Previous Page Next Page 
మహావృక్షం పేజి 8

అనూష కారు మెడికల్ కాలేజీవైపు బయలుదేరింది.
మరునాడు వీణ వచ్చేసింది. ఢిల్లీనుంచీ వస్తూనే అనూషా వాళ్ళింటి దగ్గర ఆటో దిగింది.
గట్టిగా అనూషని కౌగలించుకుని "నీకో గుడ్ న్యూస్ చెప్పనా డియర్" అంది.
"నువ్వు సుప్రీం కోర్టులో గెలిచావా?" నవ్వింది అనూష.
"మనం గెలిచాం....కానీ కోర్టులో కాదు, పోరాటంలో."
అనూష సందేహంగా చూసింది.
వీణ అనూషని వదిలి, సోఫాలో వాలిపోయి, "సుశీల కొడుక్కి అతని తండ్రి సంపాదనలో, ఆస్తిలో భాగం వస్తుంది" అంది.
"ఈజిట్" అనూష కళ్ళల్లో వెలుగు కనిపించింది.
"అవును.... రామేశ్వరి అనే మహిళ భర్త చనిపోవడంతో తనకి కూడా భర్త మరణాంతరం వచ్చే పెన్షను, గ్రాట్యుటీ డబ్బులో వాటా ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. హిందూ వివాహ చట్టప్రకారం రెండోపెళ్ళి చెల్లదు కాబట్టి ఆమెకి ఆ డబ్బు చెందే ప్రసక్తిలేదని కేసుకొట్టేశారు. అయితే అతని సంతానానికి మాత్రం వాళ్ళకు మైనారిటీ తీరిందాకా ఆ డబ్బులో వాటా ఇవ్వలసిందని తీర్పుచెప్పారు సుప్రీంకోర్టు వేసిన కేసు, గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వుంది. ఆమె పెళ్ళి సంప్రదాయకంగా జరిగినా ఆమెని రెండో భార్యగా పరిగణించి కేసు కొట్టేస్తారుగా మన జడ్జిగారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా సుశీల కొడుకు రాజుకి అతని తండ్రి ఆస్తిలోగానీ, సంపాదనలోగానీ భాగం కోరచ్చు"
"అంటే పిల్లలని లీగల్ గా కన్సిడర్ చేసినట్టేనా?"
"రెండో భార్య పిల్లలకి సామాజిక గౌరవం ఎప్పుడయితే కల్పించిందో అప్పుడే వాళ్ళని లీగల్ చిల్డ్రన్ గా కన్సిడ ర్ చేసిందని అర్థం అవునా! అలాంటప్పుడు మనం ఈ కేసు ఎందుకు వదిలేయాలి?"
"కానీ....అది తండ్రి మరణానంతరం కదా!"
"ఏం? మరణానంతరం అయితే ఒకటి, బతికి వున్నప్పుడయితే ఒకటా? ఇప్పడు రాజు మంచి చదువు ఒక ఉన్నతస్థానం పొందాలంటే డబ్బు కావాలి, తండ్రి వుండగా వాడు దిక్కులేని వాడిలా ఎవరు దానం ఇస్తారా అని ఎదురుచూడాల్సిన అవసరం ఏమిటి చెప్పు? మరణానంతరం వచ్చే పెన్షను, గ్రాట్యుటీ సంగతెలా వున్నా, ఆ జడ్జిమెంట్ ఆధారంగా బతికి వున్నప్పుడే అతని సంపాదనలో భాగం అడగచ్చుకదా. అతను పోయిందాకా ఈ పిల్లాడు చదువు లేకుండా వుండగలడా? అతనెప్పుడు పోతాడా అని ఎదురుచూస్తాడా? నీకెందుకు నేను ఎట్టి పరిస్థితిల్లోనూ వాడికి వాళ్ళ నాన్న సంపాదనలో భాగం ఇప్పించి తీరతాను" స్థిరంగా అంది వీణ.
అనూష ఆమె చేయందుకుని అంది.
"కనీసం మహిళా న్యాయవాదులన్నా అందరూ నీలాగా ఆలోచిస్తే ఈ సమాజంలో దగాపడిన స్త్రీలకు ఎంత న్యాయం జరుగుతుందో కదా! రెండోపెళ్ళి చేసుకున్న మగవాడు ఏ విధంగా నష్టపోడుకానీ, స్త్రీ మాత్రం అన్నివిధాలా నష్టపోతుంది. మగవాళ్ళ గౌరవించని చట్టాన్ని ఆడవాళ్ళు మాత్రం ఎందుకు గౌరవించాలి?"
"అన్నీ అవే బాగుపడతాయి. స్త్రీలకు మంచిరోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది" దృఢంగా అంది వీణ.
"లే...లేచి స్నానం అదీ కానివ్వు....టిఫిను చేద్దాం...." అంది అనూష.
వీణ సోఫాలోంచి లేచి "ఈ విషయం నీకు ఎప్పుడెప్పుడు చెబుదామా అని తహతహలాడుతూ వచ్చాను. అందుకే రాగానే చెప్పాను..." అంది జుట్టు ముడేసుకుంటూ.
"నీకు ఇంకో బాధ్యత తగిలింది."
"ఏంటది?"
"చెబుతాను.... నువ్వు రెడీ అవు. మనం వెళ్ళేటప్పుడు దారితో చెబుతాను. నిన్ను హైకోర్టు దగ్గర డ్రాప్ చేసి వెళతాను."
"ఓ...కే.." వీణ తయారవడానికి వెళ్ళిపోయింది.

                                     *      *      *      *
నలభై నిముషాల తరువాత కారులో వెళుతుండగా అనూష నీరజ సంగతి వివరించింది వీణకి.
"ఇంతకీ వాళ్ళెవరో వచ్చారా?" అంతా విన్నాక అడిగింది వీణ.
"లేదు. ఇంకా రాలేదు ఏ క్షణాన్నైనా రావచ్చు. లేదా రాకపోవచ్చు. ఆ అమ్మాయిని వదిలేసే ఉద్దేశం వుంటే మాత్రం రారనుకుంటున్నాను."
వీణ సాలోచనగా తల పంకించింది. అంతలో హైకోర్టు సమీపించడంతో కారు ఆపింది అనూష.
"ఓకే, వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయి సెల్ కి. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. రేపు వచ్చి బ్యాగు తీసుకుంటాను..." వీణ దిగిపోయింది.
అనూష కారు హాస్పటిల్ వైపు తిప్పింది. ఆ రోజు ఆమె ఒక ఆపరేషన్ చేయాల్సి వుంది.
   
                                           *     *     *      *
నీరజని ఆశ్రమంలో చేర్పించి వరం దాటింది. ఈలోగా అనూష, వీణ రెండుసార్లు వెళ్ళి ఆమె పరిస్థితి చూసి వచ్చారు. నీరజని హాస్పిటల్ కు తీసుకొచ్చిన మేనమామగానీ, మరెవరూగానీ ఇంతవరకూ రాలేదు. పేపరులో వచ్చిన వార్త కూడా జనం మర్చిపోయారు.
రోజూ అలాంటి వార్తలు అనేకం వస్తుంటాయి. చదివి అయ్యో అనుకొని ఎవరి దినచర్యలో వారు పడిపోతారు. పక్క ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోటానకి తీరికలేని జనాలు, ఎక్కడో ఏదో జరిగితే ఎలా గుర్తుంచుకుంటారు?
గుర్తుంచుకుని ఏం చేస్తారు....?ఇవన్నీ మామూలైపోయాయి ఈ రోజుల్లో అనుకుంది అనూష.
ఆశ్రమంలో కూడా నీరజని ఆమె కథేంటి అని ఎవరూ అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. ప్రతిక్షణం ఎక్కడ తనని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారో అని ఆమె గదిలోంచి బైటికి రావడంలేదు. శ్యామల, సుశీల తల్లీ పిల్లాడిని కంటికిరెప్పల్లా చూసుకుంటున్నారు. బాబుకి పాలు ఇవ్వడం తప్పవాడి ఆలనాపాలనా అంతా సుశీలే చూసుకుంటోంది. అక్కడ అందరికీ బాబు కాలక్షేపం అయ్యాడు.

 

 Previous Page Next Page