Previous Page Next Page 
మహావృక్షం పేజి 6

స్వల్పకాలంలో ఎక్కువ ప్రగతి సాధించిన ఆమెని చూసిన కొన్ని దుష్టగ్రహాలు ప్రభుత్వం విరాళంగా యిచ్చిన లాండ్ తమదని కేసులు పెట్టి గొడవచేశాయి. ఆ గొడవలని  ఎదుర్కోడానికి అనూష లాయర్ వీణని కలుసుకుంది. డైనమిక్, డాషింగ్ లాయర్ వీణ. ఆ సమస్యని దూదిపింజలా తీసేసి, ఆ సంస్థ అభివృద్దికి తనవంతు సాయంగా లీగల్ కేసులన్నీ చూసుకోవడానికి అనూషతో కలిసి తన సేవలు ప్రారంభించింది.
అలా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు ఎందరికో ఆశ్రయం అయింది. అందుకే దాన్ని ఆశ్రమం అనడం ప్రారంభించారు. అక్కడ ఉన్నవాళ్ళ ఆసక్తికి తగినవిధంగా వాళ్ళకి కొన్ని వ్యాపకాలు కల్పించారు వీణ, అనూష ఇద్దరూ కలిసి, కొందరికి కుట్టుమిషన్లు కొనిచ్చి, వారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు.
అందుకే ఈ మధ్య నెలలో ఒకటో రెండుసార్లు వచ్చి అక్కడ జరిగే విషయాలన్నీ పర్యవేక్షించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని కావాల్సిన సాయంచేస్తూ వుంటుంది.ఇప్పుడు నిస్సహాయ స్థితిలో వున్న స్త్రీలు ఎవరు అయినాసరే, వయసుతో నిమిత్తంలేకుండా ఆ ఆశ్రమానికి నేరుగా వచ్చేస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఎంతోకొంత నెలకింత అని చెల్లించేవాళ్ళు కొందరైతే, ఏమీ లేనివాళ్ళకి ఉచితంగానే అక్కడ ప్రవేశం లభిస్తుంది. అక్కడ వాళ్ళందరికీ అనూష దేవత. నిద్రలేచి వాళ్ళు కొలిచేది,పూజించేది ఆమెనే. అక్కడ ఉన్నవాళ్ళందరిలో ఎంతో క్రమశిక్షణ. టైమ్ కి అన్నిపనులూ అందరూ కలిసి చేసుకుంటారు. సుశీల, శ్యామల కలిసివంట చేస్తారు. మిగతావాళ్ళు మిగతా పనులు చేసుకుంటారు.

                                            *      *      *      *
రోజూలాగే ఆరోజు కూడా ఉదయాన్నే లేచి అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైనారు.
సందడిగా, ఆహ్లాదంగా వున్న ఆ ఆశ్రమం గేటులోకి దూసుకుని వచ్చింది డాక్టర్ అనూష కారు.
"మేడమ్ వచ్చారు. మేడమ్ వచ్చారు" ఒక్కసారిగా అనేక కంఠాలు పలికాయి.
కారు దిగి, చేతిలో పసిపిల్లాడితో లోపలికి వస్తోన్న అనూషని అప్యాయంగా కౌగలించుకుని, బాబువైపు ప్రశ్నార్ధకంగా చూసింది శ్యామల.
అటుగా పరిగెత్తుకొచ్చిన మృదులనీ, శారదనీ చూస్తూ "కారులో వున్న అమ్మాయిని జాగ్రత్తగా లోపలికి తీసుకురండి" చెప్పింది అనూష. ఇద్దరూ కారు దగ్గరికి పరిగెత్తారు.
సుశీల చేతిలో కాఫీ కప్పుతోవచ్చి, అనూషకి నమస్కరించింది.
చేతిలో బాబుని శ్యామల అందుకుంది. కాఫీ కప్పు అనూషకిచ్చి, శ్యామల చేతుల్లోంచి బాబుని సుశీల అందుకుంది. శ్యామల, మృదుల ఆసరాతో లోపలికి వస్తోన్న నీరజని చూసిన వాళ్ళకి పరిస్థితి కొంచెం అర్థమైంది. శ్యామల అక్కడేవున్న ఒక స్త్ర్రీతో " ఆ అమ్మాయికి గదిలో మంచం, పక్కా రెడీ చేయమ్మా గౌరమ్మా" అంది.
గౌరమ్మ వడివడిగా లోపలికెళ్ళింది.
పది నిముషాల్లో నీరజని మంచంమీద పడుకోబెట్టి శారదా, మృదులా అనూష దగ్గరికి వచ్చారు నీరజ కథ వినాలన్న కుతూహలంతో.
అప్పటికే ఆశ్రమంవాళ్ళు చాలామంది వచ్చి అనూషని పలకరించి వెళ్ళారు.
"నువ్వు ఇక్కడికొచ్చి నెల దాటుతోంది అనూషా! మళ్ళీ ఈ అమ్మాయి వలన రాగలిగావా?"
"లేదు శ్యామలా! ఈమధ్య రెండుసార్లు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. పైగా హాస్పిటల్ కేసులెక్కువైనాయి. జీవితంలో పెరిగిన వేగానికి, వత్తిళ్ళకేమో వయసుతో సంబంధం లేకుండా ప్రతివాళ్ళకీ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి."
"నిజమే మేడమ్! టెన్షన్ ఎక్కువవుతోంది రోజురోజుకి" శారద అన్నది. "ఇంతకీ ఎవరీ అమ్మాయి?" శ్యామల ప్రశ్నిస్తుండగా మణి కారు వచ్చింది. మణి హడావిడిగా వచ్చి "ఏదీ ఆ అమ్మాయి...?" అంటూ కూర్చుంది ఆయాసంగా.
"నువ్వు ముందు కొంచెం రిలాక్స్ అవు."
"రిలాక్సా పాడా? అబ్బ ఈ టెన్షన్ భరించలేకపోతున్నాననుకో, ఈ ఉద్యోగం చేసేకన్నా  హాయిగా ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తోంది. అన్నీ ఇవే కేసులు...ఈమధ్య పెళ్ళి అయినవాళ్ళు తక్కువైనారు.... డెలివరీ కేసులన్నీ ఈ బాపతే. అమ్మాయ్ సుశీలా! నీ చేత్తో మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా" గబగబా మాట్లాడింది మణి.
"నీకసలే బి.పి.కదా! ఎందుకంత హైరానా పడతావు?" మందలించింది అనూష.
సుశీల క్షణంలో కిచెన్ వైపు వెళ్ళి పెద్ద స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చింది.
"ఆహా! నీ చేతి కాఫీకి మంచి పరిమళం. ఈ పరిమళానికే కాఫీ తాగిన తృప్తి కలుగుతుంది."
మణి మాటలకి అందరూ నవ్వారు.
ఐదు నిముషాల తరువాత మళ్ళీ అందరూ కలిసి, నీరజ పడుకున్న గదిలోకి వెళ్ళారు.
ఆ సందడికి కళ్ళు తెరిచింది నీరజ. మణిని చూస్తూనే ఆమె కళ్ళల్లో భయం నిండిపోయింది.... చూస్తుండగానే కళ్ళలో నీళ్ళు తిరిగి, ఏడుపు ప్రారంభించింది.
"ఎందు కేడుస్తావు? చేసిన వెధవపని చాలక.... ఏమ్మా నా ఉద్యోగం ఊడగొట్టాలనా? ఎందుకు పారిపోయావు? ఏం ఉద్దరించాఫు?" కోపంగా అంటున్న మణిని వారించి, " ముందు ఆ అమ్మాయికి మందులేం వాడాలోరాసివ్వు" అంది అనూష.

 

 Previous Page Next Page