నిశాగీతం
-వాసిరెడ్డి సీతాదేవి
"మీ అమ్మాయికి జబ్బెమిటమ్మ?" లావుపాటి ఆవిడ అదే బెంచీమీద కూర్చునివున్న స్త్రీని ప్రశ్నించింది.
ఆ స్త్రీ కనుబొమ్మలు చిట్లించి లావుపాటి ఆమెను చూసింది.
"మీ అమ్మాయేనా? ఏమిటి జబ్బు?" మళ్ళీ అడిగింది.
"ఏం జబ్బా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏం జబ్బో అదే! మీ అబ్బాయి జబ్బే, మా అమ్మాయి జబ్బు" చురుగ్గా సమాధానం ఇచ్చింది.
లావుపాటి ఆవిడ పక్కగా కూర్చుని వున్న యువకుడు తల తిప్పి చూశాడు. అదోలా తనలోతానే నవ్వుకున్నాడు లావుపాటి ఆవిడ మరోప్రశ్న వెయ్యలేదు. కాని ముఖం కందగడ్డలా అయింది.
ఉన్నట్టుండి ఎదురు బెంచీమీద ఇద్దరు నడివయస్కుల మధ్య కూర్చునివున్న యువకుడు చివ్వున లేచి నిల్చున్నాడు.
అతడి ఇరుప్రక్కల వున్న పెదమనుషులు లేచి ఆ యువకుడి చెరో రెక్కా పట్టుకున్నారు.
"బాబూ! కూర్చో! డాక్టరుగారు వచ్చేవేళయింది" అన్నాడు ఒకడు. ఇద్దరూ కలిసి ఆ యువకుడ్ని కూర్చోపెట్టడానికి ప్రయత్నించారు. కాని ఆ యువకుడు కాళ్ళను భూమిమీద తాకించి బిర్రబిగిసిపోయి నిల్చున్నాడు. పాతేసిన కట్టుకొయ్యలానిల్చున్నాడు. అతడి ఇరువైపులవున్న పెద్ద మనుషుల ఎంత బ్రతిమాలినా, అతడిలో ఇరువైపులవున్న పెద్ద మనుషుల ఎంత బ్రతిమాలినా, అతడిలో చలనం ఏమాత్రం కన్పించలేదు. అతడి చేతులు వదిలేసి, వాళ్ళిద్దరూ యుద్దంలో ఓడిపోయిన సిపాయిల్లా బెంచీమీద కూలబడ్డారు.
ఎదురు బెంచీమీద కూర్చునివున్న లావుపాటి ఆవిడ ఇదంతా చోద్యంగా చూస్తున్నది. ఆవిడ పేరు మంగతాయారు.
"మీరు ఆ అబ్బాయికి ఏమోతారు?" మంగతాయారు ప్రశ్నించింది.
"నా కొడుకు. ఈయన మా ఇంట్లో అద్దెకు వుంటున్నాడు" ఒక వ్యక్తి సమాధానం ఇచ్చి నిట్టూర్పు విడిచాడు. అతడి పేరు రాఘవరావు.
"మీ అబ్బాయి పేరు?" మంగతాయారు అడిగింది.
"రఘురాం" అని మంగతాయారు పక్కనే కూర్చునివున్న యువకుడి కేసి జాలిగా చూశాడు. "మీ అబ్బాయి కీ జబ్బు ఎంతకాలంనుంచీ?" అడిగాడు మంగతాయారును.
"నా ఖర్మ.....ఇటీవలే వాడ్ని ఈ జబ్బుపట్టుకుంది. వాడు తనకు జబ్బెంలేదని నాకే జబ్బనీ అంటాడు."
"ఈ జబ్బుకున్న లక్షణమె ఇది" అన్నాడు రాఘవరావు.
"అమ్మా! మాట్లాడకుండా కూర్చో!" విసుక్కున్నాడు మంగతాయారు పక్కనే కూర్చునివున్న యువకుడు.
"ఇదండీ వరస" ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అన్నది మంగతాయారు.
"ఏంచేస్తాం తల్లీ! ఏనాడు చేసుకున్న పాపమో ఇది మా వాడూ! ఇదే వరస"
"అట్టా పాతేసినట్టు నిలబడిపోయాడేం?" యువకుడ్ని చూస్తూ అడిగింది మంగతాయారు.
"అంతేనమ్మా నిల్చుంటే అలాగే గంటలకొద్దీ నిల్చుండిపోతాడు. పడుకుంటే రోజులకొద్దీ పడుకుంటాడు. స్నానం చేయించడం, అన్నం తినిపించడం పెద్ద సమస్య అయిపోయింది.
"మా వాడితో అలాంటి బాధేం లేదులెండి. వాడే నాకు అన్నం తినిపిస్తాడు."
మంగతాయారు కొడుకు రాజేంద్ర చివ్వున లేచి నిల్చున్నాడు. చక చక బయటికి వెళ్ళిపోయాడు.
"అయ్యో! మీ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి" గాభరాగా అన్నాడు రాఘవరావు.
"పోనియ్యండి. పీడా విరగడౌతుంది."
"అయ్యో! అదేమిటమ్మా అలా అంటారు?"
"వాడు ఎక్కడికి చావడయ్యా, మళ్ళీ తిరిగొస్తాడు చూస్తుండండి. పోయినోడు పోయినా బాగుణ్ణు."
"అయ్యో! అదేమిటమ్మ అలా అంటారు?"
"అంటానయ్యా అంటాను. నా కొడుకు నా ఇష్టం. మధ్యలో నువ్వెవడివి తల దూర్చడానికి? వచ్చినప్పట్నించీ చూస్తున్నా నీ వాలకం ఒకటే ప్రశ్నలు...."
"అదేమిటమ్మానేనేం ప్రశ్నలు వేశానూ? మీరేగా పలకరించారు? ప్రశ్నలు వేశారు?" రాఘవరావు లబలబ లాడాడు.
మంగతాయారు వినిపించుకోకుండా మాట్లాడుతూనే వుంది.
"ఇంతకూ నువ్వెవ్వరు? అమ్మో-అర్థం అయింది. నిన్ను అది పంపించింది కదూ? ఆ తాయారు దయ్యం నామీద సి.ఐ.డి. పని చెయ్యడానికి నిన్ను పంపించింది కదూ? ఓరి సచ్చినోడా? అందుకా అంది తియ్యగా కూపీలాగుతున్నావు? అసలు నీకూ దానికీ ఏం సంబంధం?
రాఘవరావూ, అతడితో వున్న పెద్దమనిషి బిత్తరపోయి చూస్తున్నారు.
అసలు పిచ్చి ఎవరికి? ఈమెకా? ఈమె కొడుక్కా? బాగానే మాట్లాడిందిగా ఇంతవరకూ? మంగతాయారును చూస్తూ ఆలోచించింది ఆమె పక్కన కూర్చునివున్న స్త్రీ.
చూస్తుండగానే ఆమె ధోరణి మారింది. చూపులు మారాయి. ఉద్రేకంతో ముఖం ఎర్రబడింది.
మంగతాయారు చివ్వునలేచి. ఒక్క ఉదుటున ముందుకు దూకి రాఘవరావు చొక్కా పట్టుకుంది. "చెప్పరా! చెప్పు! నిన్ను అదేగా పంపించింది? నన్ను చంపాలని వచ్చావా?"
రాఘవరావు గాభరాగా షర్టు విడిపించుకొబోయాడు. ఆమె చాలా గట్టిగా పట్టుకుంది. రాఘవరావుతోపాటు రెండో వ్యక్తికూడా ఆమెనుపట్టుసడలించలేకపోయాడు.
ఇంత జరుగుతున్నా రాఘవరావు కొడుకు రఘురాం మాత్రం చలనం లేనట్టుగా నిలబడే వున్నాడు.
"అమ్మా ఏమిటిది? వదులు" అప్పుడే తిరిగొచ్చిన ఆమె కొడుకు ఆమె చేతిమీద గట్టిగా కొట్టి రాఘవరావును ఆమె పట్టునుంచి విడిపించాడు. ఆమెను లాక్కొచ్చి బెంచీమీద కూర్చోబెట్టాడు.
"కాదురా అబ్బాయ్. వాడెవడో తెలుసా? ఆ తాయారు మనిషి. అది వీడ్ని నన్ను చంపమని పంపించింది" చలిజ్వరం వచ్చిన మనిషిలా వోణికిపోసాగింది. ఆమె కళ్ళల్లో భయం చూపులు నిలవడంలేదు.
"కాదమ్మా భయపడకు."
"కాదురా అబ్బాయ్ వీడు వాడే."
"నేనున్నాగా! భయంలేదు" తల్లిని అనునయిస్తూ అన్నాడు.
కొంతసేపటికి ఆమె కొంచెం సర్దుకున్నట్టుగా అయింది.
"క్షమించండి మా అమ్మకు."
"ఫర్వాలేదు బాబూ, ముందు నీకే జబ్బు అనుకున్నాను. ఈ జబ్బు తరహయే అంత ఇక్కడకు వచ్చిన వాళ్ళలో పేషెంటుఎవరో, వాళ్ళతో వచ్చ్సిన వాళ్ళెవరో ఒక పట్టాన తెలిసిచావదు" అన్నాడు రాఘవరావు.
"అవును, అలాగేవుంది. నేను మొదటిసారి ఇక్కడకు వచ్చాను" అన్నాడు రాఘవరావుతో వచ్చిన పెద్దమనిషి.
"బాబూ! కూర్చోరా!" రాఘవరావు కొడుకుని చూస్తూ బాధగా అన్నాడు.
రఘురాం కదలలేదు. మెదలలేదు.
రఘురాం స్కిజోఫ్రేనిక్, స్కిజోఫ్రేనియా అనేక రకాలుగా వుంటుంది. అందులో 'కెటటానిక్' అనేది ఒక రకం. ఈ జబ్బు సామాన్యమైన లక్షణం జడత్వం. ఈ రోగులు భావరాహిత్యమైన ముఖకవళికలు కలిగి వుంటారు. తిండి తినడానికీ, స్నానం చెయ్యడానికీ, బట్టలు మార్చుకోవడానికి మరొకరి సహాయం కావాలి. వారంతట వారు ఈ పనులకు పూనుకోరు. ఈ రోగులు, కూర్చుని, నిల్చుని, పడుకొని, గంటలకొద్దీ జడత్వంలో వుండిపోతారు. నిల్చున్నప్పుడు సైనికుల్లా నిటారుగా నిల్చుంటారు.
రఘురాం నిలువుగా, నిటారుగా సైనికునిలాగా నిల్చున్నాడు.
అది ఉదయం. పదిగంటల పది నిముషాలయింది.
ప్రశాంత నర్సింగ్ హొమ్ విజిటర్స్ రూంలోనూ, ముందు హల్లోను రోగులు, వారిలో వచ్చినవారూ కూర్చుని వున్నారు.
రాఘవరావూ, మంగతాయారూ, మరి కొంతమంది హాల్లోనే కూర్చుని వున్నారు.
రోగులు ఎవరి లోకంలో వారున్నారు.
వారిలో వచ్చినవారు ఆందోళనగా డాక్టరు రాకకోసం ఎదురు చూస్తున్నారు.
అక్కడవున్న రోగులు పదిమందికంటే ఎక్కువలేరు. వారితో వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా వుంది.
నర్సింగ్ హొమ్ గేట్ తెరిచి ఓరగా నిల్చున్నాడు గూర్ఖా.
డాక్టరు ఉదయచంద్ర కారు తాళాల చైను కుడిచేతి చూపుడువేలుతో తిప్పుతూ చకచకా మెట్లెక్కి వస్తున్నాడు. అతడి వెనక మరో యువకుడు కూడా వచ్చాడు.
"డాక్టరుగారొచ్చారు. డాక్టరుగారొచ్చారు" అనేక కంకాలు ఒక్క సారిగా అన్నాయి.
హల్లోనూ, విజిటర్స్ రూంలోనూ కూర్చున్న రోగుల తాలుకువారు దేవుడే దిగి వచ్చినట్టుగా లేచి నిల్చున్నారు.