరికి ఒంటిగంట దాటింది" అంది ఆమె, ఆయన భావంగ్రహించి రామారావుగారు తల ఊపి యధాప్రకారంశ్రవ్యంగా, గంభీరంగాసుప్రభాతం చదవటంమొదలు పెట్టారు.
    రోజుతెల్లవారి నాలుగుగంటలకే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి జపంపారాయణ పూజతంతులన్నీ ఓ గంట గంటన్నరజరపనిదే ఏ పని చేయరు ఆయన. పూజా పునస్కారములు ఆయన నిత్యకృత్యాలలో ముఖ్య భాగం. ఉదయం ఆయనతోపాటే కూతుర్నిలేపేసేవారు. చిన్నప్పటినుంచి ఆయన స్నానంచేసివచ్చేసరికి కూతురు ఉత్సాహంగా పెరట్లో ఉన్న పూలన్నీ ఒక్కటీమిగలకుండా కోసి తెచ్చిపెట్టేది.
    
    ఇప్పుడు అరుణ పెద్దయ్యాక చిన్నప్పటి అలవాటు ప్రకారం తండ్రి లేవకముందేలేస్తుంది. తండ్రి కంటేముందుగానే స్నానం అదీ చేసి పూజ గదిలో అన్నీ సిద్దం చేస్తుంది. ఈ వేళ ఆ అలవాటుకు భిన్నంగా భార్యపూలు తేవడంకాస్త ఆశ్చర్యం కలిగించింది ఆయనకి. అందుకే భార్య వైపు ప్రశ్నార్ధకంగా చూశారు అరుణకిఒంట్లో బాగులేనప్పుడు, ఇతర కారణాలప్పుడుతప్ప ఇలా జరగదు.
    రాత్రి ఇంటికి ఆలశ్యంగా వచ్చి, తరువాత ఆలోచనలతో చాలా సేపటి వరకూ నిద్రపట్టని అరుణ, తెల్లవారు జామున లేవలేకపోయింది. మామూలుగా, తండ్రి కంఠం విని ఉలిక్కిపడిలేచింది. బారెడు ప్రొద్దెక్కడం చూచిగాభరాగా లేచి ఇవతలకి వచ్చింది. వంటింట్లో కాఫీకలుపుతున్న వదినగారిదగ్గిర కెళ్ళింది. "చాలా ఆలస్యం అయిపోయింది. లేపలేదేం, వదినా? నాన్న పూజకికూర్చున్నారా పూలుకోసి ఇచ్చావా?" ఆతృతగా అడిగింది.    
    "ఆ.మీ అమ్మగారు కోసి ఇచ్చారులే రాత్రి ఆలస్యంగా వచ్చావు, పడుకున్నావని లేపలేదు" అంది సరస్వతి. "అవును ఇంటికి వచ్చేసరికి పన్నెండున్నర అయింది. తరువాత మూడు గంటల వరకు నిద్ర పట్టలేదు" అంటూ, అరుణ బ్రష్ పట్టుకుని పెరట్లోకి నడిచింది. అరుణ ముఖం కడుక్కుని లోపలికి వస్తుంటే పూజగదిలో నుంచి రామారావుగారు బయటికి వచ్చారు. కూతుర్ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వారు. అరుణ ఏదో తప్పు చేసినట్లు మొహం దించుకుంది. "మెలకువ రాలేదునాన్నా!" అంది. "ఫరవాలేదులేమ్మా ఒక పూజకి ఏముంది" అంటూబట్టలు మార్చుకుని గదిలోకి వెళ్ళారు. వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కాఫీ తనకి, ఇంకో గ్లాసు తండ్రికి పట్టుకుని బయటికి వచ్చింది అరుణ. పూజ ముగించి, వీధి వరండాలో పేపరుపట్టుకు కూర్చుంటారురామారావుగారు రోజు. తండ్రికి కాఫీ గ్లాసు అందించి పక్కనున్న కుర్చీలో కూర్చుంది అరుణ. రోజు ఈపాటికి అరుణ చాలాహడావిడిలో ఉంటుంది. స్నానం, ముస్తాబు అన్నీ చేసుకొని కాఫీ ఫలహారాలు తీసుకుని ఆస్పత్రికి వెళ్ళేహడావిడిలో ఉంటుంది. కాని ఈ రోజు డ్యూటీలేదు. అందుచేత సావకాశం కాఫీ తాగుతూ కూర్చుంది.    
    "రాత్రి ఫంక్షన్ బాగా జరిగిందా అమ్మా? ఆ మినిష్టర్ ఎవరోవచ్చారా? రాత్రి చాలాఆలశ్యం అయినట్లుందే!?" రామారావు గారు అడిగారు.    
    "చాలా బాగా జరిగింది నాన్నా! అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం అయినా అంతా సవ్యంగా జరిగింది. మీరు రమ్మంటేవచ్చారు కాదు"    
    మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవం ఆఖరిరోజు ఉత్సవాలకు మంత్రులు మొదలగువారేకాక పెద్ద పెద్ద వారందరూ ఆహ్వానింపబడ్డారు. పెద్ద ఎత్తున ప్రోగ్రాములు ఏర్పాటు చేయబడ్డాయి. నెల రోజులు ముందు నుంచి మెడికల్ కాలేజి విద్యార్ధులకి, స్టాఫ్ కి ప్రోగ్రాములు ఏర్పాటుల్తో ఊపిరి సలపనిపని. అరుణ ఆఖరి రోజుప్రోగ్రాముకన్నా తప్పకరమ్మని తండ్రిని బలవంతపెట్టింది.    
    "నేనెక్కడ అంతసేపు కూర్చోగలనమ్మా! రాత్రి తొమ్మిదిదాటితే నిద్ర కాగలేనుగదా? ఆ ...... అయితే మంత్రులు ఏమంటారు?" నవ్వుతూఅడిగారాయన.  
    అరుణ చిన్నగా నవ్వింది. "ఏమంటారు? ఉపన్యాసాలన్నీ ఒకలాగే ఉంటాయి! చదువుకోవాలి, ప్రయోజకులవ్వాలి, దేశాన్ని ఉద్దరించాలి. అందులో మీరు దేశ సౌభాగ్యానికిమూల విరాట్టులవంటివారు. మానవసేవే మాధవ సేవ అని మీరందరూ స్వప్రయోజనాలుస్వలాభం ఆశించకుండాముందుకు వచ్చియధోచితంగా ప్రజలకిసేవ చెయ్యాలి మన దేశంలో డాక్టర్ల కొరత చాలావుంది. మన దేశంలో చాలినంతమంది డాక్టర్లు లేరు. మీ కాలేజి ఇంకా ఇంకా ఇలాగేప్రతి ఏడు డాక్టర్లనిదేశానికి అందజేయాలనిఆశ!" అరుణ మంత్రిగారిని అనుకరిస్తూ ఉపన్యసిస్తున్నట్లే మాట్లాడింది.    
    రామారావుగారుకూడా నవ్వారు.    
    "కాని, నాన్నా.....అందులో ఒకమాటమాత్రం నాకు చాలానచ్చింది.    
    "ఏమిటది?"   

    అరుణఒక్కక్షణం జవాబీయకుండా ఊరుకుంది. కాఫీత్రాగుతూ.
    "నాన్నగారూ......."    
    "ఏమిటమ్మా!" కూతురు ఏదో చెప్పబోతుందనిఆయన గ్రహించి చెప్పమన్నట్లుచూశారు.        
    "నాన్న! నేను ఏదన్నా పల్లెటూరులో ప్రాక్టీసు పెడితే బాగుండదూ? వీధికి నలుగురు డాక్టర్లుండే ఈ పట్టణాలలోకంటే ఏ పల్లెటూళ్ళోనో ప్రాక్టీసు పెడితే ఎలాగుంటుంది?" అరుణ అంటున్న దేమిటో ఆయనకి అర్ధం కాలేదు. అసలు ఇప్పుడు అరుణ అంటున్నదానికి, ఆ మంత్రిగారు చెప్పిందానికి సంబంధం ఏమిటా అని ఒక్కక్షణం ఆలోచించారాయన. "ఇప్పుడు హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందినీకు? మనం అలాంటిఆలోచనలు ఎప్పుడూ చేయలేదుగా? గవర్నమెంటు ఉద్యోగంచేస్తావనే అనుకున్నాంగా?" సాలోచనగా అన్నారురామారావు గారు." అయినా నీ హౌస్ సర్జన్ ఇంకా నాలుగు నెలలుంది ఇప్పుడెందుకు ఈ ఆలోచన?"    
    "మనపల్లెలలో బొత్తిగా వైద్యసౌకర్యాలు లేవు. ఏ రోగమన్నావస్తే.......తెలిసీతెలియని ఏ నాటు వైద్యమో చేయించుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుని, అప్పుడు ఏ పట్టణమో పరుగెత్తుకువస్తారు చేతులుదాటిపోయాక. ....... నేనుపబ్లిక్ హెల్త్ పోస్టింగ్ చేసినపుడు చూశానుగదా?"    
    "ఇంతకీఏమంటావు నీవు?" కూతురు ఉపోద్ఘాతం దేనికోఅర్ధం అయిందాయనకి.    
    "మపప్రతిభ రాణింపుకురావాలన్నా మనంచదివిన చదువుకి సార్ధకత చేకూరాలన్నా అలాంటిచోట అయితేఎక్కువ అవకాశం ఉంటుందనుకుంటాను."    
    "అయితేఏమిటి? నీవూ ఏదన్నాపల్లెల్లో ప్రాక్టీసు పెడతానంటావా? ఆ మంత్రిగారు చెప్పింది ఈ విషయమేనాఏమిటి?"    
    "ఆయన చెప్పడం కాదు. నిజంఅంతేగా? మన పల్లెటూళ్ళలో డాక్టర్లు ఆస్పత్రులుఎక్కడ? పదేసి గ్రామాలకి ఒక్కటైనా ఆస్పత్రిలేదు. ఒక డాక్టరయినా లేడు? అలాంటి సదుపాయాలుఅన్నీ ప్రభుత్వమే చూడాలంటే ఇంకపల్లె ప్రజలగతేమిటి? ఇంక పల్లెలఅభివృద్ది ఎప్పటికి? ప్రతివాళ్ళూ స్వలాభాలేచూసుకుంటే ఈ దేశం ఎప్పటికీ బాగుపడుతుంది? మాలాంటి యువతరం వారే ఈ విషయాలలో ముందుకిరాకపోతే ఎలా? ఈ విషయం నా కిన్నాళ్ళూ ఎందుకు తట్టలేదా అని ఆలోచిస్తున్నాను. నిన్న ఆ మాట వినేవరకూ నా కర్తవ్యం ఏమిటో కూడా ఆలోచించలేదు." ఉత్తేజితురాలైంది అరుణ.    
    "గరర్నమెంటు ఉద్యోగం చెయ్యడమా, ప్రాక్టీసు పెట్టడమా అన్న నా ఆలోచనలకి ఓ నిర్దిష్టమైన అభిప్రాయం లేదు ఇప్పటివరకు. కాని! ఆలోచిస్తే...... వీధికి నలుగురుడాక్టర్లు ఉండే చోటులోమనమూ వారిలో ఒకరమైపోమూ ఏ ప్రత్యేకతా లేకుండా ముందుఇస్తూ డబ్బులు చేసుకోవడంకంటే మన అవసరంఉన్న చోటికి వెడితేఎంతటి మానసికానందం, తృప్తి లభిస్తాయి. నేనూ నా చేతనయినంతగా ప్రజలకి ఉపయోగపడడంలో ఉన్న తృప్తి ఇక్కడ ఎన్ని వేలు సంపాదిస్తేవస్తుంది?" ఉపన్యసిస్తున్నట్లు ఆవేశంగా మతలాడుతున్నాకూతురి వంక స్థిరంగా చూడసాగాడు రామారావుగారు పేపరు పక్కనపెట్టేసి.    
    తండ్రి చూపులు గుర్తించిన అరుణ తన మాటలు ఆపేసింది. తండ్రి ముఖంలోకి సూటిగా చూసింది.    
    "ఏమంటారునాన్నా?"    
    రామారావుగారు అదోలా నవ్వారు. "అమ్మా అరుణా, వేదిక లెక్కి ఉపన్యాసాలు.  
    ఈయటంచాలా తేలిక, మనమూ చెప్పవచ్చు--మానవసేవే మాధవేసేవ. మీలాంటి వారేముందుకు రావాలి.    
    దేశాన్ని ఉద్దరించాలి--అని. ఈ మాటలన్నీఅనడం ఆచరణలో పెట్టాలంటే ఎదుర్కొనేఇబ్బందులని గూర్చి ఎవరూ చెప్పరు?"   
    "ఇబ్బందులు ఉంటాయనుకోండి. కాని ఒక సత్కార్యం చేస్తున్నామని మనం అనుకుంటే అవి అంతగా బాధించవేమో"

Next Page