మర్నాడు అందరూ ఆలస్యంగా లేచారు. చివరికి కావేరి కూడా బారెడు పొద్దెక్కేవరకూ లేవలేకపోయింది. అత్తగారు కాఫీ తెచ్చిస్తే సిగ్గుపడిపోయింది. శశిధర్ వెళ్ళిపోవడానికి తయారయ్యాడు. ఇంకో రోజుండమని సుధాకర్ బలవంతం చేసినా వినలేదు. జయ దిగులుగా చూసింది. కావేరి హడావుడిపడ్తూ వంట చేసింది. మాటిమాటికి గడియారం చూస్తోంది. పదవుతుండగా కాత్యాయనీ, రామారావుగారూ, యమునా ఆటోలోంచి దిగారు.
"హమ్మయ్యా!" అంటూ గుండెలనిండా ఊపిరి పీల్చుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది వాళ్ళని కావేరి.
"ఇంతాలస్యంగానా?" అడిగాడు సుధాకర్ యమునని. బావగారివైపు నిర్లిప్తంగా చూసి ఊరుకుంది. "మొహం కడుక్కో! చీర మార్చుకో, వాళ్ళొచ్చేస్తారు" అంటూ చెల్లెల్ని తొందరచెయ్యసాగింది కావేరి.
"ఏం ఇలా బాలేనా?" అడిగింది యమున. గులాబీరంగు పువ్వులున్న తెలుపు జార్జెట్ చీర కట్టుకుని, వదులుగా జడేసుకుని, చిన్న బొట్టు పెట్టుకుని సింపుల్ గా ఉంది యమున.
"పోనీ మొహమన్నా కడుక్కుంటావా? అదీ లేదా" అడిగింది విసుగ్గా.
"సరే!" అంటూ లేచి లోపలికెళ్ళిందిక తప్పదని. హేమలతమ్మగారూ, ప్రభా వచ్చారు కాసేపటికి. సుధాకర్, శశిధర్ తో "మనమెళ్ళి పెళ్ళివారిని తీసుకొద్దాం" అన్నాడు. అతను సరేననడంతో ఇద్దరూ బయల్దేరారు.
యమున బయటికొచ్చి "జయ బాత్ రూంలోంచి ఎంతకీ రావట్లేదు" అని చెప్పింది.
"కాల్ ఆఫ్ ది నేచర్ ఏమో" అంది హేమలతమ్మ.
కావేరి, వర్ధనమ్మ కంగారుగా లోపలికెళ్ళారు. ప్రభ వాకిట్లో బయల్దేరుతున్న అన్నగారితో "ఒక్క నిముషముండు. జయ ఏదో కంగారు పెట్టేటట్టుంది" అంది.
వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు.
"ఏమ్మా నడుంనొప్పిగా ఉందా?" అడుగుతోంది జయని వర్ధనమ్మ.
"అమ్మా, బాబోయ్" అని మూల్గడం తప్ప జవాబివ్వలేకపోతుంది జయ. "ముందు స్టౌ మీద కాసిని వేడినీళ్ళు పడెయ్యి. నాకు కాళ్ళూ చేతులు ఆడ్డంలేదు బాబూ" అంటూ గాభరాపడసాగింది వర్ధనమ్మ.
"కంగారెందుకు వదినా మేమంతా లేమూ! అయినా డాక్టరిచ్చిన డేట్ కంటే ఇంతముందుగానా?" అనుమానం వ్యక్తంచేసింది కాత్యాయని.
"రాంగ్ కాలిక్యులేషన్స్ ఈ కాలం పిల్లలకి" అంది హేమ్ లెట్ టక్కున.
కావేరి వేడినీళ్ళు తీసుకురాగానే జయని బాత్ రూంలోకి తీసుకువెళ్ళారు. శశిధర్ వెళ్ళి ఆటో తీసుకువచ్చాడు. జయ అరుపులు ఎక్కువయ్యాయి. వర్ధనమ్మకి కళ్ళు చీకట్లయి వెళ్ళి దేవుడి గదిలో కూర్చుంది. "అమ్మగారికి నమస్కారం చేసిరా" చెప్పాడు శశిధర్ జయతో. జయ తల్లి దగ్గరకెళ్ళగానే "త్వరగా ప్రసవమయ్యి గుమ్మడిపండులాంటి మనవడ్నెత్తుకురా తల్లీ" అని దీవించి మళ్ళీ దేవుడి దగ్గరే కూలబడిపోయింది.
"అత్తగారికి కంగారెక్కువ, నువ్వెళ్ళమ్మా హాస్పిటల్ కి" అంది కావేరి.
చివరికి కాత్యాయనీ, శశిధర్, సుధాకర్, ప్రభా జయని తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు "పెళ్ళివారికి మర్యాదలవీ తక్కువగాకుండా చెయ్యండి. బావగారూ మీరుంటారుగా" అని ఫల్గుణరావుతో చెప్పి వెళ్ళాడు సుధాకర్.
"పూర్వమిలాగే పిల్ల సమర్తా, గేదీనడం, ముసురువానలూ, ఇంటావిడ బయట చేరడం, దూరపు బంధువులు పోయి సూతకం, కోడలికి నొప్పులు, ఒక్కసారే వస్తాయి అనేవారు పెద్దలు" అంది హేమలతమ్మ.
కావేరికి కూడా కంగారుగానే ఉంది. కానీ బయటపడకుండా ఇంట్లోకి, బయటికీ తిరుగుతూ అత్తగారికి ధైర్యం చెప్పసాగింది. హేమలతమ్మ కాఫీ కలిపి వర్ధనమ్మకీ, కావేరికి, రామారావుగారికీ ఇచ్చింది. తనకేం పట్టనట్లు యమునెళ్ళి గదిలో పడుకుంది. "ఆ పెళ్ళివారు రాకపోతే బావుణ్ణు, వచ్చినా నేను నచ్చకపోతే బావుణ్ణు, నచ్చినా ఎక్కువ కట్నమడిగితే బావుణ్ణు" అనుకుంటుంటే శేఖర్ గుర్తుకొచ్చి ఏడుపొచ్చేసింది. ఒక్కసారిగా లేచి శేఖర్ అడ్రస్ వెతుక్కుంటూ పరుగెత్తుకెళ్ళి "ఇదంతా ఏమిటి?" అని కాలర్ పట్టుకుని అడిగితే అనిపించింది. "అవును, నేనెందుకలా అతన్ని ముఖాముఖీ కలవలేదు? నువ్వు చెప్పిన కబుర్లేమిటీ? చేస్తున్న పనేమిటి? నాకంటే అందగత్తె కనిపించగానే నన్నొదిలేస్తావా? నీకిది న్యాయమేనా? అని అడిగి వదిలిపెట్టాల్సింది." అనుకుంటూ దిగ్గున లేచి కూర్చుని "వెళ్ళాలి. నేను వెంటనే వెళ్తాను. ఇప్పటికే ఆలస్యమయిపోయింది" అంటూ మంచం మీదనుంచి లేస్తుండగా కారు హారన్ వినిపించింది.
హేమలతమమగారు "కావేరీ! వాళ్ళొచ్చేశారు. పెళ్ళివారొచ్చేశారు" అంటూ కేకలు వేసింది. యమున నిస్త్రాణగా మళ్ళీ మంచంమీద కూలబడిపోయింది.
బయట హడావుడీ, వర్ధనమ్మగారినీ, రామారావుగారినీ పరిచయాలు చెయ్యడం, శంకర్, నర్మదా గొంతులూ వినిపిస్తున్నాయి. కావేరి లోపలికి వచ్చి "త్వరగా తయారవ్వు! అబ్బాయి చాలా అందగాడు, దిష్టితగుల్తుందేమో నన్నంతగా బావున్నాడు" అని చెప్పి, మళ్ళీ హడావుడిగా వెళ్ళిపోయింది.
"హూ! అందగాడు. ఈ కళ్ళకి శేఖర్ తప్ప మరెవరూ అందంగా కనిపించరీ జన్మలో" అనుకుంది విరక్తిగా.
బయట కాఫీ, టిఫెన్లవుతున్నట్టున్నాయి. చప్పుడు వినిపించసాగింది. నర్మద లోపలికొచ్చి "పద, తీసుకురమ్మంటున్నారు" అంది. ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లున్న యమున మొహాన్ని తేరిపార చూస్తూ.
"పదండి వస్తాను" అని నడిచింది యమున.
"కాస్త మొహం కడుక్కుంటే" అంటున్న నర్మద మాటలకడ్దొస్తూ "అక్కర్లేదు" అంది. ముందు గదిలోకెళ్ళగానే "రామ్మా రా," అంటూ పెద్దవాళ్ళ గొంతులు కలగాపులగంగా వినిపించాయి. కావేరి ఏదో పరిచయం చేసింది. యమున తలెత్తకుండానే నమస్కారం చేసి నర్మద పక్కన కూర్చుంది చాపమీద.
"నీ పేరేమిటమ్మా!" అత్తగారి గొంతులా ఉంది.
"యమున" చెప్పింది.
"పాటలొచ్చా" అడిగిందో మగగొంతు.
"రావు" ఠక్కున చెప్పింది తలెత్తకుండానే.
"ఒక్కసారి తలెత్తి అబ్బాయిని చూడమ్మా" అన్నారెవరో.
అ"అక్కర్లేదు" పక్కనించీ మోచేత్తో పొడిచింది కావేరి చెల్లెల్ని.