Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 1

                                 

                   
                                         హద్దులున్నాయి జాగ్రత్త
    
                                                                        ----బలభద్రపాత్రుని రమణి
    
    
                                

 

        'నా భర్త పర స్త్రీ వ్యామోహితుడు అవడానికి, అనైతికమైన ప్రవర్తనతో బాధ్యతను విస్మరించి అక్రమ సంబంధాన్ని కలిగి వుండడానికి అతని బాధాకరమైన బాల్యమే కారణం.'
    
    ... ఈ మాటలు అన్నది ఓ సామాన్యమైన గృహిణి కాదు. ఓ విద్యాధికురాలైన వనిత. న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్న స్త్రీ. అమెరికా దేశపు ప్రథమ మహిళ. హిల్లరీ క్లింటన్. పూరి గుడిసెలో వున్నా, వైట్ హౌస్ లో వున్నా ఆడది ఆడదే... అనడానికి ఇంతకన్నా నిదర్శనమేముందీ?
    
    నేను చదువుతున్న టైమ్ మేగజైన్ టేబుల్ మీద పడేసి లేచి బాల్కనీలోకి వచ్చాను. కుండీల్లో పెట్టిన హైబ్రిడ్ రోజెస్ ఆకర్షణీయంగా పూసాయి. సంకరం గావించబడదాంతో ఎంతో ఆకర్షణ! బాస్టర్డ్స్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ లవ్ - ఆస్కార్ వైల్డ్ కొటేషన్ గుర్తొచ్చింది.
    
    ఎదురింటి బాల్కనీలో బెంగాలీ దంపతులు కూర్చుని టీ త్రాగుతున్నారు. వారి ఇంటి ముందు లాన్ లో వారి పిల్లలిద్దరూ బాల్ ఆడ్తున్నారు. ఆ దంపతులు గొప్ప నిశ్చింతగా టీ తాగుతున్నారు. స్లీవ్ లెస్ నైటీలోంచి ఆమె తెల్లని జబ్బలు మెరుస్తున్నాయి. ఆమె మెడ క్రింద పెరిగిన డబల్ చిన్ కానీ, ఎట్టయినా పొత్తికడుపుకానీ అతను ఆమె పట్ల ప్రేమ ప్రదర్శించడానికి అడ్డురావడం లేదు!
    
    అమృత్ సేన్ గుప్తా ఏదో ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అతని భార్య అల్పన కేవలం హౌస్ వైఫ్. వాళ్ళనలా చూసినప్పుడల్లా నేనేం మిస్ అవుతున్నానో అద్దంలో చూసుకున్నట్లుగా వుంటుంది నాకు.
    
    ఫోన్ మ్రోగింది. బెడ్ రూంలోకెళ్ళి కార్డ్ లెస్ తీసుకుని "హలో" అన్నాను.
    
    "సుమతీ...రేపు మొదటి శ్రావణ శుక్రవారం. రెండో వారం మీ ఇంట్లో చేసుకుందువుగాని, రేపు ఇక్కడికి వచ్చెయి. జయంతీ పిల్లలూ కూడా వస్తున్నారు..." అంది మా అత్తగారు.
    
    "ఆ...అలాగే!" అన్నాను.
    
    "సుమతీ...బాబు రాలేదా?"
    
    జవాబిచ్చే ముందు నేను గాఢంగా నిట్టూర్చాను. ఈ టైంలో నీ కొడుకు ఇంట్లో ఎందుకుంటాడు? అనే సంకేతం వుంది అందులో. తర్వాత "లేదత్తయ్యా" నమ్రతగా చెప్పాను.
    
    "సరే...మామయ్య నీకోసం కంచి నుంచి పట్టుచీరలు తెచ్చారు. జయంతి చూపించమన్నా చూపించలేదు. ముందు నా కోడలికి.... ఆ తర్వాతే కూతురికి! అన్నారు. అది అలిగింది తెలుసా?" అత్తయ్య నవ్వింది.
    
    నేనూ నవ్వాను. చాలా సందర్భాల్లో.... చాలా భావాలు వ్యక్తం చెయ్యలేక నవ్వునే ఆశ్రయిస్తూ వుంటాను.
    
    "ప్రొద్దుటే వస్తావు కదూ! కారు పంపిస్తాను" అత్తయ్య ఫోన్ పెట్టేసింది.
    
    మంచం మీద వాలి ఫోన్ ఆఫ్ చేస్తుండగా, టీపాయ్ మీదున్న మాధవి ఉత్తరం కనపడింది. దాన్ని చోదోఅగానే మాధవి జ్ఞాపకం వచ్చింది. కాలేజీలో వున్నప్పుడు, ముంతకింద పప్పు కొనుక్కుతింటూ ఎంతెంత దూరం నడిచేవాళ్ళం? అర్ధం తెలీని భాషైనాసరే మార్నింగ్ షోలకి క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళం! ఓ రోజు అలాగే టికెట్ కొనుక్కుని ఆనంద్ థియేటరల్లో వెళ్ళి కూర్చుంటే బ్రహ్మాండమైన ఎడల్ట్స్ ఓన్లీ సినిమా ప్ర్రారంభమయింది. అప్పుడు గమనించాం మేం ఇద్దరం తప్ప హాల్లో ఆడవాళ్ళే లేరు. ఇంటర్ వెల్ లో మమ్మల్ని చూసి అందరూ అసహ్యంగా కామెంట్ చేస్తూ ఈలలు వేస్తుంటే, ఎవరో తరుముతున్నట్లు పైర్పోయి వచ్చేసాం. మాధవి ఈ విషయం మేనేజర్ కి కంప్లయింట్ చేయబోతే, ఆయన మా వైపు చూసిన చూపు నాకింకా గుర్తే!
    
    ఉత్తరాన్ని చెంపకి ఆనించుకుంటే, మాధవి దగ్గరున్నట్లే అనిపించింది, దాన్ని తెరిచి చదవక్కర్లేదు. అందులో మాధవి ఏం వ్రాసిందో నాకు కంఠతావచ్చు. అన్నిసార్లు చదివాను.
    
    "ఒసే...మూర్ఖ శిఖామణీ! ఎప్పటిలా సాకులు చెప్పక ఈసారైనా నా పుట్టిన రోజుకి తగలడు. రేణుకనీ, మంజులనీ కూడా రమ్మన్నాను. కనీసం ఆ రెండు రోజులైనా మనస్పూర్తిగా బ్రతుకుదువుగాని! నీ పతిదేవుడి ఆరోగ్యం ఎలా వుందీ? అయినా నీ పూజలూ, వ్రతాలూ సక్రమంగా మీ అత్తగారి ఆధ్వర్యంలో జరుగుతున్నంత కాలమూ ఆయనకేం ఢోకావుండదులే! మీ పరమ పూజ్యులైన మావగారు ఈ మధ్య నీకేం కొత్త నగలు చేయించలేదా? నా దృష్టిలో వాడికీ పింప్ కీ తేడా లేదు! నువ్వు తన కొడుకుతో కాపురం చేస్తూ కాలు గడపదాటకుండా, పెదవి తెరిచి పలుకు గొంతుదాటకుండా వుండడానికి వాడలాగే నీకు మూల్యం చెల్లిస్తుంటాడు! ఉంటాను.
    
    ఈసారైనా వస్తావు కదూ.....
    
                                                                                                        నీ
                                                                                                     మాధవి.
    
    దాని మాటలకి నిజానికైతే ఏడవాలి. కానీ నాకెందుకో నవ్వొచ్చింది. మామయ్యని 'పింప్' అంది. నోటికొచ్చినట్లు అనేస్తుంది. ఎవరైందీ చూసుకోదు. ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి డస్ట్ బిన్ లో పారేసాను. ఆనంద్ చూస్తే పెద్ద గొడవౌతుంది.
    
    ఆకాశంలో చీకటి అలుముకుంది. అమావాస్య కాబోలు ఎక్కడా కాంతిరేఖ లేదు. క్షీణించి....క్షీణించి చంద్రుడు పూర్తిగా మాయమయ్యాడు. కృష్ణపక్షంలో 'నా కుషస్సులు లేవు... నా కుగాదులు లేవు' అన్న కృష్ణశాస్త్రిగారు గుర్తువచ్చారు. ఏదైనా ఉషస్సు వుందంటే అది యవ్వనంలోనే! మాధవి స్నేహం, హాస్టల్ జీవితం, విరించి పరిచయం!
    
    విరించి మాధవిని బావ వరసవుతాడు. గడ్డం పెంచి ఏదో భావకవిత్వం వ్రాస్తుండేవాడు.
    
    నా హృదయ కుహరంలో 'ఏ మూలనో దాగిన నీ జ్ఞాపక శిధిలాలను కూకటివేళ్ళతో పెకల్చి వేస్తున్నప్పుడు వినవచ్చిన ఆక్రందనలు క్షితిజరేఖను దాటి అంతరిక్ష ప్రహరీని దూకి అనంతంలోకి ప్రసరించాయి' అని నా పుట్టిన రోజున చదివి వినిపించాడు.
    
    నా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. నా మీదున్న అభిమానాన్ని ఎంత ఘాటుగా వర్ణించాడు! అనిపించింది. ఆ రోజంతా గాల్లోకి తేలిపోయి, మర్నాడు మాధవికి చూపించాను.
    
    అది చదివి 'నిశ్శబ్దాన్ని - మోసే ఈ బరువైన క్షణాల్ని అటు వింధ్య నుండి ఇటు హిమాచలం వరకూ మోయనీ....తూనికరాళ్ళకి లొంగని ఈ భారాన్ని నీ ఎదకంటి చూపులో తూచనీ......నిరర్ధకమైన ఈ వ్యర్ధక్షణాలని ఇక చాలించి, ఇకనైనా క్లాసులకి నడవనీ.... మిగిలిన పాఠాలైనా విననీ! ఈ బేవార్సు కవితలకి ఇక స్వస్తి చెప్పనీ...' అంది.

Next Page