"పద భోజనానికెళ్దాం" అని అరుణ్ లేస్తుంటే "ఇక్కడనుంచి కదలబుద్ధి కావట్లేదు అరుణ్. బహుశా! స్వర్గం ఇలాగే ఉంటుందేమో" అంది.
"అందుకే దీన్ని కలియుగ వైకుంఠం అన్నది. పద" అన్నాడు చేయిపట్టి లేపుతూ.
"థాంక్స్ ఎలాట్" అంది ఆ చేయి అలాగే గట్టిగా పట్టుకుని.
* * * *
"నీ లీల పాడెద దే...వా" అంటూ నాదస్వరం వాళ్ళు తమ సత్తా చూపిస్తున్నారు. ప్రతివాళ్ళు చాలా హడావుడిగా తిరుగుతూ, ఎదురుపడ్డవాళ్ళ చెవుల్లో ఏదో పని పురమాయిస్తున్నారు.
జయ చంటిపిల్లని శశిధర్ చేతిలో పెట్టి "ఎత్తుకోండి! పెళ్ళికూతుర్తోబాటు జ్యోతులు తేవాలి!" అంటూ గబగబా వెళ్ళిపోయింది.
ఆయిల్ క్లాత్ మీద స్వెట్టర్ తో వున్న పాపనెత్తుకుని అది జారిపోతుంటే గుండెల కదుముకుని నానాపాట్లూ పడ్తున్నాడు శశిధర్.
"బాగానే వుంది! అబ్బురంగా పిల్లపుడ్తే దబ్బనంతో ముక్కుకుట్టమనీ, దానికి అసలే ఉక్కపోస్తుంటే ఇవన్నీ ఏమిట్రా" అంటూ వచ్చింది దుర్గమ్మ.
"ఊరికే ఎత్తుకోకండి! హైట్ బోయిల్ అయిపోతుంది." అంది హేమ్ లెట్.
"ఏమయిపోతారూ?" అంది అర్థంకాక దుర్గమ్మ. "హైట్ అంటే ఎత్తు, బోయిల్ అంటే మరగడం, ఎత్తుమరిగిపోతుంది" అని వివరించింది హేమ్ లెట్.
"ఇదిగో చూడమ్మా, ఇట్లాంటి బొట్లేరు ఇంగిలీషు నాకర్ధం కాకుండా మాట్లాడమోకు. నాదసలే మంచినోరు కాదు. అసలు బెజవాడ కనకదుర్గమ్మ అంటే ఏమనుకుంటున్నావ్?" అంది గట్టిగా.
"కోరిన వరాలిచ్చే చల్లని తల్లని మేమందరం అనుకుంటాము. ముందు అక్షింతలు తీసుకుని వధూవరులని దీవించండి" అంటూ కావేరి అందుకుంది.
"అంతే! అంతే! మా తల్లే" అంటూ అక్షింతలందుకుంది దుర్గమ్మ.
పూలజడా, నుదుట బాసికం, బుగ్గన చుక్కా, కళ్యాణబొట్టు పెట్టుకుని మధుపర్కాలలో యమున, శేఖర్ కూర్చునున్నారు. తలంబ్రాల బియ్యం తెచ్చారు. "బావా! మనమే గెలవాలి. గబగబా పోసేసెయ్" చెవిలో చెప్పింది శిరీష.
స్లీవ్ లెస్ బ్లౌజు, పట్టుచీరా కట్టుకుని, నగలన్నీ పెట్టుకుని మిలమిలా మెరిసిపోతున్న ఆ పుత్తడిబొమ్మ ఎవరా? అన్నట్లు పరిశీలనగా చూసింది యమున తలెత్తి. "ఏమిటి అలా చూస్తున్నారు? నేను మా బావ మరదల్ని" అని కిసుక్కున నవ్వింది శిరీష.
దేవకన్యలింత అందంగా వుండేవారన్నమాట అనుకుంది యమున. సాటి స్త్రీ అయిన తనే కనులు తిప్పుకోలేకపోతోంది! కానీ శేఖర్! ఎంత నిగ్రహం చూపాడూ! మనసు మరలుకోని స్వచ్చమైన ప్రేమని పంచాడు! అనుకోగానే అతనిమీద ప్రేమ రెట్టింపయి తృప్తిగా గుండె పొంగింది.
శిరీష గట్టిగా చప్పట్లు కొడ్తూ "అక్కా! ఓడిపోయావు" అంటుంటే అప్పుడు గమనించింది శేఖర్ మొత్తం పళ్ళెం ఎత్తి తన తలమీద తలంబ్రాలు గుమ్మరించేశాడని.
శిరీషని చూస్తూ "నీ వెలుగుకి నా కళ్ళు చీకట్లయ్యాయి చెల్లెలా!" అంది నవ్వుతూ.
చేతిలోని అక్షింతలు వధూవరుల మీద చల్లి "కలకాలం సుఖంగా వుండండి" అని తృప్తిగా నిట్టూర్చారు కాత్యాయనీ, రామారావుగార్లు.
* శుభం *