ప్రియతమా! ఓ ప్రియతమా
బల భద్రపాత్రుని రమణి.
"అమ్మా ..... అమ్మా..... అమ్మా..." ఆ కేకలు హృదయ విదారకంగా ఉన్నాయి. రక్తం గడ్డ కట్టిన ముఖంలో భయ విహ్వలుడై చూస్తున్నాడు అంబరంలోని దినకరుడు.
పీట మీద కూర్చోబెట్టారు పదమూడేళ్ళ అరుంధతిని, నలుగురు ఆమెను అటు, ఇటు కదలకుండా బలంగా అదిమిపెట్టి పట్టుకున్నారు.
నిడుపాటి అరుంధతి కురులు కృష్ణవేణి తరంగాలని తలపిస్తూ , ఆమె తల నుండి పీట క్రింద వరకూ పరచుకున్నాయి.
ఆమె గుండెలు ఎగసిపడుతున్నాయి. ఇంకా ఎదిగి ఎదగని లేలేత గుండెలు ఎగసి ఎగసి పడ్తున్నాయి. కరిగి నీరవుతున్నాయి. కనికరించే దిక్కు కోసం కళ్ళు నలుదిశలా అన్వేషిస్తున్నాయి.
అతను నెమ్మదిగా పెట్టె తెరిచాడు. అతను చేతిలోకి తీసుకున్నా వస్తువుని చూడగానే అప్రయత్నంగా ఆమె నోటి నుండి "కె....వ్వు 'మన్న కేక బయటపడింది.
అది 'తళతళలాడే కట్టి'
అరుంధతి శక్తినంతా కూడగట్టుకుని పట్టుకున్న వాళ్ళని విదిలించుకుని పరుగు తీసింది. నాలుగు అడుగులు వేసేసరికి బోర్లా పడిపోయింది. ఏడు గజాల గోచీ పోసి కట్టిన చీర ఆమె ప్రయత్నాన్ని కొనసాగనివ్వలేదు.
వీళ్ళు, ఆమెను ఒడిసి పట్టారు.
ఆ తరువాత ఏం జరిగిందో అరుంధతికి తెలియలేదు. ఆమెకి స్పృహ తప్పింది.
ఆమె కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి! ఏం మిగిలిందనీ జీవితంలో ! లేచి కూర్చుంటూ పమిట సర్దుకుంది. అనాచ్చాదికంగా ఉన్న గుండెలు తగిలి, ఉలిక్కి పడింది. రవిక లేదు! తెల్లని సైను పంచె తనకు చుట్టబడి, తల చుట్టూ కూడా! హి భగవాన్! ఏమిటిది? తను ఇప్పట్నుంచే ఇలా పక్కింటి బుచ్చమ్మ పిన్నిలా, ఎదురింటి బామ్మగారిలా! తల నిమురుకుంటే నున్నగా తగిలింది. ఏది నా అందమైన నీలవేణి ! చిన్నప్పటి నుండీ నా కలలనీ, వ్యధల్నీ పంచుకున్న నా ఆలోచనలకు దగ్గరకు ఉన్న నా కురులేవి?
నెమ్మదిగా , గూటి దగ్గరికి వచ్చి అడ్డం చేతిలోకి తీసుకుంది. అంతే "కే...వ్వు' మన్న కేక దిగంతాలలో ప్రతిధ్వనించింది. అందమైన అరుంధతి స్థానంలో ఒక వికారమూర్తి!
"అరనయిదోతనము ఏ చోట నుండూ.....
అరుగులలికేవారి అరచేత నుండూ....."
"నేను అరుగులు ఆరో ఏట నుంచే అలికెదాన్నె౧ గోరింటాకు పెట్టుకున్నాకా, తప్పనిసరిగా అరికాల్లో అయిదో తనం కోసం చందమామ పెట్టుకునేదాన్నే! అట్లతద్దె నాడు నా చేతులు చూసి, సింధూరంగా పండాయి , మా అరుంధతి పూర్ణ సౌభాగ్యవతి అనే వారే పెద్దలు! కన్నె నోములు నోచాను, కన్నె గానే బ్రతుకు పండిపోయింది. చిట్టి బొట్టు నోము నొచాను , సౌభాగ్యం పొట్టి దయిపోయింది. ఉదయ కుంకుమ నోము నొచాను , ఉదయాన్నే కుంకుమ తుడిచేసారు. "అరుంధతి పెదవుల మీదకి వైరాగ్యపు నవ్వు అలుముకుంది" చేసుకున్న వారికీ చేసుకున్నంత తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలములు ఇవ్వమంటే ఎలా?"
ఇప్పుడామె అరుంధతి కాదు! అరుంధతమ్మ. ఆమె అందం , అనందం అన్నీ ఆమెని విడిచి ముప్పై ఏళ్ళు గడిచి పోయాయి. అయినా ఆ పీడకల ఆమెని వెంటాడుతూనే ఉంది.
"మామ్మగారూ! మామ్మగారు!" అశ్వర్ధ నారాయణ పిలుస్తున్నాడు.
అతని తల్లి కంటే తను నాలుగేళ్ళు చిన్నది, అయినా మమ్మగారేగా మరి!
నెమ్మదిగా లేచి అవతలికి రాబోయింది.
గుమ్మంలోకి రాబోతున్న ఎదురింటి రామమూర్తి వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు.
ఉస్సురుమని నిట్టూర్చింది అరుంధతి.
"నువ్వే లోపలికి రారా" అని పిల్చింది.
పువ్వులు తెచ్చాడు అశ్వర్ధ.
"మామ్మగారూ ఇవిగో నందివర్ధనాలు" అన్నాడు అశ్వర్ధ.
"అవును బ్రతుకులో ఇవే మిగిలాయి" మనసులో అనుకుంటూ అందుకుంది అరుంధతి.
"మామ్మగారూ అమ్మ పదిగంటలకి పురాణానికి రమ్మంది నే వస్తా" అంటూ తుర్రుమన్నాడు వాడు.
తులశమ్మలో నీళ్ళు పోస్తుంటే , పై నుంచి జుయ్యుమని విమాన శబ్దం! తల పైకెత్తి చూస్తూ అనుకుంది . "నారాయణ మూర్తి ఇందులోనే వస్తాడేమో!"
నారాయణమూర్తి గుర్తుకు రాగానే కళ్ళు చెమర్చాయి. ఎంత ప్రేమగా పెంచింది 'నారిగాడ్ని ! అన్నగారి కొడుకైనా, స్వంత తల్లిలా సాకింది. 'అమ్మా' అని
తప్ప 'అత్తా అని ఏనాడూ పిలిచి ఎరుగడు
తెలివైనవాడు! కష్టపడి చదువుకుని ప్రయోజకుదయ్యాడు. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది. నారాయణ తనకంటే ఐదారెళ్ళే చిన్నవాడు.
పిల్ల నిచ్చిన మావగారు "అమ్మా నారాయణకి మంచి భవిష్యత్తు ఉంది. అతడు చదివిన చదువుకి విదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకని పిల్లల్ని విదేశానికి పంపిద్దాం అనుకుంటున్నాను" అన్నప్పుడు , మిన్ను విరిగి మీద పడినట్లు అయింది.
కష్టపడి ఓ చెట్టు పెంచుకుంటే దాన్ని పడగోడ్తానంటాడు ఏమిటీ పెద్దమనిషి? నారాయణ కేసి చూసింది. అతని కళ్ళల్లో మెరుపు ఆమెని మరి మాట్లాడనివ్వలేదు.
తరువాత రెండేళ్ళకే ఆడపిల్ల పుట్టింది. 'మంజీరా' అని పేరు పెట్టాను అని ఉత్తరం రాశాడు.
ఆ తరువాత ఒకటి రెండుసార్లు ఒక్కడే వచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు తండ్రికి గయాలో పిండాలు వదిలేస్తానన్నాడు.
"ఆ చేత్తోనే నాకు కూడా వదిలేయ్యరా! నువ్వు వచ్చేదాకా నేను ఉండనేమో" అంది.
"నేను త్వరలోనే స్వదేశానికి తిరిగి వచ్చేద్దామనుకుంటున్నాను. అప్పుడు మాత్రం నిన్ను విడిగా ఉండనిచ్చేది లేదు" అన్నాడు.
అప్పట్నించి అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది.
మళ్ళీ ఇన్నేళ్ళకి 'పూర్తిగా వచ్చేస్తున్నాను' అని రాసాడు.