"పోనీ మావాడు చూడాలనుకుంటున్నాడు. తలెత్తుతావా?"
బాగా విన్నదే ఆ కంఠం. "ఎవరబ్బా!" అనుకుంటూ ఆ వైపు చూసింది. "రమేష్" ఇదేమిటిలా తన కథ అంతా తెలిసి కూడా పెళ్ళిసంబంధం తెచ్చాడు అనుకుంటూ విసురుగా తలపక్కకి తిప్పింది.
అంతే!
షాక్ కొట్టినట్లు ఆగిపోయింది.
చిరునవ్వు నవ్వుతూ కాలిమీద కాలేసుకుని శేఖర్!
ఇది కలా నిజమా! అనుకుంటుంటే కళ్ళు మసకలయ్యాయి. శేఖర్ రూపు అలుక్కుపోయినట్లు కనిపించసాగింది. నెమ్మదిగా కావేరి భుజంమీద వాలిపోయింది.
"యమునా! ఏమైంది" అంటూ కంగారుపడసాగింది కావేరి.
"ఏమీ కాలేదు. కాస్త షాకు తిందంతే" అన్నాడు రమేష్ గ్లాసులోంచి నీళ్ళు తీసి యమున ముఖంపై జల్లుతూ.
"ఏమిటిదంతా, అయోమయంగా ఉంది" అంటూ గాభరాపడ్డారు రామారావుగారూ, కావేరి.
"కృష్ణపరమాత్ములు... మా బావగారాడించిన నాటకం" అన్నాడు రమేష్ నవ్వుతూ.
యమున తెప్పరిల్లి లేచి కూర్చుంది.
"పడుకో అమ్మా! లేవకు. మా శేఖర్ అంతా చెప్పాడు. నా మనసులో వేరే అమ్మాయి ఉంది అని మొదటే చెప్తే ఇంత గొడవ ఉండకపోనమ్మా. నిన్న రమేషూ మీ బావగారు వచ్చి చెప్తే అంతా తెలిసింది" అంటూ యమున పక్కనొచ్చి కూర్చుంది శకుంతలమ్మ.
రమేష్ యమునా, శేఖర్ ల ప్రణయం గురించి, మధ్యలో వచ్చిన గొడవల గురించీ కావేరి వాళ్ళకర్థమయ్యేటట్లు చెప్పుకొచ్చాడు. "ఈయనకంతా తెలుసా! నాకు కూడా చెప్పకుండా దాచారు అంతా కలసి. అయినా ఫరవాలేదులెండి. మా చెల్లెలదృష్టవంతురాలు, అర్థం చేసుకునే అత్తవారు దొరికారు" అని యమున తల నిమిరింది కావేరి తృప్తిగా.
"బావగారిని మొన్నే ఆఫీసులో కలసి అంతా వివరించాను. నాకు తెలిస్తే ఇంతదాకా రానిచ్చేవాడ్నా అంటూ సాయంత్రం నాతో కలసి శేఖర్ వాళ్ళింటికొచ్చి మాట్లాడారు. వాళ్ళు ఒప్పుకోవడంతో ఆ పెళ్ళిచూపులు రద్దుచేసి ఈ పెళ్ళిచూపులేర్పాటు చేశారు. యమునని బాగా ఏడిపిస్తానన్నారు కానీ..." అని రమేషంటుండగా "మా అమ్మాయి హడావుడి చేసింది ప్రొద్దుటే. దాంతో అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు. ఎలా వుందో ఏమో" అంది వర్ధనమ్మ.
"వాట్ ఏ లవ్ స్టోరీ!" అంటూ యమున బుగ్గలు పుణికింది హేమ్ లెట్. నునుసిగ్గులతో రెప్పలు బరువుగా వాలిపోతుంటే భారంగా ఎత్తి శేఖర్ వైపు చూసింది యమున. సమయం కోసం కాచుకున్నవాడిలా వెంటనే కన్నుగీటాడు. దిగ్గున తలొంచుకుని "ఎవరూ చూడలేదుకదా! ఈ మనిషికసలు బుద్ధిలేదు' అనుకుంది మురిపెంగా.
ఇంతలో శశిధర్ పెద్ద స్వీట్ బాక్స్ తో హడావుడిగా లోపలికొచ్చాడు. "ఎలా వుంది నాయనా! ప్రసవమయిందా?" అంటూ ఆదుర్దాగా ఎదురొచ్చింది వర్ధనమ్మ.
"మగపిల్లాడు పుట్టుంటాడు. మొహం చూస్తే తెలియడంలేదూ!" అంది హేమ్ లెట్.
"కాదు ఆడపిల్ల. ముందు స్వీట్ తీసుకోండి" అన్నాడు ఆనందంగా స్వీట్ బాక్స్ ముందు పెడ్తూ.
"వెరీగుడ్. మహాలక్ష్మి పుట్టిందన్నమాట" అంది సంతోషంగా హేమ్ లెట్.
"ఏదో ఒక పిల్ల, ముందు నా పిల్ల కులాసాగా ఉందా?" అంది వర్ధనమ్మ ఆత్రంగా.
"కులాసాగా ఉందండీ. పదండి మనం హాస్పిటల్ కెళ్దాం" అన్నాడు శశిధర్.
ఆడపిల్లలు ఆణిముత్యాలయ్యా. నా ఇద్దరాడపిల్లలూ చూడండి రత్నం, వజ్రం" అన్నారు రామారావుగారు తృప్తిగా.
"ఆడపిల్లలేని ఇల్లు వెలితిగానే వుంటుంది. అది నాకు బాగా తెలుసు! ఆ వెలితి మా కోడలొచ్చి తీర్చాలి. అచ్చం ఇలాంటి కుటుంబంలోంచి వచ్చిన పిల్లే కావాలనుకున్నాము. మా అందరితో కలసిమెలసి వుంటే అంతేచాలు!" అంది శకుంతలమ్మ.
రామారావుగారు చేతులు జోడించి "కోటికొక్కరుంటారు మీలాంటి పుణ్యమూర్తులు" అన్నారు ఆనందంగా.
* * * *
దూరంనించి 'తెరతీయరా... తిరుమలవాసా' అని మధుర గాయకుడి స్వరం అమరమై, అమృతప్రాయమై తేలివస్తోంది.
"నేనింక అడుగు కూడా వెయ్యలేను బాబూ" అంటూ మెట్లమీద మోకాళ్ళు పట్టుకుని కూర్చుండిపోయింది సింధు.
అరుణ్ నవ్వుతూ చెయ్యిజాపి "వాళ్ళని చూడు!" అన్నాడు.
నెత్తిమీద మూటలు పెట్టుకుని, భుజాలమీద పిల్లల్నెక్కించుకుని ఆడా, మగా మనకర్ధం కాని తెలుగులో మాట్లాడుతూ ముందుకు సాగి, నిముషంలో కనుమరుగవుతున్నారు.
"నావల్ల మాత్రం కాదు. ఈ మోకాళ్ళ పర్వతం దగ్గరే మోకాళ్ళు పట్టుకుని కూలబడిపోతాను" అంది.
చేతిలోని తేగని వలచి, దాన్లోంచి చందమామని తీసి ఆమె నెత్తిమీద మొడ్తూ "సింధూ! డాక్టర్ అయిన సందర్భంలో ఎంత ఉత్సాహంగా ఉండాలీ? ఎలా లేడిలా గెంతులెయ్యాలీ? అసలు దేనికైనా పట్టుదలుండాలిలే!" అన్నాడు కవ్విస్తూ. "నాకు పట్టుదల లేదంటావా? అయితే చూడు ఎలా నడుస్తానో" అంటూ లేచి చకచకా మెట్లెక్కసాగింది సింధు.
అరుణ్ వెనుకనుంచి "నిలువవే వాలు కనులదానా, వయ్యారీ హంస నడకదానా!" అంటూ పాడసాగాడు. సింధు నవ్వుతూ వెనక్కి తిరిగి అతని చేయందుకుంది.
మెట్లమీద కూర్చుని ప్రసాదం తింటుంటే "కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడూ..." అంటూ శ్రావ్యంగా వినిపిస్తోంది. చుట్టూ రకరకాల మనుషులూ, రకరకాల భాషలూ. సింధు చమేలీ పూవుల దండలను కొని సిగనిండా ముడుచుకుంది. ఆకుపచ్చని ఎర్రని అంచు పట్టుచీరలో అప్పుడే విరబూసిన లతలా ఉంది సింధు.