మధురమైన ఓటమి
--బలభద్రపాత్రుని రమణి
ధృతి బస్ దిగి వడివడిగా నడవసాగింది.
ఆమె మొహంలో త్వరగావెళ్ళాలన్న ఆతృత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.
రోడ్డు దాటడానికి ముందు ఓక్షణం ఆగి అటూ ఇటూ చూసింది.
ఏవీ దగ్గర్లో లేవని నిర్ధారించుకుని అడుగు వేయబోతుండగా జరిగిపోయిందా సంఘటన!
ఓ పదేళ్ళ కుర్రాడు పేపర్లు పట్టుకుని రోడ్డుకి అడ్డంపడి పరిగెత్తుకొచ్చేస్తూ అటునుంచి స్పీడుగా వస్తున్న కాఉర్ని చూసుకోలేదు. కారు సడెన్ బ్రేక్ తో కీచుగా చప్పుడు చేస్తూ ఆగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయినట్లుగా పిల్లవాడు క్రింద పడిపోయి, లేవలేనట్లు బాధతో ఏడుస్తున్నాడు. కాలు పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు.
ధృతి ఒక్క అంగలో అతని దగ్గరకు చేరుకుంది. పిల్లవాడిని చూడగానే పరిస్థితి అర్ధమయిపోయింది. దెబ్బలు గట్టిగానే తగిలాయి. నుదుటి నుంచి రక్తం కూడా కారుతోంది. అప్పటికే చాలామంది జనం మూగారు. పిల్లవాడ్ని లేవనెత్తుతూ, కారు డ్రైవర్ ని ఉద్దేశించి తిడుతున్నారు.
ధృతి కారు దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగిచూస్తూ అడిగింది - "మీ పొరపాటువల్ల పిల్లవాడికి ఏక్సిడెంట్ జరిగింది. త్వరగా తలుపుతీసి పిల్లవాడిని ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి" అని.
డ్రైవర్ ముందు సీట్లోంచి అద్దందింపుతూ అన్నాడు - "ఈ అబ్బాయి సడెన్ గా వచ్చేశాడమ్మా అప్పటికే బ్రేక్ వెంటనే వేశాను."
"జరిగినదాని గురించి తర్కించడం అనవసరం. త్వరగా జరగవలసింది చూడండి" ధృతి ఆదుర్దాగా అంది.
డ్రైవర్ మళ్ళీ ఏదో చెప్పబోతుండగా, వెనకనుంచి "డ్రైవర్! ఈ వందా తీసుకుని ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పు. త్వరగా కానీ, మనకి ఆలస్యం అవుతోంది" అన్న మగకంఠం వినిపించింది.
ధృతి వెనకాల కిటికీ దగ్గరకు దూకుడుగా వచ్చి "ఈ వందా పుచ్చుకుని, ఆటోకోసం ఎదురుచూసి, అందులో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకువెళ్ళే లోపల ప్రమాదం ముదిరిపోతే అందుకు ఎవరు బాధ్యులు? మీరే ఈ కారులో అతన్ని తీసుకెళ్ళండి" అంది.
ఆయన కంఠం కొంచెం కటువుగా, అసహనంగా వినిపించింది- "నాకు ప్రతి నిమిషం చాలా విలువైనది. పరిస్థితి అంత ప్రమాదకరంగా కూడా అనిపించాలేదు. అందుకని ఆ పని ఏదో మీరే చెయ్యండి. కావాలంటే ఇంకో యాభై తీసుకోండి"
ధృతి ఆవేశంగా "మీరు ఏం పనిమీద వెళుతున్నారో, అందుకు ఆలస్య మయితే ఏం నష్టమో నాకు తెలీదు. కానీ నేను మాత్రం చాలా అనవసరమైన పనిమీద వెళుతున్నాను నాకు ఆలస్యం అయితే నాకూ, నా కుటుంబానికి జీవనాధారమైన ఉద్యోగం నేను పోగొట్టుకోవలసి రావచ్చు. ఇక్కడ అజ్రుగుతున్న యీ వ్యర్ధ ప్రసంగం వలన నేను నష్టపోతున్నదే ఎక్కువ. ఫరవాలేదు. నేనూ, నా కుటుంబంలోనివారూ తిండిలేక మాడినా ఒక ప్రాణం రక్షింపబడితే అంతే చాలు. మీరు ఇంకో రెండు వందలు యిచ్చినా సరే, నేను ఒప్పుకోను మీరే యీ పిల్లవాడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మీ విలువైన సమయం ఒక ప్రాణంకంటే ఎక్కువ కాదు. కేవలం డబ్బు పారేసి అవతలివాళ్ళ నోళ్ళు మూయించాలనే ప్రయత్నం మీలాంటివాళ్ళు మానుకుంటే మంచిది" అంది.
అప్పటికే చాలామంది ఆమె వెనకాల చేరి "అవును! లేకపోతే వూరుకోము. కారు అద్దాలు పగలకొడ్తాము, విరగ్గొడతాము" అంటూ ఇష్టం వచ్చినట్లు అరవసాగారు. వారి కళ్ళల్లో పిల్లవాడిని గురించిన ఆందోళన కన్నా కారు వ్యక్తిని హింసించాలనే తపన ఎక్కువగా వుంది.
ఇంతలో కారు డోర్ తీసుకుని ఆ వ్యక్తి క్రిందికి దిగి, ధృతిని ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు.
ఆమె కూడా ఆయన్ని సూటిగా చూసింది. వయసు యాభై పైనే వుంటుంది. బట్టతలా, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలూ, భారీ విగ్రహం చూడగానే గౌరవం కలిగేటట్లున్నాడు.
"డ్రైవర్! నువ్వా పని చూడు. నేను ఆటోలో వెళ్తాను" అంటూ డ్రైవర్ కి కొంత డబ్బిచ్చి ఆయన ఆటోస్టాండ్ వైపు వేగంగా వెళ్ళిపోయాడు.
ఆయన వెళుతూంటే ఎవరూ నోరెత్తి ఏమీ అనలేకపోయారు. కొంతమంది మొహాల్లో సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమైపోయినందుకు అంతులేని నిరాశ కనిపించింది.
ధృతీ, డ్రైవర్ కలిసి పిల్లవాడిని కార్లో ఎక్కించారు. ఇంతలో ఆ పిల్ల వాడి తల్లి ఏడుస్తూ రావడంతోటి, ధృతి ఆమెని కూడా కార్లోఎక్కించి, డ్రైవర్ కి ఏ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలో వివరంగా చెప్పి తన పనిమీద తను బయలుదేరింది.
ఆమె ముఖంలో యిప్పుడు ఇందాక వున్న తొందరా, ఆతృతాలేదు. వాటి స్థానంలో తృప్తి, ఆత్మవిశ్వాసం చోటుచేసుకున్నాయి. సాధించాలనే తపన వుంటే సాధించలేనిది ఏదీ వుండదు. మనిషి ఒకసారి ధైర్యాన్ని కోల్పోతే, ఇక కోల్పోవడానికి ఏమీ వుండదు. సర్వం కోల్పోయినట్లే!
* * *
ధృతికి పెద్ద కంగారేంలేదు. ఆమెకి ఇంటర్వ్యూలు కొత్త కాదు. చుట్టూ వున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్నీ పరికించి చూసింది అందరిలో ఏదో ఆందోళనా, ఉద్వేగం, అది దాచటానికి ఒకరితో ఒకరు గుసగుసగా ఏదో మాట్లాడుకుంటున్నారు. మొదటిసారి ఇంటర్వ్యూ కొచ్చిన వాళ్ళ మొహాలు మరీ తెలిసిపోతున్నాయి. చేతులు, కాళ్ళూ వణుకుతుంటే బిగించుకుని కూర్చున్నారు. కొంతమంది గొంతుదగ్గర తడుముకుని దండం పెట్టుకుంటున్నారు.
ధృతి పెదవుల మీదకి చిరునవ్వు చేరింది. తనూ అంతే! మొదటిసారి ఎంతో కాన్ఫిడెన్స్ తో, ఎంతోమంది దేవుళ్ళకి మొక్కుకుని ఇంటర్వ్యూకి వచ్చింది. ఇల్లుచేరిన మరుక్షణం నుండీ వాళ్ళుపంపే ఎపాయింట్ మెంట్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తూ గడిపింది. తర్వాత.... తర్వాత అనుభవం మీద తెలిసింది. ఉద్యోగాలు దొరకడం అంత సులభం కాదని.