అందరూ కూడా మనవళ్ళనీ, మనవరాళ్ళనీ గుర్తుకు తెచ్చుకుని, వాడిలో వాళ్ళని చూసుకుంటూ వాడిమీద మమకారం పెంచుకోసాగారు. అది చూసిన నీరజకి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా, హాయిగా వుంది? అనుకుంది. రోజూ ఉదయం, సాయంత్రం అందరూ కలిసి భజనలు చేస్తారు. శారద వీణ వాయిస్తుంటుంది.
ఎంతో శ్రావ్యంగా హాయిగా వుండే ఆమె వీణానాదం కోసం ఎదురుచూడటం నీరజ దినచర్యలో భాగమైంది. తను పడుకున్న మంచం పక్కన కిటికీలోంచి బయట కనిపించే పూలమొక్కలని చూస్తుంటే కంటి కింపుగా, మనసుకి శాంతిగా వుంటోంది.
ఎప్పుడెప్పుడు తను మామూలుగా అందరిలా తిరగ్గలదా అని ఎదురు చూడసాగింది.
శ్యామల తల్లిలాగా చూసుకుంటోంది. బాలింతరాలు ఏం ఆహారం తీసుకోవాలో అన్నీ తయారుచేసింది. ఆయుర్వేదం షాపులోంచి కాయం తెప్పించింది. తెలగపిండి తెప్పించింది.
ఇదంతా చూసిన నీరజ భగవంతుడా! నన్నిక్కడినుంచి ఎప్పటికీ తీసికెళ్ళకు' మనసారా వేడుకుంది.
* * * *
ఆ రోజు అనూష ఇంటికి త్వరగా వచ్చేసింది. ఫ్రెషవ్ అయి, టీ తాగుతూ టీవీ ఆన్ చేసింది.
ఇంతలో మణి ఫోన్ చేసింది.
"అనూ! వాళ్ళొచ్చారు. పెద్ద పెద్ద కేకలు పెట్టారు. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. అక్కడికీ దబాయించాను. మీరు పదేసి రోజులు కనిపించకుండా పొతే పేషంటుని ఏం చేయాలి? మిగతా పేషంట్స్ వస్తే బెడ్స్ ఖాళీలేవు. అందుకే మా ఫ్రెండ్ దగ్గర సేఫ్ గా వుంచాను అని నీ పేరు చెబితే 'ఆమె ఎవరు? ఆమెకేం సంబంధం మా అమ్మాయితో? ఎందుకు పంపించారు! అని గొడవ. నీ ఫోన్ నెంబరు ఇచ్చాను. బహుశా ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేయచ్చు."
"ఇంటి నెంబరు ఇచ్చావా?" నిదానంగా అడిగింది అనూష.
"ఆ ఇంటి నెంబరే, హాస్పిటల్ కు వస్తామన్నారు వద్దన్నాను."
"ఓకే నేను చూసుకుంటాలే నువ్వేం ఖంగారుపడకు."
అనూష ఫోన్ పెట్టేసి టీవీ చూస్తూ కూర్చుంది.
కాస్సేపటికి ఫోన్ మోగింది.
"హలో నేను వామనమూర్తిని మాట్లాడుతుండా. మాపిల్ల. నీరజ మీ దగ్గర ఉందంటగా, మేము వస్తున్నాం. పిల్లను రెడీగా వుంచండి. తీసికెళ్ళిపోతాం" అన్నాడు అవతలి వ్యక్తి.
ఎవరు రిసీవ్ చేసుకున్నారో, మాట్లాడేది ఎవరో, ఏమిటో తెలీకుండా తను చెప్పాల్సింది చెప్పేస్తున్న అతని మాటలకి అడ్డుపడుతూ అడిగింది.
"చెప్పాగా నా పేరు వామనమూర్తి. మీ ఇంటి అడ్రసు చెప్పండి ఎట్టా రావాలి?"
"వామనమూర్తి అంటే నాకెలా తెలుస్తుందండి?"
"ఏంటమ్మా తెలిసేది? మా అమ్మాయి నీరజ నీ దగ్గర వుందటగా, మేము వస్తుండాం. అడ్రసు చెప్పు డాక్టరమ్మా?"
"హమ్మయ్య తను డాక్టరు అనూష అని అర్థమైందన్నమాట" నిట్టూర్చింది అనూష .
"ఇప్పుడు చీకటిపడింది కదండీ....రేపు మార్నింగ్ రండి...." అంది.
"కాదు. ఇప్పుడే వస్తాం. మళ్ళీ మేము మా ఊరికి వెళ్ళిపోవాలి."
"ఓకే. నోట్ చేసుకోండి" వాళ్ళకి అడ్రసు చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళకోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
కొంచెం సేపటికి ఇద్దరు మగవాళ్ళు వచ్చారని వచ్చి చెప్పాడు వాచ్ మేన్.
ఎత్తుగా, లావుగా, తెల్లటి ఖద్దరు బట్టలు, రెండు చేతుల వేళ్ళకీ ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, చూడగానే దర్పంగా, ధనవంతుడిలా, రాజకేయ నాయకుడిలా వున్న ఒక నలభై ఐదు ఏళ్ళ వ్యక్తి, నల్లగా, గడ్డంతో గోధుమరంగు ఖద్దరుచొక్కా, తెల్లప్యాంటు వేసుకున్న ఓ 30 ఏళ్ళ వ్యక్తి లోపలికి వచ్చారు.
"నమస్కారం. నా పేరు వామనమూర్తి" అన్నాడు తెల్లబట్టలు వేసుకున్నాయన.
"నమస్కారం. కూర్చోండి...." చిరునవ్వుతో సోఫా చూపించింది.
వాళ్ళిద్దరూ ఓసారి హాలు పరికించి చూసి సోఫాల్లో కూర్చున్నారు.
"మా అమ్మాయిని మీరెందుకు తీసుకొచ్చారు? మీకేం పరిచయం?" అడిగాడు వామనమూర్తి.
"మీ అమ్మాయితో నాకేం పరిచయం లేదు...."
"మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయించి ఎందుకు తీసుకొచ్చారు?"
అనూష అడ్డంగా తలాడిస్తూ అంది. "నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయించి తీసుకురాలేదు. ఆ అమ్మాయే హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకోబోయింది. నేను కాపాడి మా ఇంటికి తీసుకొచ్చాను."
వామనమూర్తి భృకుటి ముడిపడింది. కొంచెం కళవెళపడ్డాడు. వెంటనే భావాలు కనిపించకుండా "మరిఈ సంగతి ఆ డాక్టరమ్మ చెప్పలేదేంటి? ఆ ఆస్పత్రిలో అంత బాగా చూసుకుంటుండారా పేషంట్లని? ఆ పిల్ల పారొచ్చిందాకా ఏం చేసినారు? అన్నాడు.
"డాక్టర్లు అస్తమానం ఒకే పేషంటు దగ్గర కూర్చుని ఆమెని కాపలా కాస్తుంటారా? రోజుకి ఎన్నో కేసులు వాళ్ళు అటెండ్ అవాల్సివుంటుంది. పేషంటు దగ్గర మీ ఆడవాళ్ళని తప్పనిసరిగా వుంచాలి. మీరెందుకు వుంచలేదు?"
అనూష స్వరంలోని కరుకుదనానికి కొంచెం ఖంగారుపడ్డాడు.వెంటనే సర్దుకుని "ఎవరుండారు దానికి? అమ్మలేదు, అయ్యలేడు. అక్కాలేదు, చెల్లీలేదు. నేనే మేనమామని అయిన పాపానికి దాని పాపం కడిగించేసి ఏ అయ్యనో చూసి గుట్టుచప్పుడు కాకుండా ముడిపెట్టేద్దామనుకుండా. అందుకే ఆస్పత్రిలో చేర్పించి నాకు పనుండాదని బొంబాయి పోయినాను. ఇంతలోకే ఇంత రబసా? అమ్మో" అన్నాడు.
"మీ భార్య లేరా?"
"ఉంది. దాని ఆరోగ్యం బాగాలేదే."
"ఓహో! సరే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసికెళ్ళి ఏం చేస్తారు?"