Previous Page Next Page 
మహావృక్షం పేజి 7

"రాసివ్వడం దేనికి? తీసుకొచ్చాను" అంటూ బ్యాగ్ లోంచి మందుల ప్యాకెట్టుతీసి, సుశీలవైపు తిరిగి "కాచి చల్లార్చిన నీళ్ళతో ఈ తాబ్లెట్టు వేయమ్మా" అంది.
నీరజ చేయి అందుకుని పల్స్ చూస్తూ.
"అసలు ఈ స్థితిలో అలా రోడ్లమీద ఎలా తిరిగావమ్మా! మతిపోయిందా? అవ్వ! బాలింతరాలివి. పదిరోజులన్నా మంచం దిగకూడదే, నీకంత తెగింపు ఎలా వచ్చింది?" ఆశ్చర్యంగా ఒక్కోమాటా మాట్లాడుతూ ఇంజక్షన్ చేసింది.
"ఈ ఇంజక్షన్ రోజూ ఒకటి చేయాలి. బికాంప్లెక్స్ మృదులా! నీకు ఇంజక్షన్ చేయడం వచ్చుగా?" అడిగింది మృదులని. మృదులకి ఇంజక్షన్ చేయడం అనూషే నేర్పింది. చిన్న చిన్న వైద్యాలు కూడా నేర్పింది అవసరానికి ఉపయోగపడచ్చని....
మృదుల "వచ్చు మేడమ్" అంది.
మృదులకీ, సుశీలకీ, నీరజకి ఇవ్వాల్సిన మందులు, ఆహారం, ఇంజక్షన్ లు అన్నీ వివరంగా చెప్పి బయటికి వచ్చారు అనూష, మణి. మిగతా వాళ్ళు వాళ్ళని అనుసరించారు.
అయిలయ్య, రాజు, అనూష దగ్గరికి వచ్చి దణ్ణం పెట్టారు. రాజు తన చేతిలో వున్న రెండు గులాబీలు అనూషకొకటి, మణికొకటి ఇచ్చాడు.
"ఆరోగ్యం బాగుందా అయిలయ్యా? జాగ్రత్తగా మందులు వాడుతున్నావా? ఏరా రాజూ బాగా చదువుతున్నావా?" అప్యాయంగా ఇద్దర్నీ పలకరించింది అనూష.
అంతకన్నా అప్యాయంగా, వినయంగా ఇద్దరూ సమాధానం చెప్పారు.
"శ్యామలా! పరిస్థితి అర్థమైందిగా. నీరజకి డెలివరి అయి కొన్ని గంటలే.... కొంచెం క్రిటికల్ కేసు... వివరాలు ఇంకా తెలీదు. ముందు నీ సంరక్షణలో వదిలేస్తే నా పనులు నేను ప్రశాంతంగా చేసుకోవచ్చని ఇక్కడికి తీసుకొచ్చాను, అమెనేం వివరాలు అడక్కండి. ఈ స్థితిలో ఆమె ఏడవటం మంచిదికాదు. నేను మళ్ళీ రేపో, ఎల్లుండో వస్తాను. అందాకా జాగ్రత్త. మేమిప్పుడు మణివాళ్ళ చీఫ్ ని కలవాలి చాలా అర్జంటు. ఈ అమ్మాయి ఇక్కడికొచ్చినట్లు అప్పుడే బయటవాళ్ళకి తెలియనివ్వకండి.... ఓ.కె."
అనూష మాటలకి చిరునవ్వు నవ్వింది శ్యామల. "నువ్వింతగా చెప్పాలా అనూశా? నీక్కానీ, మేడమ్ గారిక్కానీ ఎలాంటి మాటా రానివ్వను సరేనా?"
"థాంక్యూ! మరి మేము వెళ్ళామా? ఆ అన్నట్టు వీణ ఫోనేమన్నా చేసిందా?"
"ఆ నిన్న చేశారు....మీరు కలవలేదుట ఫోనులో. ఇక్కడకి చేశారు. రేపు బయలుదేరి వచ్చేస్తానని చెప్పమన్నారు."
"హమ్మయ్య" నిశ్చింతగా నిట్టూర్పు విడిచింది అనూష. 'వీణ వస్తే ఈ అమ్మాయి సంగతి తనకి వదిలేసి నిశ్చింతగా వుండచ్చు' అనుకుంది.  
అందరికి చెప్పి అనూష, మణి బయలుదేరారు.
మణి వాళ్ళ చీఫ్ హరిశ్చంద్రప్రసాద్ ని కలిసి, నీరజ ఏ పరిస్థితుల్లో తనకి తారసపడిందో వివరించి "ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే చాలా కష్టంలో వున్నట్టన్పిస్తోంది సార్, అందుకే తిరిగి హాస్పటల్ కి పంపించదల్చుకోలేదు. వాళ్ళవాళ్ళు వస్తే నేను మాట్లాడతాను మీరనుమతిస్తే" అంది అనూష.
"నాక్కూడా వాళ్ళ మాటలు, పద్దతి నచ్చలేదమ్మా. కానీ ఏంచేయను? మా మేనకోడలు అని వాళ్ళు అంటోంటే కాదు అని చెప్పడానికి నా దగ్గర రుజువేం వుంది? ముఖ్యమంత్రి చుట్టాలం అన్నారు. రాజకీయం అంతా మా గుప్పిట్లోనే వుంది అన్నట్లు మాట్లాడారు. అఫ్ కోర్స్ నేను కూడా కొంచెం గట్టిగానే వున్నాననుకో కానీ, గవర్నమెంటు డాక్టర్లం ఏం మాట్లాడినా, ఏం చేసినా తప్పేకదా!వినీవే, ఒక పనిచేద్దాం. నేనెలాగూ ఈరోజు సాయంత్రం మెడ్రాస్ వెళుతున్నాను. వాళ్ళు గనక వస్తే మణిగారిని కలుస్తారు. ఆవిడ నీ అడ్రసు ఇస్తారు. నేను వచ్చేలోగా మాటర్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నాను. యామ్ ఐ ష్యూర్?" అడిగాడాయన.
"యస్ సార్...ష్యూర్" కాన్ఫిడెంట్ గా చెప్పింది అనూష.
"గుడ్. మీమీద నాకు నమ్మకం వుంది. మీరు చేసే సర్వీసు రియల్లీ గ్రేట్" మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడాయన.
"థాంక్యూ సర్" అనూష, మణి ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు.
"అబ్బ భయంకరమైన సమస్యని చిటికెలో సాల్వ్ చేశావు అనూ! ధాంక్స్ ఎలాట్"
మణి మాటలకి నవ్వింది అనూష "సమస్య మనం రిసీవ్ చేసుకోవడంలో భయంకరమైనదా? చిన్నదా? అనీ తెలుస్తుంది. మణీ!మన ఖంగారు, భయం సమస్యలొచ్చినప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే వాటిని సునాయాసంగా దాటిపోగలం."
మణి అబ్బురంగా అనూవైపు చూసింది. "ఇంక చిన్న వయసులో ఇంత మనోనిబ్బరం, ఈ ధైర్యం ఎలా వచ్చాయి ఈమెకి?" అనుకుంది, మణికన్నా అనూష పదేళ్ళు చిన్నది. మణికి పెళ్ళి అయిన కొడుకు సంజయ్ కాక మరో కొడుకు వున్నాడు. కానీ ఆవిడకి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే అనూషంటే ఆమెకి ప్రాణం.
ఎనిమిదేళ్ళక్రితం లయన్స్ క్లబ్ వాళ్ళు గాంధీజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్ లో అనూషతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచీ ఇద్దరూ ఒకరికొకరు ప్రాణస్నేహితులయ్యారు. ఏ సమస్య వచ్చినా అనూషకి చెప్పుకోకపోతే స్వాంతన లభించదు మణికి. ఇద్దరు మగపిల్లల తత్వాలు రెండు రకాలు. భర్త చాలా నెమ్మదస్తుడు. నోట్లోంచి మాటే రాదాయనకి. భిన్న మనస్తత్వాల మధ్య మణికి ఇంట్లోవాళ్ళని, హాస్పిటల్లో ఇలాంటి కేసులని మేనేజ్ చేయడం దినదినగండంగా అనిపిస్తుంటుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను వెళ్ళనా? ఇప్పటికే బాగా ఆలస్యం అయింది" అనూష మాటతో ఆలోచనలనుంచి తేరుకుని "ఓ.కే." అంది.

 

 Previous Page Next Page