"చెప్పాగా. పెళ్ళి చేస్తా....ఎవుడో ఒకడు దొరక్కపోడుగా."
"ఏం చదువుకుంది ఆ అమ్మాయి?"
"బి.ఎ. సదువుతా. ఎర్రి,మొర్రి ఏషాలు ఏసి కడుపు తెచ్చుకుంది.
అనూష సన్నగా నిట్టూర్చి అంది- "వామనమూర్తిగారూ! పెళ్ళి సెకెండరీ. జరిగిందేదో జరిగింది. ఆ అమ్మాయికీ చదువు చెప్పించి ఏదన్నా ఉద్యోగం చూపించి తన కాళ్ళమీద తను నిలబడేలా చేయండి. మీరిప్పుడు అబద్దం చెప్పి పెళ్ళిచేస్తే నిజం తెలిశాక ఆ అబ్బాయి వదిలేస్తే మళ్ళీ ఆమె గతి అధోగతేగా ఏమంటారు?"
వామనమూర్తి మొహంలో రంగులు మారాయి. అనూష మాటలకి అయిష్టత అతని మొహంలో లిప్తపాటు కనిపించి మాయం అయింది.
"చూద్దాంలెండి. అమ్మాయిని పిలవండి. మేము వెళ్ళాల" అన్నాడు మాట దాటేసి.
"అమ్మాయి ఇక్కడ లేదండి...నేను హాస్పిటల్ కి వెళ్ళిపోతే ఆమెని, బాబునీ చూడడానికి ఎవరూ లేరని మా ఆశ్రమంలో వుంచాను. అక్కడ చాలామంది వున్నారు. అందరూ ఆడవాళ్ళే వాళ్ళు నీరజని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు."
"ఏంటీ ఆ పిల్లకాయని అనాధాశ్రమంలో ఇచ్చేయమని అండానే! ఎంటేసుకుని తిరుగుతుందా?" కోపంగా అన్నాడు.
"తల్లికదా ఎలా వదిలేస్తుంది? పసిపిల్లలు ఎవరి సంతానమైనా ఎలాంటివారైనా తల్లికి ప్రాణమేకదా!"
వామనమూర్తి కళ్ళల్లో ఎరుపుజీర, మొహంలో మారుతున్న రంగులు స్పష్టంగా గమనిస్తోంది అనూష. మాట్లాడుతూనే అతని స్వభావాన్ని అతనికీ నీరజకీ వున్న సంబంధాన్నీ అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. అతని మాటల్లో నిజాయితీకోసం వెతుకుతోంది. అదే ఆమె స్పెషాలిటీ.
"ఆ ఆశ్రమం యాడుంది? పోదాం పదండి కారుంది" అన్నాడు.
"కారు నాకూ వుంది. కానీ ఇది సమయం కాదు. ఇంత చీకటిలో ఆ అమ్మాయిని మీతో పంపించలేము. రేపు మార్నింగ్ రండి వెడదాం. ఎలాగా రేపు ఆదివారం కూడా" అంది.
"వీల్లేదు.... మీకు రావడానికి కుదరకపోతే అడ్రసు చెప్పండి. మేము వెడతాం" కొంచెం కోపంగా అన్నాడు.
మూర్కుడులా వున్నాడే అనిపించింది అనూషకి. టైము చూసింది. ఎనిమిది అవుతోంది. అరగంట పడుతుంది వెళ్ళడానికి.
"ఓకే వెడదాం పదండి " అనూష లేచి వాచ్ మాన్ ని పిలిచి కారు బయటకి తీయమని చెప్పింది.
"ఒక్క క్షణం"అంటూ లోపలికి వెళ్ళి వీణ సెల్ కి ఫోన్ చేసింది. "వీణా! వాళ్ళొచ్చారు. నువ్వేం చేస్తున్నావు?"
"ఏం లేదు. రెస్టు తీసుకుంటున్నాను. మొన్న ఢిల్లీలో ఒకతను పరిచయం అయ్యాడు. చాలా హ్యండ్ సమ్ ఫెలో. ఇవాళ మా ఇంటికి వస్తున్నాడు. వుయ్ వాంట్ టు ఎంజాయ్."
"నీకసలు బుద్దిలేదు. ఎవడో కొంచెం పరిచయం అవగానే ఈ వేషాలేమిటి?ఆశ్రమానికి రాకూడదూ?"
"ఇప్పుడా దేనికి?"
"దేనికేంటి? నీరజ మేనమామ వచ్చాడు. ఇవాళ ఆమెని తీసుకెళ్ళిపొతాట్ట."
వీణ నవ్వింది. "మతిపోయిందా?ఇంత రాత్రివేళ పంపిస్తావా?"
"వినేట్టులేడు. గట్టిగా మాట్లాడితే మనం ఆ అమ్మాయిని కిడ్ నాప్ చేశామనుకుని కేసు పెట్టేట్టున్నాడు. సేఫ్ గా ఆ అమ్మాయి వుందని చూపిస్తే ఆ తరువాత పంపించే విషయం ఆలోచిద్దాం అనుకుంటున్నాను."
"సరేలే ఆ అమ్మాయి వెళ్ళినప్పటి సంగతికదా! ముందు వాళ్ళు నిజంగా ఆమె బంధువులా కాదా పరీక్షచేయి. ఆమె రానంటే వాళ్ళ రియాక్షన్ చూడు. అవసరం అయితే అక్కడ పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేయి. అక్కడ సర్కిల్ ఇన్స్ పెక్టరు నాకు బాగా తెలుసు. నేను ఫోన్ చేస్తాను అతనికి. ఆ తరువాత మరీ అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలతాను. ఓ.కే."
"ఇప్పుడు అతనికోసం ఎదురుచూడడం అంత అవసరమా?"
"చాలా అవసరం. నన్ను ప్రేమిస్తున్నాట్ట ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో చూడాలని."
"ఛ నీకసలు సిగ్గులేదు. సరేలే నేను వెడుతున్నాను. కానీ సెల్ ఆఫ్ చేయకు."
"చేయనురా."
అనూష ఫోన్ పెట్టేసి తిరిగి హాల్లోకి వచ్చింది.
ఐదు నిమిషాల్లో రెండు కార్లు బయలుదేరాయి.
అరగంట తరువాత ఆశ్రమం గేటులోకి దూసుకొచ్చిన రెండు కార్లని చూసి ఆవరణలో గుండ్రంగా కూర్చుని భజన చేస్తున్న స్త్రీలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు.
కారు దిగిన వామనరావు, అతని అనుచరుడు ఆ స్త్రీలని చూస్తూ ఆశ్రమాన్ని పరికిస్తూ హుందాగా నడుస్తూ వస్తోంటే అనూష చకచకా లోపలికి వెళ్ళి సుశీలని పిలిచి రెండు కుర్చీలు బయట వరండాలో వేయమంది.
సుశీల కుర్చీలు తీసుకెళ్ళి వరండాలో వేసి వస్తూ వామనమూర్తిని అతని అనుచరుణ్ని చూసి కూర్చోమని చెప్పి లోపలికి వచ్చేసింది. క్షణంలో సగంసేపు వాళ్ళ మొహంలోకి చూసిన సుశీలవాళ్ళ చూపుల్లోని వాడికి బెదిరిపోయింది.
"ఎవరు అనూషా వాళ్ళు? ఈ టైమ్ లో వచ్చావేంటి?" శ్యామల అడిగింది.
"నీరజ మేనమావట. నీరజని తీసికెళ్ళడానికి వచ్చారు. ఏంచేస్తోందితను?"
"ఇప్పుడే భోజనం చేసి కాస్సేపు ఇక్కడ కూర్చుని పడుకుంటానని వెళ్ళింది. ఇవాళ పదో రోజుగా స్నానం చేయించాను. అది సరే ఇలారా" శ్యామల అనూషని పక్కకి తీసికెళ్ళి రహస్యంగా చెప్పింది. "నిన్నరాత్రి బాగా అనునయించి అడిగితే చెప్పింది. తనని హాస్పటల్లో చేర్పించినాయన మేనమామ కాదుట, తనది ఈ ఊరు కాదుట. వాళ్ళ వాళ్ళంతా నెల్లూరులో వుంటారుట."
"మేనమామ కాదా మరి?"
అనూష సందేహంగా చూసింది. "ఇంకా ఏం చెప్పింది?"
"ఏం అడిగినా ఏడుస్తోంది. వెక్కిళ్ళు తప్ప మాటరావడంలేదు నోట్లోంచి."