లీడర్
---బలభద్రపాత్రుని రమణీ ప్రభాకర్
1930 వ సంవత్సరంలో వైజాగ్ జైల్లో....
"ఏమిటి నీ మొండితనం? ఏం చూసుకుని ఇంత పొగరు?" కోపంగా అన్నాడు జైలరు.
అతను నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. "మనోబలాన్ని మొండితనమనీ, దేశభక్తిని పొగరనీ అనుకునే నీకు ఏం చెప్పినా అర్ధంకాదు! నా చిన్ని కోరికలు తీర్చకూడదని నీకెందుకింత పట్టుదల?"
"చిన్న కోరికలా? అందరితోబాటూ జైలు బట్టలు కట్టుకోను, ఖద్దరు పంచెలు చింపి నిక్కర్లు కుట్టించమనడం, నీ చిన్ని కోరికా? పెన్నూ, పుస్తకాలూ మొదలగు రాజభోగాలన్నీ నీ వంటి ఖైదీకి అడిగిన వెంటనే అందించాలనుకోవటం కూడా చిన్న కోరికేనా?" హేళనగా అడిగాడు.
"మీ ఇష్టం! మీరొప్పుకోకపోతే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది" అన్నాడు కాసేపయ్యాక నీరసంగా.
"సార్... సార్....! బయట స్టూడెంట్స్ ని కంట్రోల్ చెయ్యడం కష్టంగా వుంది." అన్నాడో కానిస్టేబుల్ కంగారుగా వచ్చి.
జైలరోసారి కోపంగా అతనికేసి చూసి బయటికెళ్ళాడు.
"అరవై ఆరు రోజులయింది అన్నంముట్టి. ఇంకెన్నాళ్ళు బతుకుతాడంటావు?" అడిగాడు పక్కవాన్ని ఇంకో పోలీసు.
"చెప్పలేం! అతను చాలా మొండి మనిషని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుమోసాడు."
"అతని పేరు?"
"సూరంపూడి శ్రీహరిరావు."
"అవును! నేను విన్నాను. ఈయన్ని గురించి ఓసారి ఆయన లెక్చర్ వినడం కూడా జరిగింది. మనిషిని ఆనవాలుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాడనుకో! అరవై ఆరు రోజులు నిరాహారదీక్ష అంటే మాటలా! ఎంత గుండెబలం? ఆత్మ నిగ్రహం?"
"ష్! ఊర్కో జైలరొస్తున్నాడు."
జైలర్ మండిపడుతూ లోపలికొచ్చాడు. బయటినుంచి విద్యార్ధులు నినాదాలు ముమ్మరంగా వినిపిస్తున్నాయి.
"శ్రీహరిరావుగారి కోరికలు న్యాయబద్దమైనవి."
"ఆయన కోరికలు వెంటనే తీర్చాలి."
"ఆయనకేమైనా జరిగితే జైలు బద్దలుకొట్టడం ఖాయం."
ఆ గొడవా, అరుపులూ అంతకంతకు ఎక్కువవసాగాయి.
"ఏమిటి నీ ఉద్దేశం? విద్యార్ధులని ఇంకా రెచ్చగొట్టదలచావా....?" జైలర్ ఆగ్రహంతో ఊగిపోతూ అడిగాడు.
"నేనెవర్నీ రెచ్చగొట్టలేదు. ప్రజాశక్తి చైతన్యమయితే అలాగే వుంటుంది...." నీరసంగా పలికినా పలుకుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.
"నేను వాళ్ళమీద లాఠీఛార్జీ చేయిస్తాను."
"అంతకంటే నువ్వేం చెయ్యగలవు మరి!" అవమానంతో వెనక్కి తిరిగాడు జైలరు.
"వెళ్ళండి! లాఠీఛార్జీ చెయ్యండి" ఆజ్ఞాపించాడు.
పోలీసులు కదలబోతుండగా, "ఆగండి" అని వినిపించింది. ఎదురుగా తెల్లని ఖద్దరు ధోవతీ, కండవాలో సింహంలాంటి మనిషి, ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు. ఆయన వెనుకే బులుసు సాంబమూర్తి గారూ, పట్టాభి సీతారామయ్యగారూ నిలబడి వున్నారు. జైలరు కొద్దిగా జంకాడు.
"శ్రీహరిరావు జైల్లో వుండి కూడా ప్రజల్నీ, విద్యార్ధులనీ రెచ్చగొడ్తున్నాడు. ఈ ఉద్రిక్తతనెలా అణచాలో నాకర్ధం కావడంలేదు."
"అందుకే మేము కలగచేసుకోవాల్సొచ్చింది" ప్రకాశం పంతులు తన సహజ గంభీర స్వరంతో చెప్పారు.
జైలర్ ఏదో అనబోయి నోరు తెరిచాడుగానీ అతని నోరు పెగల లేదు. బయట జైలు తలుపులు తోసుకుంటూ విధ్యార్ధులు లోపలికొచ్చేస్తున్నారు.
"ఈ సమయంలో శ్రీహరిరావు నిరాహారదీక్ష మానడం ఎంతైనా అవసరం" చెప్పారు ప్రకాశంపంతులు మొండిగా తనకేమీ పట్టనట్లు కూర్చున్న మిత్రుడికేసి క్రీగంట చూశారు. అతనూ అప్పుడే తలెత్తి పంతులుగారికేసి చూశాడు. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. మెచ్చుకోలు కురిసే కళ్ళతో ఒక్క సెకనుపాటు చూసి, చటుక్కున తల తిప్పు కున్నారు ప్రకాశం పంతులు.
ఆ రాత్రి చాలాసేపు జైలు నాలుగ్గోడల మధ్యా, ఆ నలుగురికీ వాదోపవాదాలు జరిగాయి. బయట జనం అంతకంతకూ పెరగడం, నినాదాలు ఎక్కువవడం గమనిస్తూనే వున్నారు.
తెల్లవారింది. శ్రీహరిరావుకి ఖద్దరు నిక్కర్లూ, పెన్నూ, పుస్తకాలూ అందచెయ్యబడ్డాయి. తన అరవైయేడు రోజుల నిరాహారదీక్షకి స్వస్తి చెప్పి, పంతులుగారి చేతిమీదుగా బత్తాయిరసం అందుకున్నాడు.
జైలర్ దెబ్బతిన్న పులిలా చూస్తూ నిలబడ్డాడు. అవి అందుకుంటూ అతను చిరునవ్వు నవ్వాడు. అప్పటికతను ఇరవైయేళ్ళ కుర్రవాడు.
* * * *
"ఊరికే అతనికోసం ఏడుస్తూ కూర్చుంటే ఎలా? కాస్త అన్నం తిను" పీతమ్మ తల్లి ప్రాణం కూతుర్ని చూసి కొట్టుకుపోతోంది.
"వాడు ఉన్నవాళ్ళల్లో జమ కాదమ్మా మనకి! చేతులారా చెల్లెలి కొడుకుని తెచ్చి నీ గొంతు కోసాను" రామ్మూర్తి తండ్రి హృదయం బాధతో పలికిన పలుకులివి. రమణ మాట్లాడలేదు. ఏడుపు మానలేదు. ముద్ద ముట్టుకోలేదు!